Sunday, December 22, 2024

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేసీఆర్ అభినందన

డా. దేవరాజు మహారాజుకు బాలసాహిత్యంలోనూ, తగుళ్ళ గోపాల్ కు యువసాహిత్యంలోనూ అవార్డులు

అనువాద పురస్కారం రంగనాథ రామచంద్రరావుకు ప్రదానం

హైదరాబాద్ : ప్రముఖ వాగ్గేయకారుడు, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్నకు  ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’  దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.  ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన  సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సిఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని..మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు.

తగుళ్ళ గోపాల్, దేవరాజు మహారాజు

తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన  సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.

ముగ్గురు తెలంగాణ బిడ్డలకు – గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ళ గోపాల్ లకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రావడం పట్ల కేసీఆర్ ఆనందం ప్రకటించారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’ గేయ సంకలనానికి అవార్డు దక్కింది. యువకవి తగుళ్ళ గోపాల్ రచించిన ‘దండ కడియం’ కవితా సంకలనానికి యువపురస్కారం అభించగా, జీవశాస్త్ర అధ్యాపకుడు ఆచార్య దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’ అనే నాటికకు బాల సాహితీ పురస్కారం దక్కింది. గోరటి వెంకన్న, తగుళ్ళ గోపాల్ ఇద్దరూ మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవులు కాగా, దేవరాజు మహారాజు నల్లగొండ జిల్లాకు చెందినవారు.

రంగనాథ రామచంద్రరావు, అనువదించిన ఓం ణమో

ఈ ఏడాది సాహిత్య అకాడమీ పురస్కారాలలో కవిత్వానికి పెద్దపీట వేశారు. ఏడు కవితా సంకలనాలూ, రెండు నవలలుూ, అయిదు చిన్న కథా సంపుటాలూ, రెండు నాటికలూ, ఒక్కొక్కటి చొప్పున ఆత్మకథ, జీవిత చరిత్ర, విమర్శ కావ్యాలకు అవార్డులు దక్కాయని కేంద్ర సాహిత్య కార్యదర్శి కృత్తివెంట శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. ఇరవై భాషలకు చెందిన జ్యూరీ సభ్యులు సిఫార్సు చేసిన పుస్తకాలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కండార చంద్రశేఖర్ అధ్యక్షతన కార్వవర్గం ఖరారు చేసిందని శ్రీనివాసరావు తెలియజేశారు.

గోరటి వెంకన్నను పురస్కారానికి ఎంపిక చేసిన న్యాయనిర్ణుతల బృందంలో ప్రముఖ రచయితలు ప్రొఫెసర్ మృణాళిని, సంపాదకుడు జి శ్రీరామమూర్తి, ప్రముఖ సాహిత్యకారిణి కాత్యాయనీ విద్మహే ఉన్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలను ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో లక్ష రూపాయల నగదుతో పాటు తామ్ర పతకంతో సత్కరిస్తారు. యువ, బాల సాహితీ పురస్కార గ్రహీతలను రూ. 50 వేల నగదుతో సత్కరిస్తారు.

కన్నడంలో శాంతి దేశాయ్ రాసిన ఓంనమో నవలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ రచయిత రంగనాథ రామచంద్రరావు అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార రామచంద్రరావుకు పురస్కారం అందజేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో అనువాద పురస్కారాలను ప్రకటించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles