Saturday, December 21, 2024

పరమహంసలు చూపే పరమాత్ముని దారి

  • 6. గోదా గోవింద గీతం తిరుప్పావై

గోదమ్మ ఒక గోపిక, తన పల్లెలో ఉన్న మిగిలిన యువకులు కూడా గోపికలే. తిరుప్పావై వ్రతం ఎందుకంటే భగవంతుని సాన్నిధ్యం సాధించడానికి. వర్షం దానంతట అది కురవవలసిందే, భగవంతుడి దయఉంటేనే సాధ్యం. కనుక భగవన్ సాన్నిధ్యం కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. ముందా కోరిక ఉండాలి. అప్పుడు అర్హత వస్తుంది. ఉపాయం సర్వేశ్వరుడే. అని మొదటి పాశురంలో చెప్పారు. ప్రేమతో చేస్తే సాధ్యమే అని రెండో పాశురం వివరించింది. ఉపకార స్మృతి ఉండి ఒకరినొకరు సహకరించుకుంటూ కృతజ్ఞతతో వ్రతం చేయాలని మూడో పాశురం చెప్పింది. భగవానుడినే ఆశ్రయించాలని నాలుగో పాశురం, ప్రతిబంధకాలు రాకుండా ఆపేశక్తి కూడా భగవానుడే అని అయిదో పాశురం చెప్పింది. ఆరునుంచి 15 దాకా పదిమంది గోపికలను, ఆళ్వారుల ప్రతీకలుగా భావించి మేలుకొలుపుతున్నారు.

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మెళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్

ప్రతి పదార్థం

పుళ్ళుం =పక్షులు కూడా, శిలమ్బిన కాణ్ = కూయుచున్నవి కదా, పుళ్ళరైయన్ =గరుడవాహనుని, కోయిలిల్ =కోవెలలో, వెళ్ళై =తెల్లని, విళి శంగిన్ =ఆహ్వానిస్తూమోగే శంఖపు, పేరరవం= పెద్ద శబ్దమును కూడా, కేట్టిలైయో=వినబడడం లేదా, పిళ్ళాయ్! =ఓ చిన్నారీ, ఎళుందిరాయ్ = లేవమ్మా, పేయ్ =పూతన యొక్క, ములై =స్తనములోని, నంజుండు= విషము తీసుకుని, కళ్ళచ్చగడం =కృత్రిమ శకటపు, కలక్కళియ =కీళ్లు విరిగేట్టు, క్కాలోచ్చి=కాలుచాచి ధ్వంసం చేసి, వెళ్ళత్తరవిల్ = పాల సముద్రంలో శేష శయనంపై, తుయిల్ అమరంద =యోగనిద్రలో అమరియున్న, విత్తినై = జగత్కారణ భూతుడైన, ఉళ్ళత్తు క్కొండు= తమ మనసులో ధ్యానించి, మునివర్గళుం =మునివరులు, యోగిగళుమ్ = యోగి వరులు, మెళ్ల = మెల్లగా, ఎళుందు =లేచి అరి ఎన్ఱ = హరి హరి హరి అనే, పేరరవం= పెద్దధ్వని, ఉళ్ళం పుగుందు =మాలో ప్రవేశించి, కుళిరుందు =చల్లబరిచింది.

Also Read : మనసులే సుమాలైతే మాధవుడు మనవాడే

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి అనువాదం సిరినోము

పక్షులరచుచుండె పక్షి వాహను వీట

            శంఖమ్ము మ్రోగుచు జనుల పిలిచె

మేలుకోవే పిల్ల: క్రోలి పూతన చను

            బాల విషమును, తత్త ప్రాణములను,

సడలగా దన్ని దుష్ట శకట ఘోర రా

            క్షసు సంధి బంధముల్ కాలుసాచి

క్షీర సాగరమందు శేషాహి తల్పాన

            కనుమోడ్పు జగదాది కారణమును

యోగులును మహర్షు లుల్లమ్ములను జేర్చి

            హరి హరి అను మనోహర రవమ్ము

మన హృదయాలలో మార్మ్రోగుచున్నది

          మేలుకోవె పిల్ల: మేలుకొనవె.

సారాంశం

ఆకాశం అంటే విస్తరించిన భగవత్తత్త్వం. ఆ ఆకాశంలో రెండురెక్కల పక్షులు విహరిస్తున్నాయి, పొద్దున్నే కిలకిలారావాలతో తెల్లవారిందని సూచిస్తూజీవరాశిని లేపుతున్నాయి. “పుళ్ళుం శిలమ్బిన కాణ్” (పక్షులు అరుస్తున్నాయ్). జ్ఞానము, దానికి ఉచితమైన ఆచరణ అనేవే రెండు రెక్కలు అంటున్నారు చినజీయర్ స్వామి, భగవత్తత్త్వంలో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే.

goda govinda geetham tiruppavai 6

పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్!” ఓ చిన్నారి అమ్మాయీ పక్షులన్నిటికీ రాజు గరుడుడు, ఆయనకు స్వామి విష్ణువు. ఆయన ఆలయంలో తెల్లని శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా అని గోపికపిలుస్తున్నది. తెల్లవారిందనడానికి మరో ప్రమాణం చూపుతున్నది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి మెరుస్తుందని గోదమ్మ ఆలయ సన్నివేశాన్ని మన ముందుంచుతున్నారు.  శంఖం ఓంకార రవం చేస్తుంది. ప్రతిజాముకీ వినిపించే ధ్వనే ఇది. ఇంకా తెల్లవారలేదేమోఅన్నట్టు ఇంకా కళ్లు మూసుకునే ఉంది. అందుకే “ఎళుందిరాయ్”- మేలుకో అంటున్నది బయటి గోపిక. “మునివర్గళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్” మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటున్నారు అదీ వినిపించడం లేదా? ఇక్కడ మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

Also Read : మేఘం వంటి భగవంతుడు, ఆచార్యుడు

అహంకారమే విషం

1. పేయ్ములై నంజుండు” పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు-ప్రకృతి మనకు ఇచ్చే “అహం-మన” అనే విషాలను హరించే హరీ.. అని జ్ఞానులు తలుస్తున్నారు.

మనశరీరమే బండి

2. కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి” శ్రీకృష్ణుడుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, కంసుడుపంపితే శ్రీ కృష్ణుని సంహరించాలని ఒక అసురుడు బండిపై ఆవహించాడు. ఆ పిల్లవాడు కాలు చాచినంత మాత్రంచేత బండి ఎగిరిపోయింది. అసురుడి కాలం తీరింది. పాపపుణ్యాల చక్రాల మీద నడిచే బండి మన శరీరం. మనల్ని నడిపించే పరమాత్మపాదాల కింద మన శరీరం అనే బండిపెట్టి చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించే హరీ.

అయిదు జ్ఞానాలు

3. “వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు” – ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు – అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. 1. నేను వాడికి చెందిన వాడిని. 2. వాడు నన్ను తరింపచేయువాడు, 3. వాడిని చేరే సాధనం వాడి శరణాగతే, 4. వాడిని చేరితే కలిగే ఫలితం వాడి సేవ, 5. వాడిని చేరకుండా ఉంచే ఆటంకం వానియందు రుచిలేకుండమే అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి.

Also Read : గోవింద గోదా గీతం తిరుప్పావై -3

తొలి ఆళ్వారుకు మేలుకొలుపు

ఆరోరోజునుంచి గోదమ్మ వరసగా రోజుకొకరుచొప్పున పదిమంది గోపికలను నిద్రలేపుతున్నారు. విష్ణువు ఆలయంలో మూలమూర్తి భగవానుని విగ్రహంతోపాటు భక్తులైన ఆళ్వార్ల విగ్రహాలను కూడా ప్రతిష్టిస్తారు. ఆళ్వార్లు ప్రధానంగా పదిమంది. మరో ఇద్దరిని కూడా చేర్చి పన్నిద్దరాళ్వార్లు అన్నారు. అయినా మొదటి పదిమంది ప్రముఖులు. ప్రదక్షిణ చేస్తూ ఈపదిమంది భక్తగురువులను చూచి అమ్మవారిని దర్శించిన తరువాత మూల పెరుమాళ్ ను దర్శించాలన్నది పద్ధతి. భగవంతుడుగురువు ద్వారా లభించాలి. భగవంతుడి దయవల్లనే అపార జ్ఞానం కలిగిన ఆళ్వార్ల కరుణ మన మీద పడితుంది అప్పుడే యోగ్యత సిద్ధిస్తుంది. ఆళ్వార్ల చూపు మనమీద పడాలి.

జ్ఞానం ఆచరణ అనే రెక్కలు

పరబ్రహ్మమనే ఆకాశములో విహరించడానికి జ్ఞానము ఆచరణ అనే రెండు రెక్కలు అవసరం. ఆ రెక్కలుగల మహాత్ములే పక్షులు. వారి కలకలరావములు వారి అధ్యయన ఉపదేశాలనే ప్రక్రియలు. జ్ఞానముతోపాటు ఆచరించిన వారే తత్వ ఉపదేశము చేయగలుగుతారు. తెల్లవారుతున్నదని ముందే తెలుసుకుని నిద్రలేచి ఇతరులను మేలుకొలిపేవి పక్షులు. తాము భగవదనుభవముచేసి తమ వాక్కులద్వారా ఇతరులకు కూడా భగవదనుభవము కలిగించడానికి మేలుకొలిపేవారు జ్ఞానులు. పక్షులు జ్ఞానానికి మార్గదర్శకులు ప్రేరకులు అని చెప్పే అద్భుత వ్యాఖ్యానాన్ని శ్రీ భాష్యం వారు వివరించారు.

Also Read : నారాయణచరణాలే శరణు

జానశృతి కథ

జానశ్రుతి అనే ఒక రాజు, ధార్మికుడు, దాన శీలి. ఇద్దరు బ్రహ్మజ్ఞానులుహంసల రూపంలో ఆకాశంలో విహరిస్తూఆయన రాజ భవనం మీదుగా వెళ్తున్నపుడు, ఆయన బ్రహ్మజ్ఞానం లో శ్రద్ధ లేని వాడు అని ఇద్దరు అనుకున్నారట.అతని గొప్పదనం గురించి వారు ఇలా మాట్లాడుకుంటూ… ‘‘జానశృతి పడుకున్నాడు కదా మన నీడ పడేట్టు ఆయన భవనం మీదుగా పోవడం ఉచితం కాదు పక్కనుండి పోదాం’’ అని ఒక హంస అంటే, ‘‘ఆయనేమయినా రైక్వుడా భయపడడానికి’’, అని మరో హంస జవాబిచ్చింది. ఈ సంభాషణ విన్నాడు జానశృతి. ఆ భాష తెలిసిన జానశృతి ఈ రైక్వుడెవరో  తెలుసుకోవాలని రాజు దూతలను పంపాడు. అన్వేషించాడు. అడవిలో సంసార వాసనలకు పూర్తిగా దూరంగా ఓ బండి కింద పిచ్చివాడిలా గోక్కుంటూ కనిపించాడట రైక్వుడు. రాజు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోయాడు. అతన్ని దర్శించి జ్ఞానోపదేశం చేయమని కోరుకున్నాడు. సర్వస్వం దక్షిణగా సమర్పించుకున్నాడు. బ్రహ్మజ్ఞానం సంపాదించాడు. ధార్మికుడైన భక్తుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రేరణను కల్పించే మహాత్ములు పరమహంసలు. ఇది ఉపనిషత్తులోని ఒకకథ. తెల్లవారుతున్నదని చెప్పిభగవదనుగ్రహం పొందే సమయం అయిందని హెచ్చరిస్తున్నాయి పక్షులు. ఆ విషయాన్ని సంకేతమాత్రంగా ప్రతిపాదించారు గోదా దేవి.

కౌసల్యకు గోరువంక సాయం

కౌసల్య అంతఃపురంలో చిలుక గోరువంక ఉన్నాయట. రెండూ మాట్లాడుతూ ఉంటాయి. ఒక సారి భగవంతుడికి నివేదించడానికి సిద్ధంగా ఉంచిన ఆహారాన్ని ఒక పిల్లి తినబోతూ ఉంటే గోరువంక ‘‘శుక, పాద మరేః దశ’’ ఓ చిలుకా ఆ శత్రువుపాదాన్ని కొరుకు అని పిల్లితినకుండా ప్రసాదాన్ని రక్షించి కౌసల్యకు సహాయం చేసింది. అరణ్యంలో రాముడు ఈ విషయం గుర్తుచేసుకుంటూ లక్ష్మణుడితో… గోరువంక చేసిన సాయమైనా నేను నా తల్లికి చేయలేకపోయానే అని బాధపడతాడట. చిలుక భగవత్తత్వము. గోరువంక శారిక ఆచార్యతత్వము, శారిక స్త్రీ అంటే భగవత్పరతంత్ర అయినది. భగవంతుడికినివేదించిన పదార్థము ఆత్మతత్త్వము. పిల్లి వలె పొంచి ఉండి హరించేది మాయ. గోరువంక వలె ఆచార్యుడు భగవంతుడితో ఈ మాయ నుంచి రక్షించాలని వేడుకుంటాడు. అదే ఆచార్యుడుచేసే ఉపకారం అని శ్రీ భాష్యం వారు వివరించారు. భగవంతుడిని ఆచార్యుని విశిష్ట లక్షణాలను ఈ పాశురంలోకూడా వివరిస్తున్నారు గోదమ్మ.

Also Read : హరిగుణ గానమే స్నానమట

పక్షిరాజైన గరుడికి ప్రభువు నారాయణుడు. నారాయణుని ఆలయసేవకు వేళ అయిందని తెలిపేది తెల్లని శంఖం, శంఖ ధ్వని వినబడడం లేదా అంటున్నారు గోపికలు.

పూతన కథ

పూతన స్తనాల్లో విషాన్ని ఆరగించి (పేయ్ ములై నంజుండు), శకటాన్ని ఆవహించిన అసురిడిని కీళ్లూడే విధంగా తన్ని (కళ్లచ్చగడం కలక్కళియక్కలాలోచ్చి), క్షీరసాగరంలో శేషశయ్యమీద నిద్రిస్తున్న కారణభూతుని (వెళ్లత్తరవిల్ తుయిలమర్ న్ద విత్తినై) మనసునిండా నింపుకుని (ఉళ్లత్తుక్కొన్డు) మునులుయోగులు నెమ్మదిగా లేస్తూ (మునివర్ గళుమ్ యోగి గళుమ్ మెళ్ల వెళున్దు) హరి హరీ హరీ అని చేసే పెద్ద ధ్వని లోనికి ప్రవేశించి చల్లబడ్డారట (అరియెన్ఱ పేరరవమ్ ఉళ్లమ్ పుగున్దు కుళిర్ న్దు).

లోపలున్న అమ్మాయి (గోపిక)కు భగవత్ప్రేమ పరిపూర్ణంగా ఉంది. ఆ ప్రేమను తానే అనుభవిస్తున్నది. ఆమె తమలో కలిస్తే గాని బయటి గోపికలకు తృప్తి లేదు. ఇటువంటి వారిని పదిమందిని కలుపుకునిపోవాలని ప్రయత్నం. కృష్ణుడికి వచ్చిన కష్టాలు చెబితే తనంత తానే ఆమె బయటకు వస్తుందని, ఆమెతోపాటు మంగళా శాసనం చేయవచ్చునని అనుకుంటూ ఆ విషయాలు చెబుతున్నారు. ఒంటరిగా భగవత్సంధానం చేయడం కన్న గోష్టిలో సమిష్ఠిగా ప్రయత్నించడం మిన్న.

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

పూతన తల్లి రూపంలోపాలిచ్చే నెపంతో వచ్చింది. శ్రీ కృష్ణునికి ప్రేమతో పాలివ్వాలని కాదు, చంపడానికి పాలు ఇస్తున్నట్టు నటిస్తున్నది. ఆమెకు అంతఃశుద్ధి లేదు. బాహ్యవేషం ఉంది. తనకు ప్రేమతో అర్పించే వారి నివేదనను ఏ విధంగా స్వీకరిస్తాడో అంతఃశ్శుద్ధి లేకపోయినా నటనకోసం నివేదించినా శ్రీ కృష్ణుడు స్వీకరిస్తాడట. భగవంతుడి యందు ప్రీతి ఉన్నట్టు నటించినా ఆయనకు సంతోషమే. అందుకే పూతన స్తన్యంలో విషపూరిత పాలను స్వీకరిస్తాడు. అమృతత్వాన్ని ఇస్తాడు, కాని ఆయనకు అది విషం కాదు. విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చినపుడు, అతను నిజంగానే రాముడిని ఆశ్రయిస్తున్నాడా, లేక మిత్రభావం నటించి మోసం చేస్తాడా అని అనుమానించారు కొందరు. రాముడు మాత్రం ‘‘సకృదేవ ప్రపన్నాయ తవాస్మిచ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతం మమ’’ శరణన్నవారిని నేను వదలను అది నావ్రతం. అతను మిత్రభావం ఉన్నట్టు కనబడుతున్నాడు ఒకవేళ అది నటనే అయినా సరే నేను వదలను ‘‘మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన’’ అని ఆశ్రయమిచ్చాడని శ్రీభాష్యం ఈ పాశుర వివరణలో చెప్పారు. పరమాత్ముడికి పాలు విషము అనే తేడా లేదు.

పూతన ప్రకృతి

పూతన ప్రకృతికి ప్రతీక. ప్రకృతి తల్లి వలెఉంటుంది కాని నిజమైన తల్లి కాదు. అహంకార మమకారాలనే స్తనముల ద్వారావిషయభోగములనే విషమిచ్చి చంపదలుచుకునే ప్రకృతి. విషము విషయమునకుతేడా ఒక్క య అనే అక్షరమే. విషం తాగితేనే చంపుతుంది. విషయం మాత్రం స్మరించినందుకుచంపుతుంది. విషయమనే పాలు నేను సంపాదించి నేను నా ధారకం కోసం తాగుతున్నాను అనుకుంటే అది విషమవుతుంది. ఆవులు ఇచ్చిన పాలు, నా హృదయంలో ఉన్న శ్రీ కృష్ణుడికివ్వడానికే తాగుతున్నాను. అనే భావంతో అర్పిస్తే మనకు ప్రకృతి అంటకుండా, మాయను నశింప చేసి రక్షిస్తాడు. అందుకే కృష్ణార్పణం అని పదేపదే అనుకోవడం. ఆ కృష్ణుడిని ధ్యానిస్తూ యోగులు హరీ అని నిద్రలేస్తున్నారు.

శకటాసుర సంహారి

ఏదో చిన్న పని చేసుకుని వచ్చే లోపల కొడుకు కు రక్షగా ఉంటుందనుకుని క్రిష్ణయ్యను బండి కింద పడుకోబెట్టిందట యశోదమ్మ. ఆ బంఢిమీదే అసురుడు ఆవేశించాడు. క్రిష్ణయ్యనే చంపబోయాడు. సహజంగా పాలకోసం కాళ్లుచేతులు విసురుతున్నాడు క్రిష్ణయ్య. ఆ విసురుకు చాచిన కాలు తాకి బండి కీలూడి ముక్కలైంది. శరీరముంటే సుఖ దుఃఖాలుంటాయి. శ అంటే సుఖము, కటముఅంటే పోడగొట్టేది. సుఖం అంటే పరమాత్మానుభవం. దానికి ఆటంకం కలిగించేది శరీరం. కృష్ణుడి కాలుతగిలేతే ఈ శకటం విరిగిపోతుంది. లేకుంటే సుఖదుఃఖాల కలిగించే సుకృత దుష్కృతాలనేరెండు చక్రాల బండి తిరుగుతూనే ఉంటుంది. మనంచేసే కర్మలను శ్రీ మన్నారాయణుడి చరణాలకేఅర్పిస్తే కర్మలు శ్రేయోదాయకమవుతాయని, కర్మలను హరించి శరీరబంధాన్నీ హరించే హరీ అని మునులు యోగులు కీర్తిస్తూ ఉన్నారు.

పాపపుణ్యముల దేహం- అన్నమయ్య

అన్నమయ్య ఒక కీర్తనలో ‘‘పాపపుణ్యముల రూపము దేహమిది దీని దీపనం బణగింపఁ దెరు వెందు లేదు’’ అని పల్లవిలో దేహాన్ని వివరిస్తాడు. సరిలేని మమకార జలధి దాఁటిఁనగాని అరుదైన నిజసౌఖ్య మదివొందరాదు తిరువేంకటాచలాధిపుని గొలిచిన గాని పరగుబ్రహ్మానందపరుఁడుఁ దాఁగాఁడు అని చరణంలో పరబ్రహ్మచరణాలే గతి అనే భావాన్ని ప్రకటిస్తాడు.

‘‘వైష్ణవులుగానివార లెవ్వరు లేరు, విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన’’ అనే పల్లవితో సాగే మరొక కీర్తనలోని ఒక చరణంలో అన్నమయ్య- ‘‘యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి యెవ్వరిఁ దలచిన నేమి అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా- రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు’’ శ్రీ హరిని తలచుకుంటేనే యెరుక దోచుతుందని వివరిస్తారు. అన్నమయ్య పదాలలో ఆండాళ్ పాశురాల అద్వైతం గోచరిస్తుంది.

లక్ష్మణుడూ భరతుడూ

లోకంలో అవతరించడానికి గాను సిద్ధంగా భగవంతుడు పాల సముద్రంలో ఎదురుచూస్తూ ఉంటాడట. అదే జగత్కారణ తత్వం. ఈ జగత్తును జనులను ఏ విధంగా రక్షించడమా అని విష్ణువు చింతించడమే యోగనిద్ర. జీవులను ప్రకృతితో సంధించడమే సృష్టి. అందుకుచేసే సంకల్పమే యోగనిద్ర. సర్వజగత్కారణభూతుడు జగద్రక్షకుడే ఆపదలను హరించాలని హరీ అని స్మరిస్తూ యోగులు మునులు లేస్తుంటారు. ముని అంటే భగవద్గుణానుభవం చేస్తూ మరే వ్యాపారమూ చేయడు. యోగి అంటే భగవంతుడికి నిరంతర సేవ చేసేవాడు. లక్ష్మణుడు కర్మయోగి రాముని సన్నిధిలో ఉండికైంకర్యములుచేస్తూ ఉంటాడు. భరతుడు ముని. మనసులోనే రాముని గుణవైభవాన్ని మననంచేసుకుంటూ ఉంటాడు. నందవ్రజంలో యోగులు మునులు ఉన్నారా అని సందేహిస్తే, శ్రీ కృష్ణుడే అవతరించి పొద్దున్నే పశువులను తీసుకువెళ్లి మేత మేపి, సాయంత్రం తీసుకువచ్చి కట్టేసే పని చేస్తూ ఉంటే ఆ కొట్టాలలో మునులు యోగులు కాచుకుని ఉండేవారట. గర్భస్థ శిశువుకు ఏమీ జరగకుండా ఉండాలని నెమ్మదిగా లేచే గర్భిణి వలె పరమాత్మను హృదయంలో నింపుకున్న మునులు యోగులు భారంగా మెల్లగా లేస్తారట.

ప్రహ్లాదుని హృదయవాసి

ప్రహ్లాదుడిని పర్వతం నుంచి కిందికి తోసినప్పుడు తన హృదయంలో ఉన్న హరికి ఏమవుతుందోనని హృదయాన్ని  గట్టిగా పట్టుకుని దెబ్బతగలకుండా కాపాడుకుంటూ ఆయన జాగ్రత్తగా కింద పడిపోయాడట. తమను రక్షించే పరమాత్ముడిని తాము రక్షించాలనుకునే వెఱ్ఱి ప్రేమ వారిది. అంతమంది యోగులు మునులు పొద్దున్నే హరి హరి హరీ అంటూ ఉంటే అది నందవ్రజంలో పెద్ద ధ్వనిగా మారిందట. అది చెవుల ద్వారా మనసులో ప్రవేశించడం వల్ల అక్కడ కృష్ణుడు లేక బీటలువారినక్షేత్రం అప్పుడుచల్లబడిందట. అప్పుడు మేల్కొన్నారట, నీవుకూడా మేలుకో అంటున్నారు గోపికలు.

పదిమంది ఆళ్వారులను మేలుకొలపడం ఈ పాశురంతో ప్రారంభమైంది. ఆళ్వారుల పేర్లు.

1. పోయిగై (పోయ్గై )ఆళ్వారు, (సరోయోగి)

2. పూదత్త ఆళ్వారు,  (భూతయోగి)

3 పేయాళ్వారు, (మహాయోగి)

4. తిరుమజిశై ఆళ్వారు (భక్తిసారులు)

5. నమ్మాళ్వారు, శఠగోపులు

6. కులశేఖర ఆళ్వారు

7. పెరియాళ్వారు (భట్టనాథులు, విష్ణు చిత్తులు)

8. తొండర్అడిప్పొడి (భక్తాంఘ్రిరేణువు, శ్రీపాదరేణువు, విప్రనారాయణ)

9. తిరుప్పాణి యాళ్వార్ (యోగి వాహనులు)

10. తిరుమంగైఆళ్వారు (పరకాల)

ఆ తరువాత గోదాదేవిని మధురకవిని చేర్చి 12 మంది ఆళ్వారులు అంటారు. శ్రియఃపతి అయిన నారాయణునికే మంగళాశాసనము చేసిన వారు కనుక  విష్ణు చిత్తులు అందరినీ మించి పెరియ (పెద్ద) ఆళ్వారు అయినారు. ఆళ్వారులనే ఆచార్యుల అనుగ్రహం లేకుండా భగవంతుడి దయకలుగదని, ఆండాళమ్మ ఈ పది మంది ఆళ్వారుల దయ సాధించడానికి వ్రతంలో ప్రయత్నిస్తున్నారు.

స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవేవిష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles