Sunday, December 22, 2024

తెలుగు పిడుగు గిడుగు

  • వ్యావహారిక భాషోద్ధారకుడు
  • తెలుగును నేలపైకి దించి నడిపించిన గిడుగు, గురజాడ
  • తెలుగువారు నిత్యం స్మరించుకోవలసిన మహనీయుడు

మరో వారం రోజుల్లోనే గిడుగు వెంకటరామమూర్తి జయంతి వస్తోంది ( ఆగస్టు 29). ఆ మహనీయుని స్మృతిగా వారోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈ రోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు.  ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా అర్ధం చేసుకోవాలి, భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈ రోజు మనం రాసే భాష, చదివే భాష,పుస్తకాల్లో,  పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష, మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాల, వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి.

Also read: చిరంజీవి పీ వీ ఆర్ కె ప్రసాద్!

ఆధునిక భాషోద్యమంలో తొలి అడుగు గిడుగుదే

గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160 ఏళ్ళనాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే  రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి, భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మన కోసం అలోచించిన దార్శనికుడు. ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషా సాహిత్యాలు, చరిత్ర పుష్కలంగా, క్షుణ్ణంగా చదువుకొని, తాను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను  చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చర పిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష – అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప, గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను, ఛందస్సును పండితులను, కవులను ఎప్పుడూ తూలనాడలేదు. సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి.

Also read: సినిమాల బాయ్ కాట్ అవివేకం, అనర్థదాయకం

సవర భాషకు జీవితం అంకితం

అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే ‘సవర’ భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు వాక్కుల రూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజల వాడుకభాషలోకి తెచ్చాడు. దాని వల్ల చదివేవారి సంఖ్య, చదువరుల సంఖ్య పెరిగింది. తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది. వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే పాఠశాలగా మార్చాడు. సొంతంగా ‘తెలుగు’ అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ, కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చిన సీతారామశాస్త్రి  మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు. ఆయనతో కలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు ‘పాండవ ఉద్యోగ విజయాలు’ పేరుతో పద్యనాటకాలు రాయడానికి  ప్రేరకుడు గిడుగు వేంకటరామమూర్తి. కారకుడు, పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,  ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం  పెంచడం సంగతి తర్వాత… ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు…అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. ‘‘గెల్చితిరేని అని ఉండాలి.  నువ్వు గెల్చిరేని అని రాశావు. ఇది తప్పు. సరిదిద్దుకో…’’ అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ‘ఆమ్మో! గిడుగు పిడుగే’ అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. అంతటితో ఆగక ‘గిడుగు పిడుగే’ అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. పాండవ ఉద్యోగవిజయాల వంటి పద్యకృతులతో పాటు,  చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా తిరుపతి  వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుకభాషవైపు మళ్లించిన ఘనుడు, ఘటికుడు గిడుగు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.

Also read: దూకుడు పెంచిన చైనా

తెలుగు భాషపై, నేలపై, గాలిపై అపరిమితమైన ప్రేమ

ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో  తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగు రామమూర్తికి తెలుగుభాష, గాలి, నేలపై ఉండే భక్తికి,  ప్రేమకు అది గొప్ప ఉదాహరణ. 1937లో తాపీ ధర్మారావు  సంపాదకుడిగా ‘జనవాణి’అనే పత్రికను స్థాపించారు. కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు. అదంతా కూడా గిడుగు ప్రభావమే. గిడుగు, గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్, చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు బాగా చదువుకున్నారు.సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు. ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు. జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను, గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే  ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు, దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ, భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు, వ్యాకరణం, పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10 ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. తెలుగు భాషా, సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో,ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. పద్యం మన ఆస్తి, అవధానం మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం,ఛందస్సులను దూరం చేస్తే కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి. మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమై పోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగువెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష, సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుకలు.

Also read: కృష్ణం వందే జగద్గురుమ్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles