ట్వీట్ భావమేమి తిరుమలేశ?
వోలేటి దివాకర్
‘రాజకీయాలు లో హత్యలు ఉండవు…ఆత్మ హత్యలే ఉంటాయి…కొంత మందిని చూస్తే ఈ సామేత గుర్తుకు వస్తుంది..
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. విందులు చేసింది…!’ అంటూ సీనియర్ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన తీరు చూస్తుంటే అమెరికాలో ఉన్నా ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఉంది. టీడీపీలో తన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు తనయుడు, టీడీపీ యువనేత అదిరెడ్డి వాసు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తానేనని స్పష్టం చేశారు. వాసు ప్రకటన ను దృష్టిలో ఉంచుకుని గోరంట్ల ఈ వాఖ్యలు చేసినట్టు విశ్లేషిస్తున్నారు.
Also read: రాజమహేద్రవరం టీడీపీ అభ్యర్థి అదిరెడ్డి వాసునట! మరి గోరంట్ల పరిస్థితి ఏంటి?
ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల కూడా 2024 ఎన్నికల్లో రాజమహేద్రవరం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వాసుకు పోటీగా తన సోదరుడు శాంతారామ్ కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ ను గోరంట్ల తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు. ఈనేపథ్యంలో వాసు ప్రకటన గోరంట్ల కు మింగుడు పడకుండా ఉంది.
Also read: కార్పొరేషన్ ఎన్నికలపై వైసీపీ సర్వే….సరే అంటేనే టిక్కెట్లు!
జన సేనతో పొత్తు కుదిరితే తన సీటు మారుస్తారన్న ముందస్తు అంచనాతోనే గోరంట్ల రాజమహేంద్రవరం నగరంలో మూసివేసిన పాత కార్యాలయాన్ని తెరిచి మరీ రాజకీయాలు సాగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంటున్నా రాజమహేంద్రవరం టీడీపీ పార్టీలో తనకున్న పట్టు సడలిపోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా వెళ్లినా తన వారసుడితో సమావేశాలు పెట్టిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజమహేంద్రవరం స్థానం కోసం గోరంట్ల గట్టిగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి . వాసుకు బాబు భరోసా దక్కిందన్న ప్రచారం నేపథ్యంలో గోరంట్ల, ఆయన రాజకీయ వారసుడి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. దాని ప్రభావమే ఈ ట్వీట్ అని భావిస్తున్నారు.
Also read: పదవులు వద్దన్న ఉండవల్లి!