ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్ !
మాడభూషి తెలుగు భావార్థగీతిక
పద్మనాభు కుడిచేతి సుదర్శన చక్రంపు మెరుపు మెరిసి
స్థిరమైఎడమ దక్షిణావర్త పాంచజన్యంపు పిడుగులుమిసి,
జగత్కారకుడు, కాల స్వరూపుడు నల్లనయ్య రంగురాసి
గంభీర జలదము, మహనీయ సుందర బాహుదండుడైన
ఆలసించక విష్ణు శార్ఞమ్మువిడిచిన శరపరంపరల విసిరి
పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు పర్జన్యదేవుమ్రొక్కి
మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు లేమలార.
అర్థం
ఆళి = సముద్రంల వలె గంభీరస్వభావంగల, మళైక్కణ్ణా = వర్షాలకు అధిపతియైన వరుణదేవా, నీ ఒన్రు = నీవు ఇసుమంతైనా, నీ = నీవు, కై కరవేల్ = దాచుకోవద్దు, ఆళియుళ్ = సముద్రంలోపల, పుక్కు = చొరబడి, ముగున్దు కొడు = అక్కడున్న నీటిని, ఆర్తు = మేఘ గర్జనలుచేస్తూ, ఏఱి =ఆకాశంలో వ్యాపించి
ఊళిముదల్వన్ = కాలము వంటి అనేక చరాచర పదార్థాలకు కారణ భూతుడైన నారాయణుని యొక్క, ఉరువమ్పోల్ = శరీరం వలె, మెయికరుత్తు= శ్యామవర్ణ శరీరంగా, పాళియందోళుడైయ = మహనీయమూ, మనోహరమూ అయిన భుజస్కందాలు కలిగిన వాడు, పర్పనాబన్ కైయిల్ = పద్మనాభుని దక్షిణ హస్తమందున్న, ఆళిపోళ్ మిన్న =చక్రాయుధం వలె మెరుపులు మెరిపించి, వలమ్బురి పోల్ = దక్షిణావర్త శంఖమైన పాంచజన్యం వలె, నిన్రదిరిన్దు =స్థిరంగా నిలిచి ఘోషించి, తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్జ్ఞ్గ =పరమాత్ముడి విల్లైన శాజ్ఞ్గమ్, ముదైత్త శరమళైపోల్ =వేగంగా కురిపించి బాణముల వర్షం వలె, వాళవులగినిల్ = విశ్వంలోని సకల జీవరాశి జీవించడానికి, నాంగళుమ్ = వ్రతాన్ని ఆచరించే మేమూ, మగిళిన్దు = సంతోషంతో, మార్గళి నీరాడ = మార్గళి స్నానం చేయడానికి, పెయ్ దిడాయ్ = వర్షాన్ని కురిపించాలి.
భావార్థము:
మేఘం స్వభావం గంభీరం, వర్షానికి వాహకుడు మేఘుడు. పర్జన్య దేవుడు. ఆ మేఘానికి ఈ పాశురం ద్వారా ప్రార్థన చేస్తున్నది. ఓ మేఘమా నీవు దాతృత్వములో చూపే ఔదార్యాన్ని ఏమాత్రమూ కూడా తగ్గించరాదు. గంభీరమైన సముద్రంలో మధ్యకు వెళ్లి, ఆ సముద్ర జలాన్ని త్రాగి, గర్జించి, ఆకాశమంతటా వ్యాపించి, సర్వజగత్కారణ భూతుడైన శ్రీమన్నారాయణుని నీల మేఘ విగ్రహమువలె శ్యామల మూర్తియై, ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరసి, ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి, శార్జ్గ్ మనే ధనుస్సు విడిచే బాణముల ములుకుల వర్షం వలె వర్షించు. లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మేమంతా సంతోషంతో మార్గశీర్ష స్నానము చేసేట్టు గా వర్షాన్ని కురిపించు.
క్షార జలధి నావరించి అలల జలము పీల్చి గగనమెక్కి
అంతరార్థం
గోపికల వ్రతానికి కారణం స్వార్థం కాదు, వారి లక్ష్యం దేశం క్షేమమే. తమ వ్రతం చేత లోకమంతటా పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్నదే వారి కోరిక. ఈ వ్రతానికి స్నానమే ప్రధానం. దీన్ని స్నాన వ్రతం అనీ అంటారు. వారి స్నానానికి జలం సమృద్ధిగా ఉండాలి. గోపికలు కృష్ణభగవానుడే ‘ఉపాయము, ఆయనే ఫలము’ అని నిశ్చయించుకొన్నారు. ఇతరములయిన ఏ ఫలితాలను వారు ఆశ్రయింపరు, వారిది అనన్య భక్తి.
భగవంతుడు సర్వేశ్వరుడు. ఆయనే అందరినీ వివిధ అధికారాలలో నియమించారు. బ్రహ్మను సృష్టికార్యానికి, శివుడిని లయకార్యానికి, అష్టదిక్పాలకులను తదితర కార్యాలకు నియుక్తులను చేశారు. సర్వేశ్వరుని ఆశ్రయిస్తే ఆ భగవానుడు నియమింన దేవతలందరూ భక్తులను అనుసరిస్తారు. ఒకసారి కూరత్తాళ్వార్ ను ‘అన్యదేవతలను చూసినపుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు?’ అని అడిగితే ‘మీరు శాస్త్ర విరుద్ధంగా అడుగుతున్నారు. మిమ్మల్ని చూసి అన్యదేవతలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని అడగాలి’ అని సమాధానం చెప్పారట.
పరమాత్మనాశ్రయించిన వారివద్ద, భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ కూడా వారికి ఆజ్ఞావశవర్తులై ఉంటారట.
ఆళి మళైకణ్ణా = వర్షనిర్వాహకుడా, వర్షం కురిపించే మేఘుడు, అది పాపాత్ములుండే చోటని తక్కువ పుణ్యాత్ములున్నారని ఎక్కువ అని కాకుండా అంతటా సమానంగా కురుస్తూనే ఉంటాడు. ఒన్ఱునీకైకరవేల్ =నీకై ఏమీ దాచుకోకుండా, పుణ్యుల చోటు, పాపులున్నచోటని, ఎడారి అనీ పంటపొలమనే పక్షపాతం లేకుండా అంతటా సమంగా వర్షాన్ని కురిపించు. గర్జించు. నీ గర్జనలు విని లోకం సంతోషించాలి. ఆర్ తు ఏఱి.. గర్జించి మిన్నంది..ఆకాశమంతా వ్యాపించు. వూళి ముదల్వనుర్వంబోల్ =చేతనాచేతన పదార్థములకు కారణభూతుడైన సర్వేశ్వరుడి మేని వలెనే, మేయ్ కరత్తు = మేఘమువంటి మేనిఛాయగల తమ నాయకుని వలె మేఘము అని పోల్చుతున్నారు.
పాళి యందోళుడై = విశాలమైన బాహువులకలవాడు. రాముని బాహుబలంతో లోకమంతా సురక్షితమైంది. నాభియందున్న బ్రహ్మను తొట్టెలోయుంచి నారాయణుడు భుజాలతోకాపాడినాడట. పఱ్పనాభన్ కైయిల్ ఆజ్ పోల్ మిన్ని = పద్మనాభుని చేతిలో చక్రంవలె మెరిసి, మేఘం కురియాలనికోరుతున్నారు. వలమ్బురిపోల్ శ్రీ కృష్ణుని పాంచజన్యం కురుక్షేత్రంలో పాండవపక్షంలో హర్షం కురిపించినట్టు, నిన్దురిన్దు= నిలిచి గర్జించాలట. తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్ ఙ్గముదైత్త శరమళైపోల్ వింటినుండి చిమ్మిన శరముల వలె రామబాణ వర్షము కురిపించాలి. నాఙ్గళుమ్ మగిళిన్దు మార్గళ నీరాడ =మేం సంతోషించి మార్గళి స్నానంచేసేట్టు అంటున్నారు.
Also read: మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు
Also read: తిరుప్పావై -2 : నెయ్యి వద్దు, శ్రీకృష్ణుని నెయ్యమే ముద్దు
Also read: శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై