Tuesday, December 3, 2024

నారాయణచరణాలే శరణు

  • గోదా గోవింద గీతం (తిరుప్పావై) 2

తొలి గీతం లో గోపికలను పిలిచిన గోదమ్మ రెండో గీతంలో మొత్తం అందరనీ పిలుస్తున్నారు. హరికథలనే పాలు పెరుగు ఉంటే వేరే పాలు పెరుగు ఎందుకడుగుతారు? నోటిమీద అదుపుకోసం ఈ పాట పాడుకొమ్మంటున్నారు.

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,

మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్

‘వైయత్తు వాళ్ వీర్ గాళ్’, ఈ భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. ‘నాముం నంపావైక్కు..’ ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, ‘శెయ్యుం కిరిశైగళ్ కేళీరో..’ ఏంచేద్దామో వినండి.. ‘పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ఱ పరమనడిపాడి…’ పాలకడలి లో సుకుమారంగా శయనించి ఉన్న వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం
‘నెయ్యుణ్ణోం పాలుణ్ణోం’ నెయ్యీ వద్దు, పాలూ వద్దు. ‘నాట్కాలే నీరాడి’తెల్లారుజామున స్నానం చేద్దాం. ‘మైయెట్టుళుదోం మలరిట్టు నాం ముడియోమ్…’ కనులకు కాటుక పెట్టుకోం కొప్పులో పూలు ముడవం…విలాసాలువదిలేద్దాం. ‘శెయ్యాదన శెయ్యోం’ చెయ్యకూడదని పెద్దలుచెప్పినవి చెయ్యం. ‘తీక్కుఱళైచ్చెన్ణోదోమ్’ మరొకరి మనసు కష్టపెట్టే పుల్లవిరుపు మాటలు మాట్లాడం, ‘ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి’, చేతనైనంత వరకు దానాలు చేస్తాం. ‘ఉయ్యమాఱెణ్ణి ఉగంద్ ..’ ఈ పనులన్నీ ఆనందంతో చేస్తాం..

బోమ్మకంటి శ్రీనివాసాచార్యుల స్వామి వారి అనువాదం సిరినోము

సుఖముల తూగాడు సుదతులార, వినుండు

చిత్తశుధ్దికి వ్రత సిధ్ధికొరకు

చేయగావలసిన చెయుదులు నుడివెద

పాలకడలి మీద పవ్వళించు

పరమాత్ము పదములు పాడగా వలయును

పరహరింప వలెయు పాలు నేయి

నీరాడి వేబోక నెరుల పూవులు లేక

కనుల కాటుక లేక కదలవలయు

చేయరాని పనులు చేయరా దెవరము

స్వామితో చాడీలు పలుక రాదు

దాన ధర్మములు యథాశక్తి సేయుడు                            

ముక్తి ద్రోవ నెరిగి ముదము గనుడు1

మాయ కమ్ముకుని అజ్ఞానం విస్తరించే ఈ భూమ్మీద ఈ కాలంలో ఉజ్జీవించి చైతన్యోద్దీపకులు కావడానికి, నారాయణ వ్రతం చేద్దాం రమ్మని పిలిస్తే ఇంత మంది వచ్చారా అని ఆండాళ్ ఆశ్చర్యపోయిందట. సరే నోము లో చేయకూడనివి చేయవలసినవి చెప్పుకుందాం అన్నారు. వ్రతం చేసే అధికారి సంభవిత సంభవములగురించి తెలుసుకోవలసి ఉంటుంది.

Also Read : హరిగుణ గానమే స్నానమట

వర్షంకోసమో మరే ఫలం కోసమో కాదీ వ్రతం. నాముం నంపావైక్కు …మనం వేరు, పద్ధతి వేరు ఇది చాలా భిన్నమైనది. మన లక్ష్యం కూడా విశిష్టమే. నారాయణుని సాన్నిధ్యమే మన లక్ష్యం. ఆ పరమాత్మను చేరడానికి ఆయనే మార్గం. నాం పావై… ఇంద్రజిత్ రాముడిని జయించడానికి వేదమంత్రాలతో ఒక యజ్ఞం చేసినాడు. కాని మన యజ్ఞాలూ వ్రతాలూ అన్నీ భగవంతుని చేరుకోవడానికి, ఆ వైభవాన్ని పరమానందాన్ని అందుకోవడానికి.

