Tuesday, January 21, 2025

గొంతెలమ్మ తల్లి సంబరం

 (మతాన్ని జయించిన కులం)

అనకాపల్లి జిల్లాలో జనాభ గణాంకాల ప్రకారం అతి పెద్ద దళితవాడ పాయకరావు పేట గ్రామం (మండల కేంద్రం) లో వుంది. పాయకరావు పేట శాసన సభ నియోజకవర్గం షెడ్యుల్డ్ కులాల ( sc)  రిజర్వుడు నియోజక వర్గం. దాని తరువాత రెండవ అతి పెద్ద దళితవాడ నాతవరం గ్రామం(మండల కేంద్రం)లో వుంది.

1983 చివరిలో, ఒక రాత్రి ఆ దళితవాడకు బయలు దేరిన  10 నుండి 12 మందితో కూడిన  బృందoలో నేను కూడా  ఒకడిని. నర్సీపట్టణం  నుండి నాతవరం వెళ్ళే ప్రధాన మార్గాన్ని విడిచిపెట్టి, నర్సీపట్టణం నుండి తుని వెళ్ళే దారిలో ప్రయాణించి గాంధినగరం అనే సెంటర్ లో దిగాము. అక్కడ నుండి  తాండవ రిజర్వాయరు సాగునీటి కాల్వ గట్టు మీదుగా, చిమ్మచీకటిలో పడుతూలేస్తూ దళితవాడకు చేరాం. కాల్వగట్టు నుండి వాడలోకి వెళ్ళాలoటే అందులోకి  దిగి ఆవలి గట్టు ఎక్కాలి. ఆ రాత్రి మేము ఒక సానుభూతిపరుని ఇంటికి చేరుకున్నాం.  

మరుసటిరోజు ఉదయం ఆ వాడలో కలియతిరిగాను. ఎక్కడ చూసినా  కటిక పేదరికం. డెల్టా ప్రాంతాలకు వలస పోవడం, తాటి మట్టలు  కొట్టి,  నార తీసి దానిని అమ్మడం వారి ప్రధాన ఆదాయ మార్గాలుగా ఆనాడు వున్నాయి. ఆ మొత్తం వాడలో ఇద్దిరికి మాత్రమే బెంగుళురు పెంకుటిళ్ళు వున్నాయి. వారిద్దరూ దళితవాడ పెద్దలు. మాల, మాదిగ, రెల్లి, కొన్ని కొండ దొర (ST) కుటుంబాలు అక్కడ వున్నాయి. అందులో అధిక సంఖ్యాకులు మాల కులానికి చెందిన వారు. ఒక నాలుగు నుండి  ఐదు రోజులకని వెళ్ళిన నేను, కాస్త అటు ఇటుగా  ఒక పూర్తి సంవత్సరo ఆ వాడలోనే వున్నాను. మేము అక్కడికి ఎందుకు వెళ్ళాము, మా “మిషన్” ఏమిటి అన్నది ఇప్పుడు చెప్పబోవటం లేదు.

Also read: మూడు పార్టీలు, వాటి జెండాలు వున్నాయి,  కాని కొండకు  దారే లేదు …

1983 నుండి ఇప్పటి వరకు నేను ఆ దళితవాడతో ప్రత్యక్ష సంబంధoలో వున్నాను. వెళ్తూ వస్తూనే వున్నాను.  నాలుగు దశాబ్దాలుగా  నేను చూస్తున్న దళితవాడ అది.

గొంతెలమ్మ అనుపు

జనవరి 18న గొంతెలమ్మను సాగనoపుతున్నాము గనుక రమ్మని కబురు. ఇప్పటి తరం యువతి యువకులకు నేను తెలీదు. కాని ఇంకా జీవించి వుండిన పాతతరం వారికీ మాత్రం  తెలుసు. మేము జీవించి వుండగానే, ఆ వాడకు సంబంధించిన చరిత్ర దొంతరలలో మరుగున పడిపోయాము. అందుకు ఎలాంటి చింత లేదు సుమా!

