హైదరాబాద్ లోని న్యూబోయినపల్లిలో అనూరాథ టింబర్స్ ఇంటర్నేషనల్ లో అనంత శేషశయన శ్రీమహావిష్ణుమూర్తి ఏకాండీ దారుశిల్పాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఉదయం ఆవిష్కరిస్తారు. ఇరవై ఒక్క అడుగుల పొడవు, ఇరవై అడుగుల కైవారం, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు ఉన్న సిసలైన బర్మా జాతి టేకు దుంగ (1500 సంవత్సరాలనాటిది)పైన ప్రఖ్యాత చిత్రకళాకారుడు గిరిధర్ గౌడ్ నేతృత్వంలో ఈ శిల్పాన్ని చెక్కారు. తన చిత్రప్రణాళికను శిల్పం చేయడానికి హైదరాబాద్ నుంచి మయన్మార్ కు గౌడ్ పంపించారు. అక్కడ దాదాపు మూడేళ్ళపాటు మయన్మార్ శిల్పులు విష్ణుస్వరూపాన్ని స్థూలంగా చెక్కమీద చెక్కారు.
అటువంటి అరుదైన దారుశిల్పం దేశ సరిహద్దులు దాటడానికి బర్మా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అందువల్ల శిల్పాన్ని సగం అక్కడ చెక్కి ప్రభుత్వానికి చూపించి అనుమతి తీసుకొని ఓడమీద ఇండియాకు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత బోయినపల్లిలోని అనూరాధా టిండర్స్ ఇంటర్నేషనల్స్ ప్రాంగణంలో చదలవాడ తిరుపతిరావు, వారి కుమారులు శరత్ బాబు, కిరణ్ కుమార్ లు గిరిధర్ గౌడ్ ఊహించినట్టుగా చెక్కించి అద్భుతమైన దారుశిల్పాన్ని తయారు చేశారు.