ఓ రామ నీనామ మెంతో రుచిరా

పాలకడలిలో శేషతల్పమున పవ్వళించిన విష్ణుని శ్రీపాదాలను స్మరిస్తూ మోక్షాన్ని ఆకాంక్షిస్తూ సంస్కృతంలోనో ద్రవిడంలోనో ఏభాషలోనో వేదాలను గానం చేద్దాం. ఓరామ నీనామ మెంతో రుచిరా అనుకుందాం. భగవన్నామం ముందు ఈ పాలూ నేయీ ఎంత? మనకీ భౌతిక పదార్థాలు అవసరమా? తెల తెలవారు ఝామున లేద్దాం. చల్లని నీట స్నానం చేద్దాం. ఈ వ్రతం పూర్తయ్యే వరకూ కళ్లకు కాటుకా వద్దు, జడలో పూలూ వద్దు అంటున్నారు గోదమ్మ. శ్రీవైష్ణవులకు ఈ అలంకారాలతో పనిలేదు. పూలు పాలూ అలంకరణలన్నీ శ్రీకృష్ణునితో కలిసి ఉండడానికే గాని మరే ప్రయోజనమూ లేదు. మన పెద్దలు ఆచరించిన మంచి మనమూ ఆచరిద్దాం. వారు చేయని పనులు మనం చేయడం ఎందుకు? నిజానికి తండ్రి తనకు రాజ్యం ఇచ్చినా, అన్న రాముడు ఏలుకొమ్మని ఆదేశించినా, రుషులు తల్లులు పెద్దలు పరిపాలించమని కోరినా, గురువు తప్పులేదని చెప్పినా, భరతుడు రాముని పాదాలనే ఆశ్రయించాడు, ఆయన ధరించిన పాదుకలనే కోరుకున్నాడు. ఎందుకంటే సూర్యవంశంలో సింహాసనం ఎప్పుడూ పెద్దకొడుకుకే గాని చిన్నవాడు అధిరోహించరాదు. అన్న సజీవుడై ఉండగా తమ్ముడు రాజ్యాన్ని పాలించడం జరగదు. ఆ శిష్టాచారమే ధర్మమని పెద్దలు నుడివిన మాట నడిచిన బాటను భరతుడు పాటించాడు. మనసా వచసా రామపాదాన్ని రాజ్యవైభవాలకన్న మిన్నగా భావించిన భాగవతోత్తముడు, పరమ భక్తుడు భరతుడు.

పరుల గురించి చెడు పలకనిలక్షణం వైష్ణవ లక్షణం. వైష్ణవ జనతో తేనే కహియే పీడ్ పరాయీ జానీరే … ఇతరుల బాధలు తెలిసిన వాడినే వైష్ణవుడంటారని మీరా భజన బోధిస్తున్నది. మనసులో కూడా పరుల చెడు ఆలోచించరాదు. ఎందుకంటే మనసులో మెదిలే ఆలోచన అంతర్యామికి తెలిసిపోతుందని తెలుసుకోవాలి కనుక. అంతరంగ మందు అపరాథములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అన్నాడు.

తప్పు చేయడం సహజం

సీతాదేవి నిజమైన వైష్ణవ సతీమణి. తనను బాధించిన రాక్షసులకు హాని ఎప్పుడూ తలపెట్టలేదు. రామునికి ఒక్క చాడీ కూడా వారిపై చెప్పలేదు. హనుమంతుడు అక్కడ రాక్షసులు బాధించిన విషయం కళ్లారా చూసి బాధపడి, అనుజ్ఞ ఇస్తే వారిని చంపేస్తానంటాడు. అప్పుడు సీత, వారు స్వయంగా ఆ పనులు చేయలేదు, రావణాసురుడి ఆజ్ఞకు బద్ధులైన సేవకులు కదా. కొంత అతి చేసి ఉండవచ్చు. అది ఈ ధరిత్రిమీద ఉన్నవారందరు పాల్పడే పనే. తప్పు చేయని వాడెవడు నాయనా అంటుంది. నీవూ కాస్త ఆజ్ఞను అతిక్రమించావు కదా. నిన్ను రాముడు చూసి రమ్మని కదా ఆదేశించింది. కాని నీవు కాల్చి పడేశావు కదా’’ అని వివరిస్తుంది.  ఈ ధరిత్రిలో అందరూ తప్పులు చేసేవారనంటావా తల్లీ, అయితే రాముడు కూడా…’’  సీత సమాధానం ఇది. ‘‘అవును రాముడు కూడా.. శూర్పణఖ వలచి వచ్చినపుడు నేను ఏకపత్నీవ్రతుడనడం వరకు సరిపోయేది. కాని లక్ష్మణుడి దగ్గరికి పంపి, వేళాకోళమాడి అవమానించడం అతి కాదా. ఇప్పుడు ఈ దుష్పరిణామాలన్నీ వాటి పర్యవసానమే కదా హనుమా’’. వారే కాదు తానూ తప్పు చేసానని మరో సందర్భంలో ఆమె అంటారు. బంగారు లేడి ఉండదని తెలిసి కూడా కావాలని కోరడం, లక్ష్మణుడిని పరుషంగా నిందించి పంపడం తన తప్పులే అంటారామే. ఎవరో తప్పు చేశారని శిక్షించడానికి అందరూ సిద్ధ పడడం సరికాదు.  దయాగుణ సంపన్నుడై ఉండాలి, భగవద్విషయాలను జనులకు చెబుతూ ఉండాలి, ఇవే వైష్ణవ లక్షణాలు. నిత్యమూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటూ సర్వజనుల సముద్ధరణే జీవిత ధ్యేయంగా చరించడం విద్యుక్త ధర్మం.

