ఇంటింటా దాచిన వెన్న దోచిన దొంగ.
మేనమామ ప్రాణం హరించాడు
మాతాపితరుల విముక్తికి.
గోవర్ధనగిరి నెత్తాడు గోవుల రక్షించి
ఇంద్రుడి గర్వాన్ని హరించేందుకు.
కాళీయుడిని మర్ధించాడు
మడుగులో విషాన్ని హరించేందుకు.
గోపెమ్మల మనసులు కొల్లగొట్టాడు,
బట్టలు ఎత్తుకెళ్ళాడు
వారి అఙ్ఞానాన్ని హరించాడు.
రుక్మిణిని ఎత్తుకెళ్లాడు.
భామ అతిశయానికి,
ఆభరణాలకు తూగనివాడు
రుక్మిణి తులసి ఆకులకు తూగాడు.
ఆదినుండీ పక్షపాతమే
ఎప్పుడూ ధర్మంవైపే.
కౌరవులను నిర్జించాడు
పాండవులే ఆయుధాలుగా.
తానేమీ చెయ్యకుండానే
అన్నీ అందరితో జరిపించేశాడు.
చోరుడుగా, జారుడుగా,
లీలామానుష రూపుడుగా
వినోదించడానికే దివినుండి
భువికి దిగిన విలాసిగా
కపటిగా కనిపిస్తూ
మనలో చెడును హరించే ఈ శ్రీహరి
దేశ కాలాలకు అతీతమైన
దివ్య జీవన మార్గాన్ని బోధించి
భక్తుల ఆత్మనే దోచిన పరమదొంగ.
పుట్టించేవాడికి, గిట్టించేవాడికి
మధ్యలో వారధి ఈ జీవన సారధి.
ఆది అంతం లేని ఈ పరమాత్మకు
పుట్టినరోజు జరపడం ఆనంద హేల.
Also read:“నేత”
Also read: “స్వాతంత్ర్య భారత చిత్రం”
Also read: విశ్వరాధరికం
Also read: “హరే కృష్ణ” – సమీక్ష
Also read: లాజిక్
(19 ఆగస్టు కృష్ణాష్టమి)