Sunday, December 22, 2024

జ్ఞానమనే ఆరని దీపం అమ్మనే వ్రతఫలంగా ఇచ్చిన శ్రీకృష్ణుడు

  • గోదా గోవింద గీతం 26

నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్య పరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్నికావాలని శ్రీ కృష్ణుడు గోపికలను అడిగాడు. ఈ పఱై గానీ వ్రతంగానీ, వర్షంకోసం వ్రతం చేయాలనడం కోసం కేవలం వ్యాజం మాత్రమే. నిన్ను చూడడమే ఈ వ్రతం లక్ష్యం. ఈ వ్రతానికి మార్గళి స్నానం అనుష్టానం అని పెద్దలు అంటున్నారు. నీతో సంశ్లేషమే స్నానం. పైకి పెద్దలకోసం చేసిన వ్రతానికి కావలసిన పరికరాలు, కాని ఆంతరముగా భగవదనుభూతికి కావలసిన సామగ్రిని వారు అడుగుతున్నారు. శంఖాలు, పఱై వాయిద్యాలు, మంగళాశాసనం చేసేవారు, దీపాలు, కేతనాలు, గొడుగులు మొదలైనవి మాకు ఇమ్మని గోపికలు ప్రార్థిస్తున్నారు.

మాలే మణివణ్ణా మార్-గళి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
జ్ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

భక్తులను కాపాడే (మాలే) నీలమణివర్ణుడా (మణవణ్ణన్) ప్రళయకాలంలో మఱ్ఱి ఆకు మీద పవళించినవాడా (ఆలిన్ ఇలైయాయ్) మార్గళి స్నానం చేయడం కోసం (మార్గళి నీరాడువాన్) పెద్దలు (మేలైయార్) చేసే అనుష్టాలకోసం (సేయ్ వనగళ్) కావలసిన ఉపకరణాలు (వేండువన) మీరు వింటే చెబుతాము (కేట్టియేల్) ప్రపంచమంతా (ఞాలత్తైఎల్లామ్) వణికేట్టు (నడుంగ) ధ్వనిచేసే (మురల్వన్) పాలరంగును బోలిన (పాలన్న వణ్ణత్తున్) నీపాంచజన్యానికి తోడైన (ఉన్ పాంచచన్నియయే) శంఖాలను (శంగంగళ్) చాలా విశాలమైన (పోయ్ పాడు ఉడైయన) చాలా పెద్దవయిన (శాలపెరం) డక్కాలు (పఱై) తిరుపల్లాండు పాడే వారు (పల్లాండు ఇశైప్పార్) మంగళ దీపాలను (కోలవిళక్కు), ధ్వజాలను (కొడి) మేలకట్లను (వితానం) మాకు అనుగ్రహించండి (అరుళ్) .

goda govinda geetham tiruppavai 26

ఆలినిలయాయ్ అంటే వటపత్రశాయి అని గోదమ్మ శ్రీకృష్ణుని వర్ణించిన చిత్రం చిరంజీవి ఉదయ్ గీసాడు.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు సిరినోము పద్యం

నిఖిలాశ్రితాదరా: నీల మణి శరీర:

పూర్వసూరి చరిత పూతమైన

మార్గశీర్ష స్నాన మహిత వ్రతము సేయ

ఏమి కావలెనందువేని వినుము

పుడమి కంపిలునట్టు మ్రోగునట్టి పాల

ఛాయవి నీ పాంచజన్య సదృశ

ములు శంఖములు మాకు వలయు: డక్కి వా

ద్యమ్ములు – మిగుల పెద్దవి -వలయును

‘పల్లాండు’ సెప్పెడి వారికి: సన్నిధి

కోలలున్ ధ్వజములు మేలు కట్లు

కావలె వ్రతపూర్తికై: వీని కృప సేయు

గోవింద: మమ్మేలుకో: ముకుంద

మాలే అన్న పదప్రయోగం ద్వారా గోదాదేవి, గోపికలకు శ్రీకృష్ణుడిమీద ఉన్న ప్రేమ కన్నా శ్రీకృష్ణుడికి వారిమీద ఉన్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు. శ్రీరాముడి విశిష్ఠ లక్షణం శరణన్న వారిని రక్షించడమే. ఇన్ని రోజులు తమకు శ్రీకృష్ణుడంటే అమితప్రేమఅని గోపికలు అనుకున్నారట. కాని ఆయన చల్లని చూపుల్లో పొంగి పొర్లిన అనురాగాన్ని చూసి ఆయన భక్త వ్యామోహంతో పోల్చితే తమ వ్యామోహం సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే అని తెలుసుకున్నారు. కనుక ఆయనను మాలే అని సంబోధిస్తారు. శ్రీకృష్ణుడు నాలో ఆశ్రిత వాత్సల్యం ఉందని మీరు ఏవిధంగా తెలుసుకున్నారంటే మణిదీపాల కాంతి దీపాలను దాటి దానంతటదే ప్రకాశించినట్టు మీ గుణం ప్రకాశిస్తున్నది మణివణ్ణా శ్రీ కృష్ణా అంటారు. మనసులలోని గుణం శరీరవర్ణంలో ప్రతిబింబిస్తున్నదట. మణివణ్ణా అంటే కొంగు మణి అనీ భక్తులకు కొంగుబంగారమనీ కూడా అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యం అనే సౌశీల్యం తోబాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యం కూడా ప్రకటితమైంది. అదిసరే మీరెందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.

రామాయణ భారత ఉదాహరణలు

శ్రీరాముడు శరణాగతవత్సలుడు, శ్రీ కృష్ణుడు ఆశ్రిత వ్యామోహము కలవాడు. రాముడు రావణుడి తమ్ముడినైన నన్ను స్వీకరిస్తాడా అని విభీషణుడు అనుకుంటూ వస్తున్నాడట. కాని శ్రీరాముడేమో రావణుడే వస్తే బాగుంటుంది కదా. పోనీ అతను కాకపోతే ఆయన తమ్ముడైనా వస్తే బాగుండు అనుకుంటాడట.

Also Read : దేవకి, యశోద ‌- దివ్యమైన నారాయణ మంత్రాలు

భక్తులను ఆదరించడానికి శ్రీకృష్ణుడు తపిస్తాడట. మహాపరాక్రమశాలి యోధ్ధలందరిలోకి మహా యోధ్ధ అయిన శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన పాండవులకోసం దూతగా సారథిగా చిన్నచిన్న పనులు చేయడానికి ఎంతో ఇష్టపడతాడట.  పరమాత్మను పొందడానికి ఆళ్వార్లు పడే ప్రేమ తపన కన్న ఆళ్వార్లను పొందడానికి పెరుమాళ్లు పడే తపన మరీ ఎక్కువట.

భాగవత కథ

శ్రీ కృష్ణుడిని పొందగలమాఅని గోపికలు భావిస్తుంటే, గోపికలకోసమే ఆయన ఒకరికి పుట్టి మరొకరి దగ్గర పెరిగాడట. శ్రీ భాష్యం వారు ఇలా రాసారు. తాను పిచ్చెక్కినట్టుండి, వీరికి కూడా పిచ్చెత్తించి తనతో పోలిక కలిగించే విచిత్రమైన పిచ్చిగలవాడు శ్రీకృష్ణుడు. ఆయన వ్యామోహము చూసి గోపికలు పరవశులై మరింత వ్యామోహం పొందారట. ప్రేమస్వరూపుడు, ప్రేమాతిశయమూర్తి. ప్రేమైక మూర్తి.

తామరపూవులో పుట్టిన లక్ష్మీతాయారు హరి శరీరకాంతికి పరవశించి ఆయన వక్షఃస్థలంలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నది. మాలే అంటే అత్యధికుడని సంబోధన. మణిని పోలిన స్వభావము కలవాడు నారాయణుడు. మణి కలిగి ఉన్నవాడు మణి ఉంటేనే బతుకని, లేకపోతే ఉన్నట్టు కాదని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు కలిగి ఉన్నవాడే ఉన్నట్టు, లేని వారు లేనివారే. మణి మరొకరికి ఉపయోగపడుతుందే కాని తనకు తాను పనికి రాదు.

పెద్దల మాట

జీయర్ స్వామి గోదాదేవి చెప్పిన మూడు వ్రతనియమాలు ఏమిటో ఈ విధంగా వివరించారు. ‘‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త తదేవేతరే జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’’ అన్నది మీరే కదా.

Also Read : జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….

–‘‘ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. పెద్దలు చెప్పిన, ఆచరించిన ఉత్తమ పద్ధతులు పాటించాలని భగవద్గీతలో చెప్పారు కదా. శెయ్యాదన శెయ్యోం, – పెద్దలు వద్దన్న పనులుచేయం.  మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా “నానే తాన్ ఆయిడుగ” నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఆ పెద్దల ఆచారమే మా వ్రతానికి కూడా ప్రబల ప్రమాణము. పెద్దలు చెప్పినవి, మన శ్రేయస్సు కోసం, మేము అంగీకరించి చేస్తున్నాం అనే మూడు సూత్రాలతో వ్రతం ఆచరించి, ఆ విధంగా ఆచరించాలని మనకు వివరించారు గోదమ్మ.  మేలైయార్ శేయ్ వనగళ్ అని మరో సూత్రం. అంటే పెద్దలు చెప్పినవన్నీ చేయాలని కాదు, అందులో ఆచరణ ప్రమాణ యోగ్యమైనవి చేయాలని వివరణ. మాలే మణివణ్ణా అనే పిలుపు అమ్మ యశోద ప్రేమతో పిలిచే పేరు. దాంతో కరిగిపోతాడు. అంత ప్రేమను దాచి ఈ పిలుపు నాకు అలవాటే, అది సరే గాని మీరెందుకు వచ్చారు అని పలకరిస్తారట శ్రీకృష్ణయ్య.

goda govinda geetham tiruppavai 26

కనుక వర్షం

ఏదో ఇస్తారని అన్నారని అడుగుతున్నాం. మాకు తగినదని మీరు ఇస్తే ఏదైనా తీసుకుంటాం. అంతేకాని మాకు ఏదో ఇవ్వడం కోసం మేం ఈ వ్రతం చేయడం లేదు. మేము వ్రతం చేసాం కనక (కనుక) ఫలితం ఇస్తారని కాదు. జీయర్ స్వామి అనేక సందర్భాలలోఈ కనక (కనుక) ల గురించి విమర్శించారు.  మేం కొబ్బరికాయ కొట్టాం కనుక మాకది చేయి. ఇది చేసాం కనుక అది చేయి అనే కన(ను)క వర్షాలను భగవంతుడు పక్కన బెట్టేస్తాడు. కనక  ఈ కన(ను)కలను వదిలేసి, వాటి వెనక పడకుండా భగవంతుడే కావాలని కోరుకొనండి అని జీయర్ స్వామి తిరుప్పావైలో గోదాదేవి సందేశాన్ని వివరించారు.

మార్గేషు శీర్షం మార్గశీర్షం. ముక్తిపొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మార్గశీర్షం హేమంతే ప్రథమే మాసః అని హేమంత రుతువులో కాత్యాయన వ్రతం చేస్తారు గోపికలని వ్యాసుడు భాగవతంలో పేర్కొన్నారు. చాంద్రమానంలో మార్గశీర్షం, సౌరమానంలో ధనుర్మాసం కలిసి రావడం విశేషం ఇందులో వివరించే మోక్షమార్గ వివరణ విశేషం. ‘మాసానామ్ మార్గశీర్షోహమ్’ మాసాల్లో నేను మార్గశీర్షాన్ని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నారు.

ఈ రోజు గోదమ్మ “మేలైయార్ శేయ్-వనగళ్” సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయమై ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ’’.

Also Read : వేదగుహలలో ప్రకాశించే పరమాత్ముడే శ్రీకృష్ణ సింహము

మార్గళి స్నాన వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వండి అన్నారు. సరే ఏంకావాలి? వేండువన కేట్టియేల్.. కావలసినవేమిటో చెబుతాంకాని మీరు వింటున్నారా? అన్నారు. అయిదులక్షలమంది ఆశ్రితులై రావడంతో ఉప్పొంగిపోయిన స్వామి ఆ ప్రేమలో వింటున్నారో లేదో అనుకుని గోపికలు ‘‘వింటున్నారా’’ అన్నారట.

ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ధ్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన” నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం అనే అసాదారణ ఆయుధాలు ఉంటాయికదా. శంఖ చక్రాలను ఆ పరమాత్ముడు మాత్రమే ధరించి భరించ ప్రయోగించగల శక్తమంతుడు. మరెవరికీ అవి అమరవు.

ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణస్తోమ భూషణ!

జనిభయస్థాన తారణ! జగదవస్థాన కారణ!

నిఖిల దుష్కర్మ కర్శన! నిగమ సద్ధర్మ దర్శన!

జయ జయ శ్రీ సుదర్శన! జయజయశ్రీ సుదర్శన!

అని సుదర్శన వైభవాన్ని వేదాంత దేశికులు వర్ణిస్తారు.

భాగవత కథ

జీయర్ స్వామి రెండు సంఘటనలు వివరించారు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని అల్లరి చిల్లరగా పనులు చేసేవాడు. ఓ సందర్భంలో కృష్ణుని సుదర్శన చక్రం కావాలన్నాడట. ఈ చక్రంఅందరికీ లొంగదు మిత్రమా అని ఎంత చెప్పినా వినకపోతే సరే తీసుకో అని ఇచ్చేసాడు.  చక్రం అత్యంత తీవ్రమైన ప్రమాదకరమైన ఆయుధం. దాని ప్రభావం ప్రతాపం బాగా దర్శిస్తే తప్ప దాన్ని ధరించడం కూడా. ఎకె 47 వంటి ప్రమాదకరమైన ఆయుధాలు వాడడం తెలియకపోతే, అది ధరించిన వారికే ప్రమాదం కలిగించడం మనకు తెలుసు. అందుకే అది సుదర్శనం బాగా తెలిసిన వారే వినియోగించాలి. ఓసారి ఎప్పుడు దానిని వినియోగించడం తెలియక తన తలనే నరుక్కున్నాడట శ్రీమాలికుడు. మరొక కథ పౌండ్రక వాసుదేవుడిది. కృష్ణుడికన్న తానే గొప్ప అనుకుంటూ తాను కూడా శంఖ చక్రాలను ధరించి కృష్ణుని వలెనే దుస్తులు వేసుకునే వాడట. కాని కృష్ణుని చక్రప్రయోగంతో అంతరిస్తాడు.

వేంకటాచలపతి చరిత్ర

శ్రీవేంకటాచలపతి చరిత్రలోని కథను కూడా జీయర్ స్వామి ఉదహరించారు. తిరుమల కొండపై పుష్కరిని పక్కన కుమారస్వామి తపస్సు చేస్తాడు. అందుకే ఆ పుష్కరిణి పేరు స్వామిపుష్కరిణి. కుమార స్వామి తపస్సు కు మెచ్చి అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు, విష్ణు మిత్రుడు పరమ శివుడు కూడా వేంచేసాడు. ఆ శివుడు తిరుమల ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకు పరవశించి తానూ అక్కడ ఉంటానని అంటాడట. ఈ కొండంతా ఆదిశేషుడు ఉంటాడు. కనుక దీనిపైన కాకుండా కొండముగిసిన ప్రాంతంలో కపిలముని తీర్థమైన కపిల తీర్థం దగ్గర నివసించాలని కోరాడట. అందుకు పరమానందంగా అంగీకరిస్తాడు పరమ శివుడు. చక్రం కావాలని శంకరుడు కూడా అనుకుంటాడట. కాని హరి చక్రాన్ని వినియోగించడం కష్టమనీ శంఖ చక్రాలు ఎవ్వరి మాట వినవనీ వారిస్తారట. అందుకే శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.

స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం, సుదర్శనం భాస్కరకోటి తుల్యం

సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే

అని కూడా వేదాంతదేశికుల వారి స్తోత్రం. సఘోషో ధార్తరాష్ట్రాణామ్ హృదయాని వ్యదారయత్  భారతయుద్ధంలో ప్రతికూలురైన ధృతరాష్ట్ర పుత్రుల గుండెలు పిండేసే ధ్వని చేస్తున్నదట,

జ్ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే పోల్వన శంగంగళ్, లోకమంతా దద్దరిల్లే విధంగా ఘోషించే పాలరంగులోఉండే నీ పాంచజన్యం వంటి శంఖాలు అని గోదమ్మవర్ణిస్తున్నారు.

ఆళ్వార్ తీర్థం

తిరుమల కొండలపై కురిసి వర్షాల పవిత్ర జలం అక్కడ జలపాతం గా కురుస్తూ ఉంటుంది ఇప్పడికీ. విష్ణు ప్రియులైన ఆళ్వారులంతా పవిత్ర సాలగ్రామ సదృశమైన తిరుమలపై కాలిడే ముందు కపిలతీర్థంలో స్నానమాడిన తరువాతే తరలుతారట. కనుక అది ఆళ్వారు తీర్థంగా భాసిస్తూ ఉన్నది.   పాంచజన్యం వంటి శంఖాలు అడుతున్నారు. అటువంటివి ఉండవు. అదే ఇవ్వాలి. పాంచజన్యం లేకుండా పరమాత్ముడు ఉండలేడు. తనకై తపస్సు చేసిన ధృవుడికి ఏం కోరుకోవాలోకూడా తెలియక, తాను ప్రత్యక్షమైనా అవాక్కయి చూస్తున్నాడే తప్ప ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు అలవోకగా తన శంఖంతో ధృవుడి నుదుటిని తాకి అంతులేని విజ్ఞానాన్ని కలిగిస్తాడు. 

విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య, యస్యధ్వనిర్దానవ దర్ఫ హంతాం,

తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే.

శ్రీకృష్ణుడు శంఖం పూరిస్తే చాలు ఆ ధ్వని దానవుల దర్పాన్ని హరిస్తుందట. వంద చంద్రులు విరిసిన వెన్నెల వంటి తెల్లనిదీ చల్లనిదీ అట. ఆ శంఖానికి శరణు అంటారు.

ప్రపంచాన్ని కలిగించి, పెంచి పోషించి, ముగించే క్రియలకు కారకుడు భగవంతునికి ఈ భయానక ఆయుధాలు అవసరమా.  విష్ణుప్రియులైన ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానునికి అలంకారాలుగా ఆభూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. ఆ ఆయుధాలన్నింటిలోనూ అగ్రస్థానం చక్రానిది. చక్రత్తాళ్వార్ అని ఆళ్వార్ స్థానం ఇచ్చారు. విష్ణువు పంచాయుధాలు నిత్యసూరి వర్గానికి చెందినవంటారు. ఈ నిత్య సూరులు సర్వకాల సర్వవస్థలయందు భగవదాజ్ఞను ఆలోచనలను అమలుపరచటానికి సంసిద్ధమై ఉంటాయని వివరిస్తూ ఉంటారు.

విష్ణుపురాణంలో శ్రీమహావిష్ణువును వర్ణిస్తూ మాధవుని మేధస్సు గదారూపంగా ఉంటుందని, పాంచజన్య శంఖం, శార్ జ్గధనువు భగవానుని జ్ఞానేంద్రియ ద్విభాగాలను సూచిస్తాయనీ. విష్ణువు ధరించిన చక్రం వాయు వేగ మనోవేగాలతో పయనించే శక్తి కలిగి ఉన్న పరాక్రమ సాధనమనీ అన్నారు. ఆచ్యుతుని ప్రకాశవంతమైన ఖడ్గం పవిత్రమైన వివేకానికి చిహ్నంమనీ  దానిని భగవానుడు వరలో నుంచి తీసి భక్తుల అజ్ఞానపు తెరలను చీల్చటానికి ఉపయోగిస్తుంటాడనీ అన్నమయ్య పాపాలను ఖండించే ఖడ్గపు అంశ అనీ వివేకమే అజ్ఞానాన్ని ఖండించే ఖడ్గమనీ. విష్ణువు ధరించే వైజయంతి అనే అమూల్యమణిఖచిత  కంఠహారభూషణం.  ముత్యం, పగడం, పచ్చ, నీలం, వజ్రం అనే ఆ మాలికలోనిమణులు ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు అనే మూలకాలని తెలియజేస్తాయి. పంచాయుధాలను భగవానుడు భక్త సంరక్షణార్థం ఉపయోగిస్తుంటాడు.  ఈ పంచాయుధాలు భగవానునికి సౌందర్యాన్ని కూర్చుతాయని వేదాంతదేశికులవారు సెలవిచ్చారు. ఈ పంచాయుధాలు కూడా వైజయంతిలోని మణులవలె తత్త్వాన్ని తెలియచేసే చిహ్నాలని చెప్పారు. చక్రం మనస్తత్వాత్మకం,  శార్ జ్గం సాత్విక తామస రాజస గుణాలకు  సంబంధించిన అహంకార తత్త్వాత్మకం, కౌమోదకీ బుద్ధితత్త్వాత్మకం, నందకం జ్ఞానతత్త్వాత్మకం, అని విజ్ఞులు వివరించారు.

విష్ణు సహస్ర నామాలలో ఆయుధ విశేషణ నామాలున్నాయి. 993 నుంచి 998వ నామం దాకా విశిష్టాద్వైతభాష్యానుసారం ఉన్నాయి. 993వ నామం శంఖభృత్, అంటే శంఖాన్ని ధరించినవాడు. పాంచజన్యం అనే ఈ శంఖం అహంకార తత్త్వాన్ని తెలియజేస్తుంది. తామసం కూడా అహంకారమే. ఇది పంచభూతాల పుట్టువునకు తావు కనుక పాంచజన్య. 994వ నామం నందకీ అనే ఖడ్గాన్ని ధరించినవాడు కనుక నందకి. 995వ నామం చక్రి అంటే చక్రం ధరించినవాడు. 996వ నామ శర్ జ్గధన్వ. శార్ జ్గము అనే ధనువుకలవాడు. 998వ నామ రథాంగపాణి. రథాంగాన్ని అంటే రథ చక్రాన్ని శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో భీష్ముడికోసం ఎత్తుకుంటాడు. రథచక్రాన్ని చేతబట్టిన వాడు రథాంగపాణి, భారత యుద్ధంలో ఎలాంటి ఆయుధాన్ని ధరించనన్న శ్రీకృష్ణుడు యుద్ధం 9వ రోజున రథచక్రానని చేతిలోకి తీసుకుని అర్జునుణ్ణి ప్రేరేపించి ఉత్తేజితుడిని చేసేందుకు భీష్మసంహారం చేస్తానంటాడు. నన్ను చంపుతానని రథచక్రాన్ని ఎత్తిన కృష్ణుడే నాకు దిక్కు అని భీష్ముడు రథం దిగి మోకాళ్ల మీద కూర్చుని తనను సంహరించమని వేడుకుంటాడు. భయపడవలసిన దశలో భక్తి చూపిన మహానుభావుడు భీష్ముడు.  ఆ దృశ్యం అంపశయ్యపై ఉన్న అంతిమ ఘడియల్లో కూడా మెదలడంచేత భీష్ముడు ఆ నామాన్ని విష్ణు సహస్రంలో చేర్చాడని పెద్దలు సమర్థించారు.  విష్ణుసహస్రనామాలలో “సర్వప్రహరణాయుధ” అనే మరో నామం ఉంది. ‘సర్వేషాం ప్రహరణాని ఆయుధాని యస్యసః సర్వ ప్రహరణాయుధ:” అంటే తననే రక్షకంగా ఆశ్రయించినవారికి సకల అనిష్టాలను సమూలంగా తొలగించే అనంతాలై, అపార సామర్థ్యంకలవై, తనకు తగినవై, ‘అనేక ఆభరణాలా? ఇవి?” అని సందేహించినట్లు, సదా సర్వత్ర సర్వప్రకారములచేత, అశ్రయించిన వారలను రక్షించటం అనే దీర్ఘ సత్రయాగాన దీక్షితాలై, సర్వైశ్వర్య భారాలను వహించి ఉండే దివ్యాయుధాలు కలవాడని నాగవరపు రవీంద్ర తన సంప్రదాయం వెబ్ సైట్ లో వివరించారు.

“రామానుజనూట్రందాది” అనే ద్రవిడప్రబంధం లోని 33వ పాశురంలో మహావిష్ణువు పంచాయుధాలు ప్రపంచాన్ని రక్షించేదుకు శ్రీరామానుజులుగా అవతరించాయని దాని కర్త తిరువరంగత్తముదనార్ గారు చెప్పారు.  స్వామిదేశికుల  వారు కూడా “యతిరాజసప్తతి” లో ప్రభువైన విష్ణువు యొక్క పంచాయుధాలే రామానుజులుగా అవతరించాయన్నారు.

ఇంతకూ గోపికలు పాంచజన్యం ఎందుకడిగారు? అంత ప్రియమైన పాంచజన్మం ఇచ్చేస్తే దాన్ని వదిలి ఉండలేక పరమత్ముడూ తమతో ఉంటాడని వారి వ్యూహం. శాలపెరుమ్బత్తియే చాలా పెద్ద మద్దెల కూడా శంఖానికి తోడు కావాలన్నారు. పల్లాండు శెప్పార్ కోల విళక్కే కొడియే వితానమే… మార్గళి స్నానానికి వెళ్తున్నప్పుడు పల్లాండుచెప్పేవారు (మంగళం పాడే వారు), చీకటి లో నడుస్తారు కనుక మంగళ దీపం, చలిలో మంచు పడకుండా తలమీద ఆచ్ఛాదన వస్త్రం కావాలని అడిగారు. ఇవన్నీ ఇంతమందికి నేనివ్వగలనా నాదగ్గర ఉన్నాయా అని పరమాత్మ అన్నారట. లోకాలన్నీ కడుపులో దాచుకుని ఏ ఆధారమూ లేకుండా చిన్న మఱ్ఱి ఆకు మీద పవళించి ఈ ప్రపంచాన్నంటినీ ఉద్ధరించిన నీకు ఆలినిలైయాయ్ అసాధ్యం ఏదైనా ఉందా? అని గోపికలు అన్నారు.

ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడట, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం ఏదంటే తాను వెన్న తినే సమయంలో చేసే ఘట నృత్యంతోపాటు వాయించే వాయిద్యాన్ని ఇచ్చాడు.  పల్లాండు అనే మంగళం పాడే సమయానికి, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు.

ఆరని దీపం అడిగారు కదా అందుకని అమ్మనే వీళ్ళతో పంపాడు. అంతటా తానుండలేక భగవంతుడు అమ్మను పంపాడని అంటారు. ఆ అమ్మే ఆరని దీపం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః అని శ్రీరంగంలో శ్రీరంగనాయకిని వర్ణిస్తారు. మంగళ దీపరేఖ  ఆ అమ్మ.

తనను ఆశ్రయించే జనులమీద ఎంత వాత్సల్యం లేకపోతే వైకుంఠం వదిలి సౌలభ్య గుణాన్ని ప్రకటిస్తూ రేపల్లెలో శ్రీకృష్ణుడు వెలుస్తాడు? సర్వాధికుడైనా సర్వసులభుడాయన. ఎంతటి జ్ఞానసంపన్నులైనా కర్మను వీడకూడదు, కనుక మార్గళిస్నానం వ్రతం వంటి పెద్దలు చెప్పిన శిష్టాచారాన్ని పాటించాలి. శంఖం కోరడమంటే ప్రణవధ్వని చేసే శంఖం ద్వారాప్రణవార్థమైన అకార త్రయ జ్ఞానాన్ని, పఱై అడిగి పరతంత్ర జ్ఞానాన్ని , పల్లాండు శైప్పారే అంటే సజ్జనసాంగత్యం, కోలవిళక్కే అంటే జ్ఞానమనే ఆరని దీపం, కొడియే వితానమే అంటే స్వభోక్తృత్వ దోషము లేని నీ కైంకర్యాన్ని అనుగ్రహించమని గోపికలు కోరుతున్నారు.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః

అన్న చరమశ్లోకంలో శ్రీకృష్ణుడు మామ్ అనడం ద్వారా సౌలభ్య లక్షణాన్ని గోదాదేవి ఈ పాశురంలో ప్రతిపాదించారు. అహమ్ అన్న మాటను, ఆలినిలైయాయ్ పదం ద్వారా పరమాత్ముడి సర్వశక్తి సంపదను వివరించారనీ ఈ పాశురం చరమశ్లోకవైభవాన్ని వివరిస్తున్నదనీ జీయర్ స్వామి ప్రవచించారు.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అన్న భగవద్గీతా శ్లోకమే చరమ శ్లోకం. అదే అంతిమం, దాన్ని మించింది లేదు.

నీరాట్టం మార్గళి నీరాడువాన్ మార్గళి స్నానం అంటే శ్రీకృష్ణసంశ్లేషమని, శ్రీకృష్ణునితో కలిసి ఉండడమే తమకు కావలసిందని చెబుతున్నారు. తమకు స్వామివారి మీద ఉన్నప్రేమ ఆవుపాదమంత చిన్నదైతే, స్వామికి తమపై ప్రేమ సముద్రమని గోపికలకు అర్థమవుతుంది.  మణి వణ్ణా అంటే ఇంద్రనీలమణి. తిరుమలలోనిలిచిన వేంకటేశ్వరుడు ఇంద్రనీలమణి. ఆ మణి ఉన్నవాడే సంపన్నుడు అంటున్నారు గోదమ్మ.  ఇక్కడ స్నానమంటే క్రిష్ణయ్య గుణగానం చేయడమే. శంఖం అంటే ప్రణవం. ప్రణవం భగవచ్ఛేషత్వమును బోధిస్తుందని కందాడై రామానుజాచార్యులు వివరించారు. గోపికలు ప్రణవ శబ్ద కైంకర్యం అడుగుతున్నారు. చాలా పెద్ద పఱ కావాలట.  ఆ పఱ అష్టాక్షరిలో ‘నమః’. పురుషార్థములో దోషమును పోగొట్టే పదం నమః.  అనన్యార్హ శేషత్వ జ్ఞానమును, పారతంత్ర్య జ్ఞానము, భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము భగవత్ కైంకర్యము, కైంకర్యమున భోక్తృత్వ బుద్ధి నివృత్తి కావాలని గోపికలు క్రిష్ణయ్యను అడుగుతున్నారని గోదాదేవి మనకు తెలియజేస్తున్నారు ఈ పాశురంలో.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles