పదో పాశురం – తిరుప్పావై కథలు
ఈ రోజు తిరుప్పావై పదో పాశురంలో కుంభకర్ణుడు, అగస్త్యుడు, పేయాళ్వార్ల ప్రస్తావన ఉంది. ఈ మహానుభావుల కథల ద్వారా గోదాదేవి శ్రీకృష్ణతత్త్వాన్ని బోధిస్తూ మనందరిని మేలుకొలుపుతున్నారు.
కుంభకర్ణుని కథ
కుంభకర్ణుడంటే రావణుడు తమ్ముడు. అతను మహాబలశాలి. శాపం పొందిన జయ విజయుల్లో, విజయుడు. అన్నతోపాటు కఠోరతపస్సుచేసిన కుంభకర్ణుడు వరం కోరుకొమ్మంటే, ఏం కోరుకుంటాడో అని దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించి అతని మాటను మార్చమని కోరినారట. ఏదో అడగబోయిన కుంభకర్ణుడు ఏదో మాయకులోనైనట్టు నిదుర నిదుర అంటాడు. బ్రహ్మ వెంటనే తథాస్తు అనడం. అంతలో ఆయన తాను కోరిందేమిటో అర్థమై, నేను ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటానా, ఇదేమిటి అని కలవరపడతాడు. బ్రహ్మ అప్పుడు తన వరానికి కొన్ని మార్పులు చేస్తాడు. ఆరునెలలు నిద్రపోతావు. ఆరు నెలలు చురుకుగా ఉంటావు, మళ్లీ ఆర్నెలలు నిద్రిస్తావు. పూర్తిగా నిద్రలేచిన తరువాత నీ బలం అమేయంగా ఉంటుంది. మధ్యలో నిద్ర లేపిన తరువాత యుద్ధానికి వెళ్తే నీ బలం తక్కువగా ఉంటుంది. కుంభకర్ణుడు ఆర్నెలల నిద్రలో మునిగి ఉండగా రావణుడు రామునితో యుద్ధం తెచ్చుకుంటాడు. తప్పనిసరిగా నిద్రలేపవలసి వస్తుంది. అప్పుడు కుంభకర్ణుడు అజేయుడు కాలేడు. అతను ఓడిపోతూ నీకు నిద్ర ఇచ్చి వెళ్లాడా ఏమిటి అని గోదాదేవి ఈ పాశురంలో చమత్కరిస్తుంది.
Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే
అగస్త్యుడి కథ
అగస్త్యుడికి కూడా కంభకర్ణుడే. కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఒక కుండలో పుట్టిన వాడు. కేదార్ నాథ్ సమీపంలో త్రియుగ్ నారాయణ్ వద్ద పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి గాను ఆయన హిమాలయపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. మరో సందర్భంలో వింధ్య పర్వతం మేరు పర్వతంతో పడి విపరీతంగా పెరుగుతూ ఉంటే, సూర్యగమనాన్ని కూడా అడ్డుకుంటాడేమోనని భయపడి, వింధ్య పెరగడాన్ని నిలిపి వేయాలని దేవతలంతా అగస్త్యుని వేడుకున్నారు. అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించగానే, గురువుకు వంగి నమస్కారం పెట్టాడట. మహాముని, సరే ఇట్లాగే ఉండు, ‘తథాస్తు’ అన్నారు. అంతే అక్కడే వంగి పోయాడు. వింధ్య పర్వతం పెరుగుదలను ఆవిధంగా ఆయన వంచినాడు. అని పెరుగుదలని వంచాడు. ఒక్కొక్క పర్వతానికి అధిష్ఠాన శక్తివిశేషం ఉంటుంది. దాన్ని బట్టే ఒక్కో పర్వతానికి విశిష్టత చేకూరుతుంది.
అగం అంటే పర్వతం, స్తంభింపచేసిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య. మరొక అర్థం ఏమంటే మనలో పెరిగిపోతున్న పాపపు కొండలని స్తంభింపజేసే శక్తి గల మహాముని. అగస్త్యుని గొప్పతనాలు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం సముద్రాన్ని పానం చేసినశక్తి శాలి. ద్రావిడ భాషకంతటికి వ్యాకరణ సూత్రాలను రచించిన మహ జ్ఞాని. వాతాపి అనే రాక్షసుడిని కడుపులోనే జీర్ణింపచేసి సంహరించిన అద్భుత ముని.
గోద (లోపలి గోపికతో) అగస్త్యుడంతటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా? ‘‘లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట ఒక్కటే చాలు మాకు. అదే మా ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష అని జీయర్ వివరించారు.
పేయాళ్వార్ కథ
ఈ పాశురంలో పేయాళ్వార్ గురించి ప్రస్తావించారు. 1. పొయగై ఆళ్వారు, (సరోయోగి) 2. పూదత్తాళ్వార్, (భూతయోగి) 3. పేయాళ్వార్ (మహాయోగి) అను ముగ్గురు ముదలాళ్వార్లు. వీరు ముగ్గురు ద్వాపరయుగంలో అవతరించినారు. పేయాళ్వార్లు చెన్నపట్టణానికి సమీపంలో మైలాపూర్ లో నున్న మణికైరవమను బావిలో ఎర్రకలువ పువ్వులో ఆవిర్భవించినారు.
వీరికి భగవంతుని మీద విపరీతమైన ప్రేమ ఉండి లోకులకు పిచ్చిగా కనిపించేవారు. జడభరతునివలె అంటే మూగవానిలా, జడునిలా, గ్రుడ్డివానిలా, చెవిటివానిలా, పిచ్చెక్కినవానిలా భగవంతుని మీద పాటలు పాడుతూ సంచరించేవారు. వీరిని పేయాళ్వారని పిలిచేవారు. “పేయ్” అంటే పిచ్చి అని అర్ధం. తానేమీ ఎరుగనని వారి వలె బొంతకుట్టుకుంటూ ఉంటారాయన. వీరిని మహాయోగి అని భక్తిసారులని కూడ అంటారు. వీరు నిరంతరం భగవదనుభవంలోనే ఉంటారు. భగవంతుడే ఉపాయము అని స్థిరంగా నమ్మి, ఇతర ఉపాయాలేవీ పట్టించుకోరు.
Also read: గుఱ్ఱం నోట్లో చేతిని ఉబ్బించి కేశిని చంపిన కేశవుడు
పిచ్చి భక్తుడు
వీరి భక్తినిష్ఠను పరీక్షిద్దామని ఓసారి పార్వతీ పరమేశ్వరులు వచ్చారట. తామెవరో వెల్లడించి, ఆది దంపతులు ఏదైనా వరం కోరుకొమ్మన్నారట. భగవంతుడిని మించి కోరుకునేదేమిటి అని ఆలోచించి, ఇతరాలు ఏవీ తనకు అవసరం లేదని చమత్కారంగా చెప్పడానికి గాను ‘‘సరే,… నాకు బొంత కుట్టుకోవాలంటే సూదిలో దారం ఎక్కించలేకపోతున్నాను. కాస్త ఈ సూదిలోకి దారం ఎక్కించి పెడతారా అని కోరాడట. ఆయనకు ఏ అవసరాలు లేవని, భగవంతుడిని తప్ప ఏదీ కోరబోరని ఈ సంఘటన విశదం చేస్తుంది. పార్వతీ పరమేశ్వరులతో పాటు, పేయాళ్వార్ అమితమైన భక్తికి మెచ్చి సాక్షాత్ శ్రియః పతి సర్వాభరణ భూషితుడై, సపరివార సమేతంగా ఆయనకు సాక్షాత్కరించాడు. పేయాళ్వారులు తిరుక్కోవలూర్ లో ఉన్న స్వామి శ్రీ త్రివిక్రమన్ (వామనుడు) దర్శించి ఆనంద పరవశులై ఈ క్రింది పాశురమును పాడినారు.
“తిరుక్కణ్డేన్ పొన్ మేని కణ్డేన్ తిఱయుమ్
అఱుక్కన్ అణి విరముం కండేన్ శెరుక్కిళరుం
పొన్నాయ్ కండేన్ పురిశంగం కైక్కణ్డేన్
ఎన్నాయ్ వణ్ణన్ పాలిన్దు.
మట్టినుంచి బంగారం
పేయాళ్వార్ భక్తి కథలు ఇంకా అనేకం ఉన్నాయి. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి రసగుళికను చూపుతూ దానితో మట్టిని బంగారు చేయవచ్చని చెబితే, పేయాళ్వార్ తన శరీరమును నలిపితే వచ్చిన మట్టి ముద్ద కూడా బంగారం అవుతుందని చెప్పారట. సిద్దుడికి ఆ మట్టి బంగారమై కనిపించింది.
యథోక్తకారి
తనకు ఒక ముదుసలి వనిత చాలాకాలం శ్రద్ధగా సేవచేసినందుకు, పేయాళ్వార్ చాలా సంతోషించారట. ఆ ఆనందం ఆమెకు వరమై అందమైన యవతిగా మారిపోయారు. యవ్వనం వచ్చేసిందన్నమాట. కాంచీపురపు రాజుగారు ఆమెను చూసి మోహించి పెళ్లి చేసుకుంటారు. ఈ కథ తెలిసి తనకు కూడా యవ్వనం ఇవ్వాలని పేయాళ్వార్ ను కోరాలనుకుంటాడు. పేయాళ్వార్ శిష్యుడు కణి కన్నర్ ను రప్పించి మీ గురువుగారిని రాజాస్థానానికి తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు. కణికన్నర్ తమ గురువుగారు ఆ విధంగా రాబోడని చెబితే రాజుకు కోపం వస్తుంది. తన రాజ్యం నుంచి వెళ్లిపోవాలని శాసిస్తాడు. అలాగే అని తాను తన గురువుగారూ వెళ్లిపోతూ ఉంటే, ఆయన ఆరాధించే ఆలయంలోని విగ్రహం కూడా కదలిపోతూ ఉంటుంది. కంచి నగరం అంతా చీకటి అయిపోతుంది. రాజుతన తప్పుగమనించి, ఆయన మహా యోగి అని తెలుసుకుని, కణి కన్నర్ ను వారి గురువుగారిని ఎక్కడికి వెళ్లవద్దని ప్రార్థిస్తాడు. వారు ఆగిపోగానే విగ్రహ రూప భగవంతుడు కూడా ఆగిపోతారు. ఈ ఆళ్వార్ చెప్పినట్టు భగవంతుడు నడుచుకున్నాడు కనుక ఈ దేవుడికి యథోక్తకారి (సంస్కృత పదం) సొన్నవణ్ణం సెయిద (తమిళ) అంటే చెప్పినట్టు చేసిన దేవుడనే పేరు వస్తుంది.
భక్తుడిని చూడడానికి పైకి నిక్కిన ధనుర్దారి రాముడు
మరో సందర్భంలో పేయాళ్వార్ కుంభకోణం ఆలయానికి వెళ్తారు. అక్కడ శార్జ్ఞపాణి (ధనుర్ధారి అయిన రాముడు శయనభంగిమలో) వెలిసి ఉన్నారు. ఒక సందర్భంలో పేయాళ్వార్ కుంభకోణం వచ్చి ఊరిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే తన ఆలయానికి రాకముందే ఆయనను చూడాలనే తపనతో శయనించి ఉన్న శార్జ్ఞపాణి నిక్కి నిక్కి పైకి లేచి చూస్తూ ఉంటారట. ఇప్పడికీ కుంభకోణంలో మూల మూర్తి శయనభంగిమలో లేచి చూస్తున్నట్టుగా ఉంటారు.
రంగనాథుడు కాదు శయనించిన రాముడు. (కుంభకోణం ఆలయంలో మూలమూర్తి శార్జ్ఞపాణి (చాలామంది సారంగ పాణి అంటారు. సారంగ పాణి అంటే సారంగమనే వాయిద్యాన్ని ధరించిన శివుడు, కాని శార్జ్ఞము అంటే ధనుస్సు. ధనుస్సును ధరించిన రాముడి విగ్రహం ఇది. రాముడు శయన భంగిమలో ఉండే కోవెల భారతదేశంలో ఇదొక్కటే.)
Also read: మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు
తొలి ముగ్గురు ఆళ్వారుల సమాగమం
తొలి ముగ్గురు ఆళ్వారుల గొప్పతనాన్ని వివరించే ఒక సంఘటన ఉంది. తిరుక్కోవలూరు గ్రామంలో పేయాళ్వార్ (సరోయోగి) ఒక చిన్నగదిలో శయనించి ఉన్నారు. బయట హోరున వర్షం కురుస్తున్నది. తలదాచుకోవడానికి భూతయోగి లోనికి వచ్చారు. ఒకరు పడుకోవడానికి సరిపోయే చిన్నస్థలం లో ఇద్దరు కూర్చోవచ్చుకదా రండి స్వామీ అని అని భూతయోగిని సరోయోగి రమ్మన్నారు. మరి కాస్సేపడికి మూడో ఆళ్వారు మహాయోగి వచ్చారు.వారు కూడా లోపలికి రావలసిన పరిస్థితి. ఫరవాలేదు ఇద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు నిల్చోవచ్చు కదా..అంటూ ఆయన్ను రమ్మన్నారు. ముగ్గురు యోగిపుంగవులు ఒకచోట చేరుకుని నిలబడి ఉండడం అనేది చాలా గొప్పవిశేషం. ఇంతటి మహాపురుషులు ఒక్కచోట ఉన్న విశేష దృశ్యాన్ని చూద్దాం అని శ్రీమన్నారాయణుడే అక్కడికి వస్తారు, ఆళ్వారుల స్పర్శాసుఖం అనుభవించేందుకు ఒక వెలుగై ఆ అంధకారలో విచ్చేసారని, ఆ వెలుగును బట్టి ఆయన రాకను తెలుసుకున్న ఆ ముగ్గురు ఆళ్వారులు కలసి మంగళం పాడినారు, అప్పుడే ముదల్ తిరువందాది (పేయ్), ఇరండామ్ తిరువందాది, మూన్రామ్ తిరువందాది (పూదత్త) పాశురాలు వెలువడ్డాయి. ఆ నారాయణుని వెలుగే తొమ్మిదో పాశురంలో వెలుగు అని గోదాదేవి ప్రస్తావించినారు.
Also read: శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై