నీలకంథరా, సదాజపా, సదాశివా
అపర శివునిగా అవతరించిన
నీ అంశ ఆదిశంకరుడు
పరమ గురువై వెలసి
భారత ఖండాన్ని భాసింప జేసిన తాపసీ
అద్వైతాన్ని ప్రపంచానికి ప్రసాదించిన జ్ఞానమూర్తి
చివరి ప్రశ్నలకు ఉత్తరమివ్వలేని బౌద్ధాన్ని
తర్కంతో పూర్వపక్షం చేస్తూ
వాడవాడల విజయాలతో
అఖండ భారతాన్ని ఒకే జాతిగా నిలిపిన
మహితాత్మా నీకిదే మా జ్ఞానాంజలి.
నీ పేరున స్థిర పడిన పీఠాలు
వాటి వెనకే విలసిల్లిన
కొంతమంది ‘అమ్మ’లు, ‘బాబా’లు
ప్రాపంచిక వాసనలు వెదజల్లుతూ
నమ్మకాన్ని, ప్రాభవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయి
జన నడవడిపై ఏమాత్రం ప్రభావం చూపలేక
రాజకీయాలకు, హత్యలకు కూడా వేదికలై
నామమాత్రంగా మిగిలిన కలి కాలాన
జాతికి దిశా నిర్దేశం చేసేవారు లేక
అనాథగా మిగిలిన నేటి ప్రపంచంలో
హింసావాదులు బలపడుతున్న సమయాన
స్వార్థంతో, అహంకారంతో కన్ను మిన్ను కానని జాతిని
కర్తవ్య దీక్షకు జాగృతం చేసి
పురుషార్థం వైపు నడిపించి
మము పునరుజ్జీవింపజేసి
నీ సామీప్యానికి మమ్ము నడిపించే
మరో శంకరాచార్యుడిని
ఈ జాతికి ప్రసాదించు శంకరా
ఓం నమఃశివాయః
Also read: మజిలీ
Also read: దేవదాసి
Also read: అభయం
Also read: వర్షం
Also read: రణం