Tuesday, January 21, 2025

కృష్ణుడి కోసం వెళ్లడమే ఫలం అనీ అదే వ్రతం

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 8

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మెయ్‌వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్, కోదుకలముడైయ
పావాయ్! ఎழுన్దిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాది దేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆ వా వెన్ఱారాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్!

తెలుగు భావార్థ గీతిక

తూరుపుదెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి

                             దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ

నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము

భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర

పఱై పరములగోరెడు నోము నోచుదామని చెప్పుదాము

కేశిరాకాసి నోరు జీల్చి. చాణూరముష్ఠుల గూల్చి

లోకాల నాధుడే మాధవుడు మనమధ్య నిలిచె

కృష్ణ సంస్పర్శస్నానాలుజేయ రావమ్మ కృష్ణవేణి.

అర్థం

కీళే (కీழ்) =తూర్పుదిక్కున, వానమ్ = ఆకాశం, వెళ్ళు = తెల్లబడ్డది, ఎన్ఱు =అని, ఎరుమై =గేదెలు, శిఱువీడు= చిన్నమేత, మేయ్‌వాన్= మేయుటకై, పరన్దనగాణ్ =వ్యాపించినవి, మిక్కుళ్ళ= మిగిలిన, పిళ్ళైగళుం= పిల్లలునూ, పోవాన్=పోవుటయే ప్రయోజనముగా, పోగిన్ఱారై = పోవుచుండగ, వారిని, ప్పోగామల్ =అలా వెళ్ళకుండా, కాత్తు=అడ్డి, ఉన్నై=నిన్ను, కూవువాన్ = పిలుచుటకై, వందు = వచ్చి (నీ యింటి ముందర), నిన్ఱోం =నిలిచితిమి, కోదుకలముడైయ=కృష్ణునికి కూడ కుతూహలము కలిగించు
పావాయ్! =యువతీ! ఎళున్నార్ ఎழுన్దిరాయ్! = లెమ్ము! పాడి = గానము చేయుచూ పఱై =పఱై అనెడి వాయిద్యమును, కొండు=అతడినుంచి స్వీకరించి, మా=అశ్వాసురుని యొక్క, వాయ్ =నోటిని, పిళన్దానై=చీల్చినవానిని, మల్లరై = చాణూరుడు, ముష్టికుడు అనే మల్లురను, మాట్టియ= మట్టి కరిపించిన, దేవాదిదేవనై= దేవతలందరికి ఆరాధ్యుడైన శ్రీకృష్ణుని, శెన్ఱు=దగ్గరకు వెళ్ళి, నామ్= మనము, శేవిత్తాల్ =నమస్కరించినట్లైతే, ఆవావెన్ఱు=అయ్యో! శ్రమపడ్డారా! యని, ఆరాయ్‌న్దు = పలుకరించి, అరుళ్ =అనుగ్రహించును, ఏల్+ఓర్+ఎం+పావాయ్=ఇదే మా గొప్ప వ్రతము.

తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లవారింది. ఉదయాన్నే లేత గడ్డి మేయడానికి గేదెలను నాలుగువైపులా విడిచిపెట్టారు. కృష్ణుడి కోసం వెళ్లడమే ఫలం అనీ అదే వ్రతమని మనతోటి గోపికలంతా మనస్ఫూర్తిగా తలస్తున్నారు. కాని విడివిడిగా పోవడం కన్న కలిమిడిగా పోవడం మంచిదని గోదమ్మ వారిని ఉద్బోధిస్తున్నారు. ఓ చిన్నదానా! నిన్ను కూడా పిలుచుకుని పోవడానికి వచ్చి నీవాకిట నిలబడ్డాం. శ్రీ కృష్ణుడిని చేరాలని నీకూ కుతూహలంగా ఉంది కదా మరి వెంటనే లేచి రావమ్మా. ఆతనిని కీర్తించి పఱై డక్క అనే వాద్యపరికరాన్ని (లేదా ముక్తిని) ఆయన్నుంచి స్వీకరిద్దాం.

Also read: “కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు” దధిమధన

సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం

ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.

 

గోదమ్మ నమ్మాళ్వార్ ను, మూడో గోపికను, మేలుకొలుపుతున్నారు. ‘‘అస్మత్సర్వ గురుభ్యోన్నమః  అనే ఆచార్య నమస్కార మంత్రాక్షరాలు అంతర్లీనంగా వెలిగేపాట. సూర్యునికి ఉషస్సే కన్న తల్లి. ఉదయం బాల్యానికి సంకేతం. పగలు యవ్వనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మరణం, మళ్లీ ఉదయం అంటే మళ్లీ జననం, నవ జీవనం అని దాశరథి రంగాచార్య ఈ పాశుర సారాంశాన్ని వివరించారు.  మమ్మల్ని మంచి మార్గాన నడపమని ప్రార్థించే పద్యాలు ఇవి. ఇది మన వేద సంప్రదాయం.

శ్రీకృష్ణుడు తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు

ఈ రోజు  పాశురంలో కేశి రాక్షస సంహారం కథ ప్రస్తావిస్తారు గోదమ్మ వారు. గుఱ్ఱం రూపం లో ఉన్న కేశి అనే రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతులు పెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. కేశి రాక్షసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. కేవలం చేయిని ఉబ్బిస్తూపోయాడు.  ఉబ్బిన చేయి శరీరంలో ఇమడక, ఆ పరిమాణాన్ని భరించలేక ఆ అశ్వరూపాసురుడి నోరు పనిచేయదు. స్వార్థంతో మింగడానికి తప్ప,అజ్ఞానంతో నోరుమూసుకుని ఉండి, మూర్ఖంగా తెరవడానికి ఇష్టపడని, స్వామిని నుతించని వారి నోళ్లను తెరిపిస్తాడు.

కేశవుడంటే క అనే పరబ్రహ్మ స్వరూపం, అ అంటే విష్ణు స్వరూపం, ఈశ అంటే రుద్ర రూపం. త్రిమూర్తుల సమ్మేళనం కేశవుడు. అయిదు ఇంద్రియాలు శరీరం అనే రథానికి కట్టిన గుఱ్ఱాలు మనను అయిదు వైపులా లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లాన్ని బుద్ధి అనే సారథి చేతులో పెట్టగలిగితే రథం సక్రమంగా సాగుతుంది. లేకపోతే ముక్కలైపోతుందని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఇంద్రియాలను చంపడు కాని అదుపులో పెట్టుకుని మారేట్టు చేయడం గురించి భగవంతుడు వివరిస్తాడు.

ఇంకా కౌమారం దాటక ముందే, బలరామ కృష్ణులు భయంకరులైన మల్ల విశారదులు చాణూర ముష్టికులను ఎదుర్కొని ఓడించారు.చాణూరుడు క్రోధానికి కోపానికి పాపానికి ప్రతీక. కామం కోపం పోవాలంటే గురువు అనుగ్రహం కావాలి. చాణూర ముష్టికులను అవలీలగా సంహరించిన వీరులు. మదజలం స్రవించే కువలయాపీడము అనే మత్తగజంతో పోరాడి, మావటిని చంపి  దాని రెండు దంతములు పెఱికి భుజాన మోస్తూ రామ కృష్ణులిద్దరూ కంసుని సభలో ప్రవేశించి మల్ల వీరులను మట్టి కరిపిస్తారు.

మంచెల మీద ఉన్న రాజులు ఆశ్చర్యభయోపేతులవుతూ ఉంటే కంసుని సింహాసనం దగ్గరికి వెళ్లి, ఒక్క ఉదుటున కిందపడవేసి పిడి గుద్దులతో చంపేసిన కృష్ణుడు అప్పడికి ఇంకా యువకుడుకూడా కాదు. నూనుగు మీసాల కౌమార దశస్కుడు. ముష్టికాసురుడు అంటే ఎంత తిన్నా ఇంకా కావాలనే వాడు కామములు తీరని వాడు. చాణూరుడు క్రోధానికి ప్రతీక. కామక్రోధాలను జయించాలి. అందుకుభగవంతుడు  ఆచార్యుని ద్వారా అనుగ్రహించాలి.

Also read: కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు

మనకు అద్భుతాలగా కనిపించే ఈ లీలలన్నీ శ్రీకృష్ణుడికి గుర్తుండవు. తలచుకోడు. మనమే ఆ భయానక సంఘటనలు తలచి భీతిల్లి శ్రీకృష్ణలీలలు గా పాడి, మంగళాశాసనాలు చేస్తుంటాము.

గోపికా భావం

తాము పిలువబోయిన గోపబాలిక శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. రజస్తమోగుణాలసంకేతాలయిన రాత్రి గడచి, సత్వగుణప్రధానమైన లేత రవి కిరణాలు మెలమెల్లగా ఉదయించే సమయం. రజస్సు, తమస్సు అంత తొందరగా వదలవు, కాని తెలతెల్లవారుతుంటే క్రమంగా తగ్గుతాయి. చిన్నబీడు అంటే అప్పుడప్పుడే పెరుగుతున్న లేతగడ్డి. బాగా పెరిగిన బయళ్లకు బయలుదేరి గేదెలు కదిలిపోతూ ఉండడం అంటే రజోతమోగుణాలు తగ్గిపోతూ ఉండడమే అని కవయిత్రి భావం. పరమాత్ముడిని ప్రేమించేవారితో కలిసి వెళ్లడం లేదా వారిని వెంటతీసుకుని వెళ్లడం ఇక్కడ కీలకాంశం.  అందరం కలిసి చేద్దాం మంచిపనులు అనే గోద సందేశమే ఆ సమాజానికి నేటి సమాజానికి కూడా కావలసిందే. ఇది గోపికా పరమైన వ్యాఖ్యానం.

Also read: యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి

ఆచార్యపరమైన వ్యాఖ్య

ఆచార్యుని ఇంటి ముఖద్వారం ముందు నిలిచి వేచి ఉండడం శిష్యుడికి ముఖ్యప్రయోజనం. అశ్వము అహంకారానికి ప్రతీక. చాణూర ముష్ఠికులు కామక్రోధాలకు తార్కాణాలు. ఆచార్యుడు కటాక్షిస్తేనే కదా వీటి అడ్డు తొలగించుకోగలుగుతాం. ఆచార్యుడి దయద్వారా పరమాత్ముడే వీటిని తొలగిస్తాడు. ఈ పాశురం అంతరార్థంలో నమ్మాళ్వారులను మేల్కొలుపుతున్నారు. కోదుకులముడయ పావాయ్ అని సంబోధన. అంటే వ్యామోహము కల పిల్ల అని దీనికి అర్థం.

నమ్మాళ్వార్ కృష్ణతృష్ణ సూచిక

రుషిం జుషా మహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితం అని స్తుతిస్తారు. కృష్ణ తృష్ణాతత్త్వం అంటే కృష్ణునికి గల తృష్ణ, కృష్ణునియందుగల తృష్ణ అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. కనుక నమ్మాళ్వార్ కోదుకులముడయపావాయ్ అని అర్థమని, నమ్మాళ్వార్ తిరువాయ్ మొళి లో తమను పావాయ్ అని చెప్పుకున్నారనీ కందాడై రామానుజాచార్య లోపలి భావం వివరించారు. కుతూహలము గలవారు అంటే భగవంతుని యందు భాగవతుల యందు అంటే ఆచార్యుల యందు, భగవంతుని ప్రేమించే వారి యందు కుతూహలం కలవారనీ అర్థం.

తెల్లవారిందా… అంటూ కృష్ణుని కోసం ఎదురుచూస్తున్నారు

ఈ పాశురంలో ఇంటిలోనున్న గోపికకు ఇంటిబయటనున్న గోదాదేవి ఆమె సహచర గోపబాలికలకు మధ్య సంవాదం వివరించారు. గోద: కృష్ణుడు మనను కలవడానికి నిర్ణయించిన సమయం వచ్చింది. ఈ సమయంలో నిద్రపోవచ్చాఅని మనవాళ్లు అడుగుతున్నారు గోపిక: ఆ సమయం సమీపించిందా, మీకే విధంగా తెలిసింది? గోద: కీళ్ వానమ్ వెళ్లెన్ఱు… తూర్పు తెల్లవారింది కదా.. గోపిక: కృష్ణవిరహం కారణంగా ఈ రాత్రి సహింపరానిది. ఆ రాత్రి తొలగిపోయి సూర్యుడికోసం ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తున్నారు కనుక మీకు అదేధ్యాస. మీ ముఖాలే సూర్యబింబాల వలె ఉంటాయి. మీ ముఖ కాంతులతో కూడా దిక్కులు తెల్లబడి ఉంటాయి. అదీగాక మీకు పాలు పెరుగు మజ్జిగ వంటి తెల్లని పదార్థాలు చూసీ చూసీ అంతా తెల్లగా ఉందనుకుంటూ ఉంటారు. గోద: ఎరుమైశిఱు వీడు….పరందన కాణ్ …పశువులు ఉదయాన్నే అప్పుడే మొలిచి, లేత గడ్డి మేయడం కోసం పొలాలకు చేరుకున్నాయి. తెల్లవారితేనే కదా పశువులు మేతకు బయలుదేరేది.. (శిఱు వీడు అంటే అప్పుడే మొలిచి, మంచు కురిసిన లేతగడ్డి, అది తినడానికి పశువులను వదలడం, పెఱువీడు అంటే ఎక్కువసేపు గేదెలను మేయడానికి వదలడం)
పెరియాళ్వార్ ల పుత్రిక గోదాదేవి తన కులానికి తగినట్టు యజ్ఞయాగాదుల భాష, వేద మంత్రాల ఘోష గురించి మాట్లాడకుండా పశువులను మేపడం వంటి విషయాల గురించి లోతుగా చర్చిస్తున్నదంటే ఆమె మహాభక్తులైన గోపబాలిలకతో ఎంతగా తాదాత్మ్యం చెందిందో తెలుస్తుంది. గోద: ఆ పశువుల వెంట మన గోపీకృష్ణుడు కదిలి వెళ్లిపోతే ఇక మనం ఎవరిని చూస్తాం. మనం జీవించడం మాత్రం ఎందుకు? ఇంక నిద్ర చాలించు, బాగా ఎక్కువైంది లే.
Also read: మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు
గోపిక: గేదెలింకా మేతకు వెళ్లలేదు. మీ ముఖ కాంతులు సోకి తొలగి పోయే చీకటి పొరలు, మబ్బులను మీరు గేదెలనుకుంటున్నారు. ముఖ కాంతులవల్ల తెల్లవారిందనుకోవడం అన్యథా జ్ఞానం. చీకటి గుంపులు గేదెల్లా ఉన్నాయనుకోవడం విపరీత జ్ఞానము.(1. ఉన్న ధర్మం లేదనుకోవడం, లేని ధర్మం ఉందనుకోవడం, సర్పరజ్జు రజ్జుసర్ప భ్రాంతి,పామును తాడనుకోవడం, తాడును పాము అనుకోవడం అన్యథా జ్ఞానం. 2. ఒక వస్తువును ఇంకొక వస్తువుగా భావించడం, పరమాత్మ పరమాత్మకాదని మరొకటని భావించడం విపరీతజ్ఞానం. ఉన్నది ఉన్నట్టు అనుకోవడం యథార్థ జ్ఞానం. తెల్లవారుఝాము సత్వగుణ ప్రధానమైన యథార్థ జ్ఞానం, మధ్యాహ్నం రజోగుణ ప్రభావం వల్ల 3. అన్యథా జ్ఞానం, రాత్రి తమో గుణ ప్రభావం వల్ల విపరీతజ్ఞానం కలిగే కాలాలు) గోద: సరే మాది అన్యథా జ్ఞానమూ, విపరీత జ్ఞానమూ అనుకో, నీవు జ్ఞానంలో శ్రేష్ఠమైనదానివి కదా, తెల్లవారలేదనడానికి నీవే ఏదయినా దృష్టాంతరం చెప్పు చూద్దాం.
గోపిక: మనగోకులంలో అయిదు లక్షల మంది గోపికలుంటే, కనీసం వేయి మందైనా వచ్చినట్టు లేదనుకుంటా. గోద: మిక్కుళ్ల పిళ్లెగళుమ్ .. నీవు తప్ప మిగిలినవారు రావడం, వెళ్లడం కూడా జరిగిపోయింది.
గోపిక: అయితే నాతో పనిలేదన్నమాట. పోనీ నన్ను లెక్కచేయలేదనుకోనా.
గోద: అట్లా అని కాదు. వారంతా కలిసి సందడిగా ఉండడం, నీవు వున్నావో వెళ్లావో తెలియకపోవడం వల్ల వెళ్లిపోయిఉండవచ్చు కదా..నీపట్ల అలక్ష్యమేమీ లేదులే..
గోపిక: ఏం పని మీద వెళ్లారో.. గోద: పోవాన్ పోగిన్ఱారై… అర్చిరాది మార్గంలో శ్రీ వైకుంఠానికి వెళ్తున్నవారి వలె, శ్రీ కృష్ణుడిని బృందావనంలో చూడడానికి వెళ్తున్న అక్రూరుడి వలె తిరుమల యాత్రకు వెళ్తున్న వారి వలె, వెళ్లడమే ప్రయోజనం… వేరే పనిగురించి కాదు.. (అంటే జీవి ఆత్మగా చేరుకునే శ్రీవైకుంఠ యాత్ర, తిరుమల యాత్ర, అక్రూరుని బృందావన యాత్ర ఒకటే అని గోద వివరిస్తున్నారు) గోపిక: నన్ను వదిలి వెళ్లిపోయినారు కదా ఇక నేను వచ్చి మాత్రం ప్రయోజనం ఏమిటి?
గోద: వాళ్లు వెళ్లిన కారణం తెలుసుకదా.. వెళ్తున్న వారితో నీవు ఇంకా రాలేదని చెప్పాం. అంతే వారు నిర్ఘాంతపోయి కదలకుండా ఉండిపోయారు. ప్పోగామల్ కాత్తు.. కదలకుండా ఉండాలని ఎవరూ కాపలా పెట్టలేదు.. తిరువాణై నిన్నాణై అంటూ ఆజ్ఞాపించిందీ లేదు. నీవు రాలేదని వినగానే కాళ్లకు సంకెళ్లు పడ్డట్టు ఆగిపోయారు తెలుసా… ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోమ్… వాళ్లని అక్కడే ఆగమని చెప్పి నిన్ను పిలుచుకుని పోవడానికి మేం వచ్చాం. శ్రీకృష్ణదర్శనం కోసం వెళ్లడమే వారి ప్రయోజనమని వారు భావించినట్టు, నిన్నుపిలుచుకుని పోవడమే ప్రయోజనమని మేము భావించి నీవాకిటికి వచ్చాం. లంకలో వానరసైన్యంతో విడిసిన శ్రీరాముని సైన్యం చెంతకు రావడానికి లంకనుంచి విభీషణుడు బయలుదేరి సముద్ర ఉత్తర తీరాన ఆకాశంలో నిలబడ్డాడు. శ్రీరాముని చూడగానే విభీషణుడు స్తంభించినట్టు మేమూ నిలబడిపోయి నీకోసం చూస్తున్నాం తెలుసా..
గోపిక: మీరంతా వచ్చిఉన్న తరువాత నా ఒక్కదాని ఇంటిముందు మీరు ఆగిపోవడం దేనికి. నేను మీతో కలవకుండా నిద్రపోతున్నది తెలిసి కూడా ‘నీవు లేకుండా మేం జీవించలేం’ అని చెప్పడానికి నాలో ఉన్న గొప్పతనం ఏమిటి? గోద: కోదుగల ముడైయపావాయ్…సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా నిన్ను ప్రశంసించగల ప్రీతిపాత్రమైన గోపికవు నీవు కదా.. నీ ఇంటికి వచ్చి నీవాకిట నిలబడి, నీ పేరు పిలిచే అర్హత మాకుందా…శ్రీకృష్ణుని అభిమానం పొందినదానివి కనుక నీవు మాకు కూడా చాలా ఇష్టమైన దానివి. మాగురించి శ్రీకృష్ణుడికి చెప్పి పురుషాకారం కట్టుకుంటావని వచ్చాం. పావాయ్ నీవుఒక స్త్రీవి అయిఉండి స్త్రీల వేదనను అర్థం చేసుకోవా, శ్రీ కృష్ణుని వలె నీవూ ఉండవచ్చా… ఎఝుందిరాయ్.. నీవు మాతో రావాలని కాదు, కాని నీవు లేచి వస్తుంటే కనిపించే నీ అద్భుత సౌందర్యాన్ని చూడాలని ఆశిస్తున్నాం. మేం ఇంటికి వచ్చిపిలుస్తే మీరు నిద్ర మేల్కొన్నారనే గౌరవాన్ని మాకు దక్కించు. గోపిక: లేచి మనం ఇప్పుడు పొందే ప్రయోజనం ఏమిటో…? గోద: పాడి… అంటే ఇంతకుముందు పొందిందే మళ్లీ పొందుతాం. ఊళ్లో పెద్దలు మనలను శ్రీకృష్ణుడినుంచి వేరుచేయడం వల్ల మనసులోనే శ్రీ కృష్ణుడిని అనుభవిస్తూ వచ్చాం. ఆ శ్రీ కృష్ణానుభవం వల్ల ఏర్పడిన ఆనందాన్ని బయటపడకుండా కాపాడుతూ వస్తున్నాం. ఇప్పుడు ఊళ్లో ప్రజలు అనుమతిస్తున్నారు. ఒక నిర్భయంగా శ్రీ కృష్ణానుభవం పొందుదాం, నోరారా శ్రీకృష్ణవైభవం పాడుకుందాం. ప్పఱై కొండు… వ్రేపల్లె ప్రజలకోసమే కదా మన నోము. ఇట్రెపఱైకోళ్వానన్ఱుకాణ్ గోవిందా… నామాట్చెయ్ వోమ్ అని చివరి గీతంలో చెప్పారు కదా… గోపిక: శ్రీ కృష్ణుడు మనకు పఱై ఇస్తాడా? గోద: మావాయ్ పిళందానై గుఱ్ఱంరూపంలో వచ్చిన రాక్షసుడిని ఇంకా మన శత్రువులైన ఎందరో రాక్షసులను సంహరించి తనను తానే మనకిచ్చుకున్న మహానుభావుడు, పఱై ఇవ్వకుండా ఉంటాడా? గోపిక: అది పాత మాట. ఇప్పుడు మధురానగరానికి పోయివచ్చిన వాడు. అక్కడ నగరస్త్రీలను చూచి వచ్చిన వాడు. మనల్ని ఎప్పుడో మరిచిపోయి ఉంటాడు. మన కోరికను తీరుస్తాడా? గోద: మల్లరై మాట్టియ… అక్కడ మల్ల విశారదులైన చాణూర ముష్టికులను సంహరించిన శ్రీకృష్ణముఖారవిందం చూడమని అక్కడ మనలను పోలిన మహిళలకు తనను తాను ఉపకరించుకున్నవాడు మనలను మరుస్తాడా?

జీయర్ చెప్పిన యాజ్ఞవల్క్యుడి కథ

యాజ్ఞవల్క్యుడు మహానుభావుడు, జ్ఞాని, జనక చక్రవర్తి గురువు. మైత్రేయి కాత్యాయని అని ఆయనకు ఇద్దరు భార్యలు. ఆ తపస్వి వానప్రస్థాశ్రమ స్వీకారం కోసం తన ఆస్తిని ఇద్దరికీ పంచి ఇచ్చినాడు. కాత్యాయని సంపదలు తీసుకుని తృప్తి పడింది. ఆస్తి అంతా మాకిస్తున్నావంటే దానికన్న విలువైనదేదో పొందడానికి నీవు వెళ్తున్నావు. అదినాకు కావాలని మైత్రేయి వెంట బయలుదేరింది. ఆత్మజ్ఞానం కోసంబయలు దేరాను . అది నీకూ కావాలంటే ‘‘ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః మైత్రేయీ’’. లోపల ఉండే ఆత్మ ను స్పష్టంగా దృష్టవ్యః చూడాలి, చూడగలగాలంటే, దాని గురించి ముందు శ్రోతవ్యః వినాలి, వినాలంటే దాని గురించి పదేపదే ఆలోచించాలి మంతవ్యః, తరువాత దాని గురించే ఊహిస్తూ ఉండాలి నిధిధ్యసితవ్యః. అని జీయర్ చెప్పారు. ఈ విషయంలో పెద్దల సూచనలు స్వీకరించాలనే అంశాలను తిరుప్పావైలో చెప్పారు. పక్షుల అరుపులతో శ్రవణం మొదలు పెట్టి, శంఖ ధ్వని, పెరుగు చిలికే ధ్వని ఊహించి, తరువాత జ్ఞానుల సహవాసంతో మునుల వలె స్మరించి, వారి ఉపదేశం పొందితే ద్రష్టవ్యః దాకా వెళ్లగలుగుతాం. 6వ పాటలో కేట్టిలయో (శ్రోత్రవ్యః),  7వపాట లో కేట్టే కిడిత్తియో మంతవ్యః దాటి 8వ పాటలో నిధి ధ్యాసితవ్యః ను చేరుతున్నారు గోద.

కలిసి ప్రయాణించడం గొప్ప, ప్రయాణమే గొప్ప. గమ్యం చేరుకోవడం కన్న గమ్యం కోసం వెళ్లడమే మిన్న. యాత్రాగోష్టి అనుభవం గొప్పది. జీవి ఆత్మ వైకుంఠానికి నడిచే అర్చిరాది యాత్ర, అక్రూరుడు కృష్ణుడిని చూడడానికి బృందావనం వెళ్లే యాత్ర, వేంకటేశుని దర్శించడానికి వెళ్లే తిరుమల యాత్ర –  ఈ మూడు యాత్రలూ సంకల్పించగానే ఆనందం కలిగించేవి. మన గోపికలందరం కలిసి కృష్ణుడిని చూడడానికి వెళ్తున్నామనుకోవడంలోనే ఎంత ఆనందం ఉంది కదా అని గోద గోపికతో అంటున్నారు.

దేవాది దేవుడి సామాన్యులను పట్టించుకుంటాడా గోపిక అడిగారు:దేవాదిదేవనై అతన్ని దేవాదిదేవుడని కీర్తిస్తారు కదా…మనవంటి సామాన్యులను పట్టించుకుంటాడా.. భాగవత కథ:గోద: దేవాదిదేవుడే అయినా మన శత్రువులను నిర్మూలించడం కోసం ఈ లోకంలో మనలో ఒకడిగా అవతరించాడు కదా, మన కోరిక తీర్చడా.. శెన్ఱునామ్ శేవిత్తాల్ ఆవా వెన్ఱు అరుళ్ .. మనమే ఆ పరమాత్మను సమీపించి సేవిస్తే… అరెరే నేను వచ్చి సేవించవలసింది కదా… మీరే నావద్దకు నడిచి వచ్చారే అని బాధపడి మనను ఆదుకుంటాడు శ్రీకృష్ణుడు. రామాయణ గాధ: దండకారణ్యంలో రుషులంతా శ్రీ రాముడి వద్దకు వచ్చి అడవిలో రాక్షసుల బాధల నుంచి రక్షించమని కోరుతారు. అపుడు… అయ్యో నేను వచ్చి మీతో మాట్లాడాల్సింది పోయి మీరే నావద్దకు వచ్చేదాకా ఊరుకున్నానే అని బాధపడ్డాడు. భక్తులు ఇబ్బంది పడడం ఆయన ఓర్చుకోలేడు. తనకు శరణాగతి చేసిన భరతుడి ప్రార్థన నెరవేర్చలేకపోయినందుకు బాధపడ్డాడు. తనకోసం వచ్చిన గుహుని చూసి నాకోసం నడచి వచ్చావా, ఇంతకన్న ఏం చేయాలి అని రాముడు ఆలింగనం చేసుకున్నాడు. తనకంటూ సుఖదుఃఖాలు లేని నిర్వికారుడే అయినా ఇతరులకోసం ఆనందాన్ని ఆవేదనను పొందడం దోషం కాదు. ఇతరుల బాధలు చూసి బాధపడడం ఏ విధంగా సాధ్యమవుతుంది. కనుక త్వరగా బయలుదేరి వెళ్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో వెళితే తప్పక ఆర్తితో ఆదరిస్తాడాయన అన్నారామె.  ఈ పాశురంలో హస్తగిరి నాథుడైన దేవాదిదేవుడు, అంటే కాంచీపురం వరదరాజస్వామిని కీర్తిస్తారు.

ఇంతటి అద్భుతమైన భావాలను, పోలికలను, చర్చను, భగవద్గుణ విశ్లేషణాలను చిన్న పాశురంలో కూర్చడం విశేషం. ఆచార్యుడు శిష్యుడిని అంగీకరించే వరకే చీకటి, ఆ తరువాత అంతా వెలుగే అని సందేశం. భగవంతుడితో నీవాడినని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడని ఈ పాశురం సందేశం.

ఆండాళ్ చరణౌ శరణం ప్రపద్యే (సంస్కృత), ఆండాళ్ దివ్య తిరువడి ఘళే శ్శరణం (తమిళ) అంటే అమ్మా నీ కాళ్లు పట్టుకుంటాను నాకు జ్ఞానం కలిగించు అని ప్రార్థించడం.

Also read: మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు

అనువాదం మాడభూషి శ్రీధర్
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles