19. గోదా గోవింద గీతం
గోదాదేవి బృందావనంలోలోని శ్రీకృష్ణుని అభిమానుల బృందానికి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నది. పది పాశురాల ద్వారా గోపికలను, పదిమందిని ఆళ్వార్లను నిద్రలేపి తనవెంట తీసుకు వచ్చి నీళాకృష్ణులున్న వైభవ భవనానికి గోదాదేవి చేరుకున్నది. ఆ భవనం అనేకానేక దీపకాంతులతో కళకళలాడుతున్నది. తనయులను కాపాడడానికి పోటీ పడే అమ్మానాన్నల ఆతురతను శృంగారపరంగా ప్రకటించే పాశురం ఇది. పైకి శృంగార రస భరితంగా కనిపించినా ఈ పద్యంలో భగవత్ తత్వ నిరూపణే జరిగిందని వివరిస్తారు శ్రీ భాష్యం అప్పలా చార్య స్వామి వారు.
Also read: లక్ష్మి కరుణిస్తేనే నారాయణుని అభయం
కుత్తు విళక్కెరియ క్కొట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ఱ పంజశయనత్తిల్ మేలేఱి,
కొత్తలర్ పూంజ్ఞల్ నప్పిన్నై కొంజ్ఞైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బావాయ్ తిఱవాయ్,
మైత్తడం కణ్ణినాయ్ నీ ఉన్ మణాళనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళవొట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్ఱు తగవేలో రెంబావాయ్
తెలుగు భావార్థగీతిక
మణిరత్నదీప స్తంభ సంచయముల ధగధగల మధ్య
దంతపు కోళ్ల పట్టెమంచముపైన పట్టుపరుపు మీద
శుభలక్షణాన్విత సుందర సురుచిర శయనమందిరాన
మేను వాల్చిన నప్పిన్న నీళ ఉత్తుంగ స్తనగిరులపైన
తలలోన తురిమిన అర్థవికసితపుష్పసుగంధములు చెలగ
ఒదిగిన మాధవయ్య ఒక మాటైన మాకొరకు పలకవయ్య
కంటికాటుకచీకటిని శ్యామసుందరు దాచుట నీ గుణము కాదు
నీళ నీ కౌగిలి బిగి సడలించి కృష్ణునొకింత మాకొదలవమ్ము
ప్రతిపదార్థాలు
కుత్తువిళక్కెరియ= గుత్తుదీపాలు, ఎఱియ= వెలుగుతూ ఉండగా, కొట్టుక్కాల్= దంతంతో చేసిన కోళ్లుగలిగిన, కట్టిన్ మేల్=మంచముపైన, మెత్తెన్ఱ= మెత్తనైన, పఞ్చశయనత్తిన్ మేల్= ఐదుగుణములు గల పాన్పుపైన, ఏఱి= ఎక్కి, కొత్తు= గుత్తులుగా ఉన్న, అలర్ = వికసించిన, పూజ్ఞుక్కళల్ = పూలుముడిచిన కొప్పుగల, నప్పిన్నై= నీళాదేవి, కొజ్ఞైమేల్ =స్తనములపై, వైత్తుక్కడన్ద= శరీరమును ఆనించి పడుకున్న, మలర్= వికసించిన మార్ పా= వక్షస్థలము గలిగినవాడా, వాయ్ తిఱవాయ్= నోరు తెఱచి ఓ మాట చెప్పు, మై= కాటుక పెట్టుకుని, తడమ్= విశాలమైన, కణ్ణినాయ్= కన్నులు గలదానా, నీ= నీవు, ఉన్మణాళనై= నీ వల్లభుని, ఎత్తనైపోదుమ్= కొంతసేపడికైనా, తుయిలెళవొట్టాయ్ కాణ్= లేవనీయవా ఏమి, ఎత్తనైయేలుమ్= ఎంతమాత్రమైనా, పిరివు= తెఱపి ఎడబాటు, అత్తగిల్లాయ్=ఓర్వలేవా, ఆల్ = ఆశ్చర్యము, తత్తువమన్ఱు= నీ స్వరూపము కాదు కదా తకవన్ఱు= నీ స్వభావమూ కాదు కదా?
Also read: ఆబోతుల పొగరణచి నాజ్ఞజితిని గెలిచిన శ్రీకృష్ణుడు
‘‘దీపపు శెమ్మెల మధ్య ఏనుగుదంతాల కోళ్లతో చేసిన మంచం మీద మెత్తని పత్తి పాన్పుపైన, వికసిస్తున్న పుష్పాలను కొప్పులో తురిమిన నీళాదేవి ఎదపై ఒరిగి నిద్రిస్తున్నక్రిష్ణయ్యా మమ్ము చూడు, విప్పారిన కాటుక కన్నుల నీళమ్మా, ఆయన్ను నిద్రలేవనీయవా, ఒక్క క్షణమైనా ఆయన్ను వదలడం సహించలేవా, ఇది నీ స్వరూపానికి తగదమ్మా, ఇది నీ స్వభావమూ కాదమ్మా…’’ అని గోపికలు గోదమ్మ నాయకత్వం లో నీళా భవనానికి వచ్చి లోనున్న నీళాకృష్ణులతో సంభాషించి సంభావించే మధుర గీతం ఇది.
బాపు రేఖావ్యాఖ్య
గోదా దేవి శ్రీకృష్ణ పరాక్రమాన్ని, సౌందర్య శృంగార వైభవాన్ని గోదాదేవి అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారీ 19వ పాశురంలో. కంసుడు తనపైకి పంపిన కువలయా పీడమనే ఏనుగును మట్టుబెట్టి ఆ ఏనుగు దంతాలతో తన శయనాగారంలో మంచం తయారుచేయించారు. ఏనుగు దంతాలు ఆయన వీరత్వానికి ప్రతీక. ఆ దంతపు కోళ్ల మంచంపైన మెత్తని, తెల్లని, విశాలమైన, వెచ్చని సుగంధాలు విరజిమ్మే పరుపు. తన భర్త శ్రీ కృష్ణుడు అలసిపోయి నిద్రిస్తున్నారు. వీరపత్ని అయిన నీళాదేవి కూడా ఆ తల్పంపైన శ్రీకృష్ణుని ఎదపై శయనించి ఉంది. ఆ మంచంలోంచి లేవడానికీ, ఆయన్ను లేపడానికీ సంకోచిస్తున్నది. ఎవరో వచ్చారని తెలిసిన నీళాదేవి ‘‘వచ్చిన వారితో నేనే మాట్లాడతాను. ఆయనను లేపడం ఎందుకు’’ అని ఆలోచిస్తున్నది. ‘‘ఏమమ్మా ఒక్క క్షణమైనా ఆయన్ను వదలవా, క్రిష్ణయ్య నిద్రలేవడానికి సమ్మతించవా’’ అంటూ ‘‘ఇది నీ లక్షణం కాదు కదమ్మా’’ అంటున్నారు బయట వేచిఉన్న గోదా గోపికలు. అయినా భర్తకు నిద్రాటంకం జరగకూడదని నీళాదేవి అనుకుంటూ ఉంటే, ‘‘నీవు నచ్చజెప్పి మాదగ్గరకు పంపాల్సింది పోయి, కనీసం లేపనైనా లేపవా తల్లీ’’ అని వేడుకుంటున్నారు గోపికలు.
Also read: తిరుమంత్రమై శ్రీకృష్ణుని కాచే యశోద
‘‘ఇంత పొద్దున్నే ఏమిటీ అల్లరి అని ఊళ్లో పెద్దలు అంటారేమోనని మేము ఇంకా చీకటి విడిపోకముందే చిన్న దీపపు కాంతిలో వెతుక్కుంటూ వచ్చాం. నీవేమో లోపల అనేకానేక దీపాలు వెలిగించి రాత్రిని పగలుగా మార్చి శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఆరాధిస్తూ చూస్తూ కూర్చున్నావు. మా ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తే కదా నీ అనుభవం పరిపూర్ణమయ్యేది? రాముడు సీత ప్రేమతో వెలిగిపోయాడు ఆయనకు వేరే దీపాల కాంతి ఎందుకు. నీవు శ్రీకృష్ణుని వైభవాన్ని వెలిగించే దీపపు శెమ్మెవు. ఇంకా వేరే దీపాలెందుకు. మాకు దూరంగా ఉన్నందుకునీకు బాధగా ఉండాలి కదా మెత్తని పరుపు కఠినంగా అనిపించాలి కదా అదేమీ లేదా, హాయిగా నూలు పరుపు మీద పడుకున్నావా? కృష్ణుడికి దూరంగా ఉన్న మా బాధను అర్థం చేసుకోలేవా?’’ అని బతిమాలుతున్నారు గోపికలు.
Also read: నందరాజు సుపాలన చెప్పే పాశురం
పరాశర భట్టర్
రామానుజుని శిష్యుడు, ఆయన అనంతరం పీఠాధిపతి అయిన పరాశర భట్టర్ (కూరేశుల కుమారుడు) ఈ పాశురార్థాన్ని సంస్కృత శ్లోకంలో సమంగా కూర్చారు. ‘‘నీళాతుంగ స్తన గిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం పారార్థ్యం శృతిశ్శతశ్శిరం సిద్ధం అధ్యాపయన్తీం, స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుజ్ఞ్తే గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః’’ తన ప్రియురాలు వీరపత్ని, నీళాదేవి ఎదపై నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిని మేలుకొలిపి, వేద వేదాంత సారాన్ని చెప్పి, తాను ధరించిన పూమాలలను ప్రేమలేఖలుగా పంపి, బలవంతంగా భగవదనుభవాన్ని సాధించిన గోదాదేవికి నమస్కరిస్తున్నాననే శ్లోకం.తన వారిని ఆదుకొమ్మని కోరుకున్న గోదా జీవన చిత్రాన్ని మనకు ఆవిష్కరించిన శ్లోకం. ఇది తిరుప్పావై సారాంశం.
Also read: నందుని భవనమే మంత్రము, నందుడే ఆచార్యుడు