Sunday, January 5, 2025

శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

గోవింద గోదా గీతమ్ (తిరుప్పావై)

తిరుప్పావై, (సిరినోము, శ్రీ వ్రతం) పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా 12 వందల సంవత్సరాల తరువాత కూడా చిరంజీవియై భాసిస్తున్న మహాకవయిత్రి గోదా దేవి. 

గోదా దేవి నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున (క్రీ.శ. 776) తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపుతీస్తున్నపుడు జనకునికి సీత వలె, విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ.  అయోనిజ. తులసీదళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు తండ్రి.  ముద్దుగా కోదై (తులసిమాల) అని పేరు పెట్టుకున్నాడు. భూమినుంచి తులసి వచ్చినట్టే ఈ పాపకూడా వచ్చిందని మరొక అర్థం. పెంచింది శ్రీ విష్ణుచిత్తుడు. విష్ణువే చిత్తములో గలవాడు. తండ్రి ఆలోచనలు, మనసు, మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ భాసించారు. వైష్ణవ మతంలోని ప్రేమ తత్త్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించారు. పిలుపులలో గోదై, అనే పేరు కాస్త మారి గోద అయింది.  13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించిన విద్యన్మణి గోదాదేవి. అందరినీ కలుపుకుని పోయే నాయకత్వలక్షణాన్ని ఈ వ్రతం వివరిస్తున్నది.

goda devi story

మహిళా విద్యకు సజీవ సాక్షి గోదాదేవి

ఆళ్వార్ అంటే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులభేదాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్) శ్రీవిష్ణుచిత్తులు, గోద ఉన్నారు. 12 మందిలో స్త్రీ మూర్తి ఈమె ఒక్కరే.  స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై. తులసీ వనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంటనడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది.

ఆండాళ్ (నా బంగారు తల్లి)

తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే తనూ నేర్చుకున్నది గోద. తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీ మాల కోదై పూమాలలద్వారా శ్రీవిల్లిపుత్తూరులోని మూలమూర్తి వటపత్రశాయికి ప్రేమసందేశాలు పంపింది. ఆ కథల్లో అన్ని అవతారాలలో ఉన్న నారాయణుడు రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చినాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడనీ భర్త అనీ బంగారు కలలు కన్నది. వటపత్రశాయిలో రంగడిని చూసుకున్నది. తండ్రీ తానూ ఎవరు అల్లినా సరే  ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తిచెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది.

goda devi story

ఓరోజు తాను తీసుకుని పోయిన పూమాలలో అమ్మాయి శిరోజం వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతురిని మందలించాడు విష్ణు చిత్తుడు. అపరాధం చేసానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి విష్ణవే కలలో కనిపించి కోదై ధరించి ఇచ్చిన మాల అంటేనే తనకు ప్రియమని కనుక గోదమ్మ ధరించిన మాలలనే తనకు ఇమ్మని కోరుతాడు.  విష్ణుచిత్తునికి గోదా చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అర్థమవుతుంది. గోద తన కూతురు కాదు తనకు కన్నతల్లి ఆండాళ్ (అంటే నను గన్న తల్లి అని అర్థం) అని పిలుస్తాడు. అప్పడినుంచి విష్ణుచిత్తులు వారు ఆమెను ఆండాళ్ అనే పిలిచేవారు. (మనం కూడా కన్న కూతురిని బంగారు తల్లి అనీ మా అమ్మే అనీ అనుకుంటాం కదా). ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు.

శ్రీరంగని వలచి వరించి…

అప్పడినుంచి ఆమె కు వచ్చిన మరో పేరు చూటిక్కొడుత్త ( ఈ తమిళ పదానికి ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు. 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక ‘‘పాడికొడుత్త నాచ్చియార్’’ అని మరో పేరుకూడా వచ్చింది. పెరియాళ్వార్ కు అమ్మాయికి వరుడిని వెదికే బరువు దిగిపోయింది. కూతురు కోరినవిధంగా విష్ణువు కూడా వరించినాడు కనుక మనసు నెమ్మదించింది. ఇక గోద నెలరోజుల పాటు దీక్షవహించి శ్రీ వ్రతం, (సిరినోము, కాత్యాయనీ వ్రతం, తిరుప్పావై) పాటించింది. తాను రాధ అయితే తోటి బాలికలు గోపికలు, విల్లిపుత్తూరే బృందావనం, వ్రేపల్లె,  అక్కడ ప్రవహించే నదే యమునానది, వటపత్రశాయే క్రిష్ణయ్య, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకున్న భాగవత కథలు, ఉపనిషద్ సూత్రాలు, వేదసార వాక్యాలే పాశురాలు. వరిచేలు, తుళ్లిపడే చేపలు, చిలుకలు, కొంగలు, ఆవులు దూడలు, మల్లె పొదలు, తులసీ వనాలు అన్ని బృందావనానికి ప్రతిబింబాలే. తొందరగా లేవవేం తల్లీ, లేచినా తలుపు తీయవా, తలుపు తీసినా లోపలికి రానీయవేమిటి అంటూ కొద్దిగా కోపం చూపే కలహాలు, మందలింపులు, అంతలోనే కలిసిపోయే స్నేహాలు ఇవన్నీ ఆమె పాశురాల్లో ఆశువుగా కురిసాయి. ఒక్కో పాశురం అర్థం తెలిసి చదువుతూ ఉంటే ఆనాటి యమునా తీర విహారి రాసలీలలు చూస్తున్నట్టు తోస్తుంది. భాగవత భావగత కథాకథనాలను కళ్లకు కట్టే దృశ్యకావ్యం తిరుప్పావై. వ్రతం పూర్తికాగానే ఫలం సిద్ధించింది. రంగడు  శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కన్పించి పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకుపంపి గోదను విష్ణుచిత్తులవారిని తీసుకొని రమ్మన్నాడు. గోదను వివాహం చేసుకున్నాడు. గోద రంగనాథునిలో లీనమైంది. గోదాదేవి కథ ఒక అద్భుతం. ఎనిమిదో శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్ర.

మరో మహా కావ్యం

శ్రీరంగనాథుని ప్రేమించిందనడానికి ప్రమాణం ఏమిటి? ఇది కట్టుకథ అని వాదించే వారుంటారు.  దీనికి ప్రమాణం గోదాదేవి పదిహేనేళ్లప్రాయంలో రచించిన మరో కావ్యం ‘‘నాచ్చియార్ తిరుమెళి‘‘ నాయకి రచించిన పవిత్రగీతాలు అని అర్థం. రంగనాథుని వలచిన గోదాదేవి తన వలపు, రంగనికి పంపిన ప్రేమలేఖలు, తన భావావేశ అనురాగ సందేశాలు, ఆశలు, ఆశయాలు, అలకలు, కోపాలు ఇందులోని 143 పాశురాలలో వ్యక్తమవుతాయి. నాచ్చియార్ తిరుమోళి గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత కావ్యమైతే తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనంచేసిన మహాద్భుత కావ్యం. రెండు కావ్యాలూ భక్తిని పరమాత్మపట్ల సమర్పణ భావాన్ని, రంగని వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి.

ఓం నమో నారాయణాయ

తిరుప్పావై ఉపనిషత్తుల సారాంశం. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషద్ అని వర్ణించినట్టే గోదాదేవి తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయంలోనే పఠించాలి. కనుక తిరుప్పావైని కూడా సూర్యాస్తమయం తరువాత అనుసంధానించకూడదంటారు. ఓంకారానుసంధానంతో వేదాల అధ్యయనం ఆరంభమవుతుంది. ఓంకారంతోనే ముగిసిపోతుంది. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగువేల కవితలను నాలాయరమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవైద్యం తరువాత సాగే మంగళా శాసనం. నాలాయిర ప్రబంధ పారాయణం తిరుప్పావై తో ముగుస్తుంది. అంటో ప్రణవనాదంతో ముగుస్తుందని అర్థం. ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదంలేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు.

అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, తిరుమంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ చెప్పినాడు రామానుజుడు. కులమతభేదాలు లేకుండా అందరికీ నారాయణుని చేరే జ్ఞాన వ్రత మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ. రామానుజుడిని తిరుప్పావై జీయర్ అంటారు. గోదాదేవి పుట్టి శ్రీరంగనిలో లీనమైన రెండువందల సంవత్సరాల తరువాత జనించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం, తరువాత తనకు రంగనితో వివాహ మైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో సుందర బాహుస్వామికి వేయిబిందెల పాయసం చేయిస్తానని పెట్టుకున్న మొక్కును రామానుజుడు తీర్చడం మరో కారణం. భగవంతుడిలోలీనం కావడం వల్ల గోదా ఆ మొక్కు తీర్చలేకపోయారు.

ధనుర్మాసం

థనుర్మాసం సూర్యమానంలో తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. చాంద్రమానంలో తెలుగువారు లెక్కించే మార్గశీర్ష మాసంలో మొదలవుతుంది. ఆమె రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. శంగత్తమిళ్ ముప్పదుం అంటారు. అందమైన తమిళంలో రచించిన 30 కవితలు. ఎనిమిది పాదాల్లో ఎంత అర్థం గుమిగూర్చారో తెలుసుకుంటే ఇది ఎంత గొప్ప కావ్యమో అర్థమవుతుంది. కథ వలె ఉంటుంది కథ కాదు. పురాణాల ప్రస్తావన ఉంటుంది కాని పురాణం కాదు. రామాయణ ఘట్టాలు వస్తాయి, రామాయణ కావ్యం కాదు. భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు ఉటంకిస్తారు. కాని పూర్తి భాగవతం కాదు. విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కాని సిద్ధాంత తత్వ గ్రంధం కాదు. ఇదొక బోధన, సాధన, పిలుపు, వ్రతం, ఆరాధన, ప్రేమరసాత్మం. భక్తిభావ బంధురం.

గోవిందునికి మేలు కొలుపు

తిరుమల తిరుపతిలో ఈ ముఫ్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. తిరుప్పళ్లియజిచ్చి అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పద్యాల తరువాత తిరుప్పావు పాశురాలు వింటాడు, గోదమ్మ రోజూ పాడే గీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాస గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంధ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు30 రోజులు సాగుతాయి. పొద్దున్నే తిరుప్పావై పారాయణాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు ప్రబోధాలు. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వందల మంది వైష్ణవాచార్యులు. మహిళా శిరోమణులు తిరుప్పావై అర్థ తాత్పర్యాలను వివరిస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలలో విస్తృతంగా తిరుప్పావై పారాయణాలు జరుగుతాయి.  ఈ 30 గీతాలను కర్ణాటక శాస్త్రసంగీతకారులు కీర్తనలుగా పాడారు. నాట్యకీర్తనలుగా కూడా పాశురాలు భాసిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని వందల చోట్ల తిరుప్పావై కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఈ సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మికోద్యమం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఈ పాశురాలను తెలుగులోకి అనువదించారు. ఇది చాలా గొప్ప వైష్ణవ భక్తి సాహిత్యంగానే కాకుండా, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా కూడా తిరుప్పావై గొప్ప రచన గా భావిస్తున్నారు.

శ్రీకృష్ణుడే చెప్పిన వ్రతం

శ్రీ కృష్ణుడుండేటి అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చి అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి ఏం చేద్దాం అని అడిగారు. ఆదుకోమన్నారు. దీనికేదైనా వ్రతముంటే చేద్దాం అని గోపకులంలో పెద్దవారు సూచించారట. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో ఈ వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించారు. మన వ్రతం పెందల కడ మొదలవుతుంది. కనుక మీరంతా తెల్లవారు ఝామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడా గోవిందుడు.

మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్నఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రిగడిపారు. తెల్ల వారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య, కనుక ముందే లేచి అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నేపథ్యం.

మన యేడాది, దేవతలకు ఒక రోజు. మన ఉత్తరాయణం వారికి దినంలో తొలి అర్థభాగం. ఉత్తరాయణానికి ముందు వచ్చే నెల మార్గశిర మాసం అంటే దేవతలకు తెల్లవారుఝాము. మార్గశిరం మొత్తం బ్రహ్మ ముహూర్తమని అర్థం. అందులో తొలి పక్షం (శుక్లపక్షం), వెన్నెల నిండిన రాత్రి గడిచి, వస్తున్న తెల్లవారుఝాము. దానికి కాస్త ముందటే లేచి నదీ స్నానంచేసి శ్రీకృష్ణుడిని చేరుకుంటే వ్రతసాధనాలన్నీ ఆయన సమకూర్చుతాడు. రండి రండి అంటూ తొలి పాశురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. గోపికలు నారాయణుని కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాశురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు. గోపకులంలో అంతా సంపన్నులే. శ్రీకృష్ణుడంటే ఆనంద స్వరూపుడైన నారాయణుడే. గోపకులానికి నాయకుడు, నారాయణుడి తండ్రి నందగోపుడు. అంటే అందరి ఆనందమైన నారాయణుడిని రక్షించే వాడు నందగోపుడు. యశోదా దేవి నోముల పట్టి ఈ నారాయణుడు. శ్రీ కృష్ణుడు బాల సింహము. నీలమేఘ శ్యాముడు. ఆయన నయనాలు అరుణ నయనాలు. సూర్యచంద్రులతో సమానమైన నయనాలతో భాసిల్లే వదనం ఆయనది. ఆ నారాయణుడే మన సాధనం, ఆ నారాయణుడే మనకు సాధనం ఇస్తాడు. ఆ నారాయణుడే మన సాధనకు లక్ష్యం. పదండి, త్వర పడండి. లేవండి వెళదాం…అని రారమ్మంటున్నది గోదమ్మ ఈ పాశురాల్లో.

గోదా గోవింద గీతం

శ్రీహరి నామాన్నే నిరంతరం కీర్తించడం, అతనే దిక్కని శరణాగతి చేయడం, తోటలో పూలు, తులసీదళాలు కోసి స్వామికి అర్పించడం గోదాదేవి జీవన చర్యలుగా మారిపోయాయి. గోపికలు శ్రీ కృష్ణుడినే భర్తగా భావించారని, ఆయనే భర్తగా పొందాలని పరితపించారని, అందుకు ఒక వ్రతం కూడా చేశారని తండ్రి సత్కథా కాలక్షేపం చేస్తూఉంటే విన్న గోదాదేవికి ఆమాటలు మనసులో నాటుకుని పోయాయి. మా శ్రీవిల్లిపుత్తూరు వ్రేపల్లె కాదా, మా వటపత్రశాయి క్రిష్ణయ్య కాదా, నేను గోపికను కాలేనా, ఆ వ్రతం చేయలేనా అని యుక్తవయస్క అయిన గోద లో ఈ భావాలు ప్రశ్నించాయి. ఆ వ్రతమే తిరుప్పావై. ముఫ్పయ్ పాశురాల గోదా గోవింద గీతం ఇది. మొదటి అయిదు పాశురాలు ఈ వ్రత నియమాలు విధివిధానాలు పరిచయం చేసేవి. తరువాత పది పాశురాల్లో గోదాదేవి పదిమంది గోపికలను (ఆళ్వారులను) ఏ విధంగా పలకరించారో, నిద్రలేచిరమ్మని పిలిచారో వివరిస్తారు. వారిని తీసుకుని నందగోపుని భవనానికి వెళ్లి అక్కడ భవన పాలకుడిని, ద్వార పాలకుడిని మేల్కొలిపి భవనంలోకి వెళ్తారు. అంత: పురంలో నందుడిని, యశోదాదేవిని, బలరాముడిని నిద్రలేపుతారు. శ్రీ కృష్ణుని నిద్రలేపే పాశురం ఒకటి, నీలాదేవికి సుప్రభాతం మరొకటి. వచ్చి సింహాసనాన్ని అథిష్టించవయ్యా కిష్టయ్యా అని పాడే పాట ఇంకొకటి. ఆయన గంభీరంగా వేంచేయగానే మంగళాశాసనం పాడతారు, వచ్చిన పని నివేదిస్తారు. నిన్నెప్పుడూ సేవించే మహాభాగ్యం ఇమ్మంటారు. 16 నుంచి 30 వ పాశురం దాకా ఈ అంశాలు ఉంటాయి. ఇదే తిరుప్పావై. ఇదే వ్రతం చేయడమంటే. శ్రీకృష్ణుడిని సన్నిధానం కన్న ఇంక కావలసేందేమిటి? ఆయన కోసమే ఈ వ్రతం. ఆయనే వ్రత విధానం, ఆయనే వ్రత సాధనం.

ఇది మధురమైన భక్తి, భగవంతుడిని భర్తగా భావించే భక్తి. గోపికల భక్తిని రసమయ భక్తి అన్నారు. శృంగారం ఒక రసం. కాని పతిపత్నీభావం శృంగారరసం కాదు. అదీ భక్తి రసమే. నారాయణుడితో ప్రణయ భావం. అమలిన శృంగారం ఇది. మన మనసుకు తోచే కామం కాదు. నిరంతరం పతిధ్యానంలో ఉండే పతివ్రత వలె, అనురాగమయి అయిన భార్యను నిరంతరం పరిశుద్ధంగా ప్రేమించే భర్తవలె భగవంతుడి పట్ల అనురాగ రంజితంగా ఉండే ఈ ప్రేమలో కామం వాసన ఉండదు. భర్త భార్య ఏకాత్మభావనతో జీవాత్మ పరమాత్మలో కలిసిపోయే అద్భుత భావన ఇది. మగవారు ఆడవారు అని మన లెక్క. కాని భగవంతుని ముందు అందరూ స్త్రీలే అని, ఆయన పురుషోత్తముడైన పరమాత్ముడనీ, జీవాత్మ జగత్పతి అయిన పరమాత్ముడిలో కలవడానికి పత్నిభావపు గోపికలుగా మారి భక్తిమార్గాన్ని అనుసరించాలని బోధిస్తూ  పత్నీభావాన్ని వివరిస్తున్నారు.  భక్తులంతా గోపికలై వ్రతం ఆచరించి విష్ణువులో కలిసారని ఉదాహరణ గా చూపడం తిరుప్పావై అర్థం. తిరుప్పావైలోని పదంలో పాదంలో పాశురంలో ప్రవహించేది ఈ మధుర సమర్పణభావనా రసమే. ఈ జ్ఞాన బోధన చేసి వ్రత సాధన చెప్పింది గోదా దేవి.

ఎల్లుండి (బుధవారం, 16 డిసెంబర్ 2020) నుంచి సంక్రాంతి దాకా రోజూ ఒక పాశురం అర్థం తెలుసుకుందాం.

-మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

  1. చాలా చక్కగా వివరించారు సర్ , ఇది చదివి నేను అందరికీ తిరుప్పావై గురించి చెప్పగలిగాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles