హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ రచయితగా రికార్డు నెలకొల్పారు. ఆమె రాసిన ‘టాంబ్ ఆఫ్ శాండ్’(ఇసుక సమాధి)కి బుకర్ ప్రైజ్ ఇస్తున్నట్టు గురువారంనాడు ప్రకటించారు. ఈ నవలను ఇంగ్లీషులోకి తర్జుమా చేసిన డెయిజీ రాక్వెల్ తో కలసి ఈ ప్రైజ్ ను గీతాంజలిశ్రీ పంచుకుంటారు. ‘లౌండ్ అండ్ ఇరెస్టిస్టిబుల్’ నవలగా తీర్పరులు ఈ నవలను అభివర్ణించారు. ఒక్క హిందీలోనే కాదు ఏ భారతీయ భాషలో కూడా ఇంతవరకూ బుకర్ ప్రైజ్ సాధించిన రచన లేదు. ఇదే మొదటిది. 50 వేల పౌండ్ల పారితోషికం లభించే ఈ ప్రైజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మరి అయిదు పుస్తకాలతో గీతాంజలిశ్రీ రచన పోటీ పడి గెలిచింది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో జన్మించిన గీతాంజలిశ్రీ దిల్లీలో స్థిరపడ్డారు. 64 సంవత్సరాల గీతాంజలిశ్రీ మూడు నవలలు, అనేక కథా సంపుటాలూ ప్రచురించారు. ‘టామ్ ఆఫ్ శాండ్’ అనే ఇంగ్లీష్ అనువాదం యునైటెడ్ కింగ్ డమ్ లో మొదటిసారి అచ్చయింది. ఆమె రచనలను ఇంగ్లీషులోకి మాత్రమే కాకుండా ఫ్రెంచ్,జర్మన్, సెర్బియన్, కొరియన్ భాషలలోకి కూడా అనువదించారు. రంగస్థల నాటకాలను కూడా ఆమె రచించారు. ఆమె కేంద్ర సంస్కృతిక మంత్రిత్వ శాఖ కు గౌరవహోదాలో పని చేస్తారు. జపాన్ ఫౌండేషన్ తో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. 2000 సంవత్సరంలో ‘మాయి’ అనే పేరుతో నవల రాశారు. క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు ఎంపిక స్థాయి దాకా వచ్చి అవార్డు త్రుటిలో తప్పింది. తిరోహిత్, హమారా సహర్ ఉస్ బరస్, ఖాళీజగహ్ అనే రచనలు కూడా చేశారు.
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న హిందీ నవల టైటిల్ ‘రెట్ సమాధి.’ ఇంగ్లీషులో ‘టాంబ్ ఆఫ్ శాండ్’ గా అనువదించారు. భారత దేశ విభజన దరిమిలా సంభవించిన సంఘటల నేపథ్యంలో భర్తను కోల్పోయిన 80 ఏళ్ళ వితంతువు మాటల్లో నవల కథ నడుస్తుంది. హిందీ నవల 2018లో ప్రచురించారు. బుకర్ ప్రైజ్ కోసం పరిశీలించిన మొదటి హిందీ పుస్తకం కూడా ఇదే కావడం విశేషం. భర్త మరణంతో దిగాలు పడిన మహిళ చివరకు కోలుకొని పాకిస్తాన్ వెళ్ళి తాము వదిలివచ్చిన గతాన్ని చూస్తుంది. జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. పాత రోజుల గురించి మాట్లాడుతుంది.
ఈ పుస్తకాన్ని అనువదించిన డెయిజీ రాక్వెల్ అమెరికాలో పుట్టి పెరిగారు. వెర్మన్ లోని నార్త్ బిన్నింగ్టన్ లో నివాసం. భీషమ్ సహ్నీ, కృష్ణసోబ్టీ, ఉపేంద్రనాథ్ ఆష్క్, ఉషాప్రియంవదల హిందీ రచనలను ఆమె ఇంగ్లీషులోకి అనువదించారు. పాకిస్తాన్ కు చెందిన ఖదీజా మస్తూర్ రచనను కూడా ఆమె ఇంగ్లీషులోకి అనువదించారు.