భగవంతుడిని చేరడానికి జ్ఞాన భక్తి కర్మ మార్గాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమనుకునే వారు మార్గశీర్షంలో పయనిస్తున్నారని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి వ్యాఖ్యానించారు. రెండో పాశురంలో ఆండాళ్ తల్లి కృత్యములు అకృత్యముల గురించి తెలియజేస్తున్నారు.

వైయత్తు వాళ్ వీర్ గాళ్ , ఈ భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. భూమి తామస గుణం ఇస్తుందట. భూమిమీద ఉండగా సాత్విక గుణం కలగడం అంటే కుంపెటలో తామరపువ్వు పూసినట్టు. భగవంతుడే రాముడై వస్తే భూమిమీద తామసగుణ ప్రభావానికి లోనైనాడు. హనుమతో సీత ఈ విధంగా అన్నారట. ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజం, నీవు చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు అది తప్పు కాదా. నేనంటే తప్పు చేసానేమో మరి రాముడు కూడా తప్పు చేసాడా తల్లీ అని ప్రశ్నించాడు హనుమ. కాదా మరి.. శూర్పణఖ వచ్చినపుడు వలచినానని చెప్పినప్పుడు నేను ఏకపత్నీ వ్రతుడనని అని నిరాకరిస్తే సరిపోయేది కదా, కాని తమ్ముడిని చూపడం వేళాకోళంచేయడం అవసరం లేనిపనే కదా. అనేక పరిణామాలకు ఆనాటి ఘటనలే కారణం కాదా?

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

కర్మ తొలగాలంటే దేహం కావాలి

జీయర్ ఈ అంశాన్ని మరింత విశేషంగా వివరిస్తారు. ‘‘నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది. ఇవన్ని ఏవి లేనప్పుడు కూడా పరమాత్మ, ఈ జీవులందరూ ఉన్నారు. వారి అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు. కాని కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరి నేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు. అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు’’. వాసుదేవ రూపంతో సర్వం తన అధీనంలో ఉంచుకుంటాడు. అందులోంచి తీసిన ఒక రూపానికి సంకర్షణ అని పేరు. ఇది ప్రళయం చేయడానికి శివునిలో తానుండి మరో రూపం తీస్తాడు, అది అనిరుద్ధ. బ్రహ్మలో తానుండి సృష్టి కోసం మరో రూపాన్ని తీస్తాడు. అది ప్రద్యుమ్న. సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇంద్రునిలో ఉండి ఆ పనిచేస్తాడు. ఆర్తితో పిలిచే వారిని ఆదుకోవడానికి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అని అవతారాలను పంపడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక అన్ని అవతారాలకు మూలస్థానం పాలకడలి’’ అని జీయర్ స్వామి అత్యద్భుతంగా వివరించారు.

భగవంతుడిని చేరడానికి భగవంతుడే మార్గం

నాముం నంపావైక్కు.. ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, శెయ్యుం కిరిశైగళ్ కేళీరో.. ఏంచేద్దామో వినండి.. పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ఱ పరమనడిపాడి… ఆ పాలకడలి లో సుకుమారంగా పయనించి, తన పాదం తొలి అడుగు అక్కడ వేసి ఉన్న ఆ వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం, ఆయన్ను మించిన వారు లేరుకనుకనే పరమన్ అంటున్నారు. శిశువు తన తల్లి స్తన్యాన్ని గుర్తించినవిధంగానే భక్తుడు భగవంతుడి పాదాలను గుర్తించగలగాలి. పాలకడలిలో పరమాత్ముడు మొదట పాదం మోపినాడు. భగవంతుడిని చేరడానికి భగవంతుడే మార్గం అని చెప్పే మార్గశీర్ష పాశురం ఇది.

కొన్ని అల్పమైన పదాలలో అనల్పమైన అర్థాన్ని గుది గూర్చిచెప్పిన అద్భుత కవిత ఇది.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles