Sunday, December 22, 2024

జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం

  • గోదా గోవింద గీతం – 9

నేపథ్యం

ఈ రోజు నాలుగో గోపికను, తిరుమళిశయాళ్వార్లను మేల్కొలుపుతున్నారు గోదమ్మ. ఆచార్య నమస్కార మంత్ర పరంపరలో  ‘శ్రీమతే రామానుజాయ నమః’ మంత్రాన్ని సంబోధించారు. భగవంతునితో మనకు ఉన్న సంబంధాన్ని వివరించే పాశురం ఇది. తొమ్మిదో పాశురం పూర్ణత్వాన్ని సూచిస్తుంది. నవ విధ మణులను, నవ విధ భక్తులను సూచిస్తుంది.

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్ !

తూమణి మాడత్తు=స్వచ్ఛమైన సహజమైన మణులచేత నిర్మించిన భవనంలో, చుట్రుం= చుట్టూ..అంతటా, విళక్కు ఎరియ=దీపాలు వెలుగుతూ ఉండగా,దూపం కమఝ=సుగంధ ధూపాలు వ్యాపిస్తుండగా, త్తుయిల్ అణైమేల్=పడుకున్నవెంటనే నిద్రవచ్చేంత మెత్తని పడకపై, కణ్ వళరుమ్=కనులుమూసుకుని నిద్రిస్తున్న, మామాన్ మగళే=మామకూతురా, మణిక్కదవమ్=మణులతో నిర్మించిన తలుపు, తాళ్=గడియను, తిఱవాయ్=తెరవవోయ్, మామీర్ = ఓ అత్తా, అవళై ఎఝుప్పీరో= నీ కూతురును లేపవమ్మా, ఉన్ మగళ్ దాన్= నీకూతురు ఏమైనా, ఉమైయో=మూగదా, అన్ఱి=లేకపోతే, చ్చెవిడో=చెవిటిదా, అనన్దలో= అలసిపోయి నిద్రిస్తున్నదా, ఏమప్పట్టాళో=కావలిలోఉంచినారా, పెరుందియిల్= చాలా సేపు నిద్రపోయేట్టు, మందిరప్పట్టాళో=మంత్రంచే కట్టుబడి ఉన్నదా, మామాయన్=మహామాయావీ, మాదవన్=మాధవుడా, వైగుందన్= వైకుంఠవాసా, ఎన్ఱు ఎన్ఱు= అని మళ్లీ మళ్లీ, పలవుమ్= సహస్రాధికమలైన అతని, నామమ్ భగవన్నామాలను, నవిన్ఱు=కీర్తించాము.

goda govinda geetham tiruppavai 9

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు అనువాదం సిరినోము

మణుల నొప్పు సొగసు మాళిగ నలుగడ

దీపాలు ధూపాలు తేజరిల్ల 1

అంచ తూలిక సెజ్జ నల్లన నిదురించి

మామ కూతుర: నిద్రమాని లేవె 1

ఘనమైన రతనాల గడియ తీయవె వచ్చి

నీవైన ఓ అత్త: నిదుర లేపు 1

మూగయో, చెవుడో ? నీ ముద్దుల దుహిత కో

అత్త 1 బండ నిదుర అలవడియెనో?

కాక కావలియో? లేకను మచ్చుమందు చ

ల్లిరొ ? ‘‘ఓయి మాయావి : హరి : వికుంఠ

వాస : విహగ పతి వాహనా 1’’ అని ఎంత

అరచిన పలుక దే మమ్మ అత్త ?

Also Read : నమ్మాళ్వార్ కృష్ణతృష్ణ సూచిక– ఈ గీతిక

భావం:

మేలైన తొమ్మిది రకాల మణులతో నిర్మితమైన మేడ, అందులో పడుకోగానే నిద్రవచ్చే మెత్తని పరుపు, చుట్టూ దీపాల వెలుగులు, సుగంధ ధూపాల ఘుమఘుమలు, హాయిగా నిద్రపోతున్నావా ఓ మామ కూతురా ! మణి కవాటపు గడియ తీయవా? ఓఅత్తా ! నీవైనా నీకూతురిని నిద్రలేపవా? నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక ఎవరైనా కదలినా ఒప్పుకోమంటూ కావలి పెట్టారా, లేక గాఢనిద్ర పట్టునట్లు మంత్రించినారా ? మహామాయావీ ! మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక భగవన్నామములను కీర్తించి ఆమె నిద్రలేచునట్లు చేయుము.

మొదటి రెండు పాశురములలొ శ్రవణము గురించి వివరించారు. తర్వాతి పాశురములో మననము ప్రాధాన్యత నిరూపించారు. నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరించారు. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను దక్కుతానని అన్నాడు శ్రీకృష్ణుడు. అట్లా అయితే మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కనుక మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్టపొంది నిద్రిస్తున్న నాల్గవ గోపికను ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఓ మామకూతురా ! మరదలా లేవమ్మా ! అంటున్నారు.

Also Read : పక్షుల రెక్కల రెపరెపలోజ్ఞానధ్వని విన్న గోద

గోపికలు నిద్రిస్తున్న గోపాంగనా భవన వైభవ వర్ణనతో పాశురం మొదలవుతుంది. నవరత్నఖచిత భవనం, ధూపదీపాలతో వెలిగే నివాసం. మణులు దోషరహితమైనవట. పరిశుధ్దముచేసినవట. శరీరమనే భవనం సంసారబంధాలచే కప్పబడి ఉండడం వల్ల ప్రకాశాన్ని కోల్పోతాయి. మోక్షదశకు చేరేనాటికి కర్మబంధాలు తొలగి ప్రకాశిస్తూ ఉంటాయి. నవమణులు అంటే నవద్వారాలతో కూడిన శరీర భవనమని ప్రతీక. మలినములు తొలగిన జీవివలె భవన శరీరం భాసిస్తున్నది. జీవుడికి పరమాత్మతో ఉన్న సంబంధాలలో ఆధార ఆధేయ సంబంధం ముఖ్యమైంది. జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం అని దీని అర్థం. అంటే జీవునకు పరమాత్మశరీరం వంటి వాడు. ఆ పరమాత్మ ఎప్పుడూ సహజమైన మణులతో ప్రకాశిస్తూ ఉంటాడు. మరకతపేటికలో పెట్టిన వస్తువు ఏ విధంగా బయటకు కనిపిస్తుందో అదే విధంగా భగవంతుడి హృదయంలో భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. భగవంతుని భవనం కన్న ఈ గోపాంగనా భవనం సహజమణులతో నిర్మించబడిందని గోపికలు మెచ్చుకుంటున్నారు.

goda govinda geetham tiruppavai 9

చుట్రుమ్ విళక్కెరియ: మణికాంతులతో భవనం ప్రకాశిస్తున్నప్పడికీ మంగళార్థంగా దీపాలు వెలిగిస్తున్నారు. పగటివేళల్లో కూడా భగవత్సన్నిధానంలో దీపాన్ని వెలిగించడానికి ఇదే కారణం. బయట మాహృదయాలనే దీపాలు చీకట్లో ఉంటే లోపల అంతటా దీపాలు వెలుగుతున్నాయే అని గోపికలు అడుగుతున్నారట. శ్రీకృష్ణుడు తనను వెతుక్కుంటూ వస్తాడనీ, అతనితో సల్లాపాలాడాలనీ దీపాలు వెలిగించి ఉంచారట. దీపం లేని ప్రాణం లేని శరీరం తో సమానం. దీపపు ప్రమిద శరీరం అయితే అందులో నేయి లేదా నూనే మనలోని ప్రేమ, ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అవుతుందని, ఆ విధంగా ప్రకాశింప చేసే శాస్త్రాలు మనకు ఉండాలి, మనం పెట్టే వత్తులురెండు శాస్త్రాలకు గుర్తు. వేదం, వేదాలపై వ్యాఖ్యానం అనే రెండు వత్తులు దేవుడివైపు తిరిగి ఉండాలనీ, వెలిగించే నిప్పు మన జ్ఞానమని, ఆ జ్ఞానం ప్రేమమయమై శాస్త్రాలకు అనుగుణంగా ఉంటే ఎదుట ఉన్న రూపం మనకు స్పష్టంగా దర్శనం ఇస్తుందని జీయర్ ఉపదేశించారు. కేవలం వెలుతురుకోసమే కాకుండా దీపాన్ని మంగళ ప్రదంగా వెలిగిస్తారు.

Also Read : పరమహంసలు చూపే పరమాత్ముని దారి

దూపమ్ కమఝ: కంటికి కనిపించని దూపం పరిమళాలు వెదజల్లుతున్నది. జ్ఞానం పరిమళిస్తున్నదని భావం. తుయులనై మేల్ కణ్ వళరుమ్: పడుకున్నవెంటనే నిద్రబుచ్చే పడక. నిద్ర అనకుండా మర్యాదగా కళ్లుమూతపడుతున్నాయని అన్నారట, భాగవతుల శయన సౌందర్యవర్ణన ఇది. సకల లోకాధినేత అయిన శ్రీకృష్ణుడిని పొందగలుగుతున్నాను కనుక ఈమె ఏ విచారమూ లేకుండా నిద్రిస్తున్నది. ద్వయంలో పూర్వభాగపు అర్థాన్ని భావిస్తూ ఉన్నదట లోపలున్న ఈ గోపబాలిక.

Also Read : మనసులే సుమాలైతే మాధవుడు మనవాడే

మామాన్ మగళే అంటే ప్రేమాదరాలతో బాంధవ్యాలను కల్పించుకుని మాట్లాడుకోవడం వంటిది. మామ కూతురా అని సంబోధించడం. మామాన్ అంటే మాలాకారులనే అర్థం కూడా వస్తుంది. బలరామకృష్ణులు మాలాకారుని గృహానికి వస్తారు, విష్ణుచిత్తులను కూడా అభిమానించారు. మామాన్ మగళే అని పిలువగానే గోపిక సంతృప్తురాలై బయటనుంచి కూడా తలుపు తెరుచుకోవచ్చు. తెరుచుకుని లోనికి రావచ్చుననే భావనతో ఆమె పడకమీదనుంచి కదలడం లేదట. వీరేమో బయటనుంచి మణిక్కదవం తాళ్ తెరవాయ్ అంటే మాణిక్య కవాటాల తాళం తీయమ్మా అంటున్నారు. ఆమె తల్లితో కూడా బంధుత్వం కలుపుకుని అత్తా ఆమెను లేపరాదా అని చెలికత్తెలు ప్రశ్నించారు. అయినా లేపకపోతే కొంత కోపంతో నీకూతురు అంటారట. కూతురు మీద ప్రేమ ఉన్నప్పుడు మామీరు అత్తగారూఅని పిలిచారు. కొంత కోపం రాగానే తల్లితో ఉన్ మగళ్ నీ కూతురు అనేంత దాకా వెళ్లిందట.

Also Read : మేఘం వంటి భగవంతుడు, ఆచార్యుడు

మేం వాకిట నిలబడి పరితపిస్తూ ఉంటే తెలిసి కూడా అయ్యో అనకుండా ఉండడానికి ఆమె మూగదా. అన్ఱి చ్చెవిడో పోనీ మూగ అనుకుందాం. మాటలువిని తలుపు తీయొచ్చు కదా? చెవిటిదికూడా అయిందా? ఆనందలో…అదీకాకపోతే రాత్రంతో శ్రీ కృష్ణసంశ్లేషంతో ఉన్నందున ఇప్పుడుగాఢనిద్రలో ఉందేమో. మాట వినికిడి మనసు మూడూ భగవంతుడిమీదే సంలగ్నమై ఉంటే మామాట ఎందుకు వినిపిస్తుంది?

ఏమప్పట్టాలో, శ్రీకృష్ణుడితో మాట్లాడకుండా ఈమెనెవరైనా బంధించారో ఏమో. వాగ్బంధం చేశారా? పెరుందుయిల్ మందిరప్పట్టాలో.. చాలాసేపు నిద్రించేట్టు ఏమైనా మంత్రా వేశారా ఏమి?

Also Read : గోవింద గోదా గీతం తిరుప్పావై -3

మామాయన్.. శ్రీకృష్ణుడి లీలలు మాయలు ఆశ్చర్యంగొలిపేవి. ఆ చేష్టలతో అబలలైన మమ్మల్ని ఉద్ధరించిన వాడు మాయావి, మాధవుడు లక్ష్మీపతి. నీవేమో నిన్ను బాధించిన రాక్షసస్త్రీలపైన కూడా కరుణ చూపించే దయావారాశివి కదా. నీ దయతో వారు రామగోష్ఠిగా మారారు. వైకుంఠమనే ఉన్నత లోకంలో ఉన్నజగన్నాథుడు ఊహాతీతుడై శ్రీదేవితో కూడిన వాడు భాగవతులతో కొలువుదీరిన వాడు..ఇంకా ఎన్ఱెన్ఱు ఎన్నెన్ని నామాలని చెప్పడం.. వనామమ్ పలవుమ్నవిన్ఱు వేలనామాల వెన్నుని స్తుతించాము కదా. కోరతేముంది.

మణులు తొమ్మిది రకాలు. భగవంతునితో చేతనుడికి తొమ్మిది సంబంధాలు ఉంటాయని ఈ శ్లోకం వివరిస్తుంది.

పితాచ రక్షక శేషి భర్తా జ్ఞేయో, రమాపతి, స్వామ్యాధారో, మమాత్మచ,భోక్తా చాద్యమనూదితః

Also Read : నారాయణచరణాలే శరణు

1. పిత (పితాపుత్ర సంబంధం), 2. రక్షకుడు (రక్ష్యరక్షకసంబంధం), 3. శేషి (శేషశేషి సంబంధం), 4 భర్త (భర్తృభార్యాసంబంధం), 5. జ్ఞేయుడు (జ్ఞాతజ్ఞేయసంబంధం), 6. స్వామి (స్వామిస్వత్వ సంబంధం), 7. ఆధారము (ఆధార ఆధేయ సంబంధం), 8. ఆత్మ (శరీరాత్మసంబంధం), 9 భోక్త (భోక్తృభోగ్య సంబంధం). ఈ తొమ్మిది రకాల సంబంధజ్ఞానమే నవవిధరత్నాలు. ఆ రత్నాలతో నిర్మించిన మేడలో గోపిక సంపూర్ణమైన భగవదానందంతో నిదురిస్తూ ఉంటుంది. తొమ్మిది సంబంధాలతో భగవంతుడిని భావించడమే ప్రజ్ఞ అంటారు, ఆ ప్రజ్ఞయే మణిమయభవనము. చుట్టుదీపమంటే శాస్త్రాధ్యయము వలన కలిగిన జ్ఞానదీపము. అగరు ధూప పరిమళం అంటే జ్ఞానం మాత్రమే కాక అనుష్టానమును సూచిస్తున్నది. మణులతో నిర్మించిన తలుపులంటే వ్యామోహజనకములైన అహకార మమకారములు, ఇవన్నీ ఆచార్య కటాక్షముచేత మాత్రమే తొలగిపోతాయి. భగవంతుని యందు దృఢాధ్యవసాయము కలవారు మూగవారుగా చెవిటివారుగా బద్ధకస్తులుగా కనిపిస్తారు. వారిని మంత్రించేది కావలి యుండునది భగవంతుడు మాత్రమే.నవ విధ భక్తులు అర్చనము, ఆత్మనివేదనము, కీర్తనము, దాస్యము, పాదసేవనము, వందనము, శ్రవణము, సఖ్యము, స్మరణము. రామానుజులు నవ రత్నముల వంటి గ్రంధాలు మనకు ఇచ్చారు.అవి 1. శ్రీ భాష్యము, 2. వేదాంత దీపము, 3. వేదాంత సారము, 4. వేదార్థ సంగ్రహము, 5. నిత్యగ్రంథము, 6. గీతా భాష్యము, 7. శరణాగతి గద్యము, 8. శ్రీ రజ్ఞ గద్యము, 9. శ్రీవైకుంఠ గద్యము.

Also Read : హరిగుణ గానమే స్నానమట

ఈ పాశురంలో తిరుమళిశైయాళ్వార్ల ప్రస్తావన ఉందని తెలుసుకున్నాం కదా. మామాన్ మకళే అని సంబోధన. గోదాదేవి లక్ష్మీదేవికి చెల్లెలు. లక్ష్మి భృగుమహర్షి కూతురు. గోదాదేవి తండ్రి కూడా భృగువంశ సంజాతులే. కనుక వారు మామాన్ మకళే (మామకూతురా) అన్నారు. ఆండాళ్ అందరికీ తల్లి. భ్రాతాచేత్ యతిశేఖర అంటే భగవద్రామానుజులు ఆమెకు అన్న. కనుక యతిరాజు మామ లవుతారు. కనుక ఇది శ్రీమతే రామానుజాయనమః అనే నమోవాకంతో కూడుకున్న పాశురం అని కందాడై రామానుజాచార్యస్వామి వివరించారు. బయట నిలిచి పిలిచే వారు లక్ష్మణుని వంటి వారు, అంటే స్వామికి కైంకర్యము చేసే ముముక్షువు వంటి వారు. లోపల నిద్రించే యువతి నిత్యసూరుల వంటి వారు అంటే స్వామిని అనుభవించేవారు. లోపలిబాలికకు పెరుమాళ్లే ఉపాయము అంటే తదేక ఉపాయ నిష్ట. ఇతర సాధనములద్వారా ఉపాయముల ద్వారా స్వప్రయత్నంచేత స్వామిని చేరాలనుకునే గోష్టి సభ్యులు అనన్య ఉపాయ నిష్ట అవలంబించేవారు. ఆండాళ్ దివ్యతిరువడి ఘళే శరణం అంటే  గోదమ్మ పాదాలే శరణు.

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles