21. తిరుప్పావై కథలు
ఈ పాశురంలో ఔదార్యం ఇతివృత్తం. ఆచార్యుడు, భగవంతుడు, లక్ష్మీదేవి, పశువులు ఎంత ఉదారమయినవో, ఆ ఔదార్యం ఎంత ఘనమైనదో వివరిస్తున్నారు. వేదాలు ప్రతిపాదించిన (ఊట్రముడయాయ్ వేదంలో చెప్పిన) నారాయణుడే శ్రీ కృష్ణుడు. ప్రమాణ సిద్ధమైన వాడు. సకల వేదాల వలన తెలియదగిన వాణ్ణినేనే అని ప్రకటించాడు. ‘‘సర్వే వేదాః కృష్ణా’’ అంటే అన్ని వేదాలు చెప్పేది కృష్ణుని గురించే. (పెరియార్) ఆ వేదంవలన కూడా తెలుసుకోబడని సమున్నతుడూ, నిరతిశయ బృహత్వముగలవాడు. వాక్కు, మనస్సులకు అందని వాడు, అయినా వాక్కు మనస్సు చేతనే గ్రహింపదగిన వాడు, (చుడరే) తేజోమూర్తి, జ్యోతిస్వరూపుడు. ప్రత్యక్షప్రమాణాలతో పరమాత్ముడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. అనుమాన, ఉపమాన, ప్రమాణాలకు కూడా అందడు. కేవలం వేదములు/శాస్త్రముల ద్వారా మాత్రమే తెలుసుకోవడం వీలవుతుంది. అవాఙ్మానసగోచరుడైన (వాక్కుకు మనసుకు గోచరించని) పరమాత్మ ఎవరికి తోచినరీతిలో వారికి ప్రపంచమంతటా కనిపిస్తున్నాడు. కంటికి కనిపించే విధంగా ఆలయాల్లో ఉన్నాడు, ఇళ్లల్లో కూడా ఉన్నాడు. తలుపుల మధ్యే కాదు తలపుల్లో కూడా తలిచిన రీతిలో ఉన్నాడు. అన్నమయ్య అన్నట్టు ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంతమాత్రముగా ఉంటాడు పరమాత్మ. ఈ మాట అన్ని మతాలకు లోకాలకు వర్తిస్తుంది. ఆయన తనను ఆపేక్షించే వారిని కరుణించడంకోసం ఎదురుచూస్తూ ఉంటాడట.
Also read: వైష్ణవమతంతో 33 దేవతలెవరు?
ఉత్తములు అధములు అనే భేదం చూపకుండా అందరినీ ఆదుకోవడం కోసం ఆయన క్షీరాబ్దిని వదిలాడు.గొల్లపిల్లలను కరుణించడం కోసం వ్రేపల్లెకు వచ్చాడు.
తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా
దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతమ్ మహాత్మనా
లోకమనే తామరపుష్పం వికసించడం కోసం అచ్యుతుడనే సూర్యుడు దేవకి గర్భాన ఆవిర్భవించినాడు. శ్రీకృష్ణుడుని తేజో రూపా అంటూ గోదాదేవి ఈ అర్థాన్ని సూచిస్తున్నారు.
అంతటి తేజోరూపుడిని ఆదుకొమ్మని అడుగుతూ గోపికలు గోద ఈ విధంగా మనవి చేస్తున్నారు. ‘‘శత్రువులు నీ పరాక్రమానికి పరాజితులై వస్తున్నారు. కాని మేము(గోపికలు) నీ గుణాతిశయాలకు పరవశులమై, వశులమై వస్తున్నాము. రాజులు బలాన్ని విడిచి నీ వాకిట నీ చరణాలను పట్టుకోవడానికి వచ్చారు. మేము కూడా మా స్త్రీత్వ సౌందర్యాహంకారాలను, అలంకారాలను విడిచి మీ వాకిట నిలుచున్నాం.
కొలని లో స్నానం చేస్తున్నపుడు నీవు మా వస్త్రాలను చెట్టుకొమ్మలు ఆకుల గుబురులలోదాచేశావు.బెరుకును విడిచిపెట్టి, సిగ్గుపడకుండా, రెండుచేతులెత్తి శరణు వేడిన వెంటనే మా వస్త్రాలు తిరిగి ఇచ్చినావు. అదే మేము మా అహంకారాన్ని విడిచి శరణాగతి చేసిన క్షణం. మళ్లీ నిన్ను శరణంటున్నాం. స్తుతించి, మంగళాశాసనం చేసేందుకే వచ్చాం. లేచిరావయ్యా కృష్ణా’’ అంటున్నారు గోపికలు. వారితో గొంతు కలుపుతున్నారుఆండాళమ్మ, నీళాదేవి.
Also read: దేవతల వలె మేమైనా రాజ్యాలడిగామా?
నేను నాది అనే మాటలు వదిలేసి మేము మనము అని ముందడుగు వేస్తే ఆదుకోవడానికి పరమాత్మ ఔదార్యంతో సిద్ధంగా ఉన్నాడని సారాంశం. భగవంతుడి ఔదార్యం ఎంతంటే తనను ఆశ్రయించవచ్చిన వారే ఎంతో ఉదారంతో తనను ఆశ్రయించారని సంతోషిస్తాడు.ఔదార్యపు రాశి భగవంతుడు. అన్నిరకాల అహంకారాలను విడిచి, భగవంతుడి ఇంటిముందు నిలిచిన గోపికలు, ఆ పరమాత్ముడిని మేలుకొలిపి రమ్మని పిలవడమే ఈ 21వ రోజు పాశురం భావం.
ఆచార్యుని కరుణ
గోదాదేవి పరమాత్ముడిని, ఆచార్యుడిని ప్రస్తావిస్తూ ప్రస్తుతిస్తూ ఉంటారు. ఈ పాశురంలో ఆమె ‘గోవు వంటి వాడు ఆచార్యుడు’ అంటున్నారు. మన మనసులనే కుండలను ఖాళీగా స్వామి ముందుంచితే భగవంతుని గుణ వైభవాలు అనబడే పాలజ్ఞానధారను ఆచార్యులవారు వర్షిస్తారు. తనకు గురువు చెప్పిన జ్ఞానాన్ని మరొకరికి చెప్పాలనే తపన, తెలియని వారు అడిగితే చెప్పాలి కదా అనే సహృదయత, రామానుజులవలె విద్య తీసుకునే వాడు కదా తర్కించలేడు. వాడికి జ్ఞాన మార్గం ఇవ్వాలతి తానే ఆతుర పడి, అడిగినా అడగకపోయినా, గోపురమెక్కి అక్కడున్నవారందరినీ పిలిచి,అతినిగూఢమైన మహామంత్రాన్ని, ఆమంత్ర అంతరార్థాలను తనంత తానే ఉపదేశించే ఔదార్యం ఆచార్యుడికి ఉంటుంది.అర్జునుడు అడగకపోయినా వివరంగా చెప్పి, పోనీ ఈ విధంగా చెబితే అర్థమవుతుందేమోనని, ఒక పద్ధతో అనేక విధానాలనో అనుసరించి, అన్ని రకాలుగా శ్రీ కృష్ణుడు ప్రబోధిస్తాడు. శిష్యులు విన్నా వినకపోయినా ప్రబోధించే ఔన్నత్యం గురువులకు ఉంటుంది. చెప్పడం నా ధర్మం, వినడం వారిష్ఠం అని చెప్పేవారు. గోవులంతాగురువులు, గోపాలుడు జగద్గురువు. జ్ఞాన ముద్ర అనే అంకుశంతో మనమనసులను తొలిచే మదములను తొలగించి కరుణించవలసింది గురువే. నందగోపుడు ఆచార్యుడు, గోవులు వేదములు, దూడలు వేదాంగములు, మన వాంఛితములు నెరవేర్చడమే కుండలు నింపడం. మరో కోణంలో గోవులే ఆచార్యులు, శిష్యులంతా కుండలు. కుండను పొదుగుకింద పెట్టడమంటే ఆచార్యుని ఆశ్రయించడం. ఆచార్యుడు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ చేయవలసిన యుక్తులను సుదృఢం చేసుకోవడమే పొంగు. ఇక శత్రువులెవరంటే భక్తులను ద్వేషించే వారే.
Also read: తల్లిదండ్రులను విడదీయడమే రాక్షసత్వం, రావణత్వం
భగవంతుడి ఔదార్యం, ఆచార్యుని ఔదార్యాలను ప్రతీకాత్మకంగా వర్ణిస్తూ, భగవంతుని గుణ వైభవాన్ని చెప్పే పాశురాలు 21నుంచి మొదలవుతాయి. ఏట్రకలంగళ్ పాశురంలో పరమాత్మ ఔదార్యవైభవాన్ని వివరించింది గోదమ్మ. ‘‘ఉదారసర్వయేవైతే ఆర్తా, జిజ్ఞాసు అర్థార్థి, జ్ఞానీతు ఆత్మైనాయేవతం’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరిస్తాడు. నన్ను ఆశ్రయించే వారు నలుగురు. 1.ఆర్తి, 2.జిజ్ఞాసు, 3.అర్థార్థి,4.జ్ఞాని. బాధలు చెప్పుకుని కాపాడమని కోరుకునే వాడు ఆర్తుడు:ఆత్మతత్వం తెలుసుకోగోరిన వాడు జిజ్ఞాసు: ఇంకా సంపద పదవులు కావాలనుకునేవాడు అర్థార్థి:లౌకిక వాంఛలు లేకుండా పరమాత్ముడి సేవే కావాలనుకునే వాడు జ్ఞాని అంటూ,‘‘ఈ నలుగురూ ఉదారులే, వారిలో జ్ఞాని నాకు ఆత్మతో సమానుడైన వాడు అత్యంత ఆప్తుడు’’ అని గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించాడు. జ్ఞానితోపాటు మిగిలిన ముగ్గురూ కూడా ఉదారులనడం ఆయన ఔదార్యం, అన్నింటికన్నా మించిన ఔదార్యం. ఆయన సాహచర్యంచేసిన నందగ్రామంలోని పశువులకు కూడా ఆ ఔదార్యం వచ్చింది. పాలు పిండే పనే లేకుండా కుండలు నింపి పొంగిపొర్లేంతగా పాలు తమంతతామే స్రవిస్తున్నాయి ఆ ఉదారమైన పశువులు.
పొదుగుల నిండుదనంవల్ల అక్కడ పాత్రలు లేకపోయినా పాలు ధారగా స్రవిస్తూనే ఉన్నాయట. భగవంతుని ఔదార్యం ఆ విధంగానే ప్రవహిస్తూ ఉంటుంది. నాకిది కావాలని అడగాలా వద్దా అనే సంశయం వస్తుంటుంది. కనీసం పొదుగుకింద కుండైనా పెట్టాలి కదా. భగవానుడికి అభిముఖుడై అడగాలి. గురువును సమీపించి నిలబడి అడగాలి. అవ్యాజముగా అడగకుండానే రక్షించే స్వభావం భగవంతుడికి ఉంది. కాని నీ కుండ నిండలేదని సూచించడానికి కుండ పొదుగుకింద ఉండాలి కదా. భగవదనుభవము కావాలనే కోరిక ఉండాల్సిందే. అది అడగాల్సిందే. నిత్యం విడిచి ఉండలేని లక్ష్మీదేవి కూడా నిన్ను విడిచి ఉండలేనయా అని కోరుతూనే ఉంటుందట. నిత్యసూరులు ‘‘సదా పశ్యన్తి సూరయః’’ ఎప్పుడూ భగవంతుడిని చూడాలని కోరుతూనే ఉంటారట. భగవత్స్వరూప గుణ వైభవమనే పాలను ఆచార్యులు వర్షిస్తుంటారు.
శత్రువు సోదరునికి ఆశ్రయం ఇచ్చిన రాముడు
మంచి లక్షణాలలో ముఖ్యమైంది దృఢత్వం. ఆశ్రితులను రక్షించడం తన కార్యమని భావించేవాడు. ప్రాణాలైనా విడుస్తాను, లక్ష్మణుడినైనా విడుస్తాను. నిన్నైనా విడుస్తాను. కాని సీతా, మునులను రుషులను ఆశ్రితులను రక్షిస్తాననే ప్రతిజ్ఞను మాత్రం విడువను, అంటాడు రాముడు. మునుల పట్ల ఔదార్యం.
తనకు అత్యంత ప్రియమైన సీతను ఎత్తుకుపోయిన శత్రువురావణుడి సోదరుడు ఈ విభీషణుడనీ, చంపదగిన వాడని హెచ్చరించినా, రావణుడే వచ్చి శరణంటే కూడా ఆదుకొంటానంటూ రాముడు, అతని తమ్మునికి ఆశ్రయం ఇస్తాడు. మనసు మార్చుకుని తనను ఆశ్రయించాలనే ఉద్దేశంతోనే రావణుడిని చంపే అవకాశం ఉన్నా వదిలేసి ఈరోజు వెళ్లి రేపు రా అని యుధ్దభూమినుంచి పంపివేస్తాడు రాముడు. ఆ ఔదార్యాన్నే ఈ పాశురంలో వివరిస్తున్నారు గోదమ్మ. ఇతరులకు ఉపకారం చేస్తున్నానని అనుకోకుండానే అదే తన పని అన్నట్టు ఉపకారం చేస్తున్నాడు. కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడికి లంకా రాజ్యాన్ని విభీషణుడికి పట్టంగట్టి తన దుఃఖం తీరినట్టు సంతోషించాడట రాముడు. గెలిచిన రాజ్యాలను ఆయన తన రాజ్యంలో కలుపుకోలేదు.
Also read: నీళాకృష్ణులకు గోదా సుప్రభాత శృంగారగీతం
కాకాసురుడికి శిక్ష
ఇంద్రుడి కొడుకు జయంతుడు. కాని అతను అసురుడి లక్షణాలే ఉన్నాయి. అతను కాకిరూపం దాల్సి, వనవాస కాలంలో సీతాదేవిని మోహించి, ఆమె ఎత్తయిన ఎదమీద పొడిచాడు. తన ఒడిలో నిదురిస్తున్న శ్రీరామునికి నిద్రాభంగం కాకూడదని సీత కాకి చేసే చీకాకు పనులను హింసను చాలాసేపు భరించింది. మహావీరుడైన భర్త సమక్షంలోనే లైంగిక హింసకు గురి కావలసి వచ్చింది. ఎంతో సేపు భరించలేకపోయింది. అదే సమయానికి అలజడి గమనించి శ్రీరాముడు నిద్రలేవడం, అక్కడ కాకి ముక్కుకి, కాళ్లకు నెత్తుటి మరకలు ఉండడం, సీత ఛాతి రక్తసిక్తం కావడం, సీత కోపోద్రిక్తత బాధ అర్థం కావడంతో, తీవ్రమైన కోపం వచ్చింది. అక్కడే ఉన్న గడ్డిపరకను మంత్రించి, దానికి బ్రహ్మాస్త్రాన్ని సంధించి ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని తప్పించుకోవడానికి కాకి వెళ్లని లోకం లేదు. ఎక్కడా రక్షణ దొరకలేదు. నిప్పులు గక్కుతూ వెంటపడుతున్నది. జయంతుడు పారిపోతున్నాడు. తండ్రి కూడా అతను చేసిన ఘోరాపరాథం తెలుసుకుని అతనికి పరిష్కారం లేదంటాడు. తిరస్కరించాడు. హరి బ్రహ్మలు కూడా నీది క్షమించే నేరం కాదంటారు. తిరిగి తిరిగి శ్రీరాముని పాదాలు చేరుకున్నాడు. తాను హింసించిన సీతమ్మనే ప్రాధేయ పడ్డాడు. సీత ఔదార్యం ఇక్కడ ప్రశంసించ తగింది. అతడిని ఆదుకొమ్మని రాముడికి చెప్పి సీత పురుషకారం కట్టుకున్నది. ఆమె మాట విని శాంతిస్తాడు. కన్ను తీసుకుని ప్రాణాలు వదిలేస్తాడు. చావు దప్పి కన్నులొట్టపోవడమనే సామెత ఈ కథ తోనే వచ్చింది. రాముని పరాక్రమ ఔదార్యాలకు ఈ సంఘటన ఒక ఉదాహరణ.
Also read: లక్ష్మి కరుణిస్తేనే నారాయణుని అభయం
వందే జగన్మాతరం
దాశరథి రంగాచార్య ‘‘గత పాశురంలో నీళా కృష్ణులను పేర్కొన్నారు. ఇప్పుడు కిష్టయ్యను మాత్రమే మేల్కొల్పుతున్నారు. ఆండాళమ్మ గత పాశురంలో వాగర్థారివ సంపృక్తౌ అన్నట్టు ఆదిదంపతుల అన్యోన్యతా దర్శనంఇచ్చారు. ఇప్పుడు మాతృదర్శనం ఇస్తున్నారు. భార్యభర్త కౌగిట్లో కరుగుతుంటుంది. ఆమె బిడ్డ ఏడుపు వినిపిస్తుంది వెంటనే ఆమెలో మాతృత్వం పొంగుతుంది. భర్తను వదిలి, బిడ్డను చేరుతుంది. వాత్సల్యం ప్రేమను తల దన్నుతుంది’’ అని ఈ పాశురపు సారాంశాన్ని ఆమె మాతృత్వ మహిమ మాధుర్యాన్ని వివరించారు. వందే జగన్మాతరం అనే కొత్త నినాదాన్ని ప్రవచించారు దాశరథి.
మనం ఘటికురాలు అనే మాట వాడుతూ ఉంటాం. ఘటకత్వం అంటే జీవులను పరమాత్మతో చేర్చడం. మహాలక్ష్మి ఘటికురాలు. పరమాత్మతో చేర్చిన తరువాత శ్రీమన్నారాయణుడితో తానూ చేరి ఉండడం ప్రాప్యం: జీవత్వ, ఘటకత్వ, ప్రాప్యత్వము మూడు లక్షణములు ఉన్న శ్రీ మహాలక్ష్మీ మహాఘటికురాలని శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామి అత్యద్భుతంగా వివరించారు. తిరుప్పావై శ్రీ తత్వాన్ని తెలుసుకోవాలంటే శ్రీ భాష్యం స్వామి వారి విస్తృతమైన వాఖ్యానం చదవాల్సిందే.
భగవంతుడియందు ప్రీతి ఉంటే వారి గుణాలకు లొంగి వశవర్తులవుతారు. ప్రీతి లేకపోతే బాణములకు లొంగి వశవర్తులు కావలసి వస్తుంది. నేను శ్రీరాముని అభిప్రాయాన్ని బట్టి తమ్ముడిని కాని, గుణములచే దాస్యభావమునొందిన వాడిని అని లక్ష్మణుడు చెప్పుకున్నాడట. గోపికలు కూడా మేమంతా నీ గుణములకు ఓడిపోయి వచ్చాం స్వామి అని విన్నవించుకుంటున్నారీ పాశురంలో.