Thursday, November 7, 2024

జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….

  • గోదా గోవింద గీతం మంగళాశాసనప్పాట్టు

నేపథ్యం
గోపికలు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు శయనాగారం నుంచి సింహం వలె, ఒక్కోసారి గజరాజు వలె గంభీరంగా నడిచి వచ్చి సింహాసనమ్మీద కూర్చున్నాడు. నీళాదేవి ద్వారము వరకు వచ్చి మంగళాశాసనం చేసి, ఆ తరువాత ఆయన తోపాటు సింహాననం మీద కూర్చున్నారు. ఒకపాదము పాదపీఠిపైనుంచి మరొకటి తొడమీద పెట్టుకున్నప్పుడు స్వామి పాదం ఎర్రగా కందినట్టు కనిపించిందట. అయ్యో స్వామిని ఎంత శ్రమ పెట్టాము?

భక్తులకోసం ఆయన తన శ్రమను లెక్క చేయడట. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు చెప్పగానే ఉభయ సైన్యముల మధ్య రధాన్ని నిలిపిన సారథి వలె భక్తుల ఆజ్ఞ శిరసావహించి భగవంతుడు శ్రమపడుతున్నాడు. నిజానికి వ్రతఫలం అడుగుదామని గోపికలు వచ్చారు. కాని వచ్చిన పని మరిచి గోపికలు, గోదాదేవి పరమాత్ముడి పాదాలకు రక్ష కట్టి మంగళం పాడుతున్నారు ఈ పాశురంలో. జగద్రక్షకుడిని  తాము రక్షకట్టి కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇది ప్రేమ తప్ప మరొకటి కాదు.  సింహాననప్పాట్టు తరువాత మంగళాశాసనప్పాట్టు ఈ 24 వ పాశురం. అద్భుతమైన మంగళ హారతి ఈ గోదా గీత గోవిందమ్. తిరుప్పావై 30 పాశురాల పారవశ్యంలో కి ఇది పతాక సన్నివేశం. జ్ఞానదశనుంచి ప్రేమదశకు చేర్చే సన్నివేశం.

పెళ్లికొడుక్కు, వధువుకు, వటుడికి, పుట్టిన రోజు జరుపుకున్న పిల్లలకు, కొత్త దుస్తులు వేసుకున్న వారికి అమ్మమ్మ దిష్టి తీయడం మనకు తెలుసు. చెడుచూపుల ప్రభావాలను తొలగించడానికి చూపుదోషాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. భగవంతుడి అర్చామూర్తికి ఉత్సవాలలోనూ మూలవిరాట్టుకు నిర్ణీత సందర్భాలలోనూ మంగళాశాసనం చేస్తారు హారతులిస్తారు. కీర్తనలలో మంగళ హారతి కీర్తనలు ఉంటాయి. ముఖ్యంగా ఆడపడచులు ముత్తైదువలు హారతి పాటలు పాడుతూ ఉంటారు. అందులోనూ హరికీర్తనే ఉంటుంది. అసలు ద్వయమంత్రానుసంధానమే దిష్టి తీయడమంటే అని కూడా పెద్దలు చెబుతారు.

అయితే భగవంతుడై అద్భుత కార్యాలను సాధించి మోహనరూపుడూ మనోహరుడూ అయినప్పుడు హారతులు ఇవ్వడం, మంగళం పాడడం ఎవరి బాధ్యత? ఆచార్యులు, అర్చకులు, ఆళ్వారులు ఆ పని చేస్తుంటారు. ఆళ్వారులు మంగళం పాడిన సన్నిధానాలను దివ్యదేశాలని పిలుస్తారు. భారత్ నేపాల్ లో కలిసి మొత్తం శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిని తమిళంలో పాడర్ స్థలం అంటే ఆళ్వారులు మంగళం పాడిన స్థలాలు అని అర్థం.

గోదాదేవి గోపికలతో కలిసి తిరుప్పావు లో మంగళం పాడే బాధ్యతను స్వీకరించిన ఆళ్వారులలోకి వస్తారు. యశోద, దేవకీదేవి, కౌసల్య, అదితి తదితర తల్లుల బాధ్యతను గోదాదేవి స్వీకరించారు. ఎప్పుడెప్పుడో పాడవలసిన మంగళ హారతులు ఎవరూ పాడలేదే అనే ఆవేదనతో, ఆర్తితో భక్తితో పరమాత్ముడి పాదాలకు పదపదాన మంగళ కరమైన పదాలతో మంగళం పాడుతున్నారు గోదాదేవి ఈ పాశురంలో.

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోర్ట్రి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోర్ట్రి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోర్ట్రి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోర్ట్రి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోర్ట్రి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోర్ట్రి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

ప్రతిపదానికి అద్భుతమయిన అర్థం

అన్ఱు=ఆనాడు, ఇవ్వులగం=ఈ లోకమును, అళన్దాయ్! =కొలిచితివే! అడి =ఆ నీ శ్రీపాదమునకు, పోర్ట్రి =మంగళము, శెన్ఱు=వెళ్ళి, అంగు=అక్కడ, తెన్=అందమైన దక్షిణదిశయందున్న, ఇలంగై=ఆ లంకానగరమును, శెత్తాయ్!=నశింపచేసితివి, తిఱల్=ఆ బలమునకు, పోర్ట్రి, పొన్ఱ=కపట వేషము దాల్చిన, శకటం=శకటాసురుని ఉతైత్తాయ్ =తన్నితివి, పుకழ= ఆ నీ కీర్తికి, పోర్ట్రి, కన్ఱు= దూడవేషం దాల్చిన వత్సాసురుని, కుణిలా = గోటీబిళ్ళవలె, ఎరిన్దాయ్ = విసరివేసితివి, కழల్ = నీ పాదభంగిమకు, పోర్ట్రి, కున్ఱు = పర్వతమైన గోవర్ధనగిరిని, కుడైయా = గొడుగువలె, ఎడుత్తాయ్! = ఎత్తితివి, కుణం = ఆ నీ సహన గుణమునకు, పోర్ట్రి, వెన్ఱు = జయించి, పగై = శత్తువులను, కెడుక్కుం = నశింపచేయు, నిన్ = నీయొక్క, కైయిల్ = చేతియందలి, వేల్ = బల్లెమునకు, పోర్ట్రి, ఎన్ఱెన్ఱు = ఈ విధముగా, ఉన్ = నీ యొక్క, శేవగమే = వీర చరితలనే, ఏత్తి = స్తుతించి, పఱై కొళ్వాన్ = పఱై అను వాయిద్యవిశేషమును ఇన్ఱు = ఈ వేళ, యాం = మేము, వన్దోం= వచ్చితిమి, ఇఱంగు = దయ చూపుమా! ఏల్+ఓర్+ఎం+పావాయ్ = ఇదియే మా గొప్ప వ్రతము.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెలుగు సిరినోము పద్యం

అలనాడు లోకాల అవధి కొల్చిన చక్రి

            చరణాబ్జ యుగళికి జయము జయము:

పోయి వన్నెల లంక పొగరణగించిన

            శౌరి శౌర్యమునకు జయము జయము:

కూలగా శకటమ్ము కాలదన్నిన యదు

            స్వామి కీర్తికి సదా జయము జయము:

విసరి వత్సమును కపిత్థాసురుని కూల్చు

            చారు హస్తమునకు జయము జయము:

గిరిని గొడుగుచేయు హరి కృపకు జయము

            గెలిచి పగ లడంచు కేల నొప్పు

చక్రాయుధమునకు జయ: మంచు కీర్తింతు

            మిమ్ము ‘ఢక్కి’ మము పాలింపు వరద

తాత్పర్యం:

తమ కోరికపైన శయనాగారం నుంచి సభాభవనంలోకి నడిచి వచ్చిన శ్రీకృష్ణుడి పాదాలకు శ్రమ ఇచ్చామే అని గోపికలు నొచ్చుకున్నారు.  పరమాత్ముడు భక్తులకోసం కష్టాలు పడిన సందర్బాలలోఎవరూ మంగళం పాడలేదని, దృష్టి తీయలేదని గోపికలు అనుకుంటున్నారు. ఆ లోపం తీర్చాలని భావిస్తున్నారు

లక్ష్మీదేవి సుతి మెత్తగా పాదాలు ఒత్తినందుకే కందిన శ్రీహరి పాదాలు ఆనాడు వామనుడై ఆకాశ, పృథ్వీ లోకాలను రెండడుగులతో కొల్చినపుడు ఎత్తు పల్లాలు తాకి ఎంత కందిపోయాయో, క్రూరులైన రాక్షసులు, మృగాలతో నిండిన అడవులలో నడిచిన రామా నీ పాదాలు ఎంత బాధలు పడ్డాయో. పుట్టిన ఏడో రోజునే శకటాసురుడిని తన్నినప్పుడు క్రిష్ణయ్య పాదాలు ఎంత నొచ్చుకున్నాయో. వృత్రాసురుని రెండు చేతులతో ఎత్తి వెలగపండు రూపంలో చెట్టుకు వేలాడుతున్న మరో రాక్షసుడిమీదకు విసరడానికి నేలపైన కాళ్లు గట్టిగా నిలబెట్టినపుడు కన్నయ్య కాళ్లకెంత శ్రమ కలిగిందో,  వారంరోజుల పాటు గోవర్ధన పర్వతం ఎత్తిన ఆ బాలుడి వేలు ఎంతగా వత్తిడికి గురైందో, అప్పుడు ఆ నారాయణుడి దివ్యపాదారవిందాలకు మంగళం ఎవరు పాడారు. ఏమో, పాడారో లేదో,  కనుక మేమంతా ఈ రోజు నీకిదే మంగళం పాడుతున్నాము. సముద్రమధ్యంలో దుర్భేద్యమైన కోట, దారి మధ్య బంగారు నగరాన్ని నిర్మించుకుని తనను ఎవరూ ఏమీ చేయలేరనే దురహంకారంతో సీతను ఎత్తుకు పోతే, అక్కడకి చేరి రావణుడి స్థానబలిమికి భయపడకుండా పరాక్రమించి రావణుని సంహరించడం ఎంత సాహస కార్యం? అంతపనిచేసిన శ్రీరాముడికి మంగళం పాడుతున్నారు. శత్రువులను జయించే నీ వేలాయుధానికి మంగళం అన్నారు గోపికలు. నిజానికి వారికి కావలసింది కేవలం శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించడమే. ఊళ్లో వారి కోసం పైకి వారు పఱై అనే వాయిద్య పరికరం ఢక్కాను అడుగుతున్నారు.

అంతరార్థం
భగవంతుడే మొత్తం బ్రహ్మాండాన్ని రక్షిస్తున్నాడని నమ్మిన తరువాత, ఆయనకు దృష్టి దోషం తాకడమేమిటి? ఆయనకు కష్టం కావడం ఏమిటి? తనను కాపాడమని పరమాత్ముడిని వేడుకునే వారు పరమాత్ముడినే కాపాడాలని అనుకోవడమేమిటి? ఇది జ్ఞానమా?

జ్జాన దశలో భగవంతుడి ఎంతటి వాడో ఆయన ముందు తానెంతో తెలుసుకుంటాడు జీవి. ఈ జగత్తును రక్షించే ఏకైక శక్తి అని అర్థమవుతుంది. ఏ జ్ఞానమూ లేని తనకు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లేదనీ తెలుసుకుంటాడు. జ్ఞానం పండి చివరకు భక్తిదశకు చేరుతుంది. అప్పుడు ఆయన అమేయమైన శక్తి గుర్తుకు రాదు. భగవంతుడిని తానే రక్షించాలనుకుంటాడు. పాదాలకు దెబ్బతాకినా భుజాలకు గాయమైనా భయపడతాడు. ఎక్కడినుంచి ఏ ఆపదవస్తుందో అని ఆందోళన పడతాడు. మొత్తం జగత్తుకే రక్షకుడైన వాడిని మనం జగత్తునుంచి దుష్టుల దృష్టి దోషంనుంచి రక్షించగలమని, రక్షించాలని అనుకుంటూ ఉంటే ఆ ప్రేమను చూసి ఆయన సరేలే కానీ అన్నట్టు నవ్వుకుంటూ ఉంటాడు. దృష్టి దోష నివారణకే మంగళ హారతి ఇవ్వడం. మంగళం పాడడం.

వామనుడికి మంగళం

బలిచేసిన తప్పు దేవతల రాజ్యములను అపహరించడం, ఎవ్వరికైనా తాను దానమీయగలనని అహంకరించడం. ఆ బలి అభిమానాన్ని అణచడానికే వామనుడై వచ్చాడు. ఆ వటువు సౌందర్యానికి ముగ్ధుడై అతను యాచించగానే దానం చేయడానికి సిద్ధమైనాడు. వామనుడు వెంటనే త్రివిక్రముడైనాడు. “అన్ఱివ్వులగమ్” ఆనాడు వామనుడై లోకాలను “అళందాయ్” కొలిచినాడు. లోకమంతా కాడు, మోడు, కొండ, బండ వంటి కఠినమైన వస్తువలతో నిండిఉంది. వాని పైన మోపిన నీ పాదాలు ఎంత కందిపోయాయో! శ్రీదేవి, భూదేవి కూడా ఆయన పాదాలను ఎక్కడ కందిపోతాయో నన్నంత సున్నితంగా పిసుకుతారట. కాని వామనుడి పాదాలకు ఆనాడెవరూ మంగళం పాడాలని ఒక్కరికీ తోచలేదని గమనించి “అడి” ఆ పాదాలకు “పోర్ట్రి” మంగళం అంటున్నారు. వామనుడు త్రివిక్రముడై పాదాన్ని పైకి చాచితే బ్రహ్మ ప్రక్షాళనం చేసినప్పుడు జాలువారిన శ్రీపాదతీర్థమే గంగానది. రుద్రుడు దాన్ని తలదాల్చి శివుడైనాడు. సర్వేశ్వరుడైన వామనుడు ఆ కష్టాలకు ఓర్చుకోగలిగాడు. కాని రాముడు సాధారణ మనుష్యుడు. రావణ సంహారం చేసిన తరువాత బ్రహ్మరుద్రాదులు వచ్చి నీవే దేవదేవుడి అని చెప్పినా ఆయన కాదు నేను మనుష్యుడనే అని ప్రకటిస్తాడు. వామనావతారంలో రెండు మూడడుగులే కొండలను కొలవడానికి వేసిన భగవంతుడు, రాముడిగా మొత్తం అడివంతా నడుస్తాడు. అనేకానేక యుధ్దాలుచేస్తాడు. వామనుడు తన సౌందర్యంతో బలిని వశపరుచుకుంటాడు. రావణుడిని రాముని సౌందర్యం జయంచలేకపోతే, బలానికి బలిచేయవలసి వచ్చింది.

రామునికి మంగళం
“శెన్ఱ్” వెళ్ళి, “అంగు” అక్కడ “త్తెన్-ఇలంగై”= దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని చేరి జయించడం గురించి ప్రస్తావిస్తారీ పాశురంలో. అంటే ఎక్కడో యుద్ధం కాదు. శతృవు స్థావరానికి వెళ్లి బయటకు రప్పించి పోరాడిన యోధుడు. వేటగాడు పులి ఉండే చోటికి వెళ్లి గుహనుంచి బయటకు రప్పించి చంపినట్టు, రాముడు వనదుర్గాన్ని, స్థల దుర్గాన్ని, జలదుర్గాన్ని దాటి లంకా దుర్గాన్నిముట్టడిస్తాడు. రావణుడితో భీకర యుద్ధం చేస్తాడు. రావణుడు విసిరిన శస్త్రాలన్నీ ఆయనపై పూలవలె చిరుజల్లు వలె కురిసాయట. ముందు ప్రాకారం పడగొట్టాడు. తరువాత సైన్యాన్ని చంపేశాడు. మంత్రులను, తమ్ములను ఒక్కొక్కరినే సంహరించేస్తాడు. రావణుని రప్పించి, సారథిని, అశ్వాల్ని, రథపతాకాన్ని, చివరకు రథాన్ని కూల్చాడు, చేతిలో విల్లు విరిచాడు. కిరీటం పడగొట్టాడు. నేలమీద నిరాయుధుణ్ని చేసి నిలబెడతాడు. అప్పడికైనా శరణువేడితే వదిలేద్దామనే కరుణ. కాని ఇంకా బుద్ధి రాకపోతే చంపకుండా విడిచిపెట్టి ఇంకో విల్లు తీసుకుని ‘‘రేపు రా’’ రమ్మంటాడు. అంటే చంపడానికి ముందు ఇంకొక అవకాశం ఇస్తాడు. అప్పుడైనా పశ్చాత్తాపపడతాడేమోనని. చివరకు తప్పని పరిస్థితిలో రావణుడిని సంహరిస్తాడు రాముడు. లంకను పాలించే రావణాసురున్ని “శెత్తాయ్” సంహరించిన “తిఱల్” నీ భుజ భలానికి “పోర్ట్రి” మంగళం అంటున్నారు గోపికలు. దక్షిణ దిక్కు అమంగళం అంటారు. అవేమీ లెక్క చేయకుండా అటే వెళ్లి విజయం సాధిస్తాడు రాఘవుడు. ఆ రాముడికి రక్షబెట్టబోతూ ఉంటే ఆయన తన భుజబలాన్ని చూపి అభయం చెప్పాడట. అప్పుడు ఆ భుజబలానికి రక్షపెడతారు గోపికలు. లంకయే శరీరము. మనస్సనే అహంకారమే రావణాసురుడు. అతని పదితలలు ఇంద్రియాలు. సర్వేశ్వరుడు అంతర్యామియై మనయందు చేరి అహంకారం ఉండే చోటికి వెళ్లి మనస్సును విషయాలను అనుభవించకుండా ధ్వంసం చేసి దానిని పాలించే రాజసగుణాన్ని చంపి సాత్వికతను నెలకొల్పి వెళ్తాడు.

రాముడు పరాక్రమవంతుడనీ తెలుసు, ఆయనే యాగాన్ని రక్షించగలడనీ తెలుసు. తానే ఆయనకు బల అతి బల అనే మంత్రాలు అనేక శస్త్రాలు ఇచ్చినాడు. అయినా విశ్వామిత్రుడు తాటకతో యుద్ధం చేస్తున్న రాముని చూచి ‘‘స్వస్తి రాఘవయోరస్తు’’ అని రక్షకట్టి మంగళం కలగాలని కోరుకున్నాడు. సీతమ్మను రామయ్యకు సమర్పించు ఘడియలో ఒకరి చేయి మరొకరు పట్టుకున్నపుడు లోకోత్తర సౌందర్య రాశులైన వారిద్దరి కలయికకు దృష్టి దోషము తగలకుండా ‘‘భద్రంతే’’= నీకు భద్రమని జనకుడు మంగళం పాడినాడట.‘‘ఇయం సీతా మమసుతా సహధర్మచరీతవ, ప్రతీచ్చ చైనాం భద్రంతే పాణి గృహ్ణీష్వ పాణినా’’ అన్న ఆ మంగళ శ్లోకం ప్రతివివాహంలోనూ ఈ నాటికీ వినిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని రక్షించే వాడికి వీరు రక్ష పెట్టడం ఏమిటి. మహాజ్ఞానులైన విశ్వామిత్రుడు, జనక రాజర్షులే జగద్రక్షకుడికి ఈ విధంగా తాము రక్ష కట్టి మంగళం పాడాలన్నంత ప్రేమపరవశులైతే ఇక తండ్రి దశరథుని నేమందాం? తాటక సుబాహులను చంపి, మారీచుని తరిమి కొట్టి శివధనుర్భంగం చేసిన రాముడు సీతతో అయోధ్య కు వెళ్లే మార్గంలో ఉండగా పరశురాముడెదురైనప్పుడు దశరథుడు ఏమవుతుందోనని ప్రాణాలు పోతున్నట్టు భయపడిపోయాడట. రక్షించమని సకలదేవతలను ప్రార్థనలుచేసినాడు. పరశురాముని జయించిన విషయం తెలిసి తనకుమారుడికది పునర్జన్మ అనుకుని తేరుకున్నాడట. అజ్ఞానులు ప్రేమైక జీవనులైన గోపికలు ఆ భగవానుడిని రక్షిస్తారా, ఏం చేస్తారు? జ్ఞానాన్ని ప్రేమ మరుగుపరుస్తుంది కదా.

దశరథుడు కైక మందిరంనుంచి సుమంత్రుడిని పంపి రాముడిని తీసుకుని రమ్మంటాడు. సీతాదేవి ‘‘ఆద్వార మనువవ్రాజ మంగళాన్యభిదధ్యుషీ’’ ద్వారందాకా వచ్చి రామచంద్రుడికి మంగళం పాడింది. కొంత దూరం వరకు భర్తననుసరించింది. తూర్పుదిక్కున వజ్రధరుడైన ఇంద్రుడు కాపాడాలని మిగిలిన దిక్కుల్లో దిక్పాలకులు రక్షించాలని ఆమె రక్ష పెట్టిందట. కన్న కొడుకు, అప్పుడప్పుడే వివాహం అయినవాడు, రాజ్యాభిషిక్తుడు కావలసిన తరుణంలో అంతఃపుర కుట్రలకు గురై అరణ్యాలకు వెళ్లే రాముడికి కౌసల్య మంగళం పాడింది. రాముడు జగదేకవీరుడైనా తల్లికి ఆ మహత్వం గోచరించడం సాధ్యం కాకపోవచ్చు. దండకారణ్యంలో మునులు యోగులు అందరికీ తెలుసు రాముడెవరో. కాని ఆయన దివ్యమంగళ విగ్రహం చూడగానే పరమాత్ముడి అప్రమేయమైన శక్తికి సంబంధించిన జ్ఞానం మరుగున పడి, ఆయన చుట్టూ చేరి మంగళం కలుగుగాక అని ఆశీర్వాదాలు చేసినారు. రామాయణ కాలంనాటి మంగళాశాసన ఘట్టాలను వివరిస్తూ ప్రేమ ముప్పిరిగొన్నవేళ రక్ష్య రక్షక భావం మారిపోతుందని శ్రీ భాష్యంవారు చాలా ప్రేమాస్పదంగా రామాయణ ప్రమాణాలతో వ్యాఖ్యానించారు. హనుమ మొట్ట మొదటి సారి రాముని చూచినప్పుడు, అయ్యో ఆభరణములు లేకుండా వచ్చినారే, ఆయన అవయవ సౌందర్యం ఈ విధంగా బయటపడితే చూచిన వారి కనురాపు తగులదా అని బెంగ పెట్టుకున్నారట. ఆ తరువాత ఒక్క క్షణమైనా వీడకుండా రాముని కనిపెట్టుకుని ఉన్నాడట హనుమ. అంతటి జ్ఞాన రాశికి కూడా రాముని సౌందర్యం మోహం ప్రేమ కలిగించి జ్ఞానం మరుగున పడింది.

జటాయువుకు తెలుసు, రాముడొక్కడే 14 వేల మంది రాక్షసులను ఖరదూషణాదులతో సహా అంతమొందించిన వాడని. రావణుడితో పోరాడి రెక్కలు తెగి, ప్రాణావసాన దశలో ఉన్న జటాయువు రాముడు కనిపించగానే ఆయుష్మాన్ అని మంగళాశాసనం చేసాడు. ఏడు సాల వృక్షాలను ఒకే దెబ్బతో కూల్చి, దుందుభి భారీ శరీరాన్ని బొటన వేలితో చిమ్మి, మహాబలశాలి వాలిని ఒక్కబాణంతో సంహరించిన రాముని శక్తి సుగ్రీవునికి తెలుసు. కాని రావణుని శిబిరంనుంచి విభీషణుడు రాముని శరణుకోరడానికి వచ్చినప్పుడు, ఇదేమైనా రహస్యవ్యూహమేమోనని సుగ్రీవుడు రాముని రక్షణ గురించి రంథిపడినాడట. శ్రీరాముని సర్వశక్తిమత్వమును కొంతసేపు మరిచిపోయేంత ప్రేమ సుగ్రీవునిది. ఈ విధంగా వాల్మీకి రామాయణంలో ఎన్నో సందర్భాలలో మంగళాశాసనాలే కనిపిస్తాయని శ్రీ భాష్యం వారు వివరించారు. ఇన్ని సార్లు ఇందరు మంగళం పాడినప్పడికీ రావణుడిని సంహరించిన తరువాత రాముని భుజబలానికి మంగళం ఎవరూ పాడలేదట. భరతుడికి ఇవ్వడం వల్ల పాదుకలుకూడా లేకుండా అడవుల్లో నడచి, బండరాళ్లతో తాళ్ళతో నిర్మించిన సేతువుపైన నడచిన ఆయన పాదాలు ఎంత నొచ్చాయో, ఎంత కంది పోయాయో, ఎన్ని కష్టాలు పడ్డాడో రామయ్య. రావణుని హతమార్చిన ఆనాటి రాముని బాహుబలమునకు ఈనాడు మంగళమగు గాక అంటున్నారు గోపికలు.

శ్రీకృష్ణుడికి మంగళం
దేవకీదేవి గర్భంలో ఉన్నది జగత్ కారణ తత్వం అని తెలుసు. పుట్టినపుడే చతుర్భుజాలతో శంఖ చక్రాలతో ఉన్న శ్రీకృష్ణుడు పురుషోత్తముడే అని తెలిసినా, ఆ జగదేక సుందర విగ్రహాన్ని చూచి అమితమైన ప్రేమ జనించి ఈ పసికందుకు కంసుని వల్ల ఏమి కీడువస్తుందో కదా అని తల్లి దేవకీ దేవి తండ్రి వసుదేవులు రక్షకట్టాలని మంగళం కలగాలని తపన పడ్డారట. నాయనా నీ శంఖ చక్రాలను దాచుకో, చతుర్భుజాలను కనపడనీయకు. జాగ్రత్త సుమా అని ఆవేదన చెందారట. ఇక నందయశోదల ప్రేమకు అంతే లేదు. జగత్తుకే క్షేమం కూర్చే వాడికి మనం రక్షణ ఇవ్వడం ఏమిటి? ఇవ్వగలమా. అది ప్రేమ అని జీయర్ స్వామి వర్ణించారు. రామావతారంలో యవ్వనం వచ్చేదాకా తండ్రితోపాటు భద్రంగా ఉన్నరాముడు ఆ తరువాత మారీచ సుబాహులు తాటకను ఎదుర్కొంటాడు. కాని శ్రీకృష్ణుడికి పుట్టగానే శత్రువులు. పుట్టిందే శత్రువు జైల్లో. రాముడు ప్రత్యక్షంగా రాక్షసులను ఎదుర్కొంటే శ్రీకృష్ణుడు మాయారూపంలో వచ్చిన అనేక మంది రాక్షసులను చిన్నప్పుడే చంపవలసి వచ్చింది.

పుట్టిన 21 వ రోజుననే పూతనను సంహరించి, చిన్నవయసులోనే అనేక వీరకృత్యాలు చేసిన తన బిడ్డడు మహా మహిమాన్వితుడని తెలియదు. కనుక రక్ష కడుతూనే ఉందాతల్లి. యమునాతీరానికి వెళ్లి అక్కడ ఒక బండి కింద ఊయెల కట్టి చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టి యశోద నీళ్లు తేవడానికి యమునకు వెళ్లిందట. పిల్లవాడు ఆకలికి ఏడుస్తూ కాళ్లను పైకి తంతున్నాడు. ఎవ్వరూ కాపలా లేని సమయం చూసి అసురుడు ఆ బండినే ఆవహించి చంపాలనుకున్నాడు. ఎంత ఆపద? ఏడుస్తూ తన్నిన ఆ పాదమే తాకి బండి ముక్కచెక్కలైంది. రాక్షసుడు చనిపోయాడు. తల్లి వచ్చి ఊయేల పగిలిపోయిందనుకుని బాలకృష్ణుడిని ముద్దాడిందట. అది త్రివిక్రముడి పాదం కాదు. బలీయుడైన శ్రీరాముడి పాదమూ కాదు.ఏడునెలల బాలుడి పాదం. ఆ పాదానికి కీర్తి ఎక్కువట. విల్లు పట్టుకున్న శ్రీరాముని చేయివలె బాలకృష్ణుని పాదం కాయకాసిందట. కనుక గోపికలు మంగళం పాడాలనుకున్నారు. “పొన్ఱ” తారుమారు అయ్యేలా “చ్చకడం” శకటాసురున్ని “ఉదైత్తాయ్” తన్ని అంతమొందించినావు. ఏడు నెలల బాలుడివి, “పుగర్” నీ కీర్తికి “పోర్ట్రి” మంగళం. పుణ్యపాప రూపములైన కర్మల వల్లనే జన్మ సిద్ధిస్తుంది. కర్మను శకటంతో పోల్చుతారు. శ అంటే సుఖము, కట అంటే పోగొట్టేది. భగవంతునితో సంబంధం వల్ల కలిగే సుఖాన్ని పొందకుండా అడ్డుకొనేది కర్మఅనే శకటం, భగవంతుని పాదం తగిలిన నాడు శకటం (కర్మ) విరిగిపడిపోతుంది. ఆ శకటాన్ని ధ్వంసం చేసిన నారాయణుని చరణాలకు మంగళం.

“కన్ఱు” దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని “కుణిలా” కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపిత్థాసురునిపై “వెఱిందాయ్” ఒడిసెల రాయిలా గిరగిరా తిప్పి విసిరిపడేసిన “కరిల్” నీ పాదానికి “పోత్తి” మంగళం. రుచి వత్సాసురుడు, వాసన కపిత్థాసురుడు. ఈ రెండూ ముగిసిపోతేనే భగవద్విషయం అర్థమవుతుంది. ఏడేళ్ల వయసులో ఒక కాలు ముందుకు పెట్టి, రెండో కాలును కాస్త మడిచి దృఢంగా నిలబడి, వత్సాసురుని విసరడానికి వీలుగా నిలిచిన ఆ భంగిమలో ఉన్న నీపాదాలకు ఎవరు మంగళం పాడారు? మేం ఇప్పుడు మంగళం పాడతాం అన్నారు.
“కున్ఱు” పర్వతాన్ని “కుడైయా” గొడుగులా “వెడుత్తాయ్” ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ “కుణమ్” సౌశీల్య గుణానికి “పోర్ట్రి” మంగళం. నాది నేను అనే ఆసక్తి ఇంద్రుడికి కలిగిందట. ఇక్కడ ఇంద్రుడు శ్రీకృష్ణుడికి శత్రువు కాదు. ఆశ్రితుడే. యజ్ఞఫలములను భుజించే అధికారాన్ని ఇంద్రునికి ఇచ్చినాడు. కాని హరి సర్వేశ్వరత్వమును సర్వాంతర్యామిత్వమును మరిచి గోపాలకులు చేసే వర్షయాగము తనకోసం అంటే నాది నేను అనుకున్నాడు. తానే హవిర్భోక్తను తానే ఫలప్రదాతనని అహంకరించినాడు. ఆ అహంకారాన్ని తగ్గించడానికి గోపాలురచేత గోవర్థనమునే ఆరాధింపచేసినాడు. హవిస్సు అందక ఆకలిగొన్న ఇంద్రుడు ఆకలి కోపంతో ఊగిపోయి రాళ్లవానతో హింసించడం మొదలు పెట్టాడు. అలిగిన పసివాడు ఆకలికి రాళ్లువేస్తున్నాడు. చేయి నొప్పిలేస్తే అతనే ఊరుకుంటాడు అనుకున్నాడు. రాళ్లవాననుంచి గోపాలకులను కొండగొడుగుగా నెత్తి రక్షిస్తాడు. విసిరే రాళ్లు కొండరాళ్లతో కలిసిపోయినాయి. యాగము అంటే ఇంద్రుని ద్వారా అంతర్యామి అయిన పరమాత్మకు చెందవలసిన ఫలమే కాని ఇంద్రునికి కాదు. ఇంద్రుడుతన తప్పు తనే తెలుసుకునేట్టు చేసి ఆ తరువాత అతన్నీ రక్షిస్తాడు. అయ్యో ఒక్కడు చిటికెన వేలుమీద కొండను ఎత్తి పట్టుకున్నాడు, జారిపడుతుందో ఏమో అని గోపాలురు తమ కర్రలతో ఊతం వలె పట్టుకుంటారట. అదీ వారి ప్రేమ.
ఈ అద్భుత కార్యాలన్నీ చేసినాయని కీర్తిస్తే అందువల్ల ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు, ఆయన చేతిలో ‘‘వేల్’’ =బల్లెం కనుక దానికి మంగళం అంటారు. “వెన్ఱు” గెలిచి “పకై కెడుక్కుమ్” విరోదభావం లేకుండా చేసే “నిన్ కైయిల్” నీ హస్తంలో ఉన్న “వేల్” శూలాయుదానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం “కూర్వేల్” ఇదేకదా, ఆ శూలానికి “పోత్తి” మంగళం. ఏ ఆయుధాలులేకుండా ఉంటేనే దృష్టి దోషం తగులుతుందనుకుంటే శ్రీకృష్ణుడు ఒక ఆయుధం కూడా పట్టుకుని ఉన్నాడు. కనుక దానికీ మంగళం పాడాల్సిందే అనుకున్నారు గోపికలు.

రామాయణ భాగవతాల్లో వర్షించిన ప్రేమను శ్రీభాష్యం వారు తమ మధురాక్షరాలలో మనపై చిలికించారు.
విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. రాజు పరవశుడై ఏనుగు అంబారీ పై ఆయనను కూర్చోబెట్టి ఊరేగిస్తుంటే తన ప్రియభక్తునికి జరుగుతున్న సన్మాన వైభవం చూడడానికి భగవంతుడే స్వయంగా ఆకాశంలో నిలబడినాడట. పరమాత్ముడిని గమనించి ఆయన మహా సౌందర్యరూపం అందరికీ కనపడితే దృష్టి దోషం తగులుతుందేమోనని ప్రేమతో పల్లాండు పల్లాండు అని మంగళం పాడతారు విష్ణుచిత్తులవారు. పల్-ఆండు అంటే అనేక సంవత్సరాలు, మళ్లీ పల్ –ఆండు అంటే అనేకానేక సంవత్సరాలు,  పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం అంటూ ఉంటే పరమాత్ముడు నాకేం భయంలేదు శంఖ చక్రాలున్నాయి కదా అని ఆళ్వారు భయంబాపడానికి చెబితే శంఖానికి, చక్రానికి కూడా మంగళం కలగాలని ప్రార్థిస్తారు. పక్కన అమ్మకి మంగళం అంటూ పాడతారు. అదే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అనే కీర్తన. తండ్రి వలెనే గోదాదేవి కూడా స్వామికి ఈ పాశురంలో రక్ష కడుతూ మంగళం పాడడం విశేషం.

ధనుర్దాసు అంతులేని ప్రేమ

ఇక ధనుర్దాసు ప్రేమకైతే అంతే లేదు. అతను మహాభక్తుడు. శ్రీరంగంలో రంగనాథుడు వైభవంగా ఊరేగుతూ ఉంటే, ఆ వైభవాన్ని చూసి ఆయనకు ఏ ప్రమాదం  తెస్తారో అని భయపడి, ఆ స్వామికేమైనా జరిగితే ఒక్క క్షణంకూడా తాను జీవించకూడదని,  ఏదైనా జరిగిన వెంటనే ప్రాణం తీసుకోవడానికి వీలుగా పిడిబాకు గుండె మీద సిద్ధంగా పెట్టుకుని ఊరేగింపులో అటూ ఇటూ చూస్తుంటాడట. ఇంతకన్న పిచ్చి ప్రేమను ఊహించడం ఎవరికి సాధ్యం?. శ్రీకృష్ణుడంటే విపరీతమైన ప్రేమాతిశయం ఉన్న గోపికలు అందుకే తమ రక్ష ద్వారా మంగళాశాసన శుభాకాంక్షల ద్వారా జగద్రక్షకుడిని రక్షిస్తున్నారు. ఆ ప్రేమాక్షరాలే ఈ పాశురం నిండా.

“ఎన్ఱెన్ఱ్” ఎల్లప్పుడు “ఉమ్ శేవకమే” నీ వీర చరితమునే “యేత్తి” కీర్తించేలా “ప్పఱై” ఆ వాయిద్యాన్ని “కొళ్వాన్” తీసుకుంటాం. “ఇన్ఱు” ఈ రోజు “యాం” మేం ఎందుకు “వందోం” వచ్చామో “ఇరంగ్” తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

  1. భక్తి అంటేనే ఎనలేని మాధుర్యం. ఆ మాధురీ పారవశ్యం ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లున్న రచన. అనేక వైష్ణవ పరిభాషలను అరటి పండొలచి అందిస్తున్నట్లున్న రచన. ఆచార్యులవారికి ధన్యవాదపూర్వకమైన నమస్సులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles