Tuesday, January 28, 2025

ఆమె జీవుడికి దేవుడికి మధ్యవర్తి, వాత్సల్య గుణోజ్వల – అలువేలు మంగమ్మ

  • గోదా గోవింద గీతం 18

నేపథ్యం

గోపికలు శ్రీకృష్ణుని మేల్కొల్పి ఆయన దర్శనానుభవ సుఖాన్ని ఆనందించాలన్న ఆశ తీరలేదు. ఆయన మేల్కొనలేదు. బలరాముడు లేచినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. కనుక నీళాదేవిని ఆశ్రయించాలని గోపికలు గమనించారు. అమ్మవారిని ఆశ్రయించకుండా ఆశ్రయించే దశ పూర్తికాదు. అమ్మగారు పురుషకారం కట్టుకుంటారు. మధ్యవర్తి. జీవుల పక్షాన నిలబడి, వారికోసం భర్తకు సిఫారసు చేసే దయామయి. కనుక నీళాదేవినే ముందుగా మేల్కొల్పవలసింది అనుకుని ఆమెను ఆశ్రయించాలని గోపికలు తెలుసుకున్నారని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు వివరించారు. ఆమె భవనం సమీపించారు. నిన్నటి పాశురంలో కడియం వేసుకున్న బలరాముని పాదాల వర్ణన చూసాం. ఈ పాశురంలో గాజులు వేసుకున్న నీళాదేవి అందమైన చేయిని విశేషంగా వర్ణిస్తారు గోదమ్మ.

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

ప్రతిపదార్థం

“ఉందు మదకళిత్తన్” =మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు “ఓడాద తోళ్ వలియన్” ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అంతటి “నంద గోపాలన్” నందగోపాలుని “మరుమగళే!” కోడలా, నప్పిన్నాయ్ = సమగ్ర సౌందర్య రాశీ, నీలాదేవీ అంటూ పిలిచారు. సీతా దేవి దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు గోపికలు. “కందం కమరుం కురలి” =సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! (మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ).”కడై తిఱవాయ్” గడియ తెరువుమా.

“కోరి అరైత్తన కాణ్” = కోడి కూస్తుంది, కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా”ఎంగుం” =అన్నీ కోళ్ళు కూస్తున్నాయి “వంద్” = తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అటువంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అని గోదమ్మ వివరిస్తున్నారు.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు తేట తెనుగులోఅందించిన తిరుప్పావై = సిరినోము

మదపు టేనుంగుల మద మడగించిన

            పోరిలో వెన్నీక వైరుల తరి

మిన నందగోపుని మేనగోడల: తల్లి:

            నీళమ్మ: పరిమళ స్నిగ్ధ చికుర:

గడియె తీయవె: నలుగడల కూయుచునుండె

            కుక్కుటములు కొక్ర్రొకో యటంచు

మాధవి పందిరి మాటున నక్కిన

            కోకిలల్ మాటికి కూయసాగె

స్వామితో నాడెడు బంతికేల ధరించు

            మగువ: పాడెదము నీ మగని కీర్తి

కాలి యందెలు మ్రోయగా వచ్చి గడె తీయి:

            చెంగల్వ పూవన్నె చేయి సాచి.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. “మాదవి ప్పందల్ మేల్” = మాధవీలత ప్రాకిన పందిరి మీద “పల్గాల్” అనేక సార్లు “కుయిల్ ఇనంగళ్” =కోకిలల గుంపులు “కూవిన కాణ్” = కూస్తున్నాయి. రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, “పందార్ విరలి” = బంతి చేతులలో కలదానా. ఈ భూమి వంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అటువంటి అండాలనన్నీ కలిపితే అది బ్రహ్మాడం. అటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

Also Read : తలుపులు తెరిస్తే కదా తలపులు మెరిసేది

ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ” నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. “శెందామరై క్కైయాల్” నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో “శీరార్ వళై ఒలిప్ప” నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, “మగిరింద్” అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో “వందు తిఱవాయ్” నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని గోద నిద్ర లేపింది అని జీయర్ స్వామి మృదు మధురంగా వివరించారు.

అంతరార్థం

నందగోపుడంటే ఆచార్యుడు. గజము భగవానుడికి ప్రతీక. గజాన్ని వశములో ఉంచుకునే శక్తి కలిగిన నందగోపుడే ఆచార్యుడు. అతని వ్రేపల్లెయే ఆచార్య కులము. గడియ తీయటమంటే అమ్మ కర్మానుసారంగా కాకుండా కృపానుసారంగా దయతలచి పరమాత్మ రక్షణ కు అభయం ఇవ్వడం.

goda govinda geetham 18

నందగోపుడు మహాబలవంతుడు. ఏనుగులతో పోరాడగలిగిన వాడు. మదము స్రవించుచున్న ఏనుగులున్నవాడు. యుద్ధములో జంకడు. అంతటి నందగోపుని కోడలివి నీవు. నీళాదేవీ నీ నీలవేణి సుగంధాలువెదజల్లుతున్నాయి. కోళ్లు అన్నీ కూస్తున్నాయి. తెల్లవారింది. మాధవీ లత అల్లుకున్న పందిరిమీద కోకిలలు గుంపులుగా కూచున్నాయి. నీచేతిలో బంతి ఉంది, మేం వచ్చి నీ బావ గుణకీర్తనం చేస్తున్నాం. ఆనందంగా మందస్మిత వదనంతో రామ్మా, నీ సుందరమైన చేతికంకణాలు ఘల్లుమని ధ్వనిస్తుంటే తలుపు తెరువుము.

విశేషార్థం

నీళాదేవిని ద్రావిడ భాషలో నప్పిన్న అంటారు. నందగోపుడు ఆచార్యుడు, యశోద తిరుమంత్రమని 17 వ పాశురంలోచదువుకున్నాం. వారితో సంబంధం ఉన్న నీళాదేవిని ఆశ్రయిస్తేనే ఫలం. భగవంతుడు ఆచార్యునికి, పురుషకార భూతురాలైన లక్ష్మికి వశవర్తియై ఉంటాడు.

మహాలక్ష్మిమాతృస్థానంలో ఉండి జీవులపట్ల వాత్సల్యం కలిగి ఉంటుంది. నారాయణుడికి శ్రీ తత్త్వమే శ్రీదేవి భూదేవి, నీళాదేవి. ద్రావిడ సంప్రదాయం ప్రకారం నీళాదేవి శ్రీకృష్ణుని పట్టపురాణి. యశోదాసోదరుడైన కుంభుడు అనువాని పుత్రిక నీళాదేవి. అంటే ఆమె యశోదకు మేనకోడలు. శ్రీకృష్ణుడు బావ. శ్రీ, శ్రియఃపతి ఇద్దరి ఆ మిధునముకే చెందిన వారము, కనుక వారిని మనము సేవించాలి అని శ్రీభాష్యం అప్పలాచార్యులవారు చెప్పారు.

Also Read : తిరుప్పావై అంతా గురుపరంపర ధ్యానమే

ఈపాశురం ద్వారా అమ్మవారి పురుషకారం గొప్పదనాన్ని గోదమ్మ వివరిస్తున్నారు. ఆకారం లేని జీవాలకు నామరూపాలు ఇచ్చేది స్త్రీ. కర్మ చేస్తే కర్మఫలం అనుభవించడం ద్వారానే ఆ కర్మ తొలగుతుంది. కర్మ తొలగడానికి మనకు శరీరం అవసరం. శరీరం లభిస్తేనే మళ్లీ శరీరంతో పని లేకుండా సాధన చేయవచ్చు. ‘‘శరీరమాద్యంఖలు ధర్మసాధనం’’ కదా. సంతానవంతుని చేయడం ద్వారా పురుషుడి గా పూర్ణుని చేస్తుంది కాబట్టి స్త్రీమూర్తిని పురుషకారం అంటారని జీయర్ స్వామి వివరించారు.

సీతా కటాక్షం – రామాయణ ఘట్టం

లంకలో సీత కోసం ఎంత వెదకినా దొరకకపోతే, ఆంజనేయుడు ‘‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దైవ్యైచ తస్యై జనకాత్మజాయై’’ అని ప్రార్థిస్తాడు. అమ్మా ఆనాడు జనకునకు ఏ విధంగా స్వయంగా దొరికావో నాకూ నీయంత నీవే కనిపించు తల్లీ అన్నాడు. అశోక వనం వైపు అతని దృష్టి మళ్లింది, ఆమె కనిపించింది.

‘‘సీతామువా చాతియశా రాఘవంచ మహావ్రతమ్’’ వనవాసానికి లక్ష్మణుడు కూడా వస్తానంటే రాముడు నిరాకరిస్తాడు. అతను సీతను ఆశ్రయించి ఆమె ద్వారా కోరితే కాదనడు. సీత వల్లనే ఆమె పాదాలు పట్టిన కాకాసురుడిని రాముడు చంపకుండా కన్ను మాత్రం హరించి వదిలాడు. సీతను కాదని రాముని పొందబోయిన శూర్పణఖ ముక్కుచెవులు కోల్పోయింది. రాముడికి దూరం చేసి సీతను పొందాలనుకున్న రావణుడు ప్రాణాలు కోల్పోయాడు. సీత విసిరిన నగల ద్వారా సుగ్రీవుడు రామునికి స్నేహితుడైనాడు. తన భార్య, కూతురు ద్వారా సీతకు సేవలుచేసి విభీషణుడు రాముని శరణాగతి పొందగలిగాడు. సీతను ఆశ్రయించి రావణుడిని వదులుకోగలిగి లంకాధిపతి కాగలిగాడు. సీత దూరమైన రామలక్ష్మణులను మాత్రమే చూచిన హనుమ కు కూడా లంకలో సీతాకటాక్షం వచ్చే వరకు పరిపూర్ణత్వం సిద్ధించలేదు.

రామదూత – రామదాసు

రావణునికి సీత చెప్పిన హితవు విన్నపుడు హనుమకు స్వస్వరూపం గురించి భగవత్స్వరూపముగురించి అర్థమైందట. అందాకా రామదూతను అనుకున్న వాడు రామదాసుడినని ఘోషించాడట. సీతాదర్శనంతో పావనమైన పావని రాముని సర్వస్వభూతమైన ఆలింగమును పొందగలిగినాడు.

అమ్మా రక్షించు

అమ్మ రక్షణ కల్పిస్తుంది. రక్షణ అంటే ఇష్టప్రాపణం అనిష్ట నివారణం. కావలసింది ఇచ్చి అవసరం లేనిది తొలగించడం. కావలసింది అంటే నీవు కావాలన్నది కాదు నీకు కావలసింది. మనం తండ్రిని శరణాగతి చేసినపుడు ఆయనకు మనలోని దోషాలు కాకుండా మనం చేసిన మంచి ఏదైనా ఉంటే దాని గురించి చెప్పిచూపుతుంది తల్లి. తద్వారా ఆయనలోని దయా వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చేది ఆమె. ‘‘వాత్సల్యాది గుణోజ్జ్వలాం వందే జగన్మాతరం’’ అని అలవేలు మంగను కొలుస్తున్నాం. దయ అంటే ఎదుటి వారు దుఃఖిస్తే వారి దుఃఖం తొలగి పోయేంత వరకు అది తన దుఃఖంగా భావించడం. వాత్సల్యం అంటే వత్సం పై కరుణ. వత్సం అంటే గోదూడ. దోడపుట్టినపుడు దానిపై ఉండే మురికిని వాత్సమ్ అంటారు. ల అంటే దాన్ని నాకి తీసేయడం. మనం తెలియకుండా మనం తెచ్చుకున్న కొన్ని దోషాలు మనపై ఆవహించి ఉంటాయి. ఆ దోషాలను తొలగించి, మనలోని మంచిగుణాలు (ఉంటే) తండ్రికి చూపించే వాత్సల్యం తల్లికి ఉంటుంది. అందుకు తల్లి తండ్రితో నిరంతరం ఎడబాయకుండా ఉండాలి. ‘‘అగలగిల్లేన్ ఇరయుమ్’’ అరక్షణం కూడా అమ్మ స్వామిని విడువదని నమ్మాళ్వార్ చెప్పారు. పరమపదంలో లక్ష్మీదేవి, భూమికి వరాహ మూర్తిగా వస్తే ఆమె భూదేవి. రాముడైతే సీత. శ్రీకృష్ణుడైతే నీళాదేవి.

