- అన్నీ మంచి శకునములే
- బ్రిటన్ ను అధిగమించాం, జర్మనీ, జపాన్ లను కొట్టాలి
ఆకలి సూచీలో భారత్ ఆరోగ్యకరంగా లేదని, రూపాయి విలువ ఘోరంగా పడిపోయిందని, ధరలు మండిపోతున్నాయని, నిరుద్యోగం ప్రబలుతోందని, కరోనా దుష్ప్రభావాల నుంచి దేశం ఇంకా బయటపడాల్సివుందని రకరకాల కథనాలు, వార్తలు, విమర్శలు అలుముకుంటున్న వేళ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత్ ఆర్థిక ప్రయాణం పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగించేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారతీయులందరూ ఎంతో ఆనందించాల్సిన వార్తలివి. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే, ముఖ్యంగా చైనాతో సరిచూసుకుంటే దౌడులో మనం వెనకబడి పోయామన్నది కాదనలేని వాస్తవం. ఇద్దరి ఆర్ధిక ప్రయాణం ఇంచుమించుగా ఒకే సమయంలో మొదలైంది. ఈపాటికే చైనా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నది. మానవ వనరులు, సహజ వనరులు, ఆరోగ్యకరమైన ఆర్ధిక ఆలోచనా విధానం, పూర్వ చారిత్రక పునాదులవల్ల మన దేశం అగ్రరాజ్యంగా అవతరించే తరుణం ఎప్పటికైనా వస్తుందనే విశ్వాసం మనలో చాలామందిలో ఉన్నది. పాలకులు, పారిశ్రామిక, ఆర్ధిక, వ్యాపార వర్గాలు తగుమాత్రం శ్రద్ధ తీసుకుంటే, కొత్త ఆవిష్కరణలు చేపడితే మన స్థానం తప్పకుండా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మరో ఇదేళ్లలోనే అంటే 2027నాటికే భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్ధికశక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ చెబుతున్న మాటలు మంత్రాక్షరాల్లా వినబడుతున్నాయి.
Also read: భారత్ ఆకలి రాజ్యమా?
అయిదేళ్ళ తర్వాత అమెరికా, చైనా తర్వాత భారత్
మరో రెండేళ్లలో జర్మనీ, జపాన్ ను దాటుతామని ఐఎంఎఫ్ మాటలను బట్టి అర్థమవుతోంది. 2027కు అమెరికా, చైనా తర్వాత మూడో స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందనే విశ్వాసాన్ని ప్రతిష్ఠాత్మకమైన సంస్థ వ్యక్తం చేయడం గొప్ప పరిణామం, శుభసూచకం. ఐఎంఎఫ్ కు చెందిన వరల్డ్ ఔట్ లుక్ డేటాబేస్ ఈ వివరాలను అందిస్తోంది. ప్రస్తుతం ఐదో ఆర్ధిక శక్తిగా ఉన్న ఇంగ్లాండ్ స్థానాన్ని భారత్ భర్తీ చేసే రోజులు 2022లోనే రానున్నాయని సమాచారం. ఇది హర్షతిరేకాలను నింపే వార్త. 2027 నాటికి మన దేశ తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీడీపీ) 3,652 డాలర్లకు చేరుకొనే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదిక భరోసా కలిగిస్తోంది. సుమారు 550 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు మన దేశాన్ని జర్మనీ, జపాన్ కంటే ఉన్నతమైన స్థితిలో నిలుపుతయానే సిద్ధాంతం ప్రచారంలో ఉంది. కాకపోతే, మన దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దీనిని అధిగమించాల్సి వుంది. తాజాగా 2021-22 తొలి త్రైమాసికంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ ను అధిగమించామని, తద్వారా ఐదో అర్ధిక శక్తిగా అవతరించామని గణాంకాలు చెబుతున్నాయి.
Also read: హిందీపై తిరుగుబాటు బావుటా
భారత్ విధానాలకు ఐఎంఎఫ్ ప్రశంస
ఐఎంఎఫ్ కూడా ఈ వాదనను బలపరుస్తోంది. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాల ఫలాలను అందించడంలో భారతదేశం అనుసరిస్తున్న తీరును ఐఎంఎఫ్ ప్రశంసిస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఎంతో ప్రయోజనకారి అని కితాబు కూడా ఇచ్చింది. సాంకేతికతను భారత్ ఉపయోగించుకుంటున్న తీరును కూడా శ్లాఘిస్తోంది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లోని ప్రతికూల ప్రభావాలు భారతదేశంపై లేవని చెప్పలేం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీని వల్ల ఆర్ధిక స్థితిగతులు కఠినతరమవుతయానే విమర్శలు కూడా వస్తున్నాయి. రష్యా -ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ధరలు పెరిగాయి. ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వడ్డీ రెట్లు పెంపు ప్రభావం పెట్టుబడులపై ఉంటుంది. దీనిని అధిగమించాల్సివుంది. దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, భూమి సంబంధిత రంగంలో, కార్మిక రంగంలోనూ సంస్కరణలు చేపట్టాలని నిపుణులు చెబుతున్న మాటలకు ప్రాముఖ్యతను ఇచ్చి, ఆచరించి చూపాలి. మన అన్ని వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. శ్రమపడే తత్త్వం, ప్రణాళికా బద్ధంగా సాగే లక్షణం పెంచుకోవాలి. ఐఎంఎఫ్ చెబుతున్నట్లు శుభశకునాలు కనిపిస్తున్న వేళ మనమంతా మరింత అప్రమత్తం కావాలి. ఆశించిన ఫలాలను అందుకోవాలి.
Also read: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే మాటలా?