- వేర్వేరు ఘటనల్లో 2.5 కిలోల బంగారం స్వాధీనం
- అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికులకు నోటీసులు
శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తీసుకొస్తున్న సుమారు 2 కిలోలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు విమానం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే తనిఖీలు చేపట్టారు. సీటు కింద లైఫ్ జాకెట్ లో దాచిన 2.3 కిలోల బంగారం బిస్కెట్లను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆ సీటులో ప్రయాణించిన వ్యక్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
మరోవైపు కువైట్ నుంచి ఎలాంటి ధృవపత్రాలు లేకుండా ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన 160 గ్రాముల బంగారాన్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడికి కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కస్టమ్స్ అధికారుల దాడుల్లో పట్టుబడిన బంగారం విలువ సుమారు కోటి వరకు ఉంటుందని అంచనావేస్తున్నారు.
Also Read: హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు