మానవ హక్కుల సంఘం ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడింది. మూత్రపిండానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న ఆదివాసీల వివరాలు సేకరించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సమర్పించారు. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఆదివాసీలను ఆదుకోవలసిందిగా అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రం దాఖలు చేశారు.
గోవిందాపూర్ లో కొన్నేళ్ళుగా గిరిజనులు మూత్రపిండం వ్యాధులతో బాధపడుతున్నారు. 40 కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో ఇప్పుడు 16 కుటుంబాలే నివసిస్తున్నాయి. వ్యాధికి భయపడి తక్కినవారు గ్రామం విడిచి పెట్టి అడవిలోకి వెళ్ళి దూరదూరంగా గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. 2019లొ గడ్డిగూడ, నానూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చొగూడ మండలాలలోని గ్రామీణులు కిడ్నీవ్యాధివల్ల నానా ఇబ్బదులూ పడ్డారు. చాలామంది మరణించారు. ఇప్పుడు ప్రభుత్వం నిజాం ఆసుపత్రి నుంచి వైద్యుల బృందాన్ని పంపించి నివేదిక తెప్పించుకున్నది. కానీ కిడ్నీ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వెంటనే జోక్యం చేసుకొని వారికి మంచి వైద్యం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ ఫోరం తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్, కార్యవర్గ సభ్యుడు జీవన్ కుమార్ లు గవర్నర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.