Thursday, January 2, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు

  • తెలంగాణలో 30- 40 శాతం మంది విద్యార్థులు హాజరు
  • బోధనా సిబ్బంది నూటికి నూరు శాతం టీకాలు వేయించుకున్న దాఖలా లేదు
  • ప్రాథమిక పాఠశాలలన సెప్టెంబర్ 30 వరకూ తెరవవద్దంటూ టీచర్ల సంఘం విజ్ఞప్తి
  • చిన్న పిల్లల విషయంలోనే ఆందోళన చెందుతున్నామంటున్న సబితా ఇంద్రారెడ్డి
  • ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యామంత్రి

హైదరాబాద్ : కోవిద్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజయనగరంలో పాఠశాలను సందర్శించిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కెజీ టు పీజీ 40 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారని మంత్రి మీడియాతో చెప్పారు. జులై నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.20 లక్షలమంది ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని ఆమె చెప్పారు.

ఒక ముఖ్యమైన విషయంలో అభిప్రాయం వెల్లడించే సమయంలో స్పష్టత అవసరం. గోడమీది పిల్లివాటంగా ఉండకూడదు. పిల్లల్ని బడులకు పంపడం ఈ సమయంలో మంచిదా, కాదా అన్నది ప్రశ్న. ఆరోగ్యమూ ముఖ్యమే, చదువూ ముఖ్యమే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించవచ్చుననీ, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలనీ ధ్వనించే విధంగా హైకోర్టు నిర్ణయం ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న బోధన, భోధనేతర సిబ్బందికి నూటికి నూరు శాతం టీకాలు వేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని భావించవచ్చు. కానీ ఆ పని జరగలేదని తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు వ్యాఖ్యానించింది. టీకాలు వేయించుకోని బోధనా సిబ్బంది ద్వారా విద్యార్థులకు కోవిడ్ సోకే ప్రమాదం ఉన్నదని హైకోర్టు భయం వెలిబుచ్చింది.

గురుకులాలు, వసతి గృహాలు మినహాయించి మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.ఈ మేరకు హైకోర్టు ఆదేశించింది.  స్కూలుకు రావాలని యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేయరాదని ఆమె అన్నారు. విద్యార్థుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవద్దనీ, ఇప్పటికే జారీ చేసిన కోవిద్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించి పాఠశాలల నిర్వహణను సాఫీగా కొనసాగించాలని ఆమె ఆదేశించారు. కోవిద్ కారణంగా 16 మాసాలు మూసి ఉంచిన విద్యాసంస్థలు బుధవారం తెరుచుకున్నాయి.  ప్రైవేటు విద్యాసంస్థలు యాజమాన్యాల ఇష్టం ప్రకారం నడుచుకోవచ్చునని చెప్పారు.

కుటుంబ సభ్యులకూ ప్రమాదం

స్కూళ్ళలో కోవిద్ వ్యాధి సోకిన పిల్లలు ఇళ్ళలో తమ తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ అంటిస్తారు. అప్పటికే వ్యాధులున్న వృద్ధులు కూడా పల్లల నుంచి కోవిద్ అంటువ్యాధిని సంతరించుకునే ప్రమాదం ఉన్నదని హైకోర్టు తాత్కాలిక ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం బడులను తిరిగి తెరవడాన్ని అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ ను విచారిస్తున్న క్రమంలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో 40 వేల పైచిలుకు స్కూళ్ళలో 60 లక్షల మంది విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు అవుతున్నారు. 1800 జూనియర్ కాలేజీలలోని తొమ్మిది లక్షల మంది విద్యార్థులూ, 955 డిగ్రీకళాశాలల్లో 4.5 లక్షల మంది విద్యార్థులూ, వృత్తివిద్యాకోర్సులలో ఐదు లక్షల మంది విద్యార్థులూ ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే, కొంతమంది తల్లిదండ్రులు ప్రత్యక్ష తరగతులు వద్దని వాదిస్తుంటే మరికొందరు ప్రత్యక్ష తరగతులు అవసరమని అంటున్నారు. నెలల తరబడి ప్రత్యక్ష క్లాసులు లేకపోవడం వల్ల పిల్లలకు స్కూలుకు వెళ్ళే అలవాటు తప్పుతోందనీ, మానసికంగా వారు క్రమశిక్షణ కోల్పోతున్నారనీ ఫిర్యాదు చేస్తున్నారు.  అందుకని రెండు వాదాల మధ్యా ఒక సమతుల్యమైన వైఖరిని న్యాయస్థానం ప్రదర్శించాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కోవిద్ 19 ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల సలహా సంఘం అభిప్రాయాన్ని ఈ విషయంలో అడిగిందా అని ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది.

ఎన్ని ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ పాఠశాలలో హాస్టల్ సౌకర్యం ఉన్నదీ, ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్కూళ్ళ యాజమాన్యాల నుంచి జిల్లా విద్యాధికారులు నివేదికలు తెప్పించుకున్నదీ లేనిదీ తెలియజేస్తూ నాలుగు వారాలలో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కుదరని ఏకాభిప్రాయం

ఈ విషయంలో స్కూళ్ళ యాజమాన్యాలకూ, తల్లిదండ్రులకూ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొన్ని విద్యాసంస్థలు మరికొంత కాలం వేచి ఉండి పరిస్థితులను పరిశీలించాలని కోరుతున్నాయి. విద్యార్థులందరినీ ఒకే సారి ప్రత్యక్ష తరగతులకు అనుమతించాలా లేక దశలవారీగా, తరగతులవారీగా అనుమతించాలా అనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారతీయ విద్యాభవన్ వంటి కొన్ని పాఠశాలలు వారానికి మూడు రోజులు మాత్రమే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలనీ, అది కూడా ఉదయం మూడు గంటల సేపే మాత్రమే తరగతులు ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించాయి.

కార్పొరేట్ కాలేజీలు మాత్రం వేచి ఉండి కొంతకాలం తర్వాత తిరిగి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. బుధవారంనాడు, సెప్టెంబర్ ఒకటో తేదీన తమ తరగతులు ప్రారంభం కావడం లేదని విద్యార్థులకు నల్లకుంట  నారాయణ కాలేజీ వర్తామానం పంపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించే పక్షంలో రెండు, మూడు రోజుల ముందుగానే కబురు పెడతామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. స్కూళ్ళ యాజమాన్యాలలో స్పష్టత లేదని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కు చెందిన ఆశిష్ నేరేడి ఒక పత్రికతో మాట్లాడుతూ అన్నారు. టీకాలు ఎంతమంది వేసుకున్నారో స్కూళ్ళను అడిగి ప్రభుత్వం తెలుసుకోవాలని అసోసియేషన్ సభ్యులు రమణ్ జీత్, సీమా అన్నారు. పిల్లలకు యూనిఫాంలు కొనాలనీ, పుస్తకాలు కొనాలనీ తల్లిదండ్రులపైన ఒత్తిడి తేవద్దని యాజమాన్యాలకు చెప్పవలసిందిగా ప్రభుత్వాన్ని వారు కోరారు.

కన్నబిడ్డల్లా చూసుకుంటాం: సబితా ఇంద్రారెడ్డి

ప్రాథమిక పాఠశాలలో ప్రత్యక్ష తరగతులను సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రాథమిక సౌకర్యాలు లేకుండా స్కూళ్ళు తిరిగి తెరిస్తే విద్యార్థులకు హాని కలుగుతుందని ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ హెచ్చరించారు. పిల్లల గురించి ఆందోళన చెందనవసరం లేదనీ, వారిని స్కూలుకు పంపితే కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫీజులకు ఒత్తిడి చేయవద్దంటూ ప్రైవేటు స్కూళ్ళకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్యాకోర్సులు చదివే విద్యార్థులు 18 ఏండ్ల పైబడినవారు పాఠ్యాంశాలను అర్థం చేసుకోగలుగుతారనీ, పుస్తకాలు చదివి విషయం గ్రహించగలుగుతారనీ, 60 లక్షల మంది చిన్న పిల్లల గురించే తాము ఆందోళన చెందుతున్నామనీ, వారు ఉపాధ్యాయులు చెబితే కానీ చదువుకోలేరనీ, వారు నష్టబోకూడదనే ఉద్దేశంతోనే స్కూళ్ళను తెరవాలని అడుగుతున్నామనీ మంత్రి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.   

Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles