5. వారణమ్ ఆయిరమ్, (గజ సహస్రం)
నిన్న, నాలుగుదిశలనుంచి పవిత్ర జలాలు తెచ్చి సంప్రోక్షించి, విప్రోత్తముల ఉచ్ఛైస్స్వరమంత్రఘోష మధ్య పసుపు పచ్చని రక్షాబంధమును తన మణికట్టుకు శ్రీరంగనాథుడు ధరింప జేసినట్టుకల గన్నవిషయం వివరించారు. వివాహ కార్యక్రమంలో తరువాత ప్రక్రియ మధురాధిపతి అయిన శ్రీకృష్ణస్వామిని పెళ్లిమంటపానికి తోడ్కొని రావడం, ఆయన గంభీరంగా రావడం.
కదిరొళి దీపమ్ కలశం ఉడన్ ఏన్ది
శదిరిళ మంగైయర్ తామ్ వందెదిర్ కొళ్ల
మదురైయార్ మన్నన్ అడినిలై తొట్టు ఎంగుమ్
అదిర ప్పుగుద క్కనాక్కండేన్ తోళీ నాన్
కదిరొళి దీపమ్ కలశం = సూర్యునివలె ప్రకాశిస్తూ మంగళ కాంతులు విరాజిల్లే సువర్ణకలశములను,ఉడన్ ఏన్ది = తమ చేతులలో ధరించి, శదిరిళ మంగైయర్ తామ్=చతురులు మనోహరులైన యువతులు,వన్దు = వినయవిధేయతలతో వచ్చి, ఎదిర్ కొళ్ల = ఎదుర్కొనగా, మదురైయార్ మన్నన్ = శ్రీమధురానగర వాసులకు రాజువైన శ్రీకృష్ణస్వామి,అడినిలై= తన పాదుకలను, తొట్టు = సమీపంలో ఉండే వారి దగ్గర ఇచ్చి, ఎజ్ఞుం అదిర = భూమి దద్దరిల్లిపోయేట్టు, ప్పుగుద= నడిచివచ్చినట్టు, నాన్ కనాక్కండేన్= నేను కలగన్నానే,తోళీ = చెలీ.
వారు తెలివిలో చక్కదనంలో కూడ మనోహరులైన యువతులు. సూర్యునివలె ప్రకాశిస్తూ మంగళకరమైన కాంతులు విరజిమ్మే దీపములతో కూడిన బంగారు కలశాలనెత్తుకుని ఎంతో వినయంగా ఎదురు వస్తుండగా ఆ మధురాధిపతి శ్రీకృష్ణస్వామి తన పాదుకలను అక్కడ దగ్గరలో ఉన్నవారికి ఇచ్చి, నేల అదిరేట్టు గంభీరంగా నడచి వస్తున్నట్టు నేను కలగన్నానే చెలీ అని గోదాదేవి వివరిస్తున్నారు.
Also read: గోదారంగనాథ కల్యాణ కంకణ ధారణ
తెలుగు కవిత
కాంతులు విరజిమ్ముమంగళ దీపకళికలు దాల్చి
కాంతలు స్వర్ణకలశమ్ములతోడశ్రీకాంతునికెదురేగ
అంతలో అక్కడి చెలునికి తన పాదుకలనిచ్చి వేదిక
చెంత గంభీరగమనుడేతెంచినట్లు నే కలగంటినే చెలీ..
ఈ పాశురంలో గోదాదేవి గంభీరగమనుడైన కృష్ణుడిని మధురానాథుడని పిలుస్తున్నారు. మధురాధిపతి అంటే కేవలం మధురానగరానికి రాజని మాత్రమే అర్థం కాదు. శ్రీ వల్లభాచార్యులు రచించిన విధంగా మధురాధిపతే రఖిలం మధురం అన్నట్టు, తన వారికి మధురమైన లీలలు చూపేవాడు, తీయనైన మనసు వాడు. మనసులు తీయగా మార్చువాడు అని అనేకానేక అర్థాలు రాబట్టగల మాధుర్యం ఆ పేరులో ఉంది.
ఒక శ్రీకృష్ణ భక్తుడికి ఒకనాడు శ్రీకృష్ణ విగ్రహం దొరికిందట. ఆయన ఎంతో మురిపి పోయాడు. పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఆ విగ్రమాన్నే ఊహించుకుంటూ ఏ పేరుతో పిలుద్దామా అని ఆలోచిస్తూ పడుకున్నాడట. కలలో కనిపించి ఆ స్వామి మధురాధిపతి అని పిలుచుకోవోయ్ అని చెప్పాడట.
Also read: దిగి వచ్చిన ఇంద్రుడు దుర్గామాత