- అన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల పెంపు
- సుహృద్భావ వాతావరణంలో జీ-7 సదస్సు
- పరిమాణానికి తగినట్టు వృద్ధి చెందవలసిన అవసరం
జర్మనీలో జీ-7 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మన ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. 26, 27, 28 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి ఏటా జరిగే కార్యక్రమమే అయినప్పటికీ, ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల నడుమ పరిష్కారాల దిశగా అందరూ కలిసికట్టుగా సాగాల్సివుంది. పెద్ద దేశాల మధ్య చెలరేగుతున్న వైషమ్యాలు మానవత్వపు గోడలను బద్దలు కొడుతున్నాయి. ఆధిపత్య పోరు, నయా సామ్రాజ్య కాంక్ష, ఆర్ధిక స్వార్థం, పదవీ లాలస, జాత్యహంకార ధోరణి, డబ్బుగర్వం దేశాలను విడదీస్తున్నాయి.
Also read: మళ్ళీ కలవరం కలిగిస్తున్న కరోనా
అనేక అంశాలపై సహకారం
‘విభజించు – పాలించు’ సంస్కృతి కొత్తపోకళ్లతో కలవరం రేపుతోంది. ఆహారభద్రత, పర్యావరణం, ఉగ్రవాదం, ప్రజాస్వామ్యం, లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్యుత్ మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. వీటన్నిటికీ తలమానికంగా ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని భారత్ తో సహా అనేక దేశాలు బలంగా భావిస్తున్నాయి. మన ప్రధాని మోదీ ఈ అంశాన్ని విస్తృత రీతిలో వివరించాలని చూస్తున్నారు. ప్రపంచంలోని ఏడు ధనిక దేశాల సమాహారమైన జీ -7లో చిన్న, మధ్య దేశాల ప్రాతినిధ్యం పెరగాలి. ఆయా దేశాల గొంతు మరింతగా విచ్చుకోవాలి. ఆ దిశగా సొమ్మున్న దేశాలు అవకాశాన్ని కల్పించాలి, సముచిత గౌరవాన్ని ఇవ్వాలి. ఈ సదస్సుకు ఆహ్వానం అందిన ప్రజాస్వామ్య దేశాలలో భారత్ తో పాటు అర్జంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులతోనూ కలువనున్నారు. మ్యూనిచ్ వేదికగా జరిగే ఈ ఆత్మీయ సమావేశం కోవిడ్ రోజుల తర్వాత జరిగే అతిపెద్ద కలయికగా భావించాలి. జర్మనీ ప్రయాణంలో సుమారు 12 దేశాల అగ్రనేతలతోనూ మన ప్రధాని విడివిడిగా సమావేశం కానున్నారు. 28వ తేది యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమరేట్స్)లో పర్యటించి గల్ఫ్ పూర్వ అధ్యక్షుడు, దివంగత నేత షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు నివాళులు సమర్పించనున్నారు.
Also read: ‘మహా’సంక్షోభం
మానవత్వంపై ముఖ్యమైన చర్చ
ఈ సదస్సు సంగతి అట్లుంచగా, భారత్ -జర్మనీ మధ్య విభేదాలు పెద్దగా లేకపోవడం, సత్ సంబంధాలు కలిగిఉండడం ఆశావహమైన అంశం. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి సదస్సులు ఎంతగానూ ఉపయోగపడతాయి. ఈ సదస్సు వంకతో ఆ ఏడు ధనిక దేశాలతో పాటు మిగిలిన దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలను, మైత్రీబంధాలను ద్విగుణీకృతం చేసుకొనే దిశగా అడుగులు వేస్తామని ప్రధాన నరేంద్రమోదీ అంటున్నారు. దీనిని మంచి కదలికగా అంచనా వేద్దాం. ముఖ్యంగా కోవిడ్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు అన్ని దేశాలు ఆర్ధికంగా చితికిపోయాయి. జీవనపోరాటంలో మానవత్వం కూడా ప్రశ్నార్ధకమైంది. విశాలంగా, ఉదారంగా ప్రవర్తించిన వారున్నారు. స్వార్థకాంక్షతో రగిలిపోయిన వారున్నారు. తమ సంగతేంటో తాము చూసుకొనే క్రమంలో, తోటివారిని మరచినవారు, విడిచినవారు ఉన్నారు. మానవాళికి కోవిడ్ చెప్పిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభావంతోనే ఈసారి సదస్సులో ‘మానవత్వం’ ముఖ్య చర్చనీయాంశంగా మారడం మంచి పరిణామం. నైతికత, విలువలు ఛిద్రమవుతున్న వేళ మానవత్వం తన ఉనికిని తాను కాపాడుకోవడం అతిపెద్ద సవాల్. టాటా గ్రూప్ వంటి కొన్ని కార్పొరేట్ సంస్థల్లో నైతికతకు పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. టాటా గ్రూప్ లో ‘సీ ఈ ఓ -ఎతిక్స్’ అనే అతి పెద్ద ఉద్యోగాన్ని కూడా రూపొందించారు. తెలుగునాట చిన్ననాడే పిల్లలకు నీతిశతక పద్యాలను చెప్పేవారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పిల్లలకు ఇంటి పెద్దలు నీతికథలను బోధించేవారు. రామాయణ, భారత, భాగవత కథలను, అందులోని గొప్ప పాత్రలను, వీరోచిత వ్యక్తుల గాథలను అమ్మమ్మలు, బామ్మలు చెప్పే సంస్కృతి ఈ నేలపై ఉండేది. మామూలు చదువులతో పాటు విలువలు, నైతికతను బోధించే సంప్రదాయం భరతభూమిపై నెలకొని ఉండేది. చందమామ, బాలమిత్ర వంటి పత్రికలు విరివిగా ఉండేవి. నీతి, మానవత్వం వంటి విలువలను నొక్కిచెప్పే కథలు ఆ పత్రికల్లో పరమ ఆకర్షణీయంగా ఉండేవి. ఆర్ధిక సవాళ్లు, సరిహద్దు యుద్ధాలు, ఇచ్చుపుచ్చుకొనే ధోరణులకు తిలోదకాలు ఇవ్వడం, ఆర్ధిక, వ్యాపార స్వార్ధాల నడుమ, నడమంత్రపు సిరి మధ్య, ‘మానవత్వం’పై ఎలుగెత్తి అరవాల్సిన అవసరం ప్రపంచదేశాలకు రావడం విషాదం. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టడం అభినందనీయం.
Also read: నాద యోగ దినోత్సవం
ఉక్రెయిన్ యుద్ధం కష్టనష్టాలు
ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో జరిగిన నష్టం, వచ్చిన కష్టం, పెరిగిన హింస, మరచిన మానవతపై చర్చించాలని పెద్దదేశాలు అనుకోవడం మంచిదే. కానీ, ఈ దుస్థితికి, ఈ దమనకాండకు కారకులు, ప్రేరకులు ఎవరో మరచిపోయినట్లు నటించడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్ధిక అంశాల చుట్టూ ప్రధానంగా చర్చ జరగాలని జీ -7 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలు కూడా తీర్మానం చేసుకున్నాయి. పడిపోతున్న కరెన్సీల విలువపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా అపారమైన ఆస్తినష్టంతో పాటు, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎందరో నిరాశ్రుయులైపోతున్నారు. మధ్యలో కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు అందినకాడికి దోచుకుంటున్నారని తాజాగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధపర్వం తేటతెల్లం చేసింది. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ తీరు, భూకంపం వంటివి ఎంతటి ప్రకంపనలను సృష్టిస్తున్నాయో ప్రపంచప్రజలు చూస్తూనే ఉన్నారు. భారత్ పై చైనా, పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలు ప్రపంచదేశాలకు అర్ధమవుతూనే ఉన్నాయి. అవసరార్ధం విధానాలు, ప్రవర్తన మార్చుకొనే అగ్రరాజ్య తత్త్వం, పెద్ద దేశాల తీరు తెలుస్తూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశంగా ఏనాడో ఎదగాల్సిన భారతదేశం ఎందుకు ఎదగలేదని ప్రశ్నించుకుంటే తొలిగా తప్పు పట్టాల్సింది పాలకులనే. ఆ తర్వాతే చైనా వంటి పొరుగు దేశాలు, అమెరికా వంటి అగ్రరాజ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాలు మనతో ఆడుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మన విదేశాంగ విధానం, ఆర్ధిక, వ్యాపార, వాణిజ్య వ్యూహాలను పునఃనిర్మాణం చేసుకుంటూ బలోపేతం కావాల్సివుంది.
Also read: ఇదేమి ఆగ్రహం?
శత్రుత్వం శ్రేయస్కరం కాదు
ఈ దశలో ఎవరితో శతృత్వం అవసరం లేదు. శ్రేయస్కరం కాదు. మైత్రీబంధాలను పెనవేసుకుంటూనే రాజనీతి, యుద్ధనీతిని అవలంబించడమే వివేకం. జీ -7 అంటే గ్రూప్ అఫ్ సెవెన్. ప్రస్తుతం కెనడా,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ప్రధాన సభ్య దేశాలుగా ఉన్నాయి. రాజకీయ, ఆర్ధిక రంగాలపై సమీక్ష, బలోపేతం దిశగా అడుగులు వేయడం వీరి ప్రధాన ఉద్దేశ్యాలు. మరిన్ని దేశాలను కలుపుకొని ఈ సంఖ్యను పెంచాలనే ఆలోచనలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ కలిగి, చైనా తర్వాత అధిక జనాభా ఉండి, శక్తివంతమైన దేశంగా మహా నిర్మాణం కాదగిన భారతదేశం పట్ల జీ -7 దేశాలకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. భారతదేశం ఆర్ధికంగా బలోపేతమైతేనే మనశక్తి పెరుగుతుంది, మన మాటవిలువ పెరుగుతుంది.ఈ దిశగా దేశాన్ని నడిపించాల్సిన బరువుబాధ్యతలు పాలకులవే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన విజయవంతం, ఫలవంతం కావాలని ఆకాంక్షిద్దాం.
Also read: కేసీఆర్ కలలు సాకారం అవుతాయా?