18వ తేదిన గొంతెలమ్మ దిబ్బ (అనాదిగా గొంతేలమ్మను వుంచే ప్రదేశం పేరు అది) వద్ద కొలాహలంగా వుంది. తీన్మార్ వాయిద్యాలకు, ఆధునిక  DJ వచ్చి చేరింది. అనాదిగా వున్న     “ మాదిగ డప్పులు” ( అలనాడు అవి తోలు డప్పులు నేడు ప్లాస్టిక్ డప్పులు) ఉండనే వున్నాయి. బల్ల వేషాలు వున్నాయి. వాటి మీద అయోధ్య రాముడు, ద్వారకా కృష్ణుడు, ఇతర మహిళా  దేవతలు ఆసీనులైనారు. వేషదారులు అందరూ  బాల బాలికలు.

ఇతర విశేషాలలోకి వెళ్ళే ముందు మీకు “ గొంతేలమ్మ కధ” చెప్పాలి. వ్యసాయానికి, పంటకు, క్షేత్రానికి, బీజానికి వున్న లింక్ కూడా చెప్పాలి. ఈ మొత్తం జాతరలో ఎప్పుడు వుండే జంట ఎలుగు బంట్ల ( భల్లుకాల) నృత్య విన్యాసాలు ఈసారి కనిపించలేదు. దాని ప్రత్యెక ప్రస్తావన ఎందుకు వచ్చిందో  మల్లి  చెపుతాను.

పైడిరాజు

ముందుగ గొంతేలమ్మ కధ

గొంతెలమ్మ మాల వారి అమ్మాయి. ఎవరో తాగుబోతులు ఆమెను అడ్డంగా నరికేశారు. ఆమె నడుము కింద భాగం తెగిపోయి మాలపేటలో వచ్చి పడింది. నడుము కింది భాగం అంటే సంతానాన్ని ప్రసాదించె స్త్రీ లైంగిక అంగo వుండే దిగువ భాగం అని అర్ధం.

దసరా వెళ్ళిన తరువాత, మాల కుల పెద్దల పంచాయితీ జరుగుతుంది. వారు చేసిన నిర్ణయం ప్రకారం కొందరు పెద్దలు వరి పండే పొలంలోకి వెళ్తారు. అక్కడ వరి దుబ్బుతో కూడిన మట్టిని సేకరిస్తారు. దానిని డప్పు వాయిద్యాలతో మాలపేటకు తీసువచ్చి గొంతేలమ్మ దిబ్బవద్ద,  అప్పటికే సిద్దం చేసిన తాటి కమ్మల గుడిసలో పీటం పెట్టి దానిపై వుoచుతారు. తమ ఆడ బిడ్డ గొంతేలమ్మ మాలపేటకు వచ్చినట్లు ఇక అందరూ భావిస్తారు.

Also read: అజయ్ కుమార్ కూ, గదబ ఉద్యమకారులకూ ఈఏఎస్ శర్మ అభినందన

జనవరి సంక్రాంతి తరువాత ఆమెను  సాగనంపడానికి మధ్య కాలంలో ఆమెకు ధూప, దీప, నైవేద్యాలు పెడుతూవుంటారు.  ఈ మొత్తం కార్యక్రమం నిర్వహణకు రజస్వల కాని  కిషోర బాలికను ఎంపిక చేస్తారు. నాతవరం దళితవాడలో   “మార్తి” అనే ఇంటి పేరుగల వారే అధిక కుటుంబాలవారు. ఈ పూజారి బాద్యత ఆ ఇంటి పేరుగల కుటుంబoలోని అమ్మాయికి లభిస్తుంది(నా భార్య కోటమ్మ అలా మూడు సంవత్సరాలు పుజారిణిగా చేసింది).  అన్ని ఇంటి పేర్ల దళితులు గొంతేలమ్మను  తమ ఆడ బిడ్డగా భావించినా, ‘మార్తి’ వారు తమ స్వంత బిడ్డ అనుకుంటారు. మిగిలిన వారికి ఎలాంటి అభ్యంతరం లేదు.

మొక్కులు

పైడిరాజు ఆగమనం

ఇక రేపు గొంతేలమ్మ వెళ్లిపోతుంది అనగా ఆ ముందు రోజు ఆమె భర్త పైడిరాజు మాలపేటకు చేరుకుంటాడు. ఆయనకు ఒక విడిది ఏర్పాటు చేస్తారు. “గుడ్ల” అనే ఇంటి పేరు కల్గిన దళిత కుటుంబం ఇంటిలో ఆ రాత్రి వుంటాడు.

పైడిరాజును నాతవరం గ్రామంలోని ఒక  కంసాలి కుటుంబం వారు తయారు చేస్తారు. అక్కడ నుండి ఆయనను మేళతాళాలతో తీసుకువచ్చి విడిది ఇంటిలో ఉంచుతారు.

