- సొంత పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యే గుస్సా
- నాకేం కాలా… నేను బానే వున్నా
(సాకేతపురం ఆరుష్ , నల్లగొండ)
ఇప్పుడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు కొత్త చిక్కొచ్చి పడింది. ప్రతి పక్ష నాయకుల కంటే సొంత పార్టీ నేతల సన్నాయి నొక్కులతో ఆయన చాలా బాధపడున్నాడు. క్లాసుకు క్లాసు మాసుకు మాసు లీడర్ గా పేరున్న ఆ ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణించందంటూ బోగస్ ప్రచారం మొదలెట్టేశారు ఆ నియోజకవర్గం నేతలు. మరి సొంత పార్టీ నేతల వైఖరితో ఇబ్బంది పడుతున్న ఆ నాయకుడెవరు ? వారి ప్రచారంలో ఉన్న వాస్తవమెంత ?
నిజం గడప దాటేలోపు….అబద్ధం ప్రపంచాన్నే చుట్టేస్తుందంటారు. అది నిజం కాదు అబద్దమని ఖండించేలోపే భాదితులకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతోంది. ఇప్పుడిదే తరహాలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కూడా భాదితుడయ్యాడు. అదెలానో తెలుసుకునే ముందు కొంచెం నర్సింహయ్య పోలిటికల్ కెరీర్ ను గుర్తు చేసుకోవాలి. కమ్యూనిస్టు రాజకీయాల్లో నుంచి వచ్చిన నోముల ఆ పార్టీలో ఉండగానే రెండు సార్లు నకిరేకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై అసెంబ్లీని దద్దరిల్లించేవారని అంతా ఒప్పుకోవాల్సిన విషయమే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2013లో హడావిడిగా కారెక్కేశారు నర్సింహయ్య. దీంతో ఆయన నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ కు మకాం మార్చారు. కొన్ని రోజులు పార్టీ ఇంచార్జ్ గా పనిచేసిన నోముల 2014 ఎన్నికల్లో పోటీ చేసి సీనియర్ నాయకులు జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో మళ్లీ జానారెడ్డిపైనే ఘన విజయం సాధించారు.
ఇక ఇంతవరకూ బాగానే ఉన్నా గత కొంతకాలంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆరోగ్యం బాగా లేదని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి తెరలేపింది ఆయన ప్రత్యర్థి వర్గం. అయితే సొంత పార్టీ నేతలే ఈ విధమైన ప్రచారం చేస్తుండడం నోములకు, ఆయన వర్గానికి మింగుడు పడడం లేదు. ఇక ఆ ప్రచారం కాస్తా ఆ నోటా ఈ నోటా నర్సింహయ్యకు చేరడంతో ఆవేదన, ఆక్రోశాన్నీ వెళ్లగక్కారు. అబ్బెబ్బే నా ఆరోగ్యం బానే ఉంది అదంతా విష ప్రచారమనీ అంతా అయిపోయాక చివరకు వివరణ ఇచ్చుకోవాల్సింది వచ్చింది ఎమ్మెల్యే నోములకు . తన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తల్లో వాస్తవం లేదనే వాదనలు వినిపిస్తూనే ఇదంతా తన మీద ప్రేమ ఎక్కువై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొంతమందికి చురకలు కూడా అంటించారు నోముల నర్సింహయ్య. వారికి ప్రజా క్షేత్రంలోనే బుద్ది చెబుతానంటూ తనదైన శైలిలో ప్రత్యర్థులకు సుతి మెత్తని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రత్యర్థుల ప్రచార పుణ్యమా అని అదంతా తప్పుడు ప్రచారమని ప్రజలకు తెలిసేలా చేయడానికి ఇప్పుడు నర్సింహయ్య నానా తంటాలు పడుతున్నారు. ప్రతి చిన్న కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలు, శుభ కార్యాలు, అశుభ కార్యాల్లో కూడా హాజరై ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మొత్తానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నోముల నర్సింహయ్యకు సొంత పార్టీ నేతల వైఖరి తలనొప్పి తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మారుతున్న టెక్నాలజీ కూడా ఈ తరం నాయకులకు తలవంపులు తెచ్చిపెడుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ అంటున్నారు రాజకీయ పండితులు. తన రాజకీయ అనుభవంతో మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన నోముల కాస్త ట్రెండ్ ను ఫాలో అయితే మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు సొంత పార్టీ నాయకులు.