డా. యంసురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక
గత మూడేళ్లుగా మానవాభివృద్ధి సూచికలో 191 దేశాలు భూభాగాలలో భారతదేశం 132 వ స్థానంలో ఉంది. 2020 నివేదికలో, 189 దేశాలు, భూభాగాల్లో భారతదేశం 131వ స్థానంలో ఉంది. దేశం పనితీరు మునుపటి స్థాయి నుండి క్షీణించడం ఆయుర్దాయం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అనేది డైనమిక్ కొలత, ర్యాంకింగ్‌లలో మార్పులు ఆరోగ్యం, విద్య ఆదాయ సూచికలతో సహా వివిధ అంశాల ద్వారా ప్రభావితమవుతాయి. ఆయుర్దాయం క్షీణించడం అనేది ముఖ్యమైన అంశం. హెచ్‌డిఐ అనేది మిశ్రమ సూచిక అని గమనించడం ముఖ్యం. ర్యాంకింగ్‌లలో మార్పులను ప్రతి దేశం అభివృద్ధిని ప్రభావితం చేసే నిర్దిష్ట అంశాల నేపథ్యంలో విశ్లేషించాలి. ట్రెండ్‌లను పర్యవేక్షించడం హెచ్‌డిఐ ర్యాంకింగ్‌లలో మార్పుల వెనుక కారణాలను అర్థం చేసుకోవడం విధాన రూపకర్తలు మొత్తం మానవ అభివృద్ధి మెరుగుదల కోసం శ్రద్ధ వహించవలసిన అంశాలను గుర్తించడంలో సహాయపడతాయి. మానవ అభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధి, ఆర్థిక వ్యవస్థలో సంపదను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి సారించలేదు. మానవత్వం ఆలోచన చుట్టూ కేంద్రీకృతమై ఉంది, ఇందులో స్వేచ్ఛను విస్తరించడం, సామర్థ్యాలను మెరుగుపరచడం, సమాన అవకాశాలు ప్రోత్సహించడం సంపన్నమైన, ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని నిర్ధారిస్తుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. అయినప్పటికీ, ఈ పెరుగుదల దాని మానవ అభివృద్ధి సూచిక తగిన పెరుగుదలకు దారితీయలేదు.
Also read: జలాశయాలుఎండిసాగు, తాగునీటి ఎద్దడిమొదలయ్యింది
నానాటికి తీసికట్టు…
2021-22 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్, శ్రీలంక తర్వాత 191 దేశాలలో భారతదేశం 132వ స్థానంలో ఉంది. భారతదేశం పరిమాణం అధిక జనాభా దృష్ట్యా, మానవ అభివృద్ధిలో లేదా రాష్ట్రాల వారీగా అసమానతలను పరిష్కరించడం చాలా కీలకం, ఇది భారతదేశం తన జనాభా డివిడెండ్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. ‘బొంకరా బొంకరా పోలిగా’ అంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత’ అన్నాడంట. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కనీసం పదివేల ఉద్యోగాలు కల్పించలేకపోయింది. మేకిన్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, ఎంఎస్ఎంఈ లు, కేంద్ర ఉద్యోగ ఉపాధి కల్పన సంస్థలు శిక్షణ సంస్థలు నిధులు లేక, జీతాలు లేక వెల వెల పోతున్నాయన్న అన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? యువతకు కేవలం స్విగ్గిస్ జొమాటో, గో డాడీ కొరియర్ అండ్ కార్గో, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ, టెలి కాలర్స్, ఆఫిస్ బాయ్స్, డ్రైవర్, పెట్రోల్ పంపులో ఆపరేటర్ ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్ లో కొలువులు ఎండమావులే. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పన మా పరిధిలో లేని అంశం అని ఎప్పుడో చేతులెత్తేశాయి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠ పరచకుండా, సాంకేతిక కళాశాల అభివృద్ధి పరచకుండా, ఉపాధి శిక్షణ సంస్థలు మెరుగుపరచకుండా ఉపాధి ఎలా లభిస్తుంది. దేశంలో పెరుగుతున్న అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, విభజన రాజకీయాలు, ప్రైవేటీకరణ, ఉత్పాదకత, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, సమాజంలో సమరస్యత లోపించడం, అభద్రతా భావం పై రాహుల్ గాంధీ ఇండియా కూటమి పౌరప్రజా సంఘాలతో కలసి ఫోకస్ పెడుతూ అసంఘటిత రంగాన్ని సమీకరిస్తుంటే మరోవైపు పనికిమాలిన సనాతన ధర్మం – దేశం పేరు మార్పు అంశాలు ప్రధాన అంశాలు మోడీ ముందుకు తీసుకెళ్తున్నారు.
Also read: యువనేతల రాజకీయ యాత్రలు ఫలించేనా?
మోదీ సర్కార్ తీరుపట్ల అసంతృప్తి
కేంద్రంలో మోడీ సర్కారు తీరు పట్ల అసంతృప్తితో ఉన్న సాధారణ ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో ప్రస్ఫుటమైనది. 2024 లోక్‍సభ ఎన్నికలకు మరో కొద్ది నెలలు మాత్రమే ఉన్న తరుణంలో గరిష్ట నిరుద్యోగ రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‍గా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జాబ్ మార్కెట్‍లోకి వస్తున్న కోట్లాది మంది యువతకు ఉద్యోగాలను కల్పించడం బీజేపీ సర్కార్‌కు ప్రధాన సవాళ్ళుగా ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తి చూపుతుంది. దీన్ని మోదీ ప్రభుత్వ వైఫల్యంగా ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. మోడీ పాలన నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, ప్రయివేటీకరణ లక్ష్యంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడం, వెరసి భారత్‌లో నిరుద్యోగం ఏటికేడూ పెరిగిపోతున్నది. కార్పొరేటు ఎగవేతదారులకు లబ్ది చేకూరే విధంగా పన్నెండు లక్షల కోట్లు బ్యాంకు రుణాలు రైటాఫ్ చేశారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ సారి కూడా భారత్‌లో గతేడాది డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 8.30 శాతానికి పెరిగింది. ఇది 16 నెలల గరిష్టం కావడం గమనార్హం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి నుంచి వెలువడిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది. సీఎంఐఈ సమాచారం ప్రకారం.. భారత్‌లో నిరద్యోగ రేటు గతేడాది నవంబర్‌లో 8 శాతంగా ఉన్నది. అయితే, అది డిసెంబర్‌లో 8.30 శాతానికి పెరగడం గమనార్హం. ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగ రేటు ఆకాశాన్ని చూసింది. ఇక్కడ నిరుద్యోగ రేటు నవంబర్‌లో 8.96 శాతంగా నమోదు కాగా.. అది డిసెంబర్‌లో 10.09 శాతానికి ఎగబాకింది. అయితే, గ్రామీణ భారతంలో మాత్రం నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. ఇది నవంబర్‌లో 7.55 శాతం నుంచి డిసెంబర్‌లో 7.44 శాతానికి పడిపోయింది. కాగా, డిసెంబర్‌లో పెరిగిన నిరుద్యోగ రేటు హర్యానాలో అధికంగా 37.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ (28.5 శాతం), ఢిల్లీ(20.8 శాతం) లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా చదువుకున్న వారిలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.
Also read: సంతోష సూచిక లేని దేశంలోవికసిత భారత్ సాధ్యపడేనా?
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న నిరుద్యోగిత
సెప్టెంబరు-డిసెంబర్ 2022లో ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 6.15 శాతంగా ఉంది. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారిలో నిరుద్యోగం రేటు అత్యధికంగా 35.1 శాతంగా ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల్లో 73 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సాధారణంగా, భారతదేశంలో, ఎక్కువ విద్యావంతులైన సమూహాలలో నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తాము. ఎందుకంటే విద్యావంతులు ఉపాధిని వెతుక్కునే అవకాశం ఎక్కువ. సాంకేతికంగా, విద్యావంతులు అధిక కార్మిక భాగస్వామ్య రేటును కలిగి ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉండటం బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్ సమస్యలు చర్చనీయాంశమవుతున్న తరుణంలో, దేశంలోని నిరుద్యోగం రేటు, మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసే ముందు మొత్తం 7 శాతం నిరుద్యోగం ఉన్న ఆరు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం సమర్పించిన గణాంకాల ప్రకారం, తెలంగాణలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 5.2 శాతం, నగర నిరుద్యోగిత రేటు 10.2 శాతం, 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మొత్తం నిరుద్యోగిత రేటు 7 శాతం ఉంది, ఆవర్తన శ్రామిక శక్తి సూచిక చూపిస్తున్నది. దేశంలో నిరుద్యోగం పెరిగి, ప్రజల ఆదాయ వనరులు తరుగుతున్నాయి. ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేటాయింపులు పడిపోతున్నాయి. రైతులు, ఇతర అన్ని తరగతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రజల అప్పులు పెరుగుతున్నాయి. శత కోటీశ్వరుల అప్పులు రద్దు అవుతున్నాయి. వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో ఉన్న కుబేరుల సంపద అంతులేకుండా పెరుగుతున్నది. ఎవరి మద్దతుతో ఇలా జరుగుతుంది అనే సత్యం ప్రజలు తెలుసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజ్ఞత కలిగిన ప్రజలు అవకాశవాద మతతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారని ఆశిద్దాం.
Also read: అంధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వమానవుడు యోగి వేమన