30. గోదా గోవింద గీతం
వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైజ్ఞి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిళ్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్త్ ఇన్బుఱువర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
ఓడలెన్నొ తిరుగు పాలకడలి చిలికిన మాధవుని కేశవుని
జేరి నోచి చంద్రవదనులు రేపల్లెలో ధన్యులైన రీతి
శ్రీవిష్ణుచిత్తువిరిబూవు, శ్రీవిల్లిపుత్తూరు శ్రీనోముపంట
చిన్నారి పసిడి హస్తాల తామరలమాలలల్లి రంగనికిచ్చి
గోదపాడిన సిరినోము ముప్పది తమిళ పాటల మాల
నోచి పాడిన చాలు తప్పును సంసార పాప కుహరాలు
నాల్గుకొండల కైదండలవాడి అండదండలందరికినందు
సుందరసిరిధర కరుణా కటాక్షానందమగ్నులగుదురెల్ల
అర్థం
ఓడలున్న పాలకడలి (వంగమ్ కడల్) దేవతలకోసం చిలికిన (కడైంద) లక్ష్మీపతిని (మాదవనై) శ్రీకృష్ణుని (కేశవనై) చందమామవంటి అందమైన ముఖాన్ని (తింగళ్ తిరుముగత్తు) సుందరాభరణాలు ధరించిన గోపికలు (చేయిజైయార్) చేరి (శెన్ఱు) నమస్కరించి (ఇఱైంజి), ఆ రేపల్లెలో (అంగు), ప్రసిద్ధమైన (అప్పరైకొండ వాట్రై) పురుషార్థాన్ని పొందిన వృత్తాంతాన్ని (తమ) అందమైన శ్రీ విల్లి పుత్తూరులో (అణి పుదువై) బంగారు కాంతులీనుతున్న తామర పూవులతో చేసిన అందమైన మాలలు గలిగిన పెరియాళ్వారుల కుమార్తె గోదాదేవి (ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై) చెప్పిన (శొన్న) ఆపాత మధురమైన ముఫ్పై తమిళ గీతాల మాల (శంగ త్తమిర్ మాలై ముప్పదుం) తప్పనిసరిగా (తప్పామే) ఈ భూమిలో (ఇంగు) ఈ విధంగా (ఇప్పరిశు) అనుసంధానం చేసే వారు (ఉరైప్పార్) కొండంత భుజాలు నాలుగు కలిగిన వాడు (ఈరిరండు మాల్ వరైత్తోళ్) ఎరుపైన అందమైన ముఖం కలిగిన వాడును (శెంగణ్ తిరుముగత్తు) ఐశ్వర్య (చెల్వమ్) శ్రీమంతుడైన శ్రీమన్నారాయణుని చే (త్తిరుమాలాల్) అన్ని చోట్ల (ఎంగుం) అతని కరుణా కటాక్షాలను పొంది (తిరువగుళ్ పెట్రు) ఆనంద మగ్నులవుతారు (ఇన్భుఱువర్)
నేపథ్యం
‘‘మీరు కోరిన అంతరంగ కైంకర్యాన్ని నేను స్వీకరిస్తాను. మీరు పొందిన ఈ మహాభాగ్యం ఇతరులు పొందాలని మీకు ఉందా దానికి మార్గం ఏమిటి’’. అని శ్రీ కృష్ణుడు అంటే ‘‘మేం పాడి మిమ్ము సాధించిన ఈ గోదాగీతాన్ని పాడుతూ సిరినోము చేసిన వారికి శ్రీమన్నారాయణానుగ్రహం కలిగి రేపల్లెలో గోపికల వలె, శ్రీవిల్లిపుత్తూరులో మా వలె ఆనంద సాగరంలో ఓలలాడుతారు’’ అని గోపికలు అంటారు.
Also read: వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఆ రోజు పాపపురుషుడెక్కడ ఉంటాడు?
దూడను కోల్పోయిన ఆవు గడ్డితో చేసిన దూడ బొమ్మను చూసినా కూడా ఆ వాత్సల్యంతో సేపులు వస్తాయి. ఆ గోమాత ఆవిధంగా ఉప్పొంగి పాలధారలను స్రవించినట్టు పరమాత్ముడు అనుగ్రహామృతాన్ని కురిపిస్తాడు.
ఆ అనుగ్రహమే ఈ గోదా పాశురాలు, ఆ అనుగ్రహం కోసమే గోదా గీత గోవిందం. దానికి అర్థాలు వివరించడానికి నెలరోజులు ప్రతి ప్రబోధకుడు చెప్పే ప్రవచనాలు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యకర్తలు, విన్నవారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన వారు ఉండడం కూడా ఈ లోకపు తండ్రి అనుగ్రహమే వారందరికీ, కన్నతండ్రి అనుగ్రహమే, అదంతా కన్నతల్లి అనురాగమే.
ఆతడిని హిరణ్యకేశుడని వేదాలు వర్ణించాయి. ఎంతటి సాగరాన్నయినా అధిగమించగల సమర్థుడతను. కడలిని మధించినపుడు పుట్టిన శ్రీదేవి అందరూచూస్తుండగా శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని చేరుకున్నది. క కార వాచ్యుడైన బ్రహ్మకు ఈశుడైన శివునకు కారణం కేశవుడని శాస్త్రం. సౌలభ్య సౌశీల్య వాత్సల్య స్వామిత్వ గుణాలు నిండిన వాడు అని నారాయణ శబ్దార్థం.
అంతరార్థం
సముద్రం చిలికితే ఒక్క చంద్రుడే ఉదయిస్తే గోపికలు అయిదు లక్షల చంద్రుల వలె భాసిస్తున్నారు. ఈ పాశురం మాదవన్ తో మొదలై తిరుమాల్ తో ముగియడం ద్వయంలోని రెండు పాదాల అర్థాన్ని సూచిస్తున్నాయని పెద్దలు వ్యాఖ్యానించారు. సఖ్య పశ్యత కృష్ణస్య ముఖమత్యరుణేక్షణం – శ్రీమహాలక్ష్మి సంబంధం వల్ల గోపికలు ఆనందం వల్ల, దివ్యవిభూతి ఐశ్యర్యం వల్ల స్వామి కనులు ఎర్రబారినవని అర్థం. లక్ష్మీ, లక్ష్మీపతీ అనుగ్రహించిన పరమానందం ఈ పాశుర సారాంశం.
Also read: ఇంత గొప్ప వ్రతం చేసింది ఒక ఢక్కి కోసమా?
నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తన ఊరు రేపల్లెగా భావించి తనను తాను ఒక గోపికగా సంభావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి, అతనినే ధ్యానించి, గీతించి, ఆతనినే వివాహమాడాలని అత్యంత దృఢ సంకల్సంతో అతన్ని బలవంతంగా భర్తను చేసుకుంది. ఫలితంగా శ్రీవిల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని పల్లకిలో రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడని చరిత్ర. గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమైపోయారని ప్రతీతి.
Also read: పరమపదంఎందుకు, నీతో బంధుత్వం ఉంటే