Sunday, December 22, 2024

నిద్ర ఒక యోగం, విజయానికి సోపానం

  • మితమైన నిద్ర వల్ల అపరిమితమైన ప్రయోజనం
  • రోజులు 8 గంటలు నిద్ర ఆరోగ్యప్రదం
  • నిద్రపోతేనే కలలు కనేది, కలల సాకారానికి కృషి చేసేది

“నిదురపోరా… తమ్ముడా.. నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా…”ఇది ఎంతో ప్రఖ్యాతి చెందిన గొప్ప పాట. ‘గానకోకిల’ లతా మంగేష్కర్ తెలుగులో పాడిన మొట్టమొదటి గీతం. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి స్వయంగా రచించి, స్వరపరచిన చైతన్య ప్రబోధ ‘గీతా’సుధ. ఈ పాట పుట్టి కూడా దాదాపు ఏడు దశాబ్దాలైంది (1955). ఈ పాట పుట్టిన సందర్భం,సన్నివేశం, చరణాలలోని భావాలు వేరే రసాన్ని పలికించినా ‘నిదురపోరా తమ్ముడా..’ అంటూ సందేశం ఇస్తోంది. మూగమనసులు సినిమాలో ఆత్రేయ ఓ పాట రాశాడు. అది అత్యంత ప్రముఖమైనది. పాడుతా తీయగా చల్లగా.. అని మొదలయ్యే ఈ గీతంలో “కునుకు పడితే మనసు కాస్త కుదుటపడుతది.. కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది..” అని గొప్పగా అంటాడు. ఇలా ‘నిద్ర’ పై ఎన్నో గీతాలు, కవితలు, పద్యాలు వెల్లువలా వచ్చాయి. నిద్ర ఎంత ముఖ్యమో వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఈరోజు పద్దెనిమిదేళ్ల ఓ కుర్రాడు కూడా నిద్ర తనకు ఎంత ఉపయోగపడిందో చెప్పాడు. అతని పేరు ఆర్ కె శిశిర్. జెఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో భారతదేశంలోనే టాపర్ గా నిలిచాడు. ఆదివారం నాడు ఫలితాలు విడుదలై, గొప్ప గెలుపును సొంతం చేసుకున్న సందర్భంలో ఈ కుర్రాడు చెప్పిన మాటలు ముత్యాల మూటలు. తను సాధించిన ఈ విజయంలో నిద్ర పాత్ర ఎంత గొప్పదో వివరించాడు. సమయపాలన, ప్రణాళిక, పట్టుదల, కృషితో పాటు చక్కని నిద్ర జతయైతే విజయలక్ష్మి వరిస్తుందని అతను చెప్పిన మాటలు నేటి తరం పిల్లలకు, పెద్దలకు కూడా గొప్ప పాఠాలు. సాధన  చేసినంత కాలం రోజుకు 8 గంటలు హాయిగా నిద్రపోయాడు. అది తన మెదడు, మనసును శక్తివంతంగా నిలబెట్టింది. నేడు అందరిలో అగ్రణిగా నిలబెట్టింది. మెదడుకు, మనసుకు నిద్ర గొప్ప శాంతిని కాంతిని ఇస్తాయని అతని మాటలు రుజువు చేస్తున్నాయి.

Also read:పోలవరం కుంటినడక ఎవరి శాపం?

గొప్ప కలలు కనండి… అవి తప్పక సాకారమవుతాయని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటలు ఎంత సుప్రసిద్ధమో తెలిసిందే. ఆయన మంచి నిద్ర పోయాడు. మంచి కలలు కన్నాడు. గొప్ప గెలుపు, తృప్తితో జీవితకావ్యాన్ని కళామయం చేసుకున్నారు. నేటి జెఈఈ టాపర్ శిశిర్ కూడా బహుశా కలాం నుంచి స్ఫూర్తి పొంది ఉంటాడు. నిద్రపోవడం, గొప్ప కలలు కనడం గొప్ప కళ. దానిని అందంగా మలుచుకోవడం జీవన సౌభాగ్యానికి కీలకం. ఏ వయసు వారు ఎంత సేపు నిద్ర పోవాలి అనే చిట్టా కూడా ఉంటుంది. నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి

రోగ నిరోధక శక్తి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కీలకమైన నాడీవ్యవస్థ గొప్పగా పనిచేస్తుంది. హార్మోన్స్ ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వల్ల సక్రమంగా జరుగుతాయి. నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. నిద్ర మనిషి జీవితానికి, జీవనానికి శారీరకంగా, మానసికంగా అత్యంత ముఖ్యమైంది. నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 2003 ప్రాంతంలో పరిశోధనలు జరిగాయి. ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్ర పోయిన వారిలో శారీరక సామర్ధ్యం తగ్గిపోయినట్లు ఆ శాస్త్రవేత్తల మండలి గుర్తించింది. నిద్ర అంశంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల మూడో శుక్రవారం నాడు ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నారు. నిద్ర సహజమైన దైనందిన చర్య . అంతే కాదు అది యోగవిద్యలో భాగం కూడా . మంచి నిద్రపట్టడం ఒక యోగం. “నిద్ర ఒక చిత్త వృత్తి” అని పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి. అదొక రకమైన యోగ సమాధిగా యోగా గురువులు చెబుతున్నారు. మహర్షి పతంజలి నుంచి నేటి విద్యార్థి శిశిర్ వరకూ చెబుతున్నదొక్కటే! మంచి ఆలోచనలతో ఉంటే అది దివ్య ఔషధం,భవ్య ఆయుధం. పగ, ప్రతీకారం, అహంకారం, అసూయ, అనుమానం వంటివి దరిచేరితే… “కంటికి నిద్ర వచ్చునే-  సుఖంబగునే రతికేళి – జిహ్వకున్ వంటకమించునే..” అన్న శ్రీనాథుడి పద్య పాదాలు అక్షర సత్యాలవుతాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి నిద్ర ఎంత సమయం అవసరమో అంత వరకు పాటించడమే ఔచిత్యం. మొద్దు నిద్ర వదలించుకొని యోగముద్ర వంటి నిద్రలోకి జారుకుందాం.

Also read: జనని సంస్కృతంబు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles