- ఉగాది నుంచి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం
- ఉగాదినాటికి టీటీడీ సిబ్బందికి వాక్సినేషన్
- టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి
కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి రావడంతో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను మోసుకొచ్చింది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమయింది. 2021-22 సంవత్సరానికి గాను 2937 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను ధర్మకర్తల మండలి ఆమోదించింది. బడ్జెట్ ఆమోదంతో పాటు పలు కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. 80 అంశాలతో రూపొందించిన అజెండాతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇకనుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డ తెలిపారు. అలాగే దేశంలోని అన్ని కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని తీర్మానించారు. టీటీడీ వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్చాలని పాలక మండలి నిర్ణయించినట్లు తెలిపారు. బర్డ్ ఆసుపత్రి పాతభవనంలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు 9 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలలో అడ్డూ అదుపూ లేకుండా వాడుతున్న విద్యుత్ ను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతిథి గృహాలలో మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ను సాధ్యమైనంత మేర ఆదా చేస్తామన్నారు. ఆయోధ్యలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు భూమిని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్
టీటీడీ సిబ్బందికి వ్యాక్సినేషన్:
ఉగాది నాటికి టీటీడీ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీ పరిథిలోని కల్యాణ మండపాలను లీజుకిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.