Thursday, November 21, 2024

మాయరోగం కరోనా మటుమాయం అవుతుందా?

  • ప్రభుత్వం చెబుతున్నలెక్కలపైన అనుమానాలు
  • నాలుగో డోసు వేస్తున్న ఇజ్రేల్,యూరోపియన్ దేశాలు
  • కొవ్యాగ్జిన్ కు తోడుగా మరో టీకా మందు అవసరం
  • ఆందోళన కలిగిస్తున్న గర్భిణుల టీకా రేటు

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించింది. ముందుగానే ప్రకటించినట్లుగా జనవరి 3 నుంచి 15-18 ఏళ్ళ వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కోవిన్ యాప్ అందించే డేటా ప్రకారం ఇప్పటి వరకూ 8 లక్షలమంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. తొలి డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోస్ ను ఇవ్వనున్నారు. ఈ దిశగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసుల పంపిణీ జరిగినట్లు సమాచారం. పుట్టినరోజు ధ్రువీకరణ సర్టిఫికెట్ ను ప్రాతిపదికగా తీసుకొనే భాగంలో ఆధార్ కార్డు, స్టూడెంట్ ఐ డి, పుట్టినరోజు సర్టిఫికెట్ వీటిల్లో ఏదో ఒకదానిని సమర్పిస్తే చాలు. ప్రస్తుతం వీళ్ళందరికీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే అందుతోంది. 15 ఏళ్ళ లోపువారికి వ్యాక్సిన్ అందించే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. 15-18 మధ్య వయస్సులోని పిల్లలందరికీ త్వరిత గతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగియాలంటే మిగిలిన కంపెనీల నుంచి కూడా పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది.

Also read: నవ వసంతానికి స్వాగతం

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్

ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకున్నది. డెల్టా వేరియంట్ వ్యాప్తి కూడా ఇంకా ముగియ లేదు. పండగల సీజన్ కూడా వచ్చేసింది. ఈ తరుణంలో  రెండో డోస్ కూడా అందరికీ అందడం ఎంతో కీలకం. అర్హులైనవారిలో 90% మందికి మొదటి డోస్ అందినట్లు, 65% వారికి రెండో డోస్ కూడా పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ గణాంకాలు వీటికి భిన్నంగా ఉంటాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 60శాతం మందికి రెండు డోసులు పూర్తయితే చాలు సామూహిక రోగ నిరోధకశక్తి (హెర్డ్ ఇమ్మ్యూనిటీ) సహజంగా పెరిగిపోతుందని మొన్నటి వరకూ కేంద్రం చెప్పుకుంటూ వచ్చింది. ఆ విధంగా చూస్తే భారతదేశంలో రెండు డోసులు పూర్తయినవారి సంఖ్య 65 శాతానికి చేరుకోవడం ఆరోగ్యకరమైన మలుపు. ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల పనితీరు, ప్రజల్లో పెరిగిన రోగ నిరోధక శక్తికి సంబంధించిన గణాంకాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. బూస్టర్ డోసు అవసరాన్ని ఎక్కువ దేశాలు గుర్తించి, ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ విషయంలో మనం వెనకబడే ఉన్నాం. ఈ జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ళు పైబడిన వయో వృద్ధులకు ‘ప్రీ కాషస్’ డోస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏ వ్యాక్సిన్ ను అందిస్తారో ఇంకా స్పష్టత లేదు. కోవాగ్జిన్ తో పాటు ఇటీవల కేంద్రం ఆమోదించిన కార్బీవాక్స్ వ్యాక్సిన్లను  ముందు జాగ్రత్తగా పంపిణీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ల ఎంపికపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సివుంది. బూస్టర్ డోసు గురించి స్పష్టత ఇవ్వకుండా, కేవలం ప్రీకాషస్ డోసు గురించి ప్రభుత్వ వర్గాలు మాట్లాడడాన్ని అర్థంలేని చర్యగా నిపుణులు చూస్తున్నారు. ఇజ్రాయల్, జర్మనీ వంటి దేశాల్లో నాలుగో డోస్ కూడా ఇస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు. బ్రిటన్, కెనడా కూడా ఈ దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ పై ఇంకా కచ్చితమైన అవగాహన రావాల్సి ఉంది. దేశంలో సుమారు 4.5కోట్ల మంది గర్భిణులు ఉంటే, అందులో వ్యాక్సిన్లు వేయించుకున్నవారు 10శాతానికి లోపే ఉన్నారన్న నివేదికలు భయపెడుతున్నాయి.

Also read: పుస్తక మహోత్సవం

జర్నలిస్టులు జాగ్రత్త!

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మీడియాకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. వార్తా సేకరణ, ప్రసారంలో భాగంగా నిరంతరం ప్రాణాలకు తెగించి పనిచేసే జర్నలిస్టులను కూడా ‘ఫ్రంట్ లైన్ వర్కర్స్’ గానే భావించాలి.  కరోనా వైరస్ బారినపడి ఎందరో జర్నలిస్టులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వాల నుంచి లభించిన ప్రోత్సాహం చాలా రాష్ట్రాలలో శూన్యం, కొన్ని రాష్ట్రాలలో నామమాత్రం. చాలీచాలని జీతాలు, ఎప్పుడు జీతం వస్తుందో, ఉద్యోగం ఊడిపోతుందో తెలియని బతుకుల మధ్య బిక్కు బిక్కుమంటున్న జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా భావించి  అన్ని డోసుల వ్యాక్సిన్లను అందించడంతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయాలను కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఎక్రిడిటేషన్ కార్డులు అందనివారి సంఖ్య చాలా రాష్ట్రాలలో రోజురోజుకూ పెరిగిపోతోంది. అందులో తెలుగురాష్ట్రాలు కూడా ప్రముఖంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మీడియా ప్రతినిధులకు అన్యాయం జరగకుండా చూడాల్సింది ప్రభుత్వాలే. అభివృద్ధి చెందిన చాలా దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ఎంతో విజయవంతమైందని జబ్బలు చరుచుకుంటే సరిపోదు. నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడంలో ఇంకా వేగం పెరగాల్సిందేనని మేధావులు మొట్టికాయలు వేస్తున్నారు. మొత్తంగా వ్యాక్సినేషన్ విధానంలో ఉన్న లోపాలను లోటుపాట్లను గుర్తెరిగి ప్రభుత్వాలు ముందుకు సాగాలి. వ్యాక్సినేషన్ విధానంపై ఉండే గందరగోళానికి ముగింపు పలకాలి.

Also read: స్వర్గానికి నిచ్చెనలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles