Monday, January 27, 2025

నాటి నెల్లూరు

ఉద్యోగరీత్యా నెల్లూరు వదలి కొన్ని దశాబ్దాలు ప్రవాసినై  తిరిగి వచ్చినా నా జ్ఞాపకాల పేటికలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు భద్రంగా ఉన్నాయని ఇవ్వాల్టి ఒక సంఘటన నిరూపించింది. 1975 లో ట్రంకురోడ్డు లోని చంద్ర భవన్ హోటల్ భోజనం ధర తగ్గించిన ప్రకటన నా తమ్ముడు మహేంద్ర వాట్సప్ సందేశంగా పంపించాడు. దాంతో ఆనాటి నా జీవిత ఫ్లాష్ బాక్ మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది.

అప్పటికే చదువు పూర్తి చేసుకున్న కుర్రవాణ్ణి. చదువు ఘనత వహించిన వీఆర్ కళాశాలలో. అది అన్నిటికీ ప్రసిద్ధి. అక్కడ చదివే వాడికి చదువుకున్నంత. లెక్చరర్లు చాలా బాగా చెప్పే వాళ్ళు. క్లాసులు ఎగ్గొట్టి తిరిగే వాళ్ళు తక్కువేం కాదు. కళాశాల ఎదురుగా ఒక పెద్ద చెట్టు. ‘గ్రీన్ వుడ్ ట్రీ’ అనేవాళ్ళు. అదే వాళ్లకు నీడ. తోడు ఎలాగూ స్నేహితులు ఉంటారు. పక్కనే సిమ్లా హోటల్. ఆ రోజుల్లో నెల్లూరులో ‘దం చాయ్’ ప్రవేశ పెట్టిన ఇరానీ హోటల్. అక్కడ స్నేహితులతో కలిసి టీ తాగి సిగరెట్ ఊదుతూ ప్రపంచ సమస్యలన్నీ చర్చించేసే వాళ్ళు. మధ్యాహ్నం వరకు అట్లా గడిపేసి ఇక చాలనుకుని వెళ్ళి పోయేవాళ్ళు కొందరు. ఇంకొందరు ఓపికగా మధ్యాహ్నం వచ్చి కళాశాలలో ఒక రౌండ్ తిరిగేసి ఎదురుగా ఉన్న లీలా మహాల్లో ఇంగ్లీషు సినిమాకో, కొంచెం పక్కగా ఉన్న వేంకటేశ్వర హాల్లో హిందీ కినిమాకో వెళ్ళి ఆనందించేవాళ్ళు. ఎంత తిరిగినా చదువు మాత్రం బాగానే చదివే వాళ్ళు. ఆటగాళ్ళకు వీఆర్ స్కూల్ మైదానం రంగస్థలం, క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటలను రోడ్డుమీది జనం కూడా కాసేపు ఆగి చూసేవాళ్ళు. పెద్ద సభలన్నీ ఆ మైదానంలోనే.

విఆర్ కాలేజీ, నెల్లూరు

రోడ్డుకే అలంకారం చంద్రభవన్

సాయంత్రమైతే నెల్లూరుకు గుండెకాయలాంటి ట్రంకురోడ్డుకు రావాల్సిందే ఎవరైనా. అలా రాకుండా  ఉండే ప్రశ్నే లేదు. ఆ రోడ్డుకే అలంకారం చంద్ర భవన్, రమణ విలాస్ హోటళ్లు. రమణ విలాస్ లో ఇడ్లీ సాంబార్, చంద్ర భవన్లో మసాలా దోశ అద్భుతం. ఆ పక్కనే కోమల విలాస్. అక్కడి భోజనం ఒకసారి తిన్నవాడు మరి జీవితంలో మర్చిపోలేడు. ఇంటి భోజనం వదిలి అక్కడ తినాలనిపించేoత బాగుంటుంది. అక్కడి అంగళ్లు జిల్లా మొత్తానికి ప్రసిద్ధి. మగవాళ్ళ బట్టలకు మాడరన్ స్టోర్స్, చీరలకు రాయవరపు శంకరయ్య, మోహినీ స్టోర్స్, అన్ని రకాలకు వెరైటీ హాల్, మఫత్ లాల్ షోరూం లు పేరెన్నిక గన్నవి. మఫత్ లాల్ షోరూంలో రోజుకో రకం చీర కట్టిన సైరాబాను నిలువెత్తు విగ్రహం బజారుకే హైలైట్. పక్కనే ఉన్న కాపు వీధిలో కట్ పీస్ అంగళ్లు, ఎంబ్రాయిడరీ చేసే టైలర్ల షాపులు ఆడవాళ్లను ఆకట్టుకుంటాయి. మరి కాస్త ముందు కెళితే ఆడవాళ్లను మురిపించే కంగన్ హాల్.

Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు     

ఓబుల్ రెడ్డి గాడ్రెజ్ ఏజెన్సీ, స్టాండర్డ్ కాఫీ, నిర్మల వక్కపొడి, శ్రీరామ స్టూడెంట్స్ ఎంపోరియం, వేంకటరామ & కో, పాత పుస్తకాల సంతానం & కో, పెన్ కార్నర్, మై స్టూడియో ట్రంకు రోడ్డు లోని ముఖ్యమైన షాపుల్లో కొన్ని. గాంధి బొమ్మ దగ్గరి స్వతంత్ర పార్క్ పెద్దలకు, పిల్లలకు సాయంత్రపు ఆట విడుపు. పగలు కోఆపరేటివ్ బ్యాంక్ ముందు మూలికలు అమ్మే వాళ్ళు, గారడీ చేసే వాళ్ళు ప్రత్యేక ఆకర్షణ.

లస్సీ సెంటర్లో ‘సీమా’ టీ కుర్రాళ్ల కూడలి. సిమ్లా కూల్ డ్రింక్స్ లో రొజ్ మిల్క్, ఇటు బాబు ఐస్ క్రీమ్, అటు సుగంధ పాల్ అందించే ‘జయరాం సోడా’ దాహాన్నే కాక మనసును కూడా చల్లబరిచేవి. ఆరోగ్యకరమైన ప్రదేశమే అయినా అడుగడుగునా కనిపించే మెడికల్ షాపులు నెల్లూరుకే ప్రత్యేకం, రమణ నేతి మిఠాయి, జైహింద్ మిఠాయి అంగళ్లలో నెల్లూరు స్పెషల్ మలైఖాజా మరువలేని మరపురాని తీపి జ్ఞాపకం. నెల్లూరుకు ఆఫీసు పనులకో, కొనుగోలుకో వచ్చేవాళ్ళు రాగానే చంద్ర భవన్లో టిఫిన్ చేసి, పని చూసుకుని, కోమల విలాస్ లో భోంచేసి, అక్కడే ఉన్న ఆరు సినిమా హాళ్లలో ఏదో ఒక మ్యాటినీ సినిమా చూసి, ఒక స్వీట్ పాకెట్, కాసిని మల్లె పూలు, కొన్ని మనోరంజితం పూలు కొనుక్కుని సాయంత్రం బస్సుల్లో వాళ్ళ ఊళ్ళకు వెళ్ళేవాళ్ళు. నెల్లూరులో దొరికే అమృతపాణి అరటి పళ్ళ ముందు చక్కెర కేళి  బలాదూర్.

నెల్లూరు భాగ్యానికి ప్రతీక

ఆడవాళ్ళకు ఇష్టమైన చిన్నబజారులో పాత్రలు, వంటింటి వస్తువులకు కాంతి స్టోర్స్, ఫ్యాన్సి వస్తువులకు విజయ స్టోర్స్, పెళ్లి చీరలకు బనారస్ హాల్, బంగారు ఆభరణాలకు కనుమర్లపూడి నారాయణ శెట్టి షాప్, బజారంతా చిన్న, పెద్ద బంగారు, వెండి అంగళ్ళతో నెల్లూరు భాగ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నెల్లూరులో బంగారు పని చేసేవాళ్ళ నాజూకైన పనితనం దేశంలోనే ప్రసిద్ధి. అప్పుడు రాజస్థాన్ నుండి వలస వచ్చిన  జైనులు క్రమంగా బంగారం, వజ్రాల వ్యాపారాన్ని బాగా అబివృద్ధి చేసుకున్నారు. స్టోన్ హౌస్ పేట టోకు వ్యాపార నిలయం. బియ్యం పప్పుల లాంటివి తప్ప అన్ని వస్తువులు ఇళ్ల దగ్గర అమ్మకానికి వచ్చేవి. ట్రంకుపెట్టెలో చీరలు తెచ్చి ఇళ్ల దగ్గర కూర్చుని అమ్మి పోయేవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ. షాపులలోలా ఎక్కువ ధర ఉండదు కాబట్టి పేద, మధ్య తరగతి వారికి చాలా సౌకర్యంగా ఉండేది. కొందరు బంగారు నగలు కూడా ఇలాగే అమ్మే వాళ్ళు. అప్పులిచ్చి సులభ వాయిదాలలో వసూలు చేసుకునే వాళ్ళు.

Also read: మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols)

విజయవాడ వైపునుండి రైల్లో వస్తుంటే చాలా దూరంనుండే కనుపించే రంగనాయకుల గుడి గోపురం, కోవూరు వెళ్ళే దారిలోని రెండు ధర్మల్ పవర్ టవర్లు సంతోషంతో హృదయ స్పందన పెoచేస్తాయి. పెన్నా వంతెనపై రైలు దడదడ లాడుతూ వచ్చేస్తుంటే శరీరం అంతా పులకరింత. నాటి నెల్లూరుకు హద్దులు. తూర్పున నవాబుపేట, ఉత్తరాన రంగనాయకులపేట, పడమర మూలాపేట, దక్షిణాన మద్రాసు బస్టాండ్. వీటి మధ్యలో స్టోన్ హౌస్ పేట, సంతపేట, ట్రంకు రోడ్డు, చిన్న బజారు మాత్రమే.  ఇప్పుడు జిల్లా కోర్టు ఉన్న ప్రదేశం ఊరి బయట ఉన్నట్లు. కోర్టు పక్కనున్న కాలువలో బస్సులు కడిగేవాళ్ళు. ఊరికి దూరంగా శోధన్ పెయింట్స్ ఫ్యాక్టరీ ఉండేది (పస్తుత ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరాన ఉన్న శోధన్ నగర్).  పెన్నా నదీ తీరంలో రoగనాయకుల గుడి, మూలాపేటలో శివాలయం చాలా ప్రాచీన దేవాలయాలు., వేణుగోపాల స్వామి ఆలయo, గ్రామ దేవత ఇరుకళాల పరమేశ్వరి (ఇరుగాళమ్మ) గుడి ప్రసిద్ధ ఆలయాలు.

పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి హాస్పటల్

గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రి కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర అమెరికన్ హాస్పిటల్, వినాయక సినిమా దగ్గర సెంట్ జోసఫ్ (‘కన్నెకల’) హాస్పిటల్, నేటి కూరగాయల మార్కెట్ ప్రక్కన జూబిలీ హాస్పిటల్ ఆ నాటి ఆసుపత్రులు. పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి అసుపత్రి ఆనాటినుండి ఈనాటి వరకు పేదలను ఆదుకునే పెన్నిధి. ఎందరో ప్రజా సేవకులైన డాక్టర్లను తయారు చేసిన పుణ్య వేదిక.  అప్పట్లో వీధికొక నాటు వైద్యుడో, ఆర్ ఎం పి నో వైద్యం చేసే వాళ్ళు. ఆలోపతి డాక్టర్లు బాగా తక్కువగా ఉండేవారు. రోగం ముదిరితేనే డాక్టర్లకు చూపించే వాళ్ళు. సినిమా హాళ్లు మాత్రం డజను ఉండేవి. వినాయక, న్యూ టాకీస్, శేష మహాల్, రంగ మహల్, విజయలక్ష్మి (మణి టాకీస్), వేoకటేశ్వర, కనక మహల్, శ్రీనివాస, అనిత, లీలా మహల్, విజయ మహల్, శ్రీ రామ (ఎయిర్ కండిషన్డ్). పాటలు బాగుంటేనే సినిమా చూసేవాళ్ళు. కధ బాగుంటేనే సినిమా విజయవంత మయ్యేది. ప్రతి సినిమాలో రెండు యుగళ గీతాలు, ఒక ఏడుపు పాట, ఒక భక్తి పాట, ఒక కామెడీ పాట, ఒక డాన్స్ పాట, ఒక ఆడవాళ్ళ పాట తప్పనిసరిగా ఉండేవి. ఆడవాళ్ళను ఎంత ఏడిపిస్తే అంత మంచి సినిమాగా లెక్క. కాని హింది సినిమాలు మాత్రం కొంచె అల్లరిగా, వినోద ప్రధానంగా ఉండేవి. ఇంగ్లీషు సినిమా చూసింతర్వాత పూర్తిగా అర్థం కాని విషయం బయటపడకుండా ఉండడానికి ఎవరూ దాని గురించి మాట్లాడేవాళ్లు కాదు.

అపోలో హాస్పిటల్

మద్రాసు వాళ్ళకు చెందిన కేవీఆర్ బస్ సర్విస్, నెల్లూరు వాళ్ళ లక్ష్మీ సరస్వతి మోటార్స్, కేవీఆర్ బ్రదర్స్ బస్సులు నెల్లూరు మద్రాసు మధ్య తిరుగుతుండేవి. ఈనాడు మయూరి హోటల్ నుండి వెంకటరమణ హోటల్ వరకు ఉన్న ప్రాంతం కేవీఆర్ బ్రదర్స్ వాళ్ళ షెడ్డు. విఆర్ స్కూల్ ఎదురుగా ఉన్న చాకలి వీధి వాళ్ళు, కేవీఆర్ షెడ్డులో పని చేసే వాళ్ళు ఒక గ్రూప్. సంతపేట,  రైల్వే స్టేషన్ మధ్య ఉన్న కపాడిపాళెం, నేటి సుబేదారు పేటలోని మేదరి వాళ్ళు, ఏసి బొమ్మకు పడమరగా ఉన్న కటారి పాళెం కలిసి మరొక గ్రూప్. వీళ్ళ మధ్య తరచూ కొట్లాటలు భయంకరంగా జరిగేవి. కర్రలు,కత్తులు, చైన్లు, సొర చేప తోకలు వాడేవాళ్ళు. ఒక సోడా బుడ్డిని  పైకి ఎగరేసి మరోదానితో పగల కొట్టడాలు జరిగేవి. కాని వీళ్ళేవరూ జనం జోలికొచ్చే వాళ్ళు కాదు. కొంతకాలం తరువాత వాళ్ళలో ముఖ్యు లందరూ ఏదో ఒక కారణంతో చనిపోయి దైవికంగా కొట్లాటలు ఆగిపోయాయి.    

మచ్చతెచ్చిన మైపాడు జంటహత్యలు

నెల్లూరు చరిత్రకు ఒక మచ్చ కళారాణి, చంద్రికారాణి అనే ఇద్దరు అమ్మాయిల దుర్మరణం. మైపాడు బీచ్ లో చెరచబడి, చంపబడ్డారు. ఇది విజయవాడ ఆయెషా, డిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ కేసుల కంటే దశాబ్దాల ముందు జరిగింది. ఆ నాటి ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మధ్య పేజి  వ్యాసంలో రాశారు వీళ్ళ గురించి. ముగ్గురు హంతకులలో ఒకరు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. అందరూ జైలు  పాలయ్యారు.                

నెల్లూరులో బాగా డబ్బున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. వేల ఎకరాల ఆసాములున్నారు. కొందరు జనానికి మేలు చేసే పనులు చేసి శాశ్వత కీర్తి సంపాదించుకున్నారు. దొడ్ల సుబ్బారెడ్డి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కట్టించారు. తన భార్య కౌశల్యమ్మ పేరుమీద నెల్లూరు చెరువు  ప్రక్కన ప్రభుత్వ స్త్రీల  కళాశాల కట్టించారు. వీఆర్ కళాశాలను, స్కూల్ ను కట్టించింది వెంకటగిరి రాజా. అవి ఆయన పేరుమీదున్నా నిర్వహణ వేరేవాళ్ళు  చూస్తున్నారు. రేబాల లక్ష్మీనరసా రెడ్డి టౌన్ హాల్ కట్టించారు. అది సాంస్కృతిక ప్రదర్శనలకు నిలయం. నెల్లూరు కళామ తల్లికి ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంది. నాటి నాయిక (నెల్లూరు నెరజాణ) వాణిశ్రీ, ప్రతినాయకుడు రాజనాల, హాస్య నటుడు రమణా రెడ్డి, నిర్మాత (పహిల్వాన్) నెల్లూరు కాంతారావు, ఇటీవలే ఇంద్రుడి పిలుపందుకుని వెళ్ళిన గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం, నాటక రంగాన ప్రసిద్ధి గాంచిన గూడూరు సావిత్రి, ఇంకా ఎందరో మహానుభావులు నెల్లూరు వారే. ‘సహస్ర సభా సింహం’గా పేరుగాంచిన పుస్తకాల షాపు నరసింహం, రేబాల దమయంతి ప్రతి సభలోనూ కనిపించేవారు. 

జనం శాంతస్వభావులు

జనం సౌమ్యంగా శాంతిగా ఉండేవాళ్లు. పరుగులు, టెన్షన్లు లేవు. పిల్లలకు హోమ్ వర్కులు లేవు. హాయిగా ఆడుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. పెద్దలు కలుపుగోలుగా ఉండేవాళ్లు. ఎక్కడినుoడో ఇక్కడికి ఇష్టం లేకుండా వచ్చిన ఉద్యోగులు నెల్లూరు మొలగొలుకులతో అన్నం తిన్న తరువాత, ఇక్కడి చేపల పులుసు రుచి చూసిన తరువాత, ఇక్కడి జనంతో మమేకమై వదిలిపోలేక ఇక్కడే స్థిర పడిన కుటుంబాలు ఎన్నో. కులాల, మతాల రాజకీయాల గొడవలు లేని ఊరు నెల్లూరు. మంచి, మర్యాద, మన్నన, అప్యాయతలకు నెలవు మా సింహపురి. మధురమైన జ్ఞాపకం నాటి మా నెల్లూరు.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles