వోలేటి దివాకర్
గోదావరి తీరాన రాజమహేంద్రవరంలోని స్థానిక సీతంపేటకు చెందిన వ్యక్తి చక్రవర్తి పారిశ్రామికరంగంలో గ్లోబల్ స్థాయికి ఎదిగారు. తద్వారా రాజమహేంద్రవరం నగర పేరు ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేశారు. ప్రపంచపటంలో రాజమహేంద్రవరం పేరును చిరస్థాయిగా నిలిపారు. దివంగత గ్రంథాలయ అధికారి ఆరుమిల్లి రంగారావు కుమారుడు చక్రవర్తి ఏవిపిఎస్ ప్రపంచ ప్యాకేజింగ్ & ఫార్మా రంగంలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తాజాగా చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీవో) గ్లోబల్ అంబాసిడర్ గా తిరిగి నియమితులయ్యారు. డబ్ల్యూపీవో తొలి మహిళా ప్రెసిడెంట్, బ్రెజిల్ కు చెందిన లూసియానా పెల్లెగ్రినో ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే జాతీయస్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంట్రాప్రెన్యూర్స్ (ఎఫ్ ఓపీఈ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా(నేషనల్), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ గా ఆయన నియమితులయ్యారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ ఫార్మా & లైఫ్ సైన్సెస్ బోర్డు సభ్యునిగా, సలహాదారుగా కూడా చక్రవర్తి కొనసాగుతున్నారు. ఇండో నెదర్లాండ్స్ బిజినెస్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ & ఏపీ ఛైర్మన్ సహా పలు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు.
రాజమహేంద్రవరంలోని సీతంపేటలోనే చక్రవర్తి బాల్యం, విద్యాభ్యాసం సాగాయి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వరకు నగరంలోనే పూర్తి చేశారు. జిల్లాకే చెందిన రవాణారంగంలో ప్రముఖ సంస్థ భారత్ మోటార్ పార్శిల్ సర్వీస్(బిఎంపిఎస్) అధినేత అల్లుడయ్యారు. తరువాత హైదరాబాద్ లో స్థిరపడిన చక్రవర్తి ఎన్నో ఏళ్లుగా ప్యాకేజింగ్ & ఫార్మా రంగాల్లో విశేష సేవలను అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇండో – డచ్ జాయింట్ వెంచర్ అయిన ఎకో బ్లిస్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈవోగా ఉన్నారు.
ఫార్మాస్యుటికల్ మాన్యుఫాక్చరింగ్ & ప్యాకేజింగ్ విభాగంలో అపార అనుభవం చక్రవర్తి ఏవీపీఎస్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇండియా ఫార్మా ప్రమోషన్ కు కృషి చేసినందుకుగానూ ప్రతిష్ఠాత్మక ఫార్మా రత్న అవార్డు ఆయనను వరించింది. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ యూఎంబీ పురస్కారం, హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో భాగంగా లెజెండరీ పురస్కారం పొందారు. వరల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ నుంచి ప్యాకేజింగ్ లీడర్ షిప్ అవార్డ్ పొందారు. పలు అంతర్జాతీయ పోటీలు, అవార్డు కార్యక్రమాలకు జ్యూరీ/చీఫ్ జ్యూరీగా కొనసాగుతున్నారు. చక్రవర్తి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలిచ్చారు. 25కు పైగా దేశాల్లో అనేక కార్యక్రమాలకు మెంటార్ గా వ్యవహరించారు. రాజమహేంద్రవరం వాసి ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తగా రాణిస్తూ..ప్రపంచ ప్యాకేజింగ్ ఆర్గనైజేష్ గ్లోబల్ మెంటార్ స్థాయికి ఎదగడం పట్ల రాజమహేంద్రవరం వాసులతో పాటు, గోదావరి జిల్లాలలు, ఉభయ తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తి భవిష్యత్ లో పారిశ్రామికరంగంలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.