Thursday, November 7, 2024

శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై

విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ గోదాదేవి

తిరుప్పావై, అంటే సిరినోము లేదా శ్రీ వ్రతం, పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా 12 వందల సంవత్సరాల తరువాత కూడా చిరంజీవియై భాసిస్తున్న మహాకవయిత్రి గోదా దేవి.  గోదా దేవి నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున (క్రీ.శ. 776) తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపు తీస్తున్నపుడు జనకునికి సీత వలె, విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ.  అయోనిజ.

తులసీదళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు తండ్రి.  ముద్దుగా కోదై (తులసిమాల) అని పేరు పెట్టుకున్నాడు. భూమినుంచి తులసి వచ్చినట్టే ఈ పాపకూడా వచ్చిందని మరొక అర్థం. పెంచింది శ్రీ విష్ణుచిత్తుడు. విష్ణువే చిత్తములో గలవాడు. తండ్రి ఆలోచనలు, మనసు, మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ భాసించారు.

వైష్ణవ మతంలోని ప్రేమ తత్త్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించారు. పిలుపులలో గోదై, అనే పేరు కాస్త మారి గోద అయింది.  13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించిన విద్యన్మణి గోదాదేవి. అందరినీ కలుపుకుని పోయే నాయకత్వలక్షణాన్ని ఈవ్రతం వివరిస్తున్నది.

స్త్రీమూర్తుల చదువులకు శ్రీ మూర్తి

ఆళ్వార్ అంటే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది

శ్రీవిల్లిపుత్తూరులో గోదమ్మ లభించిన పూలతోట, తులసీవనం

వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులబేధాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్) శ్రీవిష్ణుచిత్తులు, వారి కూతురుగోద ఉన్నారు. 12 మంది ఆళ్వార్ లలో స్త్రీమూర్తి ఈమె ఒక్కరే.

స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై. తులసీ వనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంటనడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది.

ఆండాళ్అంటే నను గన్ననా తల్లి

తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే తనూ నేర్చుకున్నది గోద. తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీ మాల కోదై పూమాలల ద్వారా శ్రీ విల్లిపుత్తూరులోనిమూలమూర్తి వటపత్రశాయికి ప్రేమసందేశాలు

గోదమ్మదొరికిన చోట భక్తుల పుష్పార్చన

ఓరోజు పెరియాళ్వార్ కు తాను తీసుకుని పోయిన పూమాలలలో అమ్మాయి శిరోజం కనిపించింది. శుధ్దిలో లోపం వచ్చిందని బాధపడి ఆ మాలలను స్వామికి సమర్పించకుండానే వచ్చి శిరోజం ఎందుకు వచ్చిందో తెలుసుకుని కూతురిని మందలించాడు విష్ణు చిత్తుడు. మహా అపరాధం

తన జన్మభూమి శ్రీ విల్లి పుత్తూరులో కొలువైన గోదాదేవి

జరిగిందని మదన పడ్డారాయన.

ఆ రాత్రి విష్ణుచిత్తుడికి విష్ణువే కలలో కనిపించి కోదై తాను ధరించి బాగుందో లేదో చూసుకుని బాగుందనుకుని ఇచ్చిన మాల అంటేనే తనకు ఎంతో ప్రియమని కనుక గోదమ్మ ధరించి విడిచిన ఆ మాలలనే తనకు రోజూ సమర్పించాలని నారాయణుడు కోరుతాడు. 

విష్ణుచిత్తునికి తన చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇక గోద తన కూతురు కాదు తనకు కన్నతల్లి ఆండాళ్ (అంటే నను గన్న తల్లి అని అర్థం) అనీ అర్థమైంది. అప్పడినుంచి విష్ణుచిత్తులు వారు ఆమెను ఆండాళ్ అనే పిలిచేవారు. (మనం కూడా కన్న కూతురిని బంగారు తల్లి అనీ మా అమ్మే అనీ అనుకుంటాం కదా).

ఇక గోదమ్మవారు మాలలు ధరించి బాగోగులు చూడడం, బాగున్నాయని ఆమె అన్నవే వటపత్రశాయికి పంపడం ఆనవాయితీ మారింది.

శ్రీరంగని వలచి వరించి…

అప్పడినుంచి ఆమెకు వచ్చిన మరో పేరు శూడి(చూటి)క్కొడుత్త (ఈ తమిళ పదానికి, ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు. 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక ‘‘పాడికొడుత్త నాచ్చియార్’’ అని మరో పేరుకూడా వచ్చింది.

తిరుప్పావై (సిరినోము)

బాపు భావార్థ కళారేఖతో 

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్

మహోత్తమమీ మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె

యమున నీరాడ రండు, సుసంపన్నపు వ్రేపల్లె సుదతులార

వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు

వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార

యశోద ఒడినెదుగు కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు

కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు

వరదుడు నారాయణుడు మనకు ఢక్కి, కైవల్యంబులిచ్చు,

నెల నోము పట్టి కలిసి భజింతము రారండు రమణులార.

ఇది తొలి పాశురానికి బాపు భావార్థ కళారేఖ. విశ్వమంతా నిండినశ్రీకృష్ణునిపాదాలే శరణు. ఆ పాదాల చెంత ఉద్భవించినది,స్త్రీరూపంలో వచ్చిన యమున కేశపాశాలే ఈ నది అని బాపు భావన. గగనాలు దాటి నిండిపోయిన త్రివిక్రముడని మడమల దగ్గర మేఘాలు చూపుతున్నాయి.  కృష్ణుని కీర్తించడానికి వెళ్లవలిసిన గోద సఖులే అలనాటి గోపికలనే భావం. అన్నీ మరిచి గోపికలు ఆనంద రాసలీలలో ఉన్నారు. యమున నీరు, మార్గళి స్నానం, సిరిసంపదలిచ్చే జీవనది. శ్రీ కృష్ణుని ప్రేమకోసం గోపబాలికలుగా మారిపోదాం అని గోదమ్మ చెలికత్తెలకు నాయకత్వం వహిస్తున్నరమణీయ చిత్రం ఇది.నారాయణ మంత్రంతోనే ఈ వ్రతం చేద్దాం అంటున్నారు కనుకచిత్రానికి అగ్రభాగాన పాదాలే విస్తరించాయి.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles