ఆకాశవాణిలో నాగసూరీయం – 7
1983 జూన్ 15న శ్రీ శ్రీ మరణించినపుడు ‘జ్యోతి చిత్ర’ అనే సినిమా వారపత్రిక ప్రత్యేక సంచికను ఎంతో బాగా వెలువరించింది. ప్రత్యేకంగా దాచుకో దగ్గ ఈ సంచిక చాలాకాలం నా వద్ద ఉండింది కూడా! అప్పట్లో ఈ సినిమా పత్రిక ఎడిటర్ పసుపులేటి రామారావు అని కూడా నాకు గుర్తుంది.
అర్థవంతమైన ప్రయోగం
శ్రీశ్రీ గొప్పకవి. సినీకవి కూడా. అప్పటికి టెలివిజన్ దాదాపు రాలేదు. కేవలం పత్రికలదే, రేడియోదే రాజ్యం! అర్థవంతమైన ప్రయోగం చేయగలిగే స్వేచ్ఛ ఉండే కాలమది. బాధ్యత కలిగిన వ్యక్తి చేసిన విశేషమైన పని కనుక మనం గుర్తు చేసుకుంటున్నాం. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక సంచిక వెలువరించడం విశేషమే ఆ కాలంలో – కానీ సినిమా పత్రిక పూర్తి సంచిక తేవడం ఇంకా విశేషం.
ఆ సమయంలో ‘ఈనాడు’ పత్రిక సంపాదకీయం సినిమా కవి వేటూరి సుందరరామమూర్తి రాశారు. సంపాదకీయం కనుక పేరు వుండదు. సి.నారాయణ రెడ్డిని శ్రీశ్రీ గురించి సంపాదకీయం రాయమని కోరితే ఇవ్వడం ఆలస్యం కావడం వల్ల వేటూరి రాశారట. ఈ విషయాలు బూదరాజు రాధాకృష్ణ స్వీయచరిత్ర ‘విన్నంత కన్నంత’లో ఇంకొంత విపులంగా చదువుకోవచ్చు ఆసక్తి ఉన్న మిత్రులు!
డిసెంబరు 31తో 2021 ముగుస్తున్న వేళ ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనిపించింది! ఇంకేమిటి? కాలం… సమయం… సందర్భం! ! ఇంతకు మించి మరేమిటి ఉంటుంది కదా?
‘వైటుకె’ యాతన
ఇరవయ్యొక్క సంవత్సరాల క్రితం యావత్ర్పపంచం ‘వైటుకె’ అంటూ నానా యాతన పడింది. నాగరికత అనే భూగోళం బుడుంగుమంటుందని. అప్పటికి న్యూస్ ఛానళ్ళు లేకపోయినా – సాధ్యమైనంత అల్లరి జరిగిందీ, తర్వాత అది ఏమీ కాలేదని తెల్సింది కూడా! అయినా ఇప్పటి స్థాయిలో బాధ్యతా రాహిత్యం లేదు కనుక, ఎంతో కొంత మంచి కృషి, గుర్తుంచుకోదగ్గ ప్రయత్నాలు ప్రతిచోటా జరిగాయి. తెలుగు పత్రికలు 1999 సెప్టెంబరు, అక్టోబరు నెలల నుంచి 2000 సంవత్సరం శతాబ్ది ముగింపు, శతాబ్ది ప్రారంభం అంటూ ఎంతో సమాచారం ఫీచర్ల రూపంలో ఇచ్చారు!
మరి 1999-2000 సమయంలో విజయవాడ ఆకాశవాణిలో ఉదయం వార్తల తర్వాత అరగంట కార్యక్రమాన్ని మూడేళ్ళకు పైగా నిర్వహిస్తున్న నేను ఏమి చేశాను? అవును ఇది అర్థవంతమైన ప్రశ్న! ఈ ప్రయత్నాల గురించి చెప్పే ముందు, ప్రయాగ వేదవతి గారు ఇచ్చిన ప్రోత్సాహం సంబంధించి ప్రస్తుతించాలి. అంతకు ముందు 1998 డిసెంబరులో విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్వర్ణోత్సవాలు నిర్వహణలో ఎవరు ఏమిటో అందరికి బోధపడింది. విజయవాడలో ముప్ఫై ఐదేళ్ళ వయసులో ఉన్న నేను చేసిన ఎన్నో అర్థవంతమైన ప్రయత్నాలకు ఆవిడ బాసటగా ఉన్నారు. ఆ సమయం నాకు ఉద్యోగ ఉత్సవరథానికి ఉజ్వల సందర్భం!
నా అభిమాన విషయాలు
సాహిత్యం, సైన్స్, మీడియా – ఈ మూడూ నా అభిమాన విషయాలని మీకందరికీ బాగా తెలుసు. తెలుగు పత్రికల కన్నా ముందుగా, నిశ్శబ్దంగా ఈ ప్రయత్నాలు నా విభాగంలో మొదలయ్యాయి 1999 జూలై 1వ తేదీన ‘శతవసంత సాహితీ మంజీరాలు’ ధారావాహికతో. 1999 ఏప్రిల్ నెలలో అక్క ముంజులూరి కృష్ణకుమారి గారికి పదోన్నతి కలిగి, ‘తెలుగు స్పోకన్ వర్డ్స్’ విభాగం కూడా నాకు ఇచ్చారు. తర్వాత శతాబ్ది ప్రారంభ సందర్భం పురస్కరించుకుని ప్రణాళిక వేసి మూడు నెలల్లో చాలా విలక్షణ ప్రయత్నాలు చేశాను. అన్నింటి గురించి వివరంగా చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు
‘పిట్టచూపు’ (విహంగ వీక్షణం అనేదానికి తాపీ ధర్మరావు వాడిన తెలుగుమాట ఇది) గా ప్రస్తావిద్దాం. మూడేళ్ళు నడిచిన ధారావాహిక ‘శతవసంత సాహితీ మంజీరాల’తో మొదలై ‘యుగసంధ్య’ సైన్స్ సీరియల్, ‘వెలుతురు చినుకులు’ కథల ధారావాహికలుగా సాగి 2001 జనవరితో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి, విజయవాడ ఆకాశవాణి సంయుక్తంగా నిర్వహించిన ‘20వ శతాబ్దపు తెలుగు మీడియా పరిణామాల’ బృహత్ సదస్సుతో నా ప్రత్యేక కార్యక్రమాలు ముగింపుకు వచ్చాయి.
శతవసంత సాహితీ మంజీరాలు :
1999 జూలై 1 నుంచి 2002 సంవత్సరం మొదటి నాలుగు నెలల దాకా సాగిన ఈ ధారావాహికలో 20వ శతాబ్దంలో వచ్చిన గొప్ప వంద తెలుగు పుస్తకాలు గురించి డెబ్బై, ఎనభైమంది చేసిన వంద విలువైన ప్రసంగాలివి. కవిత్వం, కథలు, నాటకాలు, సాహిత్య విమర్శ, స్వీయ చరిత్రలు, ఇతరాలు అనే కేటగిరీలలో ఇమిడే రీతిలో నడిచిన ప్రసంగాలమాలికిది.
యుగసంధ్య :
20వ శతాబ్దపు శాస్త్ర సాంకేతిక పరిణామాలను గుర్తు చూస్తూ, ముందు ముందు జరగబోయే, సాధ్యమయ్యే సౌకర్యల గురించి, సామాజిక పరిణామాల గురించి సాగిన ధారావాహికిది. దీనికి స్క్రిప్ట్ నేను రాస్తే, మిత్రుడు చెన్నూరి రాంబాబు రేడియో రూపం ఇచ్చారు. ‘రామం’గా ప్రసిద్ధులైన ఎస్. బి. శ్రీరామమూర్తి, ఆవాల శారద తమ గళాలతో రక్తి కట్టించారు. మూడు, నాలుగు నెలలు సాగిన ఈ ధారావాహిక గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. దీని రికార్డింగు విజయవాడ ఆకాశవాణి సౌండ్ లైబ్రరీలో పదిలంగా ఉంటుందని భావిస్తున్నాను.
వెలుతురు చినుకులు :
చాలా అందమైన శీర్షిక ఇది. ఇరవయ్యో శతాబ్దంలో మానవాళి కోల్పోయిన ఆర్ద్రతను స్థానిక వాతావరణంలో చిత్రించిన తెలుగు కథలు 2000 జనవరి నుంచి ప్రతివారం ఓ కథ చొప్పున ఒక ఆరునెలలపాటు ప్రసారమయ్యాయి. పెద్ధిభొట్ల సుబ్బరామయ్య, పరుచూరి రాజారాం, భమిడిపాటి జగన్నాథరావు, వీరాజీ, సత్యవతి, ప్రతిమ, కాట్రగడ్డ దయానంద్, పాపినేని శివశంకర్, చంద్రశేఖరరావు వంటి వారు రెండేసి కథలు ఈ ధారావాహికలో చదివారు.
ఏమంటున్నారు ఎడిటర్లు?:
పదవిలో ఉన్న అన్ని పత్రికల సంపాదకులు ప్రసంగకర్తలుగా కళకళలాడిన ఈ సదస్సు సమకాలీన సమాచార ప్రసారరంగంలో పరిణామాలపై ఆకాశవాణి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఆకాడమి గుంటూరులో 2001 జనవరి 24న జరిగింది.
ఇవి కాకుండా పలు రంగాలకు సంబంధించి ఎంతోమంది ప్రముఖులు ప్రసంగించారు.
కొన్ని వివరాలు:
తెలుగు నాటకరంగం (మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఐదు ప్రసంగాలు), శతవర్ష భారతి (కవిత్వం గురించి నాగభైరవ కోటేశ్వరరావు, కడియాల రామమోహనరాయ్ రెండేసి ప్రసంగాలు; అలాగే కథలు గురించి పెద్ది భొట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాథరావు గార్ల రెండేసి ప్రసంగాలు); తెలుగు చిత్రకళ (మారేమండ శ్రీనివాసరావు నాలుగు ప్రసంగాలు), మీడియా పరిణామాలు (పొత్తూరి వెంకటేశ్వరరావు నాలుగు ప్రసంగాలు), శాస్త్రవేత్తలు (అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆరు ప్రసంగాలు); ఆరోగ్యం- వైద్యం (ఆరోగ్య విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ డా. ఎం.వి. శ్యామ్ సుందర్ నాలుగు ప్రసంగాలు) ; వర్తక వాణిజ్యాలు (ఎం.వి.ఎన్. శర్మ నాలుగు ప్రసంగాలు), తెలుగు కథా సంకలనాలు (పెనుగొండ లక్ష్మీనారాయణ రెండు ప్రసంగాలు); కవితా సంకలనాలు (కడియాల రామమోహనరాయ్ రెండు ప్రసంగాలు); పర్యావరణం (దుగ్గరాజు శ్రీనివాసరావు నాలుగు ప్రసంగాలు); తత్త్వవేత్తలు (బి. తిరుపతిరావు నాలుగు ప్రసంగాలు); అలనాటి సినీ వైతాళికులు (మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి చిరుప్రసంగాలు); అంటు వ్యాధులు – వైద్యం (డా. .ఎస్.నరసింహారెడ్డి నాలుగు ప్రసంగాలు); మనసుగతి-సైకాలజి (అన్నపురెడ్డి వెంకటేశ్వరరావునాలుగు ప్రసంగాలు)… ఇలా… ఇంకా కొన్ని ఉండే ఉంటాయి.
ఇవి కాకుండా 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం భావన, దేశదేశాల చరిత్ర గురించి సి. రాఘవచారిగారితో పరిచయాల మాలిక; ఒంగోలులో ఆహుతుల సమక్షంలో ‘శతవసంత కవితారవళి’ ; 2000 జనవరి లో విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక సాహిత్య కార్యక్రమం ఇలా ఎన్నో ఉన్నాయి.
జీవితం అనుభవాల సెలయేరు!
గతం జ్ఞాపకాల పూల తేరు! !
– డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్: 9440732392