గొంతేలమ్మను ఒక పీట మీద, పైడిరాజును మరో పీట మీద పక్కపక్కన వుంచుతారు. వారిని సాగనంపే సమయంలో ఇరువురిని వంతులు వారిగా తలలపై మోస్తారు. తమ కోర్కెలు తీరాలనుకునే వారు, ముఖ్యoగా సంతాన సాఫల్యం కోసం కొద్ది సేపు ఆ గద్దెలను  తలపై పెట్టుకుంటారు.

Also read: అవును! గదబ సాగు రైతులే   గెలిచారు

పైడిరాజు కొంత వరకు పురుషుని  పోలిన బొమ్మ రూపంలో వుండగా, గొంతెలమ్మకు అలాంటి రూపం వుండదు. కాని గొంతెలమ్మ పేరున , గుడ్డతో చుట్టబడి,  పీటoపై ఉంచిన నమూనాను చూస్తే అది స్త్రీ జననాంగం ఉపరితల భాగాన్ని పోలి వున్నదనిపిస్తుంది.

దసరాకి దుబ్బులేసిన  పంట జనవరి నాటికి ఇళ్ళకు చేరుతుంది. పంటకు నేల / భూమి ‘క్షేత్రం’ అయితే ఆమె గొంతేలమ్మ. విత్తనం/బీజం  పైడిరాజు. వారి మధ్య జరిగే కాపురo    సంతానo అనే  ‘పంట’.

మాల వారి అమ్మాయి

గొంతెలమ్మను దళితేతర కులాల వారు మాల వారి అమ్మాయిగా చూస్తారు.  గద్దె వద్దకు వచ్చి మొక్కులు చెల్లిoచడానికి అభ్యంతరం ఏమి లేదు.  ఆఖరి రోజు,  తన భర్తతో కలసి వెళ్లిపోతున్నప్పుడు సంతానం కావాలనుకునే రైతు మహిళలు ఆ గద్దెను ఎత్తుకుంటారు.  తమ ఇంటి అమ్మాయి భర్తతో కలసి వెళ్లిపోతున్నందున, పెళ్ళికి సారె పెట్టినట్లుగా  అరటి పళ్ళు, తినుబండారాల కావిళ్ళను సిద్దం చేస్తారు.  ఊరికి దూరంగా వున్న “దాలమ్మ చెరువు” లొ గొంతెలమ్మను, పైడిరాజును నిమజ్జనం చేస్తారు.

బల్ల వేషాలు – దళితవాడలో శ్రీరాముడు

గొంతేలమ్మ అనుపు/ నిమజ్జనం రోజును గొంతెలమ్మ తీర్దం, సంబరం అని పిలుస్తారు. బంధువులకు కబుర్లు చెప్పుకుంటారు. పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయులు, అబ్బాయిలు “ హాల్ చేస్తారు”. ఒరుసుకోవడాలు, చూపులు కలుసుకోవడాలు జరుగుతుంటాయి. పెళ్లీడు పిల్లల తల్లులు వారిని అలంకరించి చూసుకొని మురిసిపోతూ వుంటారు.  యవతి, యువకుల  తల్లిదండ్రులు, బంధువులు వారిని గమనిస్తూ సంబంధాలు కలుపుకోవడానికి ప్రణాళికలు వేస్తూవుంటారు. జనవరిలో గొంతెలమ్మ తీర్దం జరిగితే మార్చిలో పెళ్లి ముహార్తాలు.  

ఇక ఎలుగు బంట్ల ( భల్లుకాల) జత గూర్చి చెప్పాను కదా. అవి తీర్దంలో ప్రత్యెక ఆకర్షణ.  ఎందుకంటే, ఈ జంట ఎలుగు బంట్లు శృoగార, మైధున  భంగిమలను తమ నృత్య విన్యాసాలలో చూపిస్తూ అన్ని రకాల వయస్సుల  వారిని అలరిస్తూ వుంటాయి. ఈ జంట ఎలుగు బంట్లు సంతాన పంటకు కావలసిన ఉద్దీపనను రగిలిస్తుంటాయి. ఈ సారి అవి లేవు. వాటి స్థానాన్ని DJ సౌండ్ సిస్టిo ముందు యువకులు పరిపూర్తి చేసారు విజయవంతంగా. 

Also read: చట్టం తన పని చెయ్యదు గాక చెయ్యదు! 

నేను 1983 చివరిలో ఈ వాడకు వచ్చినప్పుడు అక్కడ  చిన్న తాటి కమ్మల పాకలో ఒక చర్చి వుండేది.  పాస్టర్  కూడా కటిక పేదరికంలో వుండేవాడు. ఆదివారం నాడు తన వద్దకు వచ్చేవారికి , “ ఏసు ప్రభువే  మీకు దిక్కు”  అని భోధించినా మిగిలిన  అన్ని రోజులు,  అక్కడి భూ పోరాటంలో ఎర్రజెండా పట్టుకొని మాతో నడిచేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. సంఘ సభ్యలు  చెప్పిన మీదట అందరితో బాటు ఆయనకు కొంత భూమి ఇవ్వబడింది. ఆయన చర్చకి వచ్చే భక్తులను ప్రభువు కరుణించాడో లేదో తెలీదు. కాని ఆయనకు మాత్రం ప్రభువు కరుణ మెండుగా లభించింది. ముగ్గురు కొడుకులు పాస్టర్స్ గా స్థిరపడ్డారు.

1983 నుండి 2024 వచ్చేసరికి ఆ నాడు వున్న ఆ ఒక్క చర్చి 11 చర్చిలకు విస్తారించాయి. ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగిలినవారoదరూ వాడలోని ఎదో ఒక చర్చికి చెందిన వారే, ‘మారు మనసు’ పొందిన వారే. 

వ్యూహాత్మక రిట్రీట్

జనవరి 18న గొంతెలమ్మ తీర్దంలో , గొంతెలమ్మ, పైడిరాజుల గద్దెలకు అతి దగ్గరిలో అనుసరిస్తున్నాను. అక్కడ హడావిడి చేస్తున్న వారిలో చాల మందిని నేను ఎరుగుదును.  వారందరూ బాప్టిజం పుచ్చుకున్నవారేనని నేను ఎరుగుదును.

గొంతేలమ్మ తీర్దం క్రైస్తవానికి బయట వ్యవహారం. అంతేగాక అందులో ఎoతోకొంత విగ్రహరాదన వుంది. గొంతెలమ్మకు చీర, చలివిడి, వడ పప్పు, పుస్తెలు, కుంకుమ భరిణి, గాజులు, పూసలు వంటి వన్ని పెడతారు. క్రైస్తవ సాంప్రదాయం దానిని అంగీకరించదు. ఇది ఎలా సాధ్యం అయ్యింది ?  ఈ ఆలోచనలే  ఆ రోజoతా నా మదిలో  సుడులు తిరుగు వచ్చాయి.  మరుసటి రోజు కొందరితో విషయాలు చర్చించాను. వాటి సారాంశం ఇలా వుంది.

హిందూ పండగలైన దసర, సంక్రాంతి, దీపావళి వంటి వాటిని ‘మారుమనసు’ పొందిన వారు చేయరు. నాగుల చవితి తమకు అచ్చిరాదని ఈ దళితవాడవాసుల నమ్మకం. వారు ప్రధానంగా జరుపుకునేది  క్రిష్టమస్ . గొంతెలమ్మ పండగ పూర్తిగా ఒక భిన్నమైన “ఎలైన్మేంట్” లో వుందని అర్ధమయ్యింది. గొంతెలమ్మను అందరూ తమ కులానికి చెందిన అమ్మాయిగా భావిస్తున్నారు. అందునా ఆమె చంపబడింది. కనుక కుల దేవత దగ్గిరకు అచ్చేసరికి, “ ఏసు క్రీస్తు అందరికి ప్రభువు” అనే విశ్వాసాన్ని గొంతెలమ్మ జయించింది.  చర్చిలను నడిపేవారి ప్రతి స్పందన ఏమిటి? వారు గొంతెలమ్మ వ్యవహారంలో  వ్యూహాత్మక ‘రిట్రీట్’ ను  పాటిస్తారు.

 నేను  సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పుడు అక్కడ 11 వరకు చర్చిలు వున్నాయని లెక్క తేలింది.  వీటిలోకి దళితేతర కులాల వారు కూడా మంచి సంఖ్యలోనే భక్తులుగా వస్తున్నారు. ఒక చర్చి పరిధిలో వుండే భక్తుల పుట్టుకలు, చావులు, బారసాలలు, రజస్వల వేడుకులు, పుట్టిన రోజులు, గృహ ప్రవేసాలు, పెళ్లిల్లన్ని  ఆ చర్చి పూజారుల  భాగస్వామ్యంతో జరుగుతుంటాయి. భక్తులుగా ఒకే చర్చికి, ఒకే పరిశుద్ద గ్రంధంతో వచ్చినా అక్కడ పెళ్లిల్లు మాత్రం, ‘మారు మనసు పొందిన’  అదే కులం వారి మధ్య మాత్రమే జరుగుతుంటాయి. ఒక చర్చికి  మరొక చర్చికి మధ్య పెళ్లి సంబoధాల రాయబారంలో మొదట చూసేది ‘ మారు మనసు’  పొందిన వారి ‘మారని’ కులాన్ని మాత్రేమే.  అందుచేత మతం కులం సరిహద్దులను చెరపలేక పోయింది. సరికదా, ఈ దేశంలో “మానవులు  గత జన్మల పాపకర్మల (గుణకర్మల)  కారణంగా ఎక్కువతక్కువులుగా జన్మిస్తారనే” హిందూ కుల భావజాలంతో, “ మానవులందరిని ప్రభువు  సమానంగా సృష్టించాడనే” క్రైస్తవ సమానత్వ భావన రాజీపడింది.

కొస మెరుపులు  :

1.       గొంతేలమ్మ – పైడిరాజులు, నిజానికి దళితేతర హిందూ కులాలు పూజించే  “గైరమ్మ – పరమేశ్వరుల”కు   అనుసరణ లేదా అనుకరణ. అది హిందువైజేషణ్ లేదా బ్రాహ్మనైజేషన్ లో భాగం. నాతవరం రైతు పేటలో ‘గౌరీ – పరమేశ్వరుల’ పూజా ప్రక్రియ,  అనుపు ( నిమజ్జనం) మొత్తం అంతా అదే. 

అయితే గొంతేలమ్మ పై అత్యాచారం అనేది ఎక్కడి నుండి వచ్చింది? అంటే, అనాదిగ దళితుల మీద, దళిత మహిళలపై జరుగుతూవస్తున్న అత్యాచాల చరిత్ర అనుభవం నుండి వచ్చి చేరింది.

1983కు ముందు నాతవరం దళితులపై దాడులు జరిగాయి. వారిని దారుణoగా కొట్టి,  ఇళ్ళను దహనం చేశారు. తోలి తరం దళిత IAS అధికారి C. అర్జనరావు విశాఖపట్టం జిల్లాకు కలెక్టర్  ( 1979-1980)గా వుండగా ఇది జరిగింది. దాడి  జరిగిన మూడేళ్ళకు కమ్యూనిస్టు విప్లవకారులు ఆ దళితవాడకు చేరుకున్నారు.

అంబేద్కర్ కంటి పరీక్ష శిబిరం  

2.       2015 ఏప్రిల్ నెల 12న ఆ వాడలో పుట్టిపెరిగిన ఇద్దరు దళిత యువతులు శంకర ఫౌoడేషన్ నేత్రాలయం వారి సహకారంతో ఆ వాడలో “అంబేద్కర్ కంటి పరీక్ష” శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరంలో అనేకమంది పాల్గొని పరీక్షలు  చేయించుకున్నారు. అందులో ఆ నాడు దళితులపై దాడులు చేసిన వారు కూడా వున్నారు. ఆ అమ్మాయిలలో  ఒకరు ఆంధ్ర యునివర్సిటిలో సోషల్ వర్కు ( MSW)లో మాష్టర్స్ చేసిన రామలక్ష్మి, మరొకరు ఆప్తమెట్రి( B.Sc, optometrist)లో డిగ్రి పూర్తీ చేసిన  అరుణ కుమారి. వారిద్దరు నా కుమార్తెలు. నేత్ర శిబిరంలో పాల్గొన్న వారికీ దృష్టి బాగుపండింది కాని వారికి ఎప్పటికైనా  కొత్త దృష్టి వస్తుందంటారా?  అనుమానమే!

Also read: ఒక చిరు విజయం

PS అజయ్ కుమార్

మతాన్ని జయించిన కులం –  కులాంతర విహాహాలు ( ?) : నా వీడియో లఘు చిత్రం లింక్ . 

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles