- పుతిన్, జిన్ పింగ్ ల యుద్ధోన్మాదం
- అగ్రరాజ్యాల మద్దతుతో పోరాడుతున్న ఉక్రెయిన్
- ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలు
ఉక్రెయిన్ లక్ష్యంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా చెడ్డపేరు మూటకట్టుకుంటోంది. ఉక్రెయిన్ కూడా తక్కువ తినలేదు. చిన్న దేశమైనా పెద్దగానే పోరాడుతోంది. పెద్దదేశాలు వెనకాల ఉండడమే ఆ దేశానికున్న అతిపెద్ద బలం. అమెరికా, యురేపియన్ దేశాలు, భారత్ మొదలు ఉక్రెయిన్ వరకూ అందరిపైనా రష్యాను ఎగేసి, శత్రుత్వ భావనలు పెంచి పోషించిన ఘనత చైనాకు దక్కుతుంది. రష్యా, చైనా ప్రస్తుత అధినేతలు ఇద్దరిదీ ఒకే తీరు. ఇద్దరికీ సామ్రాజ్య విస్తరణ కాంక్షలు మెండుగా ఉన్నాయి. ఉభయుల శత్రువుల జాబితా మెల్లగా ఒకటే అవుతోంది. పాకిస్థాన్ కూడా ఈ రెండు దేశాలకు బాగా దగ్గరయ్యింది. ఈ మూడు దేశాల్లోనూ యుద్ధోన్మాదం సమాన స్థాయిలోనే ఉంది. కాకపోతే ఈ రెండు దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ బలహీనమైన దేశం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ఎప్పుడో చేరిపోయింది. అణుబాంబుల బెదిరింపులు, కవ్వింపు చర్యలు, నియంతృత్వ పోకడలతో రష్యా ప్రతిష్ఠ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా రష్యాపై యురేపియన్ దేశాలు ముద్ర వేశాయి. పార్లమెంట్ లో తాజాగా తీర్మానం కూడా చేశారు.
Also read: చమత్కార సంభాషణ ప్రియుడు రోశయ్య
ఉగ్రవాద దేశంగా రష్యాపై ముద్ర
ఉక్రెయిన్ లో పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగి సామాన్య పౌరుల ఆస్తులను ధ్వంసం చేయడం, ఆ రణరంగంలో అమాయకమైన మామూలు ప్రజలను బలికొనడంపై యూరోపియన్ దేశాలు రష్యాపై మండిపడుతున్నాయి. తటస్థ దేశాలకు కూడా రష్యా తీరు నచ్చడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేస్తున్న ఆరోపణలకు కూడా మిగిలిన దేశాల నుంచి మెల్లగా మద్దతు పెరుగుతోంది. రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని వస్తున్న విజ్ఞప్తుల పట్ల అమెరికా సుముఖత చూపించడం లేదు. ఉగ్రవాద దేశాల జాబితాలోకి వెళితే రక్షణ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్ధికపరమైన ఆంక్షలు కూడా ఉంటాయి. ఈ పాటికే రష్యాపై యురేపియన్ దేశాలు పలు ఆంక్షలను విధించాయి. ఈ ప్రభావం రష్యాను కుదిపేస్తోంది. అంతేగాక, మిగిలిన దేశాలకు కూడా తలనొప్పిగా మారింది. ఎగుమతుల, దిగుమతుల సమస్య చిన్నది కాదు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం వల్ల ధరలు మండిపోతున్నాయి. ఆ బూచి చూపించి ఇష్టానుసారం ధరలు పెంచేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. మనం కూడా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాం. ఇంకా ఆ సమస్యల నుంచి మనం పూర్తిగా బయటకు రాలేదు. కరోనా ప్రభావంతో పాటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలపై భీకరంగా పడిన నేపథ్యంలో, ఆర్ధికమాంద్యం భయం అందరినీ వెంటాడుతోంది.
Also read: సత్యసాయి జయంతి
పట్టు వీడని పుతిన్, జిన్ పింగ్
ఈ పాపం ప్రధానంగా జిన్ పింగ్ కు, పుతిన్ కే దక్కుతుందనే మాటలు గట్టిగా వినపడుతున్నాయి. కరోనా వైరస్ ను సృష్టించిన దేశంగా చైనా, యుధ్ధోన్మాదం, సామ్రాజ్య కాంక్షతో ఆర్ధిక మాంద్యానికి మూల విరాట్ గా రష్యాకు చెడ్డపేరు చేరిపోయింది. దీని నుంచి బయటపడే చర్యలకు దిగకపోగా మరింత పట్టుదలగా ఆ దేశాధినేతలు ముందుకు సాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా, చైనా గర్జింపులు, గాండ్రింపులు ఎప్పుడు ఆగుతాయా అని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. శాంతి నెలకొన్న నాడే క్రాంతి, కాంతి ప్రభవిస్తాయి.
Also read: లంక తర్వాత పాకిస్తాన్ వంతు!