Also Read : శంఖం ప్రణవం, చక్రం సుదర్శనం, దారి విష్ణువు

దాశరథి చెప్పిన నీళా వివాహగాధ

హరి వంశంలో ఒక కథ ఉంది. కాలనేమి అనే రాక్షసుడికి ఆరుగురు పుత్రులున్నారు. వారిని షడ్గర్భులు అంటారు. హిరణ్యకశిపుని కాలంలో వీరు జీవించి ఉన్నారు. ఈ ఆర్గురు చావులేని వరం కోరుతూ బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్నారని తెలుసుకుని హిరణ్య కశిపుడు ఆగ్రహించాడు. అందరూ తననే పూజించాలని తనకోసమే తపస్సు చేయాలని హిరణ్య కశిపుడి శాసనం. అందుకని ఆ షడ్గర్భులు తండ్రి చేతిలోనే చస్తారని శపిస్తాడట. కాలనేమి మరుజన్మలో కంసుడై పుడతాడు. తన చెల్లి దేవకి పుత్రుడే శత్రువని తెలుసుకున్న కంసుడు దేవకి ఆరుగురు బిడ్డలను వధిస్తాడు. ఆ ఆరుగురే పూర్వపు షడ్గర్భులు.

క్రిష్ణయ్య మరదలు నీళాదేవి

విదేహ రాజ్యంలో యశోద తమ్ముడు కుంభకుడు ఉండేవాడు. అతని భార్య ధర్మద.  ఈదంపతులకు శ్రీరాముడు కొడుకు, నీళ కూతురు. ఆరు పొగరుఆబోతులుగ ఆ కుంభకుని మందలో పుట్టాయట. అవి కుంభుని రాజ్యంలో సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాయి. కుంభుని ఆబోతుల విధ్వంసం గురించి విదేహ రాజుకి జనం మొరబెట్టుకున్నారు. రాజు కుంభకుని పిలిచి ఆబోతులను అదుపు చేయమని హెచ్చరించారు. ఎంత ప్రయత్నించినా ఆబోతులను ఆపడం సాధ్యం కాక, కుంభుడు వాటిని అణచిన వారికి తన కూతురునిచ్చి పెళ్లిచేస్తానని ప్రకటించాడట. ఆబోతుల సంక్షోభం ఏ విధంగా నివారించాలా అని ఆందోళన పడుతూ యశోదా నందులు, బలరామ శ్రీకృష్ణులు, మరెందరో గోపయువకులు కుంభుడి ప్రదేశానికి వచ్చారట. ఎంతమంది ఆబోతులతో తలపడినా ప్రయోజనం లేకపోయింది. ప్రజలు గ్రామం విడిచి పోయారట. కుంభుడి ఇంటిపైన కూడా దాడిచేసి ధ్వంసం చేశాయి. అదంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు విజృంభించాడు. ఒక్కొక్క పిడికిలి పోటుతో ఒక్కొక్క ఆబోతును దెబ్బ తీస్తే ఆబోతులు రక్తం కక్కుకుని చనిపోయాయి. మరొక రచనలో ఆ ఏడు ఆబోతులను జయించి ఒక గాట కట్టి, ఆబోతుల సంక్షోభాన్ని తొలగించారంటారు. అంతటి పరాక్రమశాలి శ్రీకృష్ణునికి తన కూతురు నీళను ఇచ్చి కుంభకుడు-ధర్మద వివాహం చేశారని దాశరథి రంగాచార్యులు తన మానస తిరుప్పావై లో వివరించారు.

నాజ్ఞజితి శ్రీకృష్ణుని శ్రీమతి

భాగవతంలో నీళాదేవి పాత్ర మనకు కనిపించదు. శ్రీకృష్ణుని ఎనమండుగురు పట్టపు రాణుల్లో ఒకరైన నాజ్ఞజితి నీళాదేవి అని పెద్దలు సమన్వయించారు. రాముడు శివధనుస్సు ఎక్కుపెట్టి సీతను పెళ్లాడినట్టు, ఏడుమృత్యువుల వంటి ఎడ్లను పట్టి బంధించి నాజ్ఞజితిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. నాజ్ఞజితిని వలెనే నీళాదేవిని కూడా అదే రీతిలో వివాహం చేసుకున్నారని జీయర్ స్వామి వివరించారు. నాజ్ఞజితి నీళ ఒకరే అన్నారాయన. నీళకే పురుషకారం ఉందని పెద్దలు అంటారు. వైష్ణవ ఆరాధనలో శ్రీ, భూ, గోదా, నీళా దేవి దివ్య మహిషులుగా పూజలందుకుంటారు.

తెల్లవారినదని చెప్పడానికి గుర్తులను నీళాదేవికి తెలియజేస్తున్నారీ గోపికలు. కోళ్లుకూసినా తెలియనంతగా శ్రీకృష్ణ సంశ్లేషానుభవానందాన్ని అనుభవిస్తున్నావా తల్లీ. ఒక్క కోడి కాదు, కోళ్లన్నీ కలిసి వచ్చి కూస్తున్నాయి. కోళ్లంటే భక్తులు. తమకు తెలిసినది అందరికీ చెప్పాలనుకునే భాగవతోత్తములైన ఆచార్యులు. వజ్రాలను కూడా ముక్కుతోపక్కకు తోసి, ధాన్యపుగింజ వంటి భగవద్విషయమునే తీసుకునే భక్తులు. తెల్లవారక ముందు లేచి అందరినీ మేల్కొలిపే వారు.

రాత్రంతా శ్రీకృష్ణుడితో బంతాట ఆడిందట. వారి లీల అది. సర్వజగత్తు ఆమెచేతిలో బంతి. ప్రళయకాలంలో జగత్తులోని నారములు (జీవులు) అనే బంతిని చేతబట్టి పరమాత్మను కౌగిలించుకునిపరుండి ఉండునట. నారములతో ఆయనను కలిపే తత్త్వమే శ్రీతత్త్వము. వారి చేరికే నారాయణ తత్త్వము. సరిగ్గా అప్పుడే తమను గాచడానికి లేవమని వీరు అర్థిస్తున్నారు.

నీ బావ పేరును పాడుతున్నాం. ఆయన్ను నీతో కలిపి శ్రీమన్నారాయణుడంటున్నాం. తలుపులు తెరుచుకుని రమ్మన్నారట నీలాదేవి. మాయంతట మేము తలుపులు తెరువలేము. నీవే తెరిచి ప్రవేశ పెట్టు తల్లీ అన్నారు వీరు. నీ గాజుల చప్పుడు కాకుండా వెనక్కునెట్టి తలుపు తీయవద్దు. ఏదో పరికరంతో దూరం నుంచి తీయవద్దు. నీవే స్వయంగా వచ్చి గాజుల ధ్వని చేస్తూ తలుపు తీయమ్మా. నీ ఆనందం కోసం ఇదంతా. నీవే సంతోషంగా తలుపుతీయి తల్లీ. జ్ఞానమే ప్రతిబంధకాలను తొలగిస్తుంది.

రామానుజుని కథ

ఈ పాశురము రామాజునునికి ప్రియమైనది. ఓసారి భిక్షాటనం చేస్తూ రామానుజుడు ఈ పాశురాన్ని మనసులో లోతుగా మననంచేస్తూ గురువుగారైన మహాపూర్ణుల ఇంటికి వెళ్లి తలుపుతట్టారట. గురుపుత్రిక అత్తులాయమ్మ ఆమె గాజులు ఘల్లుమన్న ధ్వనితొ తలుపు తీస్తే ఆమెను చూసి నీళాదేవి సాక్షాత్కరించిందనే పరవశంతో ఆయన మూర్ఛపోయారట. ఇదంతా గురువుగారు దూరాన ఉండి ఊహించారట. నిన్ను చూసి నీళాదేవి అనుకుని ఉంటాడు అటూ వచ్చి రామానుజుడిపై నీళ్లు చల్లి మేల్కొల్పారట. ఈ పాశురం అనుసంధానం చేస్తే అమ్మవారి సాక్షాత్కారం కలుగుతుందని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు మృదు మధురంగా వివరించారు. తిరుప్పావై అంటే అమిత అభిమానం కలిగిన రామానుజుల వారిని తిరుప్పావై జీయర్ అని పిలుస్తారు.

ప్రతీకాత్మకం ఈ కావ్యం

కందాడై రామానుజాచార్యుల వారు ఈ పాశురం సారాంశాన్ని ప్రతీకలను వివరించారు. నందగోపుడు ఆచార్యుడు, గజము భగవానుడు. భగవానుని వశములోనుంచుకునిన ఆచార్యులే ఏనుగులను వశీకరించుకొన్న నందగోపుడు. ఆచార్యుడైన నందగోపుని పల్లె ఆచార్య కులము. అదే వ్రేపల్లె. గడియ తీయడమంటే పరమాత్మ రక్షించేట్టు చేయడం. అది కూడా కర్మానుగుణముగా కాకుండా కృపానుగుణముగా మనను పరమాత్మ రక్షించేట్టుగా ఆమె కరుణిస్తారట. కోళ్లు అంటే భగవంతుడి సేవలో అమితమైన శ్రద్ధగలిగిన భక్తులు ఆచార్యులు. కోకిలలు అంటే మధురంగా భగవంతుడిని కీర్తించే ఆళ్వారులు. నీళ చేతిలో బంతి అంటే లీలా విభూతి. ఈ లోకాలతో లీలగా ఆడుకోవడం. జ్ఞానానికి ప్రతీక ఆ చేయి. చేతికి దాల్చిన గాజులే భగవత్ సంబంధ జ్ఞానము. గాజులు పురుషుడితో స్త్రీ సంబంధాన్ని తెలియజేసే సంకేతాలు. తామరపూవువలె ఉందట ఆమెచేయి. తామరపూవుకు సౌందర్య, సౌకుమార్య, సౌరభ్య లక్షణాలుంటాయి. జ్ఞాన లక్షణాలు ఏమంటే – ఇతర విషయ నివృత్తి అనే సౌందర్యం, స్వభోక్తృత్వ నివృత్తి అనే సౌకుమార్యము, నిరతిశయప్రేమాత్మకమనే సౌగంధ్యము ఉండడం.  చేతి గాజులు అనన్యార్హశేషత్వము, అనన్య శరణత్వము, అనన్యభోగత్వము.

ఎనిమిది పాదాల తమిళ పాశురంలో గోదాదేవి శాస్త్ర విజ్ఞానాన్ని కూర్చి మనకు అందించారు. ప్రతిపదంలో అనల్పమైన అర్థం నింపారు. రామాయణ, భాగవత గాధలు, ఆళ్వారుల మంగళ గానాలు, అనేకానేక విశేషాలను తిరుప్పావైలో ఇమిడ్చారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles