10 వారణమ్ ఆయిరం (గజసహస్రం)
కుజ్ఞుమ మప్పిక్కుళిర్ శాన్దం మట్టిత్తు
మజ్ఞల వీది వలంశెయ్ దు మణనీర్
అజ్ఞవనోడుముడన్ శెన్ఱజ్ఞానైమేల్
మఞ్జన మాట్టక్కనాక్కణ్డేన్ తోళీ నాన్
ప్రతిపదార్థములు
కుజ్ఞుమం అప్పి= దేహమంతా కుంకుమను జల్లి, కుళిర్ శాన్దం మట్టిత్తు = శీతలమైన చందనమునలది, మణనీర్ = సుగంధ ద్రవ్యములతో కూడిన వసంత జలములచేత, మజ్ఞల వీది = మంగళకరంగా అలంకృతమైన నగరవీధులలో,వలంశెయ్ దు= ఊరేగింపుగా వచ్చి, అజ్ఞు = ఆ వీధులలో, ఆనైమీల్ = మత్తగజముపై నున్న, అవనోడుం = శ్రీకృష్ణునితోడ, శెన్ఱు = వెళ్లి, ఉడన్ = అతని తోడ, మఞ్జన మాట్ట = వసంత జలముతో క్రీడించినట్టు, క్కనాక్కణ్డేన్ = కలగంటినే,తోళీ నాన్ = చెలీ నేను.
శీతల చందనగంధముల్ధరించి, మేనిన్కుంకుమలనలదుకుని,
అతులిత సుగంధ ద్రవ్యములు జల్లగ, మంగళాలంకృత వీధులన్
పతిశ్రీకృష్ణుడితోడ మత్తగజారోహణము జేసి ప్రదక్షిణలొనర్చుచు, వ
సంత జల క్రీడలనాడి పరవశించిన రీతిన్ నే కలగంటినే చెలీ.
గోదాదేవి తను కల గన్న మరో కల్యాణ ఘట్టాన్ని వివరిస్తున్నారు పదవ పాశురంలో. శ్రీకృష్ణుడు మహాగజారూఢుడై శోభాయమానంగా వస్తున్నాడు. ఆయనదేహమంతా కుంకుమ జల్లినారు. చల్లని చందనగంధాలు అలదినారు. సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడే వసంతజలాలతో, మంగళ తోరణాలతో అలంకరించిన వీధులలో ప్రదక్షిణంగా ఊరేగింపులో వస్తున్న ఆయనతో పాటు గజారోహణ చేసిశ్రీకృష్ణుడు నేను వసంత జలములను జల్లుకుంటూ క్రీడించినట్టు నేను కలగన్నానే చెలీ అంటున్నారామె.
వివాహమహోత్సవ ప్రక్రియలో గోదా రంగనాథుల కల్యాణం, వధూవరుల గజారోహణ ఊరేగింపులు వసంతోత్సవంతో ముగుస్తున్నది.మంజిల్ నీరాట్టం అనే ఈ మంగళస్నాన కార్యక్రమంతో వివాహ వైదిక ప్రక్రియలు పూర్తయినాయి. అందంగా అలంకరించిన నగర వీధులో కృష్ణునితో పాటు గజారోహణచేసి గోదాదేవి ఊరేగినారు. ఒకరిమీద ఒకరు కుంకుమ చందనములు, మంగళప్రద ద్రవ్యములు చల్లుకుంటూ క్రీడిస్తున్నఘట్టం. మంజిల్ అంటే పసుపు, కుంగుమమ్ అంటే కుంకుమ. దీన్ని మంజిల్ నీరాట్టం. పసుపు నీటి మంగళ స్నానం అని అర్థం. ఊరిజనులు కూడా వారిపై మంగళ ద్రవ్యములు అక్షతలు కుంకుమ చందనాలు పన్నీరు జల్లుతూశుభాకాంక్షలు పలుకుతూ ఆశీర్వదిస్తూ ఊరేగింపుగా తీసుకువెళుతున్నారు.
Also read: గోదారంగనాథుల లాజహోమం
వేయిగజములతో ఊరేగింపుగా వచ్చిన పెళ్లికొడుకు, వివాహానంతరం పత్నీసమేతుడై సాధుగజముపై ఊరేగి శ్రీవిల్లి పుత్తూరుజనులకు నయనానందాన్ని కూర్చుతున్నాడు.
శ్రీవైష్ణవులు కీర్తించే నగరం శ్రీవిల్లి పుత్తూరు, అందులో పెరియాళ్వార్ గా ప్రసిద్ధులైన మహావిష్ణు భక్తులు విష్ణుచిత్తుల కుమార్తె ఆణ్డాల్ రచించిన నాచ్చియార్ తిరుముజి లో ఈ పది పాశురాలను వారణమ్ ఆయిరమ్ అనే పేరుతో పిలుస్తారు. తొలి పాశురంలో గోవిందుడు వేయి గజాలమీద వచ్చిన ఘట్టం వల్ల ఈ పది పాశురాలకు వారణమ్ ఆయిరమ్ అనే పేరు వచ్చింది. తిరుప్పావై వ్రతం తరువాత కూడా కరుణించలేదని, తనను ఆలస్యం చేస్తున్నాడని నిరాశపడుతున్న గోదాదేవిని కరుణించి స్వయంగా శ్రీకృష్ణుడు తన ఊరేగింపుగా వచ్చి విధియుక్తంగా వివాహంచేసుకున్నట్టు గోదాదేవికి స్వయంగా శ్రీకృష్ణుడే తెలియజేసిన స్వప్నవృత్తాంతాలుఈ పదిపాశురాలు.
Also read: గోద పాదాలతో సన్నికల్లు తొక్కించిన శ్రీకృష్ణుడు
ఫలశృతి
ఆయనుక్కాగత్తాన్ కండ కనావినై
వేయర్ పుగళ్ విల్లపుత్తూర్ క్కోన్ కోదై శొల్
తూయతమిళ్ మాలై ఈరైందుమ్ వల్లవర్
వాయునన్ మక్కళై పెట్రు మగిళ్ వరే
ప్రతిపదార్థములు
ఆయనుక్కు= శ్రీగోపకుల మంగళదీపమై విరాజిల్లు శ్రీకృష్ణస్వామికి, ఆగ= అనన్యార్హత్వము మొదలైన అధికారసంపన్నయైన, తాన్ కండ కనావినై = తాను కన్న కలను, వేయర్ పుగళ్ = శ్రీవైష్ణవులు కీర్తించే, విల్లపుత్తూర్ = శ్రీవిల్లిపుత్తూరులో ఉండేవారికి, క్కోన్ = నిర్వాహకులయిన పెరియాళ్వార్ల పుత్రికయైన, కోదై = గోదాదేవి, శొల్ = రచించి, తూయతమిళ్ మాలై= పరిశుద్ధమైన తమిళ భాష సాహిత్యమాలలో, ఈరైందుమ్ = పది పాశురాలనే పుష్పాలను, వల్లవర్ =అనుసంధించే వారు, వాయునన్ మక్కళై = మనోహరులైన శిష్యులను పుత్రులను, పెట్రు = పొంది, మగిళ్ వరే = ఆనందిస్తారు.
Also read: అగ్ని సాక్షి, గోదా రంగనాథుల ఏడడుగులు
గోపాలునికై తాను కన్న కలలను శ్రీవైష్ణవులు కీర్తించే విల్లిపుత్తూరులో పెరియాళ్వారు కుమార్తె సాయించిన పవిత్ర ద్రవిడమాల, రెండయిదులను నేర్చి అనుసంధించిన వారు యోగ్యులైనభర్తను, పుత్రులను పొంది ఆనందిస్తారని అర్థం.
వరమాలలు ధరించి ఇచ్చినందగోపాలుని
వరించిన శ్రీవిల్లిపుత్తూరు పెరియాళ్వారు
వరపుత్రి కూర్చిన తమిళ దశపాశుర కలల
వరమాలనేర్వసుతానందవరముల్ కురియు.
గోదాదేవితో సమానవయస్కులైన కన్యలు వారణమాయిరమ్ పారాయణం చేస్తే శ్రీకృష్ణుడి వంటి ఉత్తమమైన భర్తను పొందుతారు. యువకులు పారాయణం చేస్తే గోదాదేవితో సమానమైన భక్తి తత్పరత కలిగిన కన్యలతో వివాహం అవుతుంది, సత్సంతానం కలుగుతుంది.
శ్రీవైష్ణవ ఆలయాలలో జరిగే శ్రీవారి కల్యాణ ప్రక్రియలో లాజహోమం తరువాత ఇద్దరు భాగవతోత్తములు ఎదురెదురుగా కూర్చుని కొబ్బరికాయలను అటూ ఇటూ దొర్లిస్తూ వారణమ్ ఆయిరమ్ పదిపాశురాలను గానం చేయడం తప్పనిసరిగా జరుగతూ ఉంటుంది. ఇది సకల శుభకారకమైన కార్యక్రమం.
ఆండాళ్ దివ్య పాదాలే శరణు.
Also read: గోదా వధువు చేయి పట్టిన గోపాలుడు
(సమాప్తం)