- గోదా గోవింద గీతం 11
పదోరోజున జ్ఞానవతి అయిన గోపికను నిద్రలేపిన ఆండాళ్ 11వ రోజున సౌందర్యవతి అయిన మరో భక్తురాలు గోప బాలికను తోడ్కొని పోవడానికి ఆమె వాకిట నిలిచి ఆహ్వానిస్తున్నారు. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. గోపికలు ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తులు తమనొక నాయికగా భగవంతుడిని నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానములే వారి సౌందర్యప్రకాశాలు.
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
కత్తుకఱవై= దూడల వంటి పశువులు, పలకణంగళ్ = అనేక మందలను, కఱందు=పాలుపితుకుతున్న వారు, సెట్రార్= శత్రువుల, తిఱల్ అఝియ= బలం నశించే విధంగా, చెన్ఱు= దండెత్తి, శెరుశెయ్యుమ్=యుద్ధం చేసే వారును, కుట్రమ్ ఒన్రు ఇల్లాద= కొరత ఏదీ లేని వారయిన, కోవలర్ తమ్= గోపవంశంలో జన్మించిన పొర్ కొడియే = బంగారు తీగ వలెనున్నదానా, పుట్రు అరవు అల్ గుల్ = పుట్టలోని పాముపడగవంటి నితంబము గలదానా, పునమయిలే= తోటలోని నెమలి వలె ఉన్నదానా, పోదరాయ్=బయలుదేరి రావమ్మా, శుట్రత్తు=చుట్టములు, తోఝిమార్= చెలికత్తెలు, ఎల్లారుమ్= ఎల్లరును, వందు= వచ్చి, నిన్ ముట్రమ్ పుగుందు= నీ భవనమునందు ప్రవేశించి, ముగిల్ వణ్ణన్= మొగిలి వర్ణముకలగిన (మేఘపు మేని రంగువాడు) శ్రీకృష్ణుడు, పేర్ = పేరు, పాడ= పాడుటకు, శెల్వ= అందమైన, పెండాట్టి నీ=సతీమణీ, శిట్రాదే పేశాదే= ఉలకకుండా పలకకుండా, ఎత్తుక్కు= ఎందుకు, ఏ ప్రయోజనాన్న ఆశించి, ఉరంగుమ్= నిద్రిస్తున్నావు, పోరుళ్= దీనికి కారణమేమిటి?
Also Read : శ్రీకృష్ణానుభవమే స్నానం, ధ్యానం, నిద్ర
ఎంత అందమైన భావన? కొమ్ములతో కుమ్ముతాయని భయపడకుండా పాలు పిదికే వారు
రణంలో బాణాలు లెక్క చేయక అరివీరుల ప్రాణాలు తీసేందుకు వెనుకాడని వీరులు
యాదవులనే హరివంశం లో వీర పుత్రికకు మేలుకొలుపుల గీతికలు
ఓ సౌందర్యరాశీ నెమలిపింఛాల నెలతా, పడగ నితంబపు పడతీ
అందాల భరణీ ఎంత సేపీ నిద్ర నీకు.
నీవు కృష్ణప్రియవని, నీవు తోడైతే నెమలి పింఛమువాడు మమ్ము కాచేనని
నీకై వేచి వేచి, మా కనులు కాచినా కదలవేమిది కమలాక్షీ,
మొద్దునిద్దుర వదిలి ముద్దుగుమ్మా లేవవమ్మా. మోహన రూపుని
జగదేకసుందరు కృష్ణమూర్తిని ఆడిపాడి కొనియాడుదాం దావమ్మా
తొలి కిరణాల వెచ్చని వెలుగుల యమునలో మునకతో లోకులందరికీ దారి చూపిన
గోపికా కన్నెల గొప్ప నోముకు కదలవే రేపల్లె పిల్లా లేచిరావే తల్లీ అని గోద పాడిన మధుర గీతం ఈ పాశురం.
బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి అనువాదం సిరినోము
వేలకొలది ఆల పాలు పిదుకు వారు
పోరిలో శత్రు సమూహములను
నుగ్గునూచము సేయు నుద్దండ వీరులు
దురిత విదూరులు దోష రహితు
లయిన గోపకులింట నవతరించిన చాన:
మేల్మి బంగారు వన్నె మేని దాన:
పుట్టపై ఆడు పాము పడగవంటి ని
తంబపు చెలి: వనాంతర మయూరి
చెలులు చుట్టాలెల్ల చేరి నీ ముంగిట
మొగిలును వన్నెలో మిగులునట్టి
కృష్ణుని నామముల్ కీర్తింప బదులీవు
లేవవు పడతి1 నీ భావమేమో?
Also Read : జీవుడు ఆధేయం పరమాత్మ ఆధారం
“కత్తుకఱవై” దూడలు గల ఆవులు, దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే “క్కణఙ్గళ్” గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల “పలకఱందు” పాలు పితకటంలో నేర్పరులు. “శెత్తార్ తిఱల్ అరియ” శత్రువుల బలం నశించేట్టుగా “చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం” వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, “కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం” ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అవి బాగా పెరిగిన పశువులుకావు. దూడలు. అవి అనేక మందలుగా ఉన్నాయి. ఆ పశువులపాలూ పితకగలరు, అదే చేత్తో శత్రువులపై దండెత్తిన వారిని నాశనమూ చేయగలరు, వారు యాదవులు. ఏ దోషమూ లేని వారు ఆ కులంలో పుట్టిన గోపాల బాలికవు నీవు.
గోధూళి దూసరిత కోమల గోపి వేషం గోపాల బాలక శతై రనుగమ్యమానం
సాయంతనే ప్రతిగృహ్యం పశుబన్ధనార్థం గచ్ఛన్త మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యమ్
గోకులంలో గోవులన్నీ నిరంతరం యవ్వనంలో ఉన్నాయట. వాటన్నింటికీ దూడలు కూడానట. అవన్నీ కడవల నిండా పాలు స్రవిస్తూనే ఉంటాయట. ఇది ఏ విధంగా సాధ్యం? కారణం కృష్ణ స్పర్శ. గోవులన్నింటనీ కన్నయ్య ప్రేమతో తడుముతాడట. తానే వాటికి గ్రాసం వేస్తాడట. తినిపిస్తాడట. తానే ప్రతి గోవునూ కట్టివేస్తాడట. అక్కడ ఎన్ని గోవులో అందరు కృష్ణులట. వత్సమధ్యగతం బాలం, అంటే దూడల మధ్య తిరుగాడే బాలుడు ఈ దేవుడు. ముక్త పురుషులు నిత్యసూరులు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారట.
Also Read : నమ్మాళ్వార్ కృష్ణతృష్ణ సూచిక– ఈ గీతిక
శ్రీకృష్ణుడిని పట్టుకొని పాకే బంగారు తీగె గోపిక
యాదవులు అరివీరులు, అమాయకులు. హరివంశానికి చెందిన “పొఱ్కొడియే” బంగారు తీగ, తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ. పాము పడగవంటి నితంబము, వనమయూరము వంటి వయ్యారము కలిగిన సౌందర్యవతివి. బంధువులు చెలికత్తెలంతా చేరి నీ భవనం ఆవరణలోకి వచ్చి ఉన్నాం. “పుత్తరవల్ గుల్ ” తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, “పునమయిలే” ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. “పోదరాయ్”రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం.
“శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు” ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, “నిన్-ముత్తం పుగుందు” నీ ముంగిట ప్రవేశించి, “ముగిల్ వణ్ణన్ పేర్-పాడ” నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. మొయిలు వంటి (మేఘం) వర్ణం కలిగిన శ్రీ కృష్ణుని తిరునామాలను కీర్తిస్తున్నాము. నీవు మాకందరికీ పెన్నిధివి. ఉలకవు పలకవు, ఎందుకు నిద్రపోతున్నావమ్మా తల్లీ, లేచి రావమ్మా.
Also Read : పక్షుల రెక్కల రెపరెపలోజ్ఞానధ్వని విన్న గోద
నిత్యసూరులు
భగవద్దర్శనముతో గోపికలూ స్పర్శనముతో గోవులూ పులకిస్తున్న గోలోకం బృందావనం. అవి దూడలే అయినా శ్రీకృష్ణుని కరస్పర్శచేత అవి పొదుగులనుంచి పాల ధారలను కార్చగల పశువులవుతున్నాయి. భగవంతుని స్పర్శమాత్రం చేతనే నిరంతర పైలా పచ్చీసు (మొదటి 25 ఏళ్ల వయసు) నిత్యయవ్వనంతో ప్రకాశించేవారే నిత్యసూరులు. 64వేల సంవత్సరాల వయసున్న దశరథుడు, గంభీరగమనుడైన రాముని చూచినప్పుడల్లా మళ్లీ యవ్వనవంతుడిగా మారుతున్నట్టు చెప్పుకున్నాడు. భగవంతుడిని దర్శనమే యవ్వనమిస్తే, స్పర్శనము ఏదైనా ఇవ్వగలదు కదా? గోపాలురు స్వతంత్రులు. వారు గోపాల కృష్ణుడికి ఆప్తులు, కాని వారికన్న అస్వతంత్రులైన గోపికల ఎడల అధిక ప్రేమానురాగాలు. వారికంటె ఎక్కువగా గోపకన్యల పట్ల ఆదరాభిమానాలు, వారికంటే కూడా తనను సదా అనుసరించే మూగజీవులైన పశువులంటే ఎంతో ప్రేమ. పశువులకన్న ఏమీ తెలియని దూడలమీద మరింత ప్రేమ వర్షం కురిపిస్తుంటాడు. ఆ మందలు ఎన్నో, వేలకు వేలు. పెక్కు జీవులన్నమాట. కాని పశువులు ఎన్ని వేలున్నా, గోపాలుడు ఒక్కడు చాలు అన్ని పశువులనే మేపడానికి, పాలు పితకడానికి. శత్రుసైన్యాన్ని సమూలంగా నాశనంచేయగల వీరులు యాదవులు.
Also Read : పరమహంసలు చూపే పరమాత్ముని దారి
దోషం లేని మహావీరులు యాదవ వీరులు
శ్రీకృష్ణుని ఓర్వలేని వారు యాదవుల శత్రువులు. భాగవతులను బాధించే వారు శ్రీకృష్ణుడికి శత్రువులు. వీరులకు ఏవో దోషాలు ఉంటాయి. కుట్రమ్ మిల్లాద, వీరిక మాత్రం ఏ దోషాలు లేవు. వెనుదిరిగిపోరు, నిరాయుధులతో యుద్దం చేయరు. యుధ్దంలో తనపై ప్రయోగించిన ఆయుధాలన్నీ కోల్పోయిన రావణుడిని చంపవచ్చు. కాని గచ్చానుజానామి రణార్థితస్త్వమ్, ‘‘అలసిపోయిన ఓ రావణా ఇంటికి వెళ్లు మళ్లీ ఆయుధాలను సమకూర్చుకుని రేపు రా’’ అని పంపిస్తాడు. అవక్రపరాక్రములు, దోషం లేని మహావీరులు యాదవ వీరులు. వారి కులానికే అలంకారం సకలసంపదలున్న ఈ గోపిక, బంగారు తీగ, ఫణిఆకార నితంబిని, వన మయూరి. కేశభారము నెమలి పింఛము వలె ఉందట. నడిస్తే నెమలివలె నడుస్తుందట. ఇక మయూరపింఛ ప్రియుడైన శ్రీకృష్ణుడు ఎందుకు ఇష్టపడడు? అందరూ వచ్చారా మరి అని అడిగిందట ఆమె. గోకులంలోని గోపికలంతా వచ్చి చేరుకోగలిగేంత పెద్ద ప్రాంగణం ఉంది. అక్కడ మొయిలు (కరిమబ్బు) వర్ణమువాడైన శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నారు. మేఘం తో పోలిక ఎందుకంటే ఎవరు తనవారు ఎవరు కారు అనే వివక్ష లేకుండా కరిమబ్బు అందరిమీదా వాన కురిపిస్తుంది, మురిపిస్తుంది. శ్రీ కృష్ణుడూ అంతే. పాపపుణ్యాల తారతమ్యాలు లేకుండా స్వపరభేదం లేకుండా అందరిమీదా కరుణ కురిపిస్తాడు. ఆమె శ్రీకృష్ణానుభవమనే విశిష్ఠమైన సంపద కలిగిన శెల్వపెండాట్టీ.
Also Read : మనసులే సుమాలైతే మాధవుడు మనవాడే
నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి పరుగెత్తివచ్చినట్టు, నీలి మేఘశ్యాముడిని మేము కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, “శిత్తాదే” ఉలుకు లేదు “పేశాదే” పలుకు లేదు “శెల్వప్పెణ్డాట్టి” ఓ సంపన్నురాలా! “నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్” ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.
పురుషోత్తముడిని ఆకర్షించేది భక్తి సౌందర్యం
పదోరోజున జ్ఞానం కలిగిన గోపికను నిద్రలేపిన ఆండాళ్ తరువాతి రోజున సౌందర్యవతి అయిన మరో భక్తురాలైన గోప బాలికను పిలుస్తున్నారు. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం. పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి, ఈ గోపికను తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ప్రయత్నిస్తున్నారు.
Also Read : మేఘం వంటి భగవంతుడు, ఆచార్యుడు
గోపికలు “యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే” అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తులు తమనొక నాయికగా భగవంతుడిని నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానములే వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తే ఆ భక్తి సౌందర్యానికి ఆయన వశమైపోతాడు. సంపన్నురాలైన ఈ గోపబాలికకు పురుషోత్తముడిని ఆకర్శించే భక్తి సౌందర్యం ఉంది. భగవత్ సేవా సంపద అధికంగా కలిగిన ఈ గోపికను తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడని గోద భావం.
Also Read : గోవింద గోదా గీతం తిరుప్పావై -3
భక్తసౌదర్యంతోనే భగవంతుడు వశమౌతాడు
ఈ రోజు పూదత్తాళ్వార్ ను పిలుస్తున్నారు. మహాబలిపురం దగ్తర తిరుక్కుడల్ మల్లై లో శ్రీమన్నారాయణుడి గదాంశంతో మాధవీ పుష్పం నందు జన్మించిన ఆళ్వార్ వీరు. ప్రేమ అనే ప్రమిదలో నెయ్యిగా జ్ఞానదీపాన్ని వెలిగించిన వారు. భగవంతుడు భక్త సౌందర్యంతోనే వశమవుతాడని గోద ఈ పాశురంలో సందేశం ఇస్తున్నది.
Also Read : నారాయణచరణాలే శరణు
Also Read : హరిగుణ గానమే స్నానమట
Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి