- వాహన తుక్కు విధానం ప్రకటించిన కేంద్ర మంత్రి గడ్కరీ
- అక్టోబరు నుంచి దశల వారీగా అమలు
దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న వాహన, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు విధి విధానాలను రూపొందించింది. ఈ విధానంలో కాలుష్యపరంగా, ఆర్థికంగా పెను భారంగా మారిన పాతవాహనాలను తుక్కు కిందికి మార్చే విధానాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ గురువారం (మార్చి 18) పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించారు. దేశంలో 15 ఏళ్లపైబడిన వాణిజ్యవాహనాలు, 20 ఏళ్ల పైబడిన ప్రైవేటు వాహనాలు అన్‌ఫిట్‌గా తేలి, వాటి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకపోతే అలాంటివాటన్నింటినీ తుక్కుగా మార్చాలని కేంద్రమంత్రి ప్రకటించారు.
నిబంధనలతో సంబంధం లేకుండా 15 ఏళ్ల పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాలనూ సేవలనుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చి కొత్త వాహనాలకు వెళ్ళాలని నిర్ణయించారు. అలా వెళ్తే కొత్త వాహనాల కొనుగోళ్లపై రాయితీలు ఇస్తామని ప్రకటించారు. జర్మనీ, యూకే, అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో అనుసరిస్తున్న ప్రపంచస్థాయి విధానాల ప్రకారం దేశంలో వాహన తుక్కు విధానాన్ని అమలుచేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు 40 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం జీఎస్టీ ద్వారా వస్తుందని తెలిపారు.
Also Read: ఏడాదిలోగా టోల్ ప్లాజాలకు స్వస్తి
తుక్కుగా మార్చడానికి నిబంధనలు:
ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమై, రెన్యూవల్‌కు వీలుకాని వాహనాలను కాలం తీరిన వాహనాలుగా పరిగణిస్తారు. అలాంటి వాటిని తప్పనిసరిగా సేవలనుంచి ఉపసంహరించి తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాణిజ్యవాహనాలకు సబంధించి వీటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించకపోతే 15ఏళ్ల తర్వాత తప్పనిసరిగా సేవలనుంచి ఉపసంహరించాలి. ఒక వేళ వాహనదారుడు తుక్కు విధానానికి అంగీకరించనట్లయితే ఇలాంటి వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫీజును 15 ఏళ్ల తరువాత భారీగా పెంచనున్నారు.
ప్రభుత్వ, ప్రవేటు వాహనాలు:
ప్రైవేటు వాహనాల విషయంలో అయితే ఆయా వాహనాలు ఫిట్‌నెస్‌లో ఫెయిలై, రిజస్ట్రేషన్ పునరుద్ధరణకు వీలుకాని 20 ఏళ్ల పైబడిన ప్రైవేటు వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. తుక్కు విధానాన్ని ప్రోత్సహించడానికి 20 ఏళ్ల పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను కూడా భారీగా పెంచనున్నారు. ప్రభుత్వ వాహనాలు 15 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఆర్‌టీసీ, ప్రభుత్వరంగ సంస్థలన్నింటి వాహనాలను రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. దీంతో ఈ వాహనాలన్నీ తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సఉంటుంది.
నిబంధనల అమలు:
2021 అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం తుక్కు విధానాన్ని దశల వారీగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఫిట్‌నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్ల పైబడిన ప్రభుత్వవాహనాలను తుక్కుకు తరలించనున్నారు. భారీ వాణిజ్యవాహనాలకు 2023 ఏప్రిల్ 1 నుంచి ఫిట్‌నెస్‌టెస్ట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు విధించారు. మిగతా వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా ఫిట్ నెస్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.
Also Read: కాలుష్య కాసారం భారతావని
తుక్కు విధానంతో అదుపులో వాహన కాలుష్యం:
ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 20 ఏళ్లపైబడిన తేలికపాటి వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్ల కాల పరిమితి దాటిన వాహనాలు 34 లక్షలు ఉన్నాయి. అసలు ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా 15 ఏళ్లకు మించిన భారీ వాణిజ్యవాహనాలు 17 లక్షలు ఉన్నట్లు తేలింది.. కొత్తవాహనాలతో పోలిస్తే కాలం తీరిన పాతవాహనాలు 10 నుంచి 12 రెట్లు అధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల కాలుష్య సమస్య తగ్గే అవకాశం ఉంది. పాత వాహనాలు, సరైన రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ లేని వాహనాలను తుక్కు కింద మార్చేవేయడంతో వాహన ప్రమాదాలు కూడా భారీగా తగ్గే అవకాశంఉంది.
కొత్తగా వస్తున్న తేలికపాటి ఆధునిక వాహనాల ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎయిర్‌బ్యాగ్ లను ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు.
స్క్రాపింగ్ కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలు:
వాహనదారునుంచి సేకరించిన తుక్కు వాహనాల నుంచి 90% దాకా ముడిసరుకును రికవరీ చేయాలి. ముడిసరుకు రికవరీ శాతం ఆధారంగా స్క్రాపింగ్ సక్సెస్ రేట్‌ను నిర్ణయిస్తారు. ఇందులోంచి తీసిన వస్తువులను ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ పరిశ్రమకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో రీసైక్లింగ్ చేయాల్సిఉంటుంది. ప్రభుత్వం వద్ద నమోదయిన తుక్కు కేంద్రాలలో పార్కింగ్‌కు తగినంత స్థలం ఉండాలి. గాలి, నీరు, శబ్దకాలుష్యాన్ని నియంత్రించే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగంలోని ఔత్సాహికులు, ఆటోమొబైల్ కంపెనీలు సంయుక్తంగా పీపీపీ విధానంలో స్క్రాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం దేశంలో జిల్లా కు ఒకటి చొప్పున ఫిట్‌నెస్ సెంటర్లు ఏర్పాటుచేయనున్నారు. అందులో వాహనాలను పరీక్షించి ఏవి స్క్రాప్ చేయాలన్నది నిర్ణయిస్తారు.
Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్ వస్తున్నాయ్ …జాగ్రత్త!