వయస్సు పెరిగే కొద్దీ సీనియర్ ఎమ్మెల్యే , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిలో ఉత్సాహం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఈమధ్యే 77 వ జన్మదినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు . ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల ఇప్పటికీ కుర్రాళ్లతో సమానంగా ఎంతో చలాకీగా ఉంటారు . జన్మదినోత్సవం సందర్భంగా వచ్చే 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు . అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో … అసెంబ్లీకా … పార్లమెంటుకా అన్న
విషయాన్ని వెల్లడించలేదు . 2004 నుంచి ఆయన తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రకటిస్తూ రావడం తరువాతి ఎన్నికల నాటికి సిద్ధమైపోవడం గోరంట్లకు అలవాటుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది .
పార్టీలోని తన రాజకీయ ప్రత్యర్థి ఆదిరెడ్డి అప్పారావు తన వారసుడిగా కుమారుడు శ్రీనివాస్ ను ప్రకటించిన వెంటనే తన వారసుడిగా తన సోదరుడు శాంతారామ్ కుమారుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ ను గోరంట్ల తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు . అయినా ఆయనలో ఇప్పటికీ ఎన్నికల ఉత్సాహం తగ్గకపోవడం విశేషం .
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు , ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేస్తామన్న వార్తలను కొట్టి పారేస్తూ … రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానానికే పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు . రాజమహేంద్రవరం లో రాజకీయంగా సుస్థిర స్థానం కోసం ఆదిరెడ్డి కుటుంబం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది.
పొత్తు కుదిరితే రాజమహేంద్రవరంపై కుస్తీ తప్పదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికార వైసిపి వ్యతిరేక పక్షాలను కలుపుకుని పోటీ చేస్తామని ప్రకటించారు . ఈనేపథ్యంలో ఒకవేళ టిడిపి , జన సేన మధ్య పొత్తు కుదిరితే ప్రస్తుతం గోరంట్ల ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గాన్ని జన సేనకు కేటాయించే అవకాశాలను తోసిపుచ్చలేము . కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్న ఈనియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు , అదే సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు . మరోసారి కందులకు ఈసీటును కేటాయిస్తే గోరంట్లను రాజమహేంద్రవరం అసెంబ్లీ లేదా పార్లమెంటుకు మరీ తప్పదనుకుంటే రాజానగరం నియోజకవర్గానికి పంపవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి .
జన సేనతో పొత్తు కుదిరితే తన సీటు మారుస్తారన్న ముందస్తు అంచనాతోనే గోరంట్ల రాజమహేంద్రవరం నగరంలో మూసివేసిన పాత కార్యాలయాన్ని తెరిచి , మరీ రాజకీయాలు సాగిస్తున్నారని భావిస్తున్నారు . ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంటున్నా రాజమహేంద్రవరం టీడీపీ పార్టీలో తనకున్న పట్టు సడలిపోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు . నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజమహేంద్రవరం స్థానం కోసం గోరంట్ల గట్టిగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి . 2024 లో కూడా దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న బిజెపి పార్లమెంటు సీటును వదులుకోకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. గోరంట్ల కు సిటీ సీటు కేటాయిస్తే ఆదిరెడ్డి వాసు ఆశలు అడియాశలవుతాయి . ఆయన గత ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించినా రాజకీయ సమీకరణాలతో ఆయన సతీమణి భవానీ కి సీటు కేటాయించారు. ఏది ఏమైనా గోరంట్ల , ఆదిరెడ్డిల్లో ఏ ఒక్కరి సీటు గల్లంతై నా టిడిపిలో మరోసారి అంతర్గత విభేదాలు , వెన్నుపోట్లు తప్పకపోవచ్చు .