వోలేటి దివాకర్
మార్గదర్శి చిట్ ఫండ్ లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా విడ్డూరమైన డిమాండ్ చేశారు . జాతీయ బ్యాంకుల కన్నా మెరుగైన పనితీరును కనపరిచేలా మార్గదర్శిని నిర్వహిస్తున్న రామోజీరావుకు దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులకు చైర్మన్ గా నియమించాలని సూచించారు . అంబానీ , అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రుణాలు ఇచ్చిన వాటిని రాబట్టుకోలేక దివాళా అంచుకు చేరుతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు . అదే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఖాతాదారులు పాట సొమ్ములను అక్కడే కేవలం 4 నుంచి 5 శాతానికే డిపాజిట్లు చేస్తున్నారని , చీటీ సొమ్మును మూడు నెలల ముందుగానే చెల్లిస్తున్నారని చెప్పారు . ఈఘనత కచ్చితంగా రామోజీరావుకే దక్కుతుందని , అందుకే ఆయనను జాతీయ బ్యాంకులకు ఛైర్మన్ గా నియమించాలని ప్రతిపాదించారు . భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదా సంస్థలో జరుతున్న తేడాలను గుర్తించి , బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు . ఇందుకు సంబంధించి తన వద్ద ఉన్న పత్రాలను వినియోగించుకోవాలని సూచించారు . గతంలోనే ప్రభుత్వానికి ఈసూచన చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు . సంస్థ ఖాతా నిల్వల్లో తేడాలు ఉన్నాయని , మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు .
Also read: సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!
తేడాలు తేల్చేస్తా …
మార్గదర్శి చిట్ ఫండ్ లో ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా లభించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు . తనిఖీల్లో లభించిన సమాచారాన్ని అందజేయాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద రిజిస్ట్రేషన్ల శాఖ ఐజికి లేఖ రాసినట్లు వెల్లడించారు . రికార్డులను పరిశీలించి , మార్గదర్శిలో జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేస్తానని , ఈ విషయంలో తనకు అనేక మంది నిపుణులు పరోక్షంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉండవల్లి తెలిపారు .
Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?
డిపాజిట్ల సేకరణ ఆపని మార్గదర్శి
ఒకవైపు చట్టవిరుద్ధంగా సేకరించిన డిపాజిట్ల సేకరణపై న్యాయపోరాటం చేస్తున్న మార్గదర్శి సంస్థ మరోవైపు డిపాజిట్ల సేకరణను కొనసాగించడం గమనార్హం . ఈవిషయాన్ని ఉండవల్లి వెల్లడించారు . గతంలో తీసుకున్న డిపాజిట్లకు నేరుగా డిపాజిట్ పత్రాలు ఇచ్చేవారని , తాజాగా రూటు మార్చి రిసిప్ట్ పేరిట పత్రాలు ఇస్తున్నారని ఉండవల్లి తెలిపారు . ఖాతాదారుల నుంచి 3 నెలల ముందుగానే చీటీల సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు . డిపాజిట్ల సేకరణ, ముందుగా చీటీల సొమ్మును వసూళ్లు నిబంధనలకు విరుద్ధమని పునరుద్ఘాటించారు.
Also read: పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!
రామోజీకి రెండు టోపీలు!
మార్గదర్శి వ్యవహారాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీతో విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు . ఇటీవలే పదవీ విరమణ చేసిన ఎన్వి రమణ , జాస్తి చలమేశ్వర్ వంటి వారితో విచారణ జరిపించినా పర్వాలేదన్నారు . రామోజీరావుకు రెండు టోపీలు ఉన్నాయని గతంలో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది వ్యాఖ్యానించారని తెలిపారు . వాటిలో ఒకటి మీడియా , మరోటి పారిశ్రామికవేత్త అని , పారిశ్రామికవేత్తకు ప్రభుత్వాలు , ఇతర వ్యవస్థల నుంచి ఇబ్బంది కలిగితే మీడియా టోపీని బయటకు తీస్తారని ఆ న్యాయవాది వ్యాఖ్యానించారన్నారు . ఒక వేళ రామోజీరావు పూర్తిస్థాయి పారిశ్రామికవేత్తగా ఉంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచేవారని కితాబునిచ్చారు.
Also read: త్వరలో విజయసాయిరెడ్డి సొంత మీడియా!