ఆశ్చర్యం కాదుగానీ ఆసక్తి అనిపించిన అంశమది. ‘కర్నాటకం’ గురించి గురువారం (18.5. 2023) ‘ది హిందూ’ బ్యానర్ వార్తలో- ‘మరో 48 నుంచి 72 గంటల్లో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడనుంది…’ అని ‘హైలైట్స్’లో కాంగ్రెస్ నాయకుడు ఒకరిని ఉటంకిస్తూ, ఆ పత్రిక రాసింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కనుక లేకపోతే, మరి ప్రస్తుతం ఉన్నది ఏమిటి? అక్కడి ప్రజలకు ‘సివిక్ ఏమినిటీస్’, ‘లా అండ్ ఆర్డర్’ వంటివి చూస్తున్నది ఎవరు? ఇది మొదటి ప్రశ్న. ఇక 48 నుంచి 72 గంటల తర్వాత ‘ప్రభుత్వం’ ఏర్పడడానికి కావలసిన ఏర్పాట్లు చేసేది ఎవరు? అనేది రెండవ ప్రశ్న.
ఇటువంటి ‘అకడమిక్’ విషయాన్ని మరింత లోతుగా చూడ్డానికి దాన్ని మన సౌలభ్యం కోసం మన పొరుగు రాష్ట్రం నుంచి మనవద్దకు మార్చి, దాన్నే మనకు తెలిసిన సందర్భంలో నుంచి చూద్దాం. హైదరాబాద్ 12 డిసెంబర్ 2013 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా ప్రతులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రత్యేక బోర్డర్ సెక్యూరిటీ విమానంలో చేరాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ బిల్లు ప్రతులను స్వయంగా తనతో తీసుకువచ్చారు. సురేష్ కుమార్ ఆ బిల్లు ప్రతులను సచివాలయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పి.కె. మహంతి కి అందచేశారు.
Also read: నీలం అడుగుజాడలు ఇంకా కొనసాగుతున్నాయి…
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర అసెంబ్లీకి బిల్లుపై తన అభిప్రాయం చెప్పడానికి ఆరు వారాల సమయం ఇచ్చారు. బిల్లు ప్రతులు అందుకున్న మహంతి ఒక ప్రతిని ముందుగా అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణకుమార్ రెడ్డికి అందచేశారు. ఆ తర్వాత రాజభవన్ కు వెళ్లి అప్పటి గవర్నర్ ఇ ఎస్.ఎల్. నరసింహన్ కు కాపీ అందచేశారు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో మకాం చేసి, బిల్లుపై సవివరమైన చర్చ జరిపి సత్వరమే రాష్ట్రపతికి తిరిగి పంపడాన్ని సమన్వయం చేశారు.
మనలో ఎక్కువమందికి తెలిసిన పైన తెలిపిన పరిణామాల్లో- ‘ప్రభుత్వం’ ఎక్కడుందో వెతికితే, కర్ణాటకలో ఇప్పుడు ఉన్నది ఏమిటో తేలిగ్గా మనకు అర్ధమవుతుంది. అప్పట్లో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. అసెంబ్లీ జరుగుతున్నది కనుక శాసనసభ్యులు, మంత్రి మండలి ఉంది. మరి ఢిల్లీ నుంచి రాష్ట్రపతి తరపున వచ్చిన ఐ.ఏ.ఎస్. అధికారి నేరుగా- ‘సి.ఎస్.’ను కలవడం ఏమిటి? సి.ఎస్. ద్వారా బిల్లు కాపీ ముఖ్యమంత్రికి చేరడం ఏమిటి? సి.ఎం. కాకుండా సి.ఎస్. గవర్నర్ ను కలిసి బిల్లు కాపీ ఇవ్వడం ఏమిటి? ఇందులో మంత్రి మండలి తరపున ఒక్కరు లేకపోవడం ఏమిటి?
కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో భాగంగా పార్లమెంట్ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదించాక, దాన్ని అమలుచేయవలసిన బాధ్యత కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) వ్యవస్థది అవుతుంది. అందుకే- అప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర విభజన అంశం మీద- ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’గా వున్న ఏ.కె. ఆంటోని, సుశీల్ కుమార్ షిండే, గులాం నబి ఆజాద్ వంటి వారు తెర వెనక్కి వెళితే, ఈ మొత్తం వ్యవహారం కార్యాచరణకు ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి తెర ముందుకు వచ్చారు. హోమ్ శాఖలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగంలో పనిచేస్తున్న తెలుగు వారు పశ్చమ బెంగాల్ కేడర్ అధికారి అయిన సురేష్ కుమార్ విభజన ముసాయిదా బిల్లు తయారీలో కీలక పాత్ర పోషించారు అంటారు.
Also read: వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!
బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చాక, సి.ఎస్. మహంతి ఆధ్వర్యంలోని పరిపాలన యంత్రాంగం, బిల్లు చట్టం కావడం కోసం ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి అందుతున్న ఉత్తర్వుల్ని అమలు చేస్తూ, అసెంబ్లీ ఉభయ సభలు బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి జరుగుతున్న వాదనల సమయంలో ‘సెషన్స్’ కు ఎటువంటి ఆటంకం లేకుండా కావలసిన ఏర్పాట్లు ఎప్పటిలా చూసుకుంటూ, అధికార యంత్రాంగం కత్తి మీద సాము వంటి ద్విపాత్ర అభినయం చేసింది. ఆ సమయంలో ఇక్కడ సి.ఎం. రాజకీయ నిర్ణయం వేరు. కానీ గవర్నర్ పాత్ర రాష్ట్రపతి సంతకం చేసి పంపిన బిల్లు ఆమోదం అయ్యేట్టుగా చూడాలి. సి.ఎస్. వీరు ఇరువురి మధ్య సంధానకర్తగా పనిచేయాలి.
సహజంగానే, ఈ దశలో మరి ఎన్నికయిన ‘ప్రభుత్వం’ ఉనికి ఇక్కడ ఏమైంది? అనే సందేహం మనకు కలుగుతున్నది. ప్రతి వ్యవస్థకు దానికుండే పరిమితులు దానికి ఉన్నాయి, అని చెప్పడమే ఇక్కడ సందర్భం. అసెంబ్లీ ఉభయ సభలు తిరస్కరించిన బిల్లు ఢిల్లీ చేరాక, కేంద్ర హోమ్ శాఖ విభజనకు ‘ఆపాయిటెడ్ డే’ని ప్రకటించింది. ఇది జరుగుతూ ఉండగానే, కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ ఎలక్షన్స్ ప్రకటించింది. 2 జూన్ 2014 అర్ధరాత్రి నుంచి ‘తెలంగాణ’ కొత్త రాష్ట్రంగా ఏర్పడినట్లు రాష్ట్రపతి భవన్ గజెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్రపతి పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాక, రెండు చోట్ల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!
అంటే- ఒక రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక, ఎన్నికలు ముగిసి మళ్ళీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేవరకు, అక్కడ ఉండేది- ‘ఇన్ టెరిమ్’ ప్రభుత్వం. ఆ కాలంలో, పరిపాలన జిల్లాల్లో కలక్టర్లు – ఎస్పీలు చూస్తే, రాష్ట్ర స్థాయిలో సి.ఎస్. కార్యాలయానికి గవర్నర్ కార్యాలయానికి మధ్య సమన్వయంతో జరుగుతుంది.
ఇందులో కొత్త విషయం ఏమీ లేకపోయినా, ఎందుకు ఈ ‘రిపిటీషన్’ అంటే, అందుకు కారణం ఉంది. ‘రాజ్యం’ లక్షణాలు నాలుగు అవి: ప్రజలు-ప్రాంతము-ప్రభుత్వము-సార్వ భౌమాధికారం. విభజన జరిగిన ‘అపాయింటెడ్ డే’ 2 జూన్ 2014 నాటికి ‘రాజ్యం’ నాలుగు లక్షణాలలో మూడవది అయిన ‘ప్రభుత్వం’ ఇక్కడ ఉనికిలో లేదు. ఎన్నికల తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక, అప్పుడు రెండు రాష్ట్రాల్లో- ‘ప్రభుత్వం’ ఏర్పడింది.
చదువులు సక్రమంగా వున్న రోజుల్లో, పైన చెప్పుకున్న వేర్వేరు వ్యవస్థల అధికారాలు, వాటి పరిధి, ప్రమేయాలు ‘సోషల్ స్టడీస్’లోను, ఆ తర్వాత కాలేజీ చదువుల్లో ‘సివిక్స్’ లోను ఉండేవి. బి.ఏ. వరకు చదివిన ఎవరికైనా వారు చేసే వృత్తి పనితో సంబంధం లేకుండా తెలిసిన సాధారణ విషయాలు ఇవి. కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా వాటిని మర్చిపోయేట్టుగా పరిపాలన అంటే- ‘రాజకీయం’ అన్నట్టుగా మారిన పరిస్థితి.
అందుకు ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలో కూడా తెలియనంతగా పరిస్థితులు మారిపోయాయి. దీనివల్ల చివరికి సామాజిక శాస్త్రాల నిపుణులు అంటే- ఆర్ధిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, సోషియాలజీ అధ్యయనం చేసేవారు అంటున్నారు తప్ప, ‘పొలిటికల్ సైన్స్’ ను ఒక ‘ఆప్లైయిడ్’ సోషల్ సైన్స్ గా పరిగణించడం లేదేమో? అనిపిస్తుంది. ఎప్పటికైనా ‘పొలిటికల్ సైన్స్’ నుంచి ‘పాలిటిక్స్’ ను వేరుచేసేటంత సంస్కారం మనకు అలవడినప్పుడు, అది సాధ్యం కావొచ్చు.
ఎక్కువగా ‘పొలిటిసైజ్’ అయ్యే సమాజాల్లో ఉండే అపశ్రుతులు అన్నీ పరాకాష్ఠ దశలో ఇప్పుడు మన వద్ద చూస్తున్నాం. ఇంకా వందేళ్లు కూడా కాని మన దేశంలో ఇదొక దశ కావొచ్చు. మనకంటే ముందు వలసలు నుంచి విముక్తి అయ్యాక, స్వంత ప్రభుత్వాలు ఏర్పాటుచేసుకున్న దేశాల్లో ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు.
Also read: ‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది…
అయితే, ఇదే కాలంలో ఇక్కడ ప్రభుత్వంపై ఆధారపడని ‘సెక్షన్’ ఒకటి రూపొందుతూ ఉందనే స్పృహ ఇక్కడ అవసరం. ఒకసారి వారికి- ‘ఆధార్ నెంబర్’ వచ్చాక, ప్రభుత్వం ‘పాస్ పోర్టు’ ఇచ్చాక, అయితే విదేశాంగ శాఖ, లేదా హోమ్ శాఖతో తప్ప ఇక్కడ ఇతర సేవలు కోసం వారి నుంచి ఉండే ‘డిమాండ్’ తగ్గుతున్నది.
నిశబ్దంగా బదిలీ జరుగుతున్న ఈ ‘ప్రాసెస్’ను గుర్తించకుండా 24X 7 అన్ని రకాల ‘మీడియా’ల్లో రాజకీయాలు గురించి మాట్లాడే విశ్లేషకుల పౌరశాస్త్ర- ‘నిరక్షరాస్యత’ చివరికి నీటి మీద కాలుష్యపు తెట్టులా కనిపించే దశకు చేరిందనే గమనం ఇప్పుడు అవసరం.
మరో 72 గంటల్లో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడవచ్చు అంటుంటే- ‘ప్రభుత్వం’ అంటే, వాతావరణం మాదిరిగా అది ఎప్పుడైనా ఏమైనా కావొచ్చు, అనే అసందిగ్ద పరిస్థితుల్లో- ‘రాజ్యం’లో పరిపాలన యంత్రాంగం అనేది ఎంత కీలకమో పైకి తెలియనివ్వకుండా, ‘పౌర శాస్త్ర’ స్పృహ లేని తరాలను పెంచుకుంటూ పోవడం ఎంత ప్రమాదమో మనకు ఎప్పటికి తెలిసేను?!
Also read: ఐదేళ్ల ఆలస్యంగా మనమూ ఆరు రాష్ట్రాల సరసన!
రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత