• అంతర్గత విభేదాలతో బుచ్చయ్య చౌదరి మనస్తాపం
• పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని వ్యాఖ్య
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ ను తన రాజకీయ వారసుడిగా బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. కమ్యునిస్టుల కాలం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. తాము పనిచేసిన పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నామని, త్యాగాలు చేశామని అన్నారు. 38 ఏళ్లుగా పదవిలో ఉన్నా లేకున్నా విలువలతో కూడిన రాజకీయాలే చేశానన్న బుచ్చయ్య చౌదరి… రాజమండ్రి పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనస్థాపానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత వ్యాపారాలు చూసుకోకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.
పార్టీ జేబు సంస్థ కాదన్న బుచ్చయ్య
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో…అలాగే చంద్రబాబు తో కలిసి పనిచేశానన్నారు. పార్టీలో పలు పదవులు నిర్వహించానని ఏనాడు స్వార్థంతో సొంత ప్రయోజనాలకోసం పాకుల్లాడలేదన్నారు. ఏనాడూ పార్టీ ప్రతిష్టను దిగజార్చే పనులు చేయలేదన్నారు. రాజమండ్రిలో కొంతమంది నాయకులు వింత పోకడలు పోతున్నారని పార్టీని జేబు సంస్థలా భావిస్తున్నారని విమర్శించారు.
అవమానాలను భరించలేకే తెరపైకి వారసుడు
తనను అభిమానించే కార్యకర్తలను, కార్పొరేటర్లను కొంతమంది తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని అది తనకు తీవ్ర వేదనకు గురిచేసిందని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో విలువలతో కూడిన రాజకీయాలతో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని అన్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారసుడిని తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
వారసుడు ఉన్నా రాజకీయాల్లో చురుకైన పాత్ర
తన వారసుడు ఇప్పటికే పార్టీ తరపున సోషల్ మీడియా సెల్ లో సేవలందిస్తున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. వారసుడు వచ్చినంత మాత్రాన తాను రాజకీయాల నుంచి నిష్క్రమించేది లేదని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.