వోలేటి దివాకర్
రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్టీ టిక్కెట్టు కోసం పోటీ పడుతున్న ప్రత్యర్థులతో సన్మానం చేయించుకున్న టిడిపి సీనియర్ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒక విధంగా గొప్పవారే. అయితే, ఈ సన్మాన సుహృద్భావ వాతావరణం పార్టీలో ఎన్నిరోజులు ఉంటుందన్నది ప్రశ్నార్థకం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వెన్నుపోటుకు గురైనా చివరి వరకు ఎన్టీ రామారావు వెంట నడిచిన గోరంట్లను రాజమహేంద్రవరంలో శుక్రవారం సత్కరించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో గోరంట్లను ఘనంగా సన్మానించారు. వెన్నుపోటు సమయంలో గన్ని కృష్ణ చంద్రబాబునాయుడు వెంట ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమంలో వర్గాలకు అతీతంగా టిడిపి కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
2019 ఎన్నికల నాటి నుంచి గోరంట్ల, ఆదిరెడ్డి వర్గీయులు మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పొలిట్ బ్యూరో సభ్యుడైనా గోరంట్లను రాజమహేంద్రవరం రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండా ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంది. ఒక్కసారైనా చట్టసభలకు వెళ్లాలన్న ఆశతో ఉన్న గన్ని కృష్ణకు కూడా గోరంట్ల ఉనికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. దీంతో ఈ ఇద్దరు నాయకులు కలిసి గోరంట్లను ఆయన నియోజకవర్గమైన రూరల్ కే పరిమితం చేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వారిని ఎదుర్కొనేందుకు కొద్దిరోజుల క్రితం గోరంట్ల పాత పార్టీ ఆఫీసును కొత్తగా తెరిచి, ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపైనే అసంతృప్తి ప్రకటించి, రాజీనామా చేస్తానని అధిష్ఠానాన్ని బెదిరించారు. తద్వారా పార్టీలో తన బలాన్ని చాటుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టిడిపి పొత్తు కుదరవచ్చన్న అంచనాలతో గోరంట్ల రూరల్ సీటును ఖాళీ చేయాల్సి వస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సీటుపై కన్నేసిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇటీవల విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ భార్య సీటును భర్తకు కేటాయించే ప్రసక్తే లేదని, సిట్టింగ్ సీట్లు మార్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ సీటుపై కర్చీఫ్ వేసుకున్న ఆదిరెడ్డి వాసుకు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావుకు ఈ మాటలు రుచించకపోవచ్చు. గోరంట్ల పరోక్షంగా తన భార్య, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సీటును ఆశిస్తున్న ఆదిరెడ్డి వాసును ఉద్దే శించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు టిడిపి కార్యకర్తలందరికీ అర్థమైపోయింది.
తమ సీటుకు ఎసరు పెట్టే నాయకుడ్ని సన్మానించడం వెనుక ఆదిరెడ్డి వర్గం వ్యూహం ఏమిటన్నది తెలియడం లేదు. ఎన్టీఆర్ వెంట నడిచిన వ్యక్తులనే సన్మానించాలని భావిస్తే గోరంట్ల సోదరుడు రాజేంద్రప్రసాద్ కూడా ఇందుకు ఎంతైనా అర్హుడని భావిస్తారు. ఎన్టీఆర్తో పరిచయం గానీ, తన సోదరుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు సాధించడంలో గానీ, రాజమహేంద్రవరంలో టిడిపి బలోపేతానికి గానీ గోరంట్ల రాజేంద్రప్రసాద్ ఎంతో కృషిచేశారని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటుంటారు. ఏది ఏమైనా తన ప్రత్యర్థులతో కూడా సన్మానాలు పొందడం గోరంట్ల గొప్పతనం.