4. వారణమాయిరమ్ (గజ సహస్రం)
నాల్ దిశై త్తీర్ త్తమ్ కొణురున్దు నని నల్గి
పార్ ప్పన చ్చిట్టర్గళ్ పల్లార్ ఎడుత్తేత్తి
పూప్పునై కణ్ణిప్పునిద నోడెన్ తన్నై
కాప్పు నాణ్ కట్ట క్కనా క్కండేన్ తోలీ నాన్
ప్రతిపదార్థాలు
నాల్ = నాలుగు, దిశై = దిశల నుండి, త్తీర్ త్తమ్ = పవిత్ర జలాలను, కొణురున్దు = తీసుకుని, నని = వినయంగా వంగి, నల్గి = ఇస్తూ, పార్ ప్పనచ్చిట్టర్గళ్ =వేదమూర్తులైన విప్రోత్తములు, పల్లార్ = వారి మిత్రులు, ఎడుత్తేత్తి = గొంతెత్తి శ్రావ్యముగా, పూప్పునై = పూలతో అలంకరించి, కణ్ణి =మాలలు కట్టి, ప్పునిద నోడు = పవిత్రాచారములు పాటించి పావనుడైన రంగనాథుడిని, ఎందన్నై, నాకు కాప్పు = పచ్చని పసుపుతాడుతో చేసిన, నాణ్ కట్ట, మణికట్టుకు కట్టినట్టు, క్కనా క్కండేన్, కల గన్నానే, తోలీ నాన్ = చెలీ నేను.
తెలుగు కవిత
నాలుగు దిశలనున్ననదీజలాలతోడిదెచ్చి
వెలుగులీను కల్యాణవేదిక ప్రోక్షించి వేద వి
ప్రులు ఆశీస్సులిచ్చి వరరంగనికి నాకున్ పూ
వులు రక్షలు మణికట్టు గట్టినట్లు కలగంటినే చెలీ
గోదాదేవి తన వివాహం గురించి కన్నకల వివరిస్తున్నట్టు కనిపిస్తున్నా ఇందులో పద్థతిగా జరిగే వివాహంలో ఏ యే ప్రక్రియలు ఉంటాయో తెలిసిపోతుంది. పది పాశురాలలో గోదమ్మవారు పది ప్రక్రియలను ప్రస్తావిస్తారు. ఒకటి – వరుడుగా నారాయణుడు శ్రీ విల్లి పుత్తూరు (తన అత్తవారింటికి) వేంచేయడం, రెండు- పందిరిలో వరుడితో కూర్చుని ముహుర్త నిశ్చయం చేయడం, మూడు- అన్న, సోదరి తదితర పెద్దలు వచ్చి ఆశీర్వదించడం వివాహాది క్రతువులు చర్చించడం గురించి వివరించారు. నాలుగో రోజున తీర్థ ప్రోక్షణము, రక్షాబంధనము గురించి గోదాదేవి తన కల వివరిస్తున్నారు. క్కనా కండేన్ తోటీ నాన్ అంటే కల కంటిని చెలి నేను అని ప్రతిపాశురానికి మకుటాన్ని అమర్చారు.
Also read: దిగి వచ్చిన ఇంద్రుడు దుర్గామాత
శ్రీకృష్ణుని జనన సమయంలో నందుని ఇంటిలో పుట్టిన బాలిక శ్రీమన్నారాయణుడి ఆజ్ఞచే బాలికగా అవతరించిన విష్ణుమాయ, దుర్గాదేవిగా పవిత్రములయిన వస్త్రాలను మధుపర్కాలను తీసుకుని వచ్చారు. భవాని దగ్గర కూచుని గోదాదేవిని కొత్త వస్త్రాలతో మధుపర్కాలతో అలకరించారు. పట్టుచీరను సవరించింది. వరమాలలను తెప్పించి మెడలోవేసినారు. సిగలో సుగంధ పూరితములైన సందుర పుష్ఫములను తురిమినారు.
నాలుగు దిశలనుంచి తీర్థమును తెచ్చి ప్రోక్షించి బ్రాహ్మణోత్తములు ఆశీర్వదించగా పూమాల ధరించిన పవిత్రునవితో రక్షాబంధనము కట్టినట్టు కలకన్నానే చెలీ అని గోదాదేవి చెలికత్తెకు చెబుతున్నారు. వివాహకార్యక్రమం ఆరంభమవుతున్నదన్నమాట. కంకణం తో కీలకమైన కల్యాణ ప్రక్రియ ఆ కల. శ్రీరామచంద్రుని పట్టాభిషేకానికి సుగ్రీవుడి ఆజ్ఞపై వానర వీరులు నలుదిక్కులకు శరవేగంగా నాలుగు సాగరాలనుంచి తీర్థం తీసుకురావడానికి వెళ్లారు. ఆ జలం రాగానే ఆ పవిత్ర జలాలతో రక్షాబంధన స్థలాను తదితర వస్తువులను ప్రోక్షించారు. ఆశీర్వదించారు. దర్భ పవిత్రలను ధరింపజేశారు.పెళ్లి పీటలమీద కూర్చోబెట్టారు. కార్యక్రమం నిర్వహించే కీలకమైన వ్యక్తులు ఆ మంగళ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి రక్షణ ఇవ్వడానికి వీలుగా రక్షాబంధనం చేస్తారు. పసుపు తాళ్లను పేని, మామిడి ఆకులకు చుట్టి, మణిబంధంగా కట్టడానికి, కంకణాలను తయారు చేసి, పూజ అంటే షోడశోపచారాలు చేసి, అంటే అర్ఘ్య పాద్య ఆచమనీయ, స్నాన, వస్త్ర, నైవేద్య, మంగళ హారతులు ఇస్తారు. తరువాత వధువుకు, వరుడికి వారి తల్లిదండ్రులకు ధరింప జేస్తారు.
Also read: పెళ్లిపందిరికి వరరంగడు చేరినాడు
Also read: గోదాదేవి రచించిన వారణమాయిరమ్ – వేయేనుగుల కల