Sunday, December 22, 2024

శంఖం ప్రణవం, చక్రం సుదర్శనం, దారి విష్ణువు

  • గోదాగోవింద గీతమ్ – ‌14

నేపథ్యం

తొమ్మిదో గోపికను, తిరుప్పాణియాళ్వార్ ను మేలుకొలిపే పాశురం ఇది.  ఇందులో మాట నేర్పరితనం, ప్రమాణాలద్వారా జ్ఞానం సంపాదించడం ప్రస్తావనకు వస్తాయి. శ్రీమన్నాథమునయే నమః అని ఆచార్యుని ప్రార్థించే పాశురం. ఇంద్రియాలతో చూడలేము, కార్యకారణ జ్ఞానంతో గమనించే సమర్థత లేదు. ఆర్యులు చెప్పిన శృతి ప్రకారం ప్రమాణం వేదమే. నిన్నటి భాగవతోత్తమురాలు జ్ఞాని.

ఉజ్ఞళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెజ్ఞల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తజ్ఞళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎజ్ఞళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శజ్ఞొడు చక్కరం ఏందుం తడక్కైయం
పజ్ఞయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

ప్రతిపదార్థం

ఉజ్ఞళ్ = మీ యొక్క, పురైక్కడై త్తోట్టత్తు = పెరటితోటలో, వావియుళ్ =కొలనులో,
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ = ఎర్రతామరలు వికసించి, ఆమ్బల్ వాయ్ కుమ్బిన =నల్లకలువలు ముకుళించుకుని ఉన్నాయి. కాణ్= చూడు, శెజ్ఞల్పొడి క్కూరై = కాషాయవస్త్రాలు ధరించిన వారు, వెణ్బల్ =తెల్లని పలువరస గల వారు, తవత్తవర్ =తపసులు, తజ్ఞళ్ తిరుక్కోయిల్ = తమ దైవ సన్నిధిలో, శంగిడువాన్ =శంఖం మోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు. ఎజ్ఞళై =మమ్మల్ని, మున్నం ఎరుప్పువాన్ = ముందుగానే వచ్చిలేపుతానని, వాయ్ పేశుమ్= నోటితో చెప్పిన, నజ్ఞాయ్! =ఓ పరిపూర్ణురాలా, ఎరుందిరాయ్ = లేచిరమ్ము, నాణాదాయ్! =సిగ్గులేనిదానా, నావుడైయాయ్= తీయని మాటలు గుప్పించే నాలుకగలదానా, శజ్ఞొడు చక్కరం = శంఖ చక్రాలను ఏందుం = ధరించిన, తడక్కైయం = దీర్ఘబాహువులు గలవాడునూ, పజ్ఞయ క్కణ్ణానై = ఎర్రతామరలను పోలిన కన్నులు గలవాడు అయిన సర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ఈ పాశురాన్ని తెలుగులోకి అనువదించిన సిరినోము పద్యం ఇది.

పెరటిలో పూదోట దరి కల్వ డిగ్గియ

వికసింప చెందమ్మి విరులు చెలువ:

ముకుళించినవి చిత్రముగ నల్ల కలువలు

కాని వల్కలములు కట్టుకున్నా

ధవళ దంతులు తపస్వి వరులు బీగాల

తరలిరి కోవెల తెరచు కొరకు

‘ముందుగా నన్నె లేపు’ డను భక్తాగ్రణీ:

‘లేవలే’దని సిగ్గు లేక మమ్మె

ఎగ్గులాడెడిజాణ: ఇకనైన మేల్కోవె:

శంఖ చక్ర విభాసి చారు హస్తు

జలజాక్షు పాడగా చనుచున్న చెలులనుః

కలిసికోవె వచ్చి గడుసు పిల్ల:

అర్థం: పరిపూర్ణురాలవైన నీవు మన చెలికత్తెలందరినీ ముందుగానే లేపుతానని తీయని మాటలుచెప్పి, ఈ విధంగా పొద్దుపోయిన పడుకోవడానికి సిగ్గుగా లేదూ.  మీ ఇంటి పెరటిలోని తోటబావిలో ఒకసారి చూడు ఎర్రతామరలు విరిసినవి. నల్లకలువలు ముకుళించినవి. ఎర్రని జేగురు రాళ్లపొడితో రంగు అద్దిన కాషాయవస్త్రములను ధరించి,  తెల్లి పలు వరుసలు గల సన్యాసులు తమ దేవాలయములకు కుంచెకోల పట్టుకుని ఆరాధనకై వెళ్తున్నారు. ఇంక నిద్ర చాలు. మాకొరత తీర్చుము. లే వమ్మా శంఖ చక్ర ధారి అయిన విశాల బాహువక్షస్థలమువాడైన పుండరీకాక్షుని స్తుతిద్దాం రా తల్లీ.

నిన్న నేనే ముందు లేస్తానని, చెలికత్తెలను లేపుతానని బీరాలు పలికి ముసుగు తన్ని పడుకున్న భామ ఈమె. పైగా ఇంకా తెల్లారలేదని వాదిస్తున్నది. ముడుచుకున్న కలువలు చూపినా, వికసించిన తామరలుచూపినా, అర్చకులు పట్టుపంచెలు కట్టి గుడికి పరిగెత్తుతున్నారని చెప్పినా నమ్మడం లేదు. శంఖ చక్ర శ్రీ వత్సముల మువ్వంక భంగిమలో నిలిచి వెలిగే శ్రీ కృష్ణస్వామిన చూసి పాడి తరించడానికి రావమ్మా తల్లీ అని ఆమెను లేపుతున్నారు గోపికలు గోద. వారి సంభాషణ ఈ విధంగా సాగింది.

Also Read : విష్ణు సేవలో కులభేదం లేదు

బయట ఉన్నగోపికలు: నీగుమ్మం ముందు నిలబడి ఉన్నాం మేము. నీవు ఇంకా బయలుదేరి బయటకు రావడం లేదేమి?
లోని గోపిక: తెల్లవారి పోయిందా?
బయటి గోపిక: ఎర్రతామరలు విరిసినాయి, నల్లకలువలు ముకుళించాయి కనిపించడం లేదా?
లోని గోపిక: మీరు నా భవనానికి వచ్చిన ఆనందంతో మీ కన్నులు వికసించాయి. నేను ఏమీ మాట్లాడకపోవడం వల్ల కోపంతో మీ నోళ్లు మూసుకుపోయినాయి. ఇవే మీరు వికసించిన తామరలు, ముకుళించిన నల్లకలువలు అంటున్నారు.
బయటిగోపిక:  బయట ఉన్న పూవులే కాదు లోపల తోటలో కూడా పుష్పాలు వికసిస్తున్నాయి. మరికొన్ని ముడుచుకుంటున్నాయి.
లోని గోపిక: మీరు తోటంతా తిరుగుతూ వికసించే వాటిని వికసింపజేస్తున్నారు. ముడుచుకునే వాటిని ముడుచుకునేట్లు చేస్తున్నారు. (మీముఖాలే సూర్యబింబం వంటి కాంతులతో నిండి ఉన్నాయి కనుక మీ ప్రభావానికి తామరలు వికసిస్తే కలువలు మూసుకుంటున్నాయని అర్థం)
బయటి గోపిక:  ఆ పుష్పాలు చాలా లోతైన కొలనులో ఉన్నాయి మేము దిగలేము. వాటిని మేము వికసింపచేయడం లేదా ముడుచుకునేట్టు చేయడం మాకు సాధ్యమా. అంటే అవి వాటంతట అవే జరుగుతున్నాయి.
లోని గోపిక:  మీ కళ్లు నోళ్లు ప్రతిఫలించే కాంతుల వల్ల పూల వలె కనిపిస్తున్నాయోమే అవి నిజమైన పూలు కావేమో.
బయటి గోపిక: సరే నీవే వెళ్లి చూడు.
లోని గోపిక:. పూలు వికసించినా ముకుళించినా అవి మీవల్లనే. మీరు ఘటనాఘటన సమర్థులైన భగవంతుని సంబంధీకులు కనుక మీరు చేయలేనిదేమీలేదు.
బయటి గోపిక: సూర్యరశ్మి పడకపోయినా కొన్ని పూలు కొలనులో వికసిస్తున్నాయి. కొన్ని ముడుచుకుంటున్నాయి. అచేతనములైనవే యథానుసారంగా విధులు నిర్వర్తిస్తుంటే చేతనమైన నీవు ఊరకే పడుకోవడం ధర్మం కాదు.

అంతరార్థం:

tiruppavai 14

ఈ శరీరమే ఒక తోట. నాడీమండలము చైతన్యప్రసరణమార్గము. నాడీమండలము వెన్నుపూసలో ఉంటుంది. ఇది దిగుడు బావి. తామరపూవులంటే నాడీ చక్రములు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. కలువలు ఇంద్రియములకు ప్రతీక. ఇంద్రియములు ముడుచుకున్నాయి. తోట అంటే అష్టాక్షరీ మంత్రం. మధ్యలో గల బావి నమః అనేది. తామరపూవు అంటే పారతంత్ర్యము. కలువపూవు అంటే స్వాతంత్ర్యము. జేగురు రాయి అంటే విషయముల (కోరికలు) యందు ఆసక్తి గల మనసు. విషయరాగమే ఎరుపు. పొడిచేయడమంటే భగవత్పారతంత్ర్యమును తెలియజేయడమే. భగవత్సంబంధముగల పదార్థములను కలుపడం అంటే నీటిలో కలపడం, భగవత్పారతంత్ర్యము, భగవత్ప్రీతి, విభూతి, యందు ప్రగాఢంగా మనసు గలిగి యుండుటమే కాషాయ వస్త్రధారణ. తెల్లని పలువరుస ఆహార శుద్ధిని వాక్ శుద్ధినీ సూచిస్తుంది. సన్యాసులంటే ప్రపన్నులు. తనకు కలిగిన భగవదనుభవమును దాచుకొనకుండా చెప్పడమే సిగ్గులేకుండా ఉండడం. పరిపూర్ణత సాధించి శిష్యులకు మనోరంజకంగా చెప్పడమే మాటనేర్పు. శంఖం అంటే ప్రణవం, చక్రమంటే సుదర్శనము, భగవంతుడిని చక్కగా చూపేది. కుంచెకోల అంటే ఆచార్యజ్ఞాన ముద్ర. జ్ఞాన ముద్ర అంటే చూపుడు వేలు బొటనవేలుతో చేర్చి, మూడు వేళ్లు దూరముగా ఉంచడం. బొటన వేలు భగవంతుడు. చూపుడు వేలు అంటే జీవుడు. మూడువేళ్లు అంటే గుణత్రయం. మూడుగుణాలు దూరమైతేనే జీవుడు భగవంతుడు చేరుతాడని చెప్పడమే జ్ఞాన ముద్రలోని సందేశం. శంఖ చక్ర ముద్రలను భుజాలపైన దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించదగిన వారు అని కందాడై రామానుజాచార్య వివరించారు.

Also Read : లక్ష్మణుడు యోగి, భరతుడు ముని: ఇద్దరూ రామభక్తులే

శరీరం మధ్యలో ఉండే పుండరీకం దోషరహితమైనది. అది సూక్ష్మమైనది అదే పరమాత్మ నివాసస్థానం. ఉపాసకుని అనుగ్రహించడానికి పరమాత్మ అతని హృదయంలో కొలువై ఉంటాడు. పరమాత్మను ఉపాసించడానికి దివ్యమంగళ విగ్రహముతో పాటు కళ్యాణ గుణములను కూడా ఉపాసిస్తారు. దీన్ని పూర్ణోపాసన అంటారు. తొమ్మిదో గోపికను పరిపూర్ణులారా అంటే ఈ పూర్ణోపాసన చేస్తున్న గోపికా అని అర్థం. నంగాయ్ పూర్ణురాలా అన్నారు.

యథార్థం తెలుసుకోవడానికి సాధనాలను ప్రమాణములు (proof or evidence) అంటారు. తాని ప్రమాణాని ప్రత్యక్ష అనుమాన శబ్దాఖ్యాని త్రీణి..అవి మూడు రకాలు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఇంద్రియములచేత విషయములను అనుభవించడం ద్వారా తెలుసుకోవడం ప్రత్యక్షం. కంటితో ఒక వస్తువును చూడడం, చెవితో వినడం,  ముక్కుతో వాసన చూడడం. తాకి తెలుసుకోవడం, నాలుకతో రుచి చూడడం వంటివి (direct evidence or eye witness). కార్యమును చూసి కారణాన్ని తెలుసుకోవడం అనుమానం. పొగ నిప్పుఉంటేనే వస్తుంది. పొగను చూచి నిప్పు ఉందనుకోవడం అనుమాన జ్ఞానం (circumstantial evidence or indirect evidence).  ఆప్త్డుడైన వ్యక్తి చెప్పిన మాట విని తెలుసుకోవడం శబ్ద జ్ఞానం (Shriti).  ఈ మూడింటిలో ముఖ్యమైనది  శబ్ద ప్రమాణము.  భ్రమ ప్రమాదములు లేకుండా మన మేలు కోరి చెప్పేవాడు ఆప్తుడు. అసలు భ్రమ ప్రమాదములు లేని వారు ఉంటారా? సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడి అనుగ్రహముతో జ్ఞానం పొందిన మహాపురుషులే ఆప్తులు. వారినుంచి వెలువడిన శృతి స్మృతి అనేవి శబ్దప్రమాణాలు. ఈ మూడు ప్రమాణాలతో తెల్లవారినదని తెలుసుకున్నామని అంటున్నారు గోపికలు. చార్వాకులు నాస్తికులు కేవలం ప్రత్యక్ష ప్రమాణాములను మాత్రమే అంగీకరిస్తారు. వారు అనుమాన శబ్ద (వేద) ప్రమాణాలను అంగీకరించరు. ప్రత్యక్ష అనుమానములను బౌద్ధులు అంగీకరిస్తారు. శబ్దాన్ని కాదు. రామానుజులు, గోద, గోపికలు మూడు ప్రమాణాలను అంగీకరిస్తారు.

ఆంజనేయుని భాషా చాతుర్యం

రామాయణంలో ఆంజనేయుడిని మొదటిసారి కిష్కిందలో కలిసిన సమయంలో, ఆయన మాట నేర్పరితనాన్నిశ్రీ రాముడు గుర్తించి లక్ష్మణుడికి వివరించే సన్నివేశం ఉంటుంది. ఈతడు రుగ్వేదము, యజుర్వేదము, సామవేదమే కాకుండా మొత్తం వ్యాకరణాన్ని తప్పక అధ్యయనం చేసినవాడని అనిపిస్తున్నది. లేకపోతే ఇంత ఔచిత్యంతో మాట్లాడలేడు కదా అంటాడు శ్రీరాముడు. ఆంజనేయుడి నేర్పరితనం మరొకసారి లంకలోని అశోకవనంలో వ్యక్తమవుతుంది. సీతమ్మకు మాత్రమే వినిపించేట్లు, అదీ ఆమెను అలరించే ధోరణిలో రామకథను హనుమ సంక్షిప్తంగా కావలసినంత మేరకు మాత్రమే చెప్తారు. ఆమె చెవికి ఇంపుగా ఉంటుంది. ఇతరులకు వినిపించదు. తను శ్రీరామునితో ఉన్నంత వరకు తెలిసిన కథను ముందువినిపించి, అవుననిపించుకున్నతరువాత, ఆమె అపహరింపబడిన తరువాత సంగతులను వివరించి ఆమెకు తాను మిత్రుడినని నిరూపిస్తాడు హనుమ. అందుకు పాండిత్యము, మాధుర్యము కూడా ఉండాలి. గోపికలు కూడా అదే విధమైన పాండిత్యం మాధుర్యంతో సంభాషిస్తున్నారు.

Also Read : దర్శనంతో గోపికలనూ స్పర్శనంతో గోవులనూ అలరించే మేఘవర్ణుడు

చతుర్భుజాలతో జన్మించినవాడు కృష్ణుడు

శంఖ చక్రధరుడైన శ్రీ కృష్ణుడిని గోపికలు కీర్తిస్తున్నారు. పుట్టే యపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ అని అన్నమయ్య వర్ణిస్తాడు.శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో శంఖ చక్రాలతో జన్మిస్తే ఆశ్చర్యపోయి చూసిన దేవకీ వసుదేవులు, శత్రువులు ఎక్కడ గమనిస్తారో అని ఆందోళన పడితే, వాటిని మరుగు పరుస్తాడు. అయితే ఆతరువాత యశోదకు, ప్రియమైన గోపికలకు కూడా ఆయన చతుర్భుజాలతో కనిపిస్తాడట. శంఖమంటే గోపికలకు చాలా ఇష్టం. శంఖం ఎప్పుడూ శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అధరాలను తాకుతూ ఉంటుంది. అతను ఊదే గాలితో పలుకుతూ ఉంటుంది. అదే విధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ హస్త, అధర సంస్పర్శనము కోరుకుంటూ ఉంటారట. శంఖము ప్రణవస్వరూపము. దూరంగా ఉన్నవారికి కూడా శంఖ నాదంతో తాను అక్కడ ఉన్నట్టు తెలియజేస్తాడు. ఆవుల మంద వదిలి దూరంగా పోయిన ఆవులను శంఖ నాదంతో పిలుస్తాడు. దూరమైన జీవులను దరిచేర్చేది శంఖమే. విరోధులకు గుండెలదిరేట్టు చేసి దూరం చేసేదీ శంఖమే. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్యయస్యధ్వనిర్దానవ దర్పహంతాం, తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని వేదాంత దేశికులు కీర్తిస్తారు. ఇక పరమాత్ముడిని బాగుగా దర్శనము చేయించేది  సుదర్శన చక్రం. ఆయన సంకల్పిస్తే చాలు దూరంగా వెళ్లి శత్రువులను దునుమాడి తిరిగి వస్తుంది. దూరం ఉన్న ఆప్తులను దరికి రప్పించే శంఖాన్ని, దూరాన ఉన్న శత్రువులను తరిమి కొట్టే చక్రాన్ని, ఆ శంఖ చక్రాలను ధరించిన విశాల బాహుయుగళం గల వాడిని ప్రేమిస్తున్నారు గోపికలు. దూరంనుంచే దరిజేర్చి ఉద్ధరించి, ఆలింగనం చేసుకునే దీర్ఘబాహువులు కలిగిన ఆజానుబాహుడిని, చూడగానే కన్నులతో కనికరించి ఊరట కలిగించే ప్రసన్న నేత్రుడైన పుండరీకాక్షుడిని కీర్తిస్తున్నారు.

జీయర్ స్వామి వివరణ

గోద ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని వివరిస్తున్నారు. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించే వారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోప బాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే గోద ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చుననే భావనతో ఈ గోప బాలికను నిద్రలేపుతున్నారు.

శ్రీమన్నాథ మునయేనమః

తిరుప్పాణియాళ్వార్ ను అనుసంధించడం ఈ పాశురంలో సాగుతుంది. నంగాయ్ గుణపరిపూర్తి, నాణాదాయ్ అహంకారం లేకుండా ఉండడం. పదిపాశురాలలో అన్ని వేదాలను ప్రతిపాదించిన గంభీరార్థములు వివరించిన వేదాంత దేశికులు ప్రస్తుతించారు గనుక వీరు నాలుకగలవారు కనుక నావుడయాయ్ అనీ అనవచ్చు. ఈ పాశురంలో శ్రీమన్నాథమునయేనమః అని అనుసంధానంచేసుకోవాలి. మనసులోలేని దానికి నోటితో చెప్పకూడదు. చెప్పినవాటిని చేయకుండా ఉండరాదు. జ్ఞానం అనుష్టానం రెండూ ఒకటి కావాలి. తెలుసుకోవడం ఆచరించడం సమన్వయంతో సాగాలి.

తిరుప్పాణి ఆళ్వార్

tiruppavai 14

Image of Thirupaani Alwar (Moola and Utsava) in Alwarthirunagari Temple

సాగుభూమిలో పుట్టి, రంగనాథ స్వామిలో ఐక్యం అయిన మహానుభావుడు తిరుప్పాణి ఆళ్వార్. కలియుగం 398 దుర్మతి నామసంవత్సరంలో తిరుప్పాణి యాళ్వారులు కార్తీక బహుళ రోహిణి యుక్త విదియ నాడు అయోనిజుడిగా ఒక బ్రాహ్మణుని వ్యవసాయ క్షేత్రంలో శ్రీరంగంసమీపంలోని అలగాపురి గ్రామంలో దొరికారు. శూద్రకులస్తులు ఈయనను పెంచి పెద్ద చేశారు. 50సంవత్సరాలు మాత్రమే జీవించారు. శ్రీ విష్ణు వక్షస్థలంలోని శ్రీ వత్సం అంశంతో నిచుళాపురంలో జనించిన వీరికి విష్వక్సేనులే స్వయంగా పంచసంస్కారాలను గావించారు. గొప్ప గాన కళా కోవిదులు. కైశికి రాగములో రంగని స్తుతిస్తూ పాడూతూ మైమరిచిపోయేవారు.చేతిలో ఎపుడూ వీణ ఉండేది. కోవెలలో పాటలు పాడే కులానికి చెందిన వారనీ ఫాణార్ కులం అని. అస్పృశ్యులుగా కోవెలలోనికి ప్రవేశము లేదన్నారు. కావేరీ నది దగ్గరికీ రానిచ్చేవారు కాదు. కావేరీ దారిలో, రంగని ఆలయం వైపు తిరిగి స్వామిని కీర్తించే వారు. ఓరోజు లోకసారంగ ముని అనే అర్చకుడు కావేరీనుంచి తీర్థం తీసుకువెళ్లడానికి వస్తూ దారిలో పాడుతూ మైమరిచి ఉన్న పాణుల వారిని పక్కకు తొలగమన్నారు. పరవశంలో ఉన్న పాణులకు వినిపించలేదు. ఓ రాయితీసుకుని దూరంనుంచి విసిరాడు. నుదురుకు దెబ్బతాకి రక్తం కారింది. అయినా పాణుల వారుకాస్సేపడిదాకా చలించలేదు.  తరువాత తెలుసుకుని దారినుంచి తప్పుకున్నారు. గాయమైన విషయం గమనించకుండా సారంగులు మరో మార్గంలో ఆలయం చేరుకున్నారు. అక్కడ గర్భాలయంలో రంగని నుదురు రక్తసిక్తంగా కనిపిస్తే ఎంత చికిత్స చేసినా రక్త ప్రవాహము ఆగడం లేదు. అర్చకులు తమ వల్ల ఏదో అపరాథం జరిగిందని అర్థమవుతుంది. క్షమించాలని ప్రార్థిస్తారు. భగవానుడే కలలో కనిపించి, భగవత్ భక్తికి కులము ప్రధానమే కాదు. కర్మజ్ఞాన ప్రపత్తులు ఉంటే చాలు. రేపు మీరు వెళ్లి ఆ తిరుప్పాణులవారిని భుజస్కంధముల మీద కూర్చోబెట్టుకుని తీసుకువస్తే దప్ప నీకు క్షమాపణ లేదని ఆదేశించారు రంగనాథస్వామి.  ఆ విధంగా మరునాడు సారంగుడు వెళ్లి తన భుజాలమీద ఎక్కి ఆలయానికి రమ్మంటే, తాను తక్కువ కులంవాడిననీ రానని అంటాడు. అప్పుడు కలలో రంగనాథస్వామి ఇచ్చిన ఆజ్ఞ గురించి వివరిస్తే పరవశించి రంగని తలుచుకుంటూ మూర్ఛిల్లుతారు. తేరుకుని సారంగుని భుజాలమీద ఆలయం లోనికి వచ్చి రంగనాథుని సేవించి పరవశుడై అమలనాదిప్పిరాన్ అనే ప్రబంధమును పాడతారాయన.  ఆపాద మస్తకం స్వామి సౌందర్యాన్ని వర్ణించే పది గేయాలు (పాశురాలు) ఇవి.  ఈ పది పాటలలో స్వామిని పాదాలతో (తిరువడి) మొదలై స్వామి ముఖం (తిరుముడి) దాకా ఏ విధంగా దర్శించుకోవాలో వివరిస్తారు తిరుప్పాణి ఆళ్వారులు. ఈ పాటలు వీణకన్న తీయగా ఉన్నాయంటారు.   అర్చకులు మోసుకు వచ్చిన వారు కనుక ముని వాహులు అనీ, యోగివాహాన్ అని వీరికి పేరు వచ్చింది. శ్రీరంగని దివ్యసౌందర్యాన్ని వర్ణిస్తూ నేత్రాలదాకా వచ్చి, ఆ నేత్రాలను వర్ణించిన పదో గేయం ముగియగానే పడిపోతారాయన. పరీక్షిస్తే ప్రాణం లేదు. శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయారు. 108 దివ్యదేశాలలో, మూడింట, శ్రీరంగం, తిరుపతి, తరువాత పరమపదంలో తిరుప్పాణియాళ్వార్ కీర్తించారు. గోదాదేవి వలె అయోనిజుడుగా పుట్టి రంగనాథునే ధ్యానించి ఆ రంగనిలోనే ఐక్యమైన మరో ఆళ్వార్ తిరుప్ఫాణి ఆళ్వార్.

goda govinda geetham tiruppavai 14
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles