వాషింగ్టన్: విజయం ధ్రువీకరించుకున్న వెంటనే అమెరికాలో పని చేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు బైడెన్. హెచ్ 1బి వీసాల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డుల కోటాను కూడా త్వరలోనే పెంచుతామని చల్లని వార్త చెప్పారు బైడెన్. అంతేకాదు, హెచ్1బి వీసాలపై వచ్చే ఉద్యోగులు తమ వెంట తమ భార్య లేదా భర్తను తీసుకొచ్చుకునేందుకు కూడా అంగీకారం తెలపనున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన, వెళ్తున్న ఎంతో మందికి ఈ నిర్ణయం కొత్త ఊపిరినిచ్చింది. త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తామని బైడెన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అమెరికాకు వచ్చే హై స్కిల్డ్ ఉద్యోగుల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారు కొత్త అమెరికా అధ్యక్షుడు.
5 లక్షల మంది భారతీయులకు మేలు
సుమారు కోటి పది లక్షల మందికి అమెరికా సిటిజెన్‌షిప్ ఇస్తామని చెప్పారు బైడెన్. సరైన డాక్యుమెంట్లు లేకపోయినా సరే వాళ్లందరికీ అమెరికా పౌరసత్వం ఇచ్చేలా ఓ రోడ్‌మ్యాప్ సిద్ధం చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో కనీసం అయిదు లక్షల మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం అతి త్వరలోనే అమెరికా చట్టసభల్లో ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ బిల్లును తీసుకొస్తామన్నారు. వీసా నిబంధనలతో ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేయడం తమ అభిమతం కాదని, ఫ్మామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానంతో కొత్త సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం దేశాలపై విధించిన వీసా బ్యాన్‌ను కూడా ఎత్తేయబోతున్నారు. పైగా ఏడాదికి 95వేల మంది శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చేలా ఓ విధానాన్ని కూడా రూపొందించబోతోంది బైడెన్ సర్కార్.