——————–
(‘GOOD AND EVIL ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
—————————
నగర పెద్దలలో ఒకాయన ” మాకు మంచీ — చెడుల గురించి చెప్పండి.” అని ఆల్ ముస్తఫా ను అడిగాడు.
ఆల్ ముస్తఫా ఇలా జవాబిచ్చాడు :
నేను మీలోని మంచిని గురించి చెప్పగలను.
కానీ చెడుని గురించి చెప్పలేను.
చెడు అంటే ఏమిటి?
— ఆకలిదప్పులతో హింసించ బడిన మంచే కదా!
నిజానికి,
ఆకలి వేస్తే ‘మంచి ‘
చీకటి గుహల్లో ఉన్న తిండి
కూడా కోరుకుంటుంది!
దాహం వేస్తే
మృత జలాలైనా తాగుతుంది!
మీ ఆత్మతో మమేకమయ్యుంటే — అదే ‘మంచి’ !
అయినా గాని,
మీ ఆత్మ తో మమేకమవకపోయినా
మీరు ‘చెడు’ కాదు!
విభాజిత మైన గృహం– దొంగల స్థావరం కాదు
అది కేవలం, విభజించబడిన ఇల్లు మాత్రమే!
ఇంకా,
చుక్కాని లేని ఓడ, లక్ష్యరహితంగా
ప్రమాదకర ద్వీపాల్లో సంచరించ వచ్చు
అయినా, అడుక్కి మునిగి పోదు!!
మిమ్ములను మీరు అర్పించుకోడానికి ప్రయత్నిస్తే
మీరు ‘మంచి’ వారు!
అయినా గాని,
మీ నుండి మీరు ప్రయోజనం
కోరుకున్నంత మాత్రాన
చెడ్డవారు కారు.
ఎందుకంటే
మీరు ప్రయోజనం కోసం శ్రమించారంటే —
నేల తల్లిని గట్టిగా పట్టుకొని ఉండి
ఆ తల్లిపాలను పీల్చుకునే వేరులే!
ఖచ్చితంగా, ఫలాలు పండి
పక్వానికి వచ్చి, “సమృద్ధిగా
ఫలాలను ఇచ్చే నా లాగా ఉండు!”
అని ఫలాలు వేళ్లకు చెప్పవు.
ఎందుకంటే,
ఇవ్వటం అనేది ఫలాలకు ఒక అవసరం
తీసుకోవడం అనేది వేళ్లకు అవసరం.
మీ ప్రసంగంలో మీరు పూర్తిగా మేల్కొని ఉంటే
(జాగరూకులై ఉంటే)
— మీరు ‘మంచి’ వారు!
నిదురలో మీ నాలుక లక్ష్యం లేకుండా
తడబడుతుంటే
అది ‘చెడు’ కాదు!
తడబడే ప్రసంగం కూడా
బలహీనమైన నాలుకను గట్టిపరుస్తుంది
మీ లక్ష్యం వైపు గట్టిగా, ధ్యెరంగా
అడుగులు వేస్తుంటే — మీరు ‘మంచి’ వారే!
అటూ ఇటూ కుంటిగా నడిచినా గానీ
మీరు ‘చెడ్డ’ వారు కాదు!
కుంటి వారు కూడా వెనక్కి నడవరు కదా!
బలంగా, వేగంగా నడిచే మీరు
కారుణ్యం చూపిస్తున్నామనుకుని
కుంటి వారి ఎదుట
కుంటి నడకలు నడవనక్కర్లేదు!
మీరు అనేక విషయాలలో మంచి వారే!
మీరు ‘మంచి’ వారు కానప్పుడు
‘చెడ్డవారు’ అని అర్థం కాదు
మీరు ఊరికే తిరిగే సోమరులు.
ఏమైనా,
మగ జింకలు తాబేళ్లకు
వేగాన్ని నేర్పించలేవు కదా!
మీ బృహదాత్మ పై అపేక్షయే మీ ‘మంచి’.
ఆ అపేక్ష మీ అందరి లోనూ ఉంది!
కానీ, మీలో కొందరిలో ఆ అపేక్ష —
వనాల గీతాలని, పర్వత సానువుల
రహస్యాలని మోసుకుంటూ —
సాగర విలీనానికై
వడివడిగా పరుగులు తీస్తుంది.
మరికొందరిలో ఆ అపేక్ష
మలుపుల్లోనూ, వంకల్లోనూ తగ్గుతూ,
సముద్రానికి చేరుకునే ముందు
తచ్చట్లాడుతూ పోయే
చదునైన ప్రవాహంలా ఉంటుంది!
అపేక్ష ఎక్కువగా ఉన్నవారు
అది తక్కువగా ఉన్న వారితో —
“మీరెందుకు అంత మెల్లగా, ఆగుతూ
నడుస్తున్నారు?” అని అడక్కండి!
నిజమైన ‘మంచి’ మనిషి —
నగ్నంగా ఉన్న వస్త్ర రహితునితో
“నీ వస్త్రాలు ఏవి? అనీ,
నిరాశ్రయునితో
“మీ ఇంటికేమైంది?” అనీ
— ప్రశ్నించడు!
Also read: కాలం
Also read: తిమింగలము — సీతాకోకచిలుక
Also read: మార్గము
Also read: రాజదండము
Also read: అన్వేషణ