వోలేటి దివాకర్
‘రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ‘గుడ్ మార్నింగ్ రాజమండ్రి’ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఉదయమే నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయా డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించడమే ఈ కార్యక్రమ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నగరంలో రెండు డివిజన్లలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భరత్ రాజమహేంద్రవరం అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే వైఎస్సార్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి మిధున్ రెడ్డి త్వరలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం కూడా ‘గుడ్మార్నింగ్’ కు మరో కారణం కావచ్చునని విశ్లేషిస్తున్నారు.
Also read: ముస్లింలకు అవసరం లేని తీర్మానం కాపులకు ఎందుకు?
సుమారు ఏడాదిన్నర క్రితం రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ వ్యవహరించిన శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం ‘గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం’ కార్యక్రమాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుతో ప్రారంభింపజేశారు. ఈకార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గుడా చైర్ పర్సన్ ఎం షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం’ జరుగుతున్న సమయంలోనే ఎంపి భరత్ తన వర్గంతో కలిసి ‘శుభోదయం రాజమహేంద్రవరం’ పేరిట పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను పిలవకుండా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసి, ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమాన్ని ఆపించేశారని కూడా చెబుతున్నారు . ఆతరువాత ఈ రెండు కార్యక్రమాలు ముగిసిపోయాయి . అధికార పార్టీ గ్రూపులుగా రోడ్డునపడటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Also read: తెలుగుదేశంలో మరో తిరుగుబాటు…. పర్యవసానం ఇదే!
తాజాగా రానున్న అసెంబ్లీ, జరిగే అవకాశం లేని కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపి భరత్ పాత కార్యక్రమాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించారు. అయితే ఎప్పటి నుంచో అనంతపురంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి పాపులారిటీని చూసి ఆయనలాగే పేరు సంపాదించాలని, టీవీల్లో … పత్రికల్లో తన పేరు మారుమోగాలని ‘గుడ్మార్నింగ్’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పార్టీలోని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తున్నారు .
గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో ఎంపి వర్గీయులే కనిపిస్తున్నారు. ఎంపి నగర అధ్యక్షుడిగా నియమించిన అడపా శ్రీహరి, ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వార్డు నాయకులు మాత్రమే ‘గుడ్ మార్నింగ్’ లో పాల్గొంటున్నారు. ఆయా డివిజన్లకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, జక్కంపూడి రాజా, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. రానున్న రోజుల్లో మిగిలిన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటారేమో వేచిచూడాలి.
Also read: ఏడుపు ఎంతో గొప్ప….
ఆర్యాపురం బ్యాంకులో అంతా వారే
చైర్ పర్సన్ మినహా రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గాన్ని ఎంపి భరత్ తన వర్గం వారితోనే నింపేశారు. సభ్యులుగా ఉన్న వారిని కేవలం 3-4 నెలల్లోనే తొలగించారు. దీంతో వారంతా ఇప్పుడు ఎంపి వ్యతిరేకవర్గంగా తయారయ్యారు. వారంతా శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను కలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ అయితే మరింత ఆవేదన చెందారు. నగర అధ్యక్ష పదవిని వదులుకుంటే ఆర్యాపురం బ్యాంకు ఛైర్మన్ పదవిని కట్టబెడతానని ఎంపి హామీ ఇచ్చారనీ, ఇప్పుడు మొండి చేయి చూపించారనీ ఆవేదన చెందారు. మాజీ పాలకవర్గ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతానని శ్రీఘాకోళపు వారిని సముదాయించారు. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుని పోవాల్సిన నాయకులు తన వర్గీయులను ప్రోత్సహిస్తే వచ్చే ఎన్నికల్లో వారి రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ఊహించాల్సిన అవసరం